Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 26

 

    ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టక్కున ఎర్ర లైటు పడింది.
    అంతే.....
    ఆ సెంటర్ లో ట్రాఫిక్ నిలచిపోయింది.
    తనముందు ఏ వెహికల్ లేకపోవడంతో స్టాప్ లైన్ వరకు జీప్ ను పోనిచ్చి గేర్ న్యూట్రల్ చేశాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.
    విష్ణు మందిరంలో జరిగిన దొంగతనం గురించే అతను ఆలోచిస్తున్నాడు.
    తను ఎన్నో రకాల కేసులు ఒక కొలిక్కి రాని వాటిని సయితం పరిశోధించాడు, కానీ విష్ణు చెప్పిన కేసే ఎంతో విచిత్రంగా , వింతగా తోచింది.
    అతని మందిరం నుంచి వచ్చిన వెంటనే వీడియో కాసేట్ ప్లే చేసి చూసుకున్నాడు.
    ఆ రోజు ఉదయం వరకూ విష్ణు ఆశ్రమంలో జరిగిన ప్రతి దృశ్యమూ వున్నది తప్ప , నగలు దోచుకు వెళ్ళిన సీన్ మాత్రం లేదు!"
    వినయ్ కుమార్ లో చెప్పలేనంత విస్మయం.
    కావాలన్నట్టు నగలు దొంగలించిన సన్నివేశం తప్ప ప్రతి చర్య వీడియోకి ఎక్కింది. నగలు పోవడం నిజమే అయితే అది కూడా కాసేట్ లో వుంది తీరాలి.
    అంటే దొంగతనం జరగడం వట్టి బూటకమా?
    దొంగతనం జరగకుండా జరిగిందని విష్ణు తనని పిలిచి ప్రత్యేకించి చెప్పడమెందుకు? అందువలన విష్ణుకి ఏం లాభం? ఒకవేళ విష్ణు ఆ పనిచేసి వుంటాడని అనుమానించాలా? అయినా మందిరంలోని ప్రతి వస్తువు అతని సొత్తే అయినప్పుడు అతనికి నగలు మాయం చేయవలసిన పని ఏముంది?
    అసలు విష్ణుకు అటువంటి దొంగాబుద్దె వుంటే కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న సంపదను ఎవరికీ లెక్కలు చూపకుండానే దాచుకోవచ్చు. పబ్లిక్ గా కనిపించే ఆ నగల కన్నా నాలుగింతలు స్వాహ చేయవచ్చు.
    అంటే , విష్ణుకి తెలియకుండానే ఈ దొంగతనం జరిగిందని నిర్ధారించుకోవలసి వస్తుంది.
    వాళ్ళెవరో ఎందుకు చేశారో విష్ణుకు తెలియదా అన్నది వేరే విషయం. ఇప్పుడు ఈ సంఘటనను బట్టి గతంలో కూడా ఏవో దొంగతనాలు జరిగి ఉండొచ్చ లేదా ఒకవేళ జరిగే వుంటే అవి చిన్నవై వుండవచ్చు. కాబట్టి తనకు రిపోర్టు చేయలేదనుకోవాలా?
    తను దొంగగా అనుమానించిన రీటా ఆ ఆశ్రమంలో వుండి పోయింది.
    ఒకవేళ ఆమె ఈ దొంగతనం చేసిందా?
    ఆమెను అనుమానించడానికి వీలుంది.....కానీ ఆశ్రమంలో ఏది పోయినా ముందు తననే అనుమానిస్తారని ఊహించగలదు కాబట్టి ఒకవేళ దొంగతనం చేసినా ఆ నగలు తన దగ్గర వుంచుకునేటంత తెలివి తక్కువది కాదు రీటా!
    ఏది ఏమయినా ముందు ఆ ఇద్దరు యువతుల దగ్గర నుంచే పరిశోధన ప్రారంభించాలి.
    సిగ్నల్ లైట్ పచ్చ రంగుకు రావడంతో ఆలోచన్లు కట్టిపెట్టి వెహికల్ ను ముందుకు దూకించాడు ఇన్ స్పెక్టర్ వినయ్.
    మరొక ఐదు నిమిషాల తరువాత వినయ్ జీప్ మహిళా పోలీస్  స్టేషన్ ముందు ఆగింది.
    స్టేషన్ లోనే ఏ.సి.పి కిరణ్మయి వున్నదని తెలుసుకుని లోపలకు వెళ్ళడతను.
    చిరునవ్వుతో అతనికి సీట్ ఆఫర్ చేసిందామె.
    "క్వయిట్ సర్ ప్రయిజ్.........ఏదయినా పని మీద వచ్చారా ఏమిటి?
    "ఇంటికి వెళుతూ మీ మహిళా పోలీసులైనా అడదొంగ కేసు దర్యాప్తులో ఏమయినా ప్రోగ్రెస్ చూపించారేమోనన్న చిరు ఆశతో ఇక్కడ ఆగాను.
    "లేదు ఇన్ స్పెక్టర్.....ఇంతవరకూ ఆ విష్ణుని కానీ, మీరు అనుమానించిన భారతి, రీటాలను కానీ కలుసుకోలేదు. నిన్న విష్ణు మందిరానికి  వెళ్ళాను , కానీ అయన లేకపోవడంతో వెనుదిరిగి వచ్చేశాను.'
    కిరణ్మయి చిన్న అబద్దం ఆడింది.
    ఆ విషయం తనకు ముందే తెలిసినా ఏమీ తెలియనట్టే మౌనం వహించాడు వినయ్ కుమార్.
    'ఈ రోజు ఉదయమే నేను విష్ణుని కలిసి వచ్చాను. అయన కంప్లయింట్ చేశాడు కూడా" ఆమె తెప్పించిన టీ సిప్ చేస్తూ ఉపోద్గాతంగా అన్నాడు.
    "విష్ణు పోలీస్ కంప్లయింట్ చేశాడా?"
    "అవును మేడమ్ .......అయన పూజ మందిరంలో కోట్లు విలువచేసే డైమండ్లు పొదిగిన విగ్రహాలు, బంగారు నగలు మాయమైనాయి"
    "ఓ మైగాడ్"
    "ఇన్ వెస్టిగేషన్ రహస్యంగా జరపమని రిక్వెస్ట్ చేయడానికి విష్ణు నన్ను పర్సనల్ గా పిలిచి చెప్పారు" చెప్పి క్షణం మౌనం వహించాడు.
    "ఐసీ.....ఎవరినయినా మీరు అనుమానిస్తున్నారా?"
    "ఎవరినయినా అనుమానించడానికి ప్రస్తుతం నాకు ఎలాంటి ఆధారము లభించలేదు మేడమ్. పైపెచ్చు రహస్యంగా పరిశోధించమనడంతో ఎలా ప్రొసీడ్ కావాలో అర్ధం కావడం లేదు. బట్.....అడదొంగ కేసులో ఈ నేరం ఇన్ వాల్వ్ అయితే మాత్రం నాకు ఇన్ ఫామ్ చేయండి......ఈ మాట చెప్పడానికే వచ్చాను, కానీ నగలు పోయిన విషయం కన్పిడేన్షియల్ గానే వుంచండి....."
    అదేమిటి ఇన్ స్పెక్టర్.....మీరు చూపించిన వీడియో కాసేట్ ను చూశాక మీకు విష్ణు మందిరంలోని ప్రతి గదినీ రహస్యంగా వీడియో తీయించగల నెట్ వుందనుకున్నాను. అలాంటప్పుడు రేపో మాపో ఆ దొంగ ఎవరో మీరు తీయించే కాసేట్ పట్టిస్తుంది కదా. ఆ మాత్రం డానికి అంత వర్రీ గావడం ఎందుకు?" అతన్ని ఎంకరేజ్ చేస్తూ అన్నది కిరణ్మయి.

 Previous Page Next Page