Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 26

   
    ఆ రాత్రి ప్రసూనకు కన్ను మూతపడలేదు- ఒకటే ఆలోచన! ఎలా.....ఎలా.....ఎలా అతనికి తన నిజాయితీ నిరూపించుకోగలదు?    
    ఆ మరునాడే మోహన్ కు ఫోన్ చేసింది.    
    "హలో!" అని అవతలివైపు నుండి మోహన్ కంఠం వినిపించగానే ఏదో భయంతోచి వెంటనే మాట్లాడలేకపోయింది.....    
    "హలో!" అన్నాడు మోహన్ మళ్ళీ.....    
    "నేను ప్రసూనని....." వణుకుతున్న కంఠంతో అంది. ఒక్క క్షణం నిశ్శబ్దం. తరువాత "ఏమిటీ?" అన్నాడు శాంతంగా....గంభీరంగా.....   "నేను.....కొంచెం....ఊరికినే.....ఏంలేదు.....ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను-"    
    "మీ ఇంటికి రమ్మంటారా?"    
    "వద్దు. నేను మీదగ్గరికి వస్తాను-"    
    "సరే! సాయంత్రం ఆరు తర్వాత రండి!"    
    మోహన్ ఏవిధమయిన ఈసడింపులు లేకుండా ఇంత మర్యాదగా మాట్లాడటం, తనను రమ్మనటం, ప్రసూనకు అంతులేని ఆనందాన్ని కలిగించింది. అతని సంస్కారానికి ముగ్దురాలయింది.    
    ఆ సాయంత్రం ప్రసూనను మోహన్ ఆదరంగానే ఆహ్వానించాడు- నిశితమైన అతని చూపులు ప్రసూన ముఖంలోని సంతృప్తిని, సంతోషాన్ని చదువుకుంటున్నాయి......    
    మోహన్ మంచి మాటకారే- కొంచెంసెపు దేశంలో రాజకీయాలగురించి, జరుగుతున్న అన్యాయాల గురించి, పాదవుతున్న విద్యావిధానం గురించి అధీ, ఇదీ మాట్లాడాడు-    
    ప్రసూన వింటూ కూర్చుంది.....అతడు మాట్లాడేది ఆవిడకు అంతు పట్టటంలేదు. ఆ కంఠం వింటూ కూచుంది- ప్రసూన తన్మయత్వం మోహన్ కు స్పష్టంగా అర్ధమవుతోంది.    
    "ఏదైనా పనిమీద వచ్చారా?"    
    ఉన్నట్లుండి అడిగాడు మోహన్..... తడబడింది ప్రసూన......    
    "నిన్న మీరు........"    
    కృతజ్ఞతలు చెప్పుకోవాలని మొదలుపెట్టిన ప్రసూన ఆ అవమానమంతా గుర్తురాగా మాట్లాడలేకపోయింది.    
    "ఆ విషయం మరిచిపొండి......" దయగా అన్నాడు మోహన్.....    
    "మీకు నావల్ల ఏదైనా సహాయం కావాలంటే......అహ-మీకు నేనేవిధంగానైనా సహాయ పడగలిగితే ఎంతో సంతోషిస్తాను."    
    మోహన్ మాట్లాడకుండా కొన్ని క్షణాలు ప్రసూన ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు......    
    ప్రసూన ఇబ్బందిగా నవ్వింది__
    "మీకు నాలో విశ్వాసం కలిగించడానికి నేనేం చెయ్యగలను? చేతులు జోడించి ప్రార్ధించగలను........"    
    మోహన్ నవ్వి "అదేమీ అవసరం లేదు. మీరు నాకు చెయ్యగలిగిన సహాయం ఒకటి ఉంది. చేస్తారా?" అన్నాడు- "చెప్పండి!" హుషారుగా అంది ప్రసూన......    
    "దొంగనోట్ల మారకానికి సంబంధించిన రికార్డు మీ దగ్గరున్నట్లు తెలిసింది- అధి నాకు అందియ్యగలరా?"    
    "రికార్డు నాదగ్గర ఉందా?" తెల్లబోతూ అడిగింది ప్రసూన.    
    "దానికోసం నేను ఎంతో వెతుకుతున్నాను, మీ కిద్డామనే......" మోహన్ అదొక మాదిరిగా నవ్వి లేచి టేప్ రికార్డర్ ఆన్ చేశాడు-"    
    ముందు శేఖర్ స్వరం- "ఈరోజు నోట్లమారకం వివరాలన్నీ రికార్డులో ఎంటర్ చేశాను సార్!"    
    సాంబశివం స్వరం "సరే! ఆ రికార్డు మామూలుగా ప్రసూన దగ్గిర జాగ్రత్త చెయ్యి....."    
    ఆ టేప్ రికార్డర్ ఆపేసాడు మోహన్.....    
    "ఇది......ఇది.....ఎలా రికార్డు చేశారు?" ఆశ్చర్యంగా అడిగింది ప్రసూన......    
    "నా అంతరంగికుడి సహాయంతో......ఒక రహస్యమైన రికార్డులో రికార్డుచేసి తరువాత ఈ రికార్డులోకి మళ్ళీ రికార్డు చేశాను. ఆ వివరాలన్నీ మీకిప్పుడు చెప్పలేను. ఒకటి చెప్పండి__మీదగ్గరున్న ఆ రికార్డు నాకు స్వాధీనం చెయ్యగలరో? లేదో?"    
    ప్రసూన ముఖం మంచుకన్న తెల్లగా పాలిపోయింది.

 Previous Page Next Page