Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 26


    "అసలు కాల్చటం ఎందుకు?"
    "చెప్పాను కదురా! అభిమానం మరీ ఎక్కువయితే వాళ్ళంతే. అలా అనిపిస్తుందట తరువాత చెప్పాడాయన"
    సరిగ్గా అప్పుడే బయట సైరన్ కూసినట్లు జీప్ హారన్ మోగింది. ఆ శబ్దం వినడంతోనే సింహాద్రికి వణుకు ప్రారంభమయిపోయింది.
    "శ్రీదేవి.....శ్రీదేవి వ్రాళ్ళ డ్రాడ్రీ వ్రచ్రిన్రట్లు వ్రాడు" అన్నాడు వణుకు కనిపించకుండా కంట్రోల్ చేస్తూ.
    "అరె- వస్తే రానీరా ఎందుకురా అనవసరంగా వణుకుతున్నావ్?" కోప్పడ్డాడు చిరంజీవి.
    "ఏమోరా ఎంత వద్దనుకున్నా తెగ భయంగా వుంది"
    "ఏం ఫర్లేదు నేనున్నాను కదా! అంతా నేను చూసుకుంటాను"
    
                        * * * * *
    
    మరుక్షణం పెద్దగా బూట్లచప్పుడు- గుండెలమీద కొస్తున్నట్లు లోపలి కొచ్చేసింది.
    మరుక్షణంలో ఆరడుగుల ఎత్తు ఆకారం జంగిల్ డ్రెస్ లో నుంచి ఇల్లెగిరిపోయేట్లు అరచింది.
    "ఒరే రంగా... రంగా"
    సింహాద్రి, చిరంజీవి వణికిపోయారు.
    నౌకరు లోపల్నుంచీ పరుగెత్తుకొచ్చాడు.
    కర్నల్ తన గన్ అతని కందించాడు.
    "క్లీన్ చెయ్యమంటారా సార్?"
    "షూట్ చేస్తాను రాస్కెల్! క్లీన్ చెయ్యలా- ఏమిట్రా? ఇడియట్, నోర్మూసుకుని క్లీన్ చెయ్"
    "అలాగే సార్"
    "ఇవాళ బులెట్స్ అన్నీ వేస్టయిపోయాయ్. మోస్ట్ అన్ ఎకనమికల్. ఒక్క జంతువు కూడా దొరకలేదు..."
    రంగా గన్ తీసుకుని లోపలి కెళ్ళిపోయాడు.
    కర్నల్ మేడమీద కెళ్ళబోతూ ఠక్కున ఓ మూల వాళ్ళవేపు తిరిగాడు కోపంగా.
    "న... న... నమస్కారమండీ" అన్నాడు సింహాద్రి.
    "నమస్కారమండీ" తనూ అన్నాడు చిరంజీవి.
    కర్నల్ అనుమానంగా మరో రెండు అడుగులు వాళ్ళవేపు వేశాడు. రెండ్రోజుల క్రితం పేపర్లో చదివిన వార్తే అతని కళ్ళముందు కదలసాగింది.
    "పెద్ద మనుషుల్లాడా- ఫుల్ సూట్లో ఇంట్లో జొరబడి చేతికందిన సామాను తీసుకుపారిపోయిన ఘరానా దొంగల ఉదంతం" అని ఉందా పేపర్లో.
    "ఎవరు మీరు?" అనుమానంగా అడిగాడు కర్నల్.
    "నేను సింహాద్రినండీ! మై నేమ్ ఈజ్ సింహాద్రి" అన్నాడు తడబడుతూ.
    చిరంజీవి ఉలిక్కిపడ్డాడు.
    "అబ్బే....కాదండీ! వీడి పేరు ధనుంజయ్. సింహాద్రి కాదు"
    కర్నల్ కి అనుమానం మరింత పెరిగిపోయింది.
    "సింహాద్రి కాదా?"
    "కాదండీ! ఏమాత్రం కాదు"
    "మరెందుకు చెప్పాడలా?"
    "పొరబాటున చెప్పాడండీ! జస్ట్ యాక్సిడెంటల్"
    "అవునండీ" తనూ వప్పుకున్నాడు సింహాద్రి.
    "ధనుంజయ్ సింహాద్రి పేర్లూ దగ్గరదగ్గరగా ఉంటాయ్ కదండీ - అందుకని సింహాద్రి అన్నాను."
    "పొరబాటున పేరు తప్పుచెప్పేవాళ్ళను నేనెక్కడా చూడలేదు"
    "అవునండీ! నేనూ ఎక్కడా చూళ్ళేదు" చెప్పాడు చిరంజీవి.
    "దెన్?"
    "అంతేనండీ! ది ఎండ్"
    "వ్వాట్ ది ఎండ్?"
    "ఇదేనండీ! వాడి పేరు సంగతి"
    "ఐసీ! చిరంజీవి వంక కోపంగా చూస్తూ అన్నాడతను.
    "నా పేరు చిరంజీవండీ! వాడిపేరు సింహా... నోనో... సారీ! వాడి పేరు ధనుంజయ్, నా పేరు చిరంజీవి! అంతేనండీ ఇంకేమీ మార్పులుండవ్"
    "నేనడుగుతోంది మీ డెవిలిష్ పేర్లు కాదు!"
    "ఓహో! కాదాండీ! అవుననుకుని చెప్పామండీ" అన్నాడు సింహాద్రి.
    "అవునండీ! పేర్లే అడిగారనుకుని..." సర్ది చెప్పిదోయాడు చిరంజీవి.
    "షటప్" గర్జించాడు కర్నల్.
    ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.
    "ఓకే అండీ! మీరెలా చెప్తే అలా షటప్ గానే ఉంటామండీ" గాబరాగా  అన్నాడు సింహాద్రి.
    "మీరెవరూ అని నేనడుగుతున్నాను" మళ్ళీ అన్నాడు కర్నల్.
    "మేమాండీ?"
    "యస్ అయామ్ టాకింగ్ ఎబౌట్ యూ ఓన్లీ"
    "మేము... మేము ఒరిజినల్ గా కాలేజ్ మేట్స్ అండీ! అంటే అంతకుముందు కూడా తెలుసన్న మాటండీ! ఇంటర్ లో క్లాస్ మేట్స్ మండీ"
    "అవునండీ! ఇద్దరం 'డి' సెక్షన్ వాళ్ళం?"
    "డీ సెక్షన్ హాకీకి బాగా ఫేమస్ అండీ"
    కర్నల్ మండిపడ్డాడు.
    "టు హెల్ విత్ యువర్ ఇంటర్- అండ్ టు హెల్ విత్ యువర్ 'జి; సెక్షన్" అన్నాడు కోపంగా.
    'జి' సెక్షన్ కాదండీ! 'డి' సెక్షన్" కరెక్ట్ చేశాడు చిరంజీవి.
    "అవునండీ! నాట్ 'జి' సెక్షన్"
    "అయ్ సే షటప్"
    "ఓకే సార్"
    "నేనడిగేది అడిగాడు"
    చిరంజీవికి అర్జంటుగా స్పార్క్ వచ్చింది.
    "ఓహో - అర్దమయిందండీ!" ఆనందంగా అన్నాడు.
    "ఏమిటది?"
    "మీరడిగేదేమిటో తెలిసింది- మీరు మా ప్రొఫెషన్ అడుగుతున్నారు. నథింగ్ రాంగ్ ఇనిట్! యు ఆర్ వెల్ కమ్! ప్రొఫెషన్ తెలుసుకోవాల్సిందే ఐ కెన్ అండర్ స్టాండ్ యువర్ ఫీలింగ్స్! వీడేమో బిజిలీ అండ్ బిజిలీ కంపెనీలో ఎకౌంటెంట్ అండీ! నేనేమో రైల్వేలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా వర్క్ చేస్తున్నానండీ"
    సింహాద్రి చప్పున  అందుకున్నాడు...
    "అయితే మొన్న జరిగిన యాక్సిడెంట్ కీ, వీడికీ ఎలాంటి సంబంధం లేదండీ! కదురా?"
    "అవునండీ! అదింకా తేల్లేదు. ఇంజనీరింగ్ వాళ్ళ ఫాల్ట్ అని కారేజ్ అండ్ వాగన్ డిపార్ట్ మెంట్ వాళ్ళూ, కాదు కారేజ్ అండ్ వాళ్ళదే అని వాళ్ళు...."
    "షటప్"

 Previous Page Next Page