"నాకు చదువొచ్చా.... కార్ల గురించి తెల్సా.... ఎవడితోనైనా ఇంగ్లీషులో మాట్లాడగలనా.... నాదేదో దారి....కుదురుగా ఒకచోట వుండలేనురా, ఒకచోట ఒకగంటసేపు కూర్చోలేను. నీకా విషయం తెల్సు."
"కుదురుగా కూర్చోవద్దు.... నీకు తిరిగే పనే అప్పజెప్పుతాను.....నాతోరా...."
దానికి సమాధానం ఇవ్వలేదు చయనులు.
"నాకేమైనా డబ్బు సహాయం చెయ్యగలవా-?" అడగకూడదను కుంటూనే అడిగాడు వికాస్.
"రేపు శ్రావణ మాసంలో పెద్దదాని పెళ్ళి ఇంకా సంబంధమేమీ చూడలేదనుకో- దాని పెళ్ళికని- పదేళ్ళుగా పైసా- పైసా కూడబెట్టిన పదిహేను వేలు బ్యాంక్ లో వుంది. ఇస్తాను- పెళ్ళి ఓ నెల్రోజులుందనగా ఇస్తే చాలు" చెప్పాడు చయనులు. చిన్నప్పట్నించీ చయనులు మనసులో ఓ ఆలోచనుంది. అది వికాస్ ని అల్లుడిగా చేసుకోవాలని. కానీ ఎప్పుడూ ఆ ఆలోచనని వికాస్ దగ్గర బయటపెట్టలేదతను.
వికాస్ కూడా ఆ ఆలోచనలో ఎప్పుడూ లేడు.
మేనమామని గురువు, దైవంగా భావిస్తున్న వికాస్ ని చయనులు ఒక్కమాట అడిగితే సరిపోయేది.
"నీ కూతుర్ని నేను చేసుకుంటాను మావయ్యా!" అని వికాస్ అంటే ఆ హృదయం ఎంతో పొంగిపోయేది.
అలా అనాలని అన్పించలేదు వికాస్ కి.
వెంటనే బ్యాంక్ లోంచి పదిహేను వేలూ తీసి, వికాస్ చేతిలో పెట్టాడు.
"జాగ్రత్తగా ఖర్చుపెట్టు."
బస్సెక్కుతున్నప్పుడు, అభిమానంగా ఆ మాటన్నాడు చయనులు.
* * * * *
అభివృద్ధి కొరకై సాగించే అన్వేషణకు ఆధారాలు కొత్త ప్రపంచాలు- సరికొత్త ప్రదేశాల్నే అక్కర్లేదు. పాత ప్రపంచాన్నే - పాత ప్రదేశాల్నే కొత్త కళ్ళతో చూస్తే చాలు. ఎలా ఎదగాలో- ఎంత ఎత్తుకు ఎదగొచ్చో తెలుస్తుంది.
* * * * *
ఎదగాలనుకుంటే రెండు మార్గాలుంటాయి-
ఒకటి కొత్త కంపెనీని స్థాపించి, సరికొత్త ప్రోడక్ట్ ని ఉత్పత్తి చేయటం.
రెండు : పడిపోయిన పాత కంపేనీని తిరిగి నిలబెట్టుకోగలగటం-
వికాస్ వెళ్ళే మార్గం రెండవది.
* * * * *
కారు.... కారు.... కారు.... కారు.... కారు.... కారు... కారు.... కారు.... కారు..... కారు....
ఊహ తెల్సిన చిన్నారి మొట్టమొదటిసారి రోడ్డు మీద కొచ్చినపుడు వాడి ముందు రెండు చక్రాల్తో వేగంగా వెళ్ళే 'సైకిల్' ని చూసి ఆశ్చర్యపడతాడు.
వాడికి అదొక గొప్ప విచిత్రమైన వస్తువు.
అలాగే కారు.... ఆలాగే రైలు.... అలాగే విమానం.... అలాగే రాకెట్.
ఆదిమ కాలంలో ఎడ్లబండి, అప్పటి కది ఓ సంచలనం!
చలనం చైతన్యానికి సంకేతం- శక్తి పరిణామానికి సంకేతం.
చలనానికి, శక్తికి కలిపితే వేగాన్ని అదుపులోకి తెచ్చుకోవచ్చనే ప్రాధమికమైన ఆలోచనే ఇవాల్టి వాహనాల పురోగతికి మూలం.
ఎందరో దీక్షాపరుల కృషికి నిదర్శనం ఇవాల్టి కారు.
వందేళ్ళ అద్భుతమైన, సంచలనాత్మకమైన చరిత్ర గల నాలుగు చక్రాల వాహనం వెనక ఒక్క వ్యక్తి కృషీ లేదు. అది సమూహ శక్తి ప్రతిభకు సువర్ణ ఆవిష్కరణం!
చక్రాల వాహనం 1880కి ముందే ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాలేదు.
కొంతమంది ప్రైవేటు వ్యక్తుల సరదాలకు, ఉత్సాహవంతుల పరిశోధనలకు మాత్రమే కారు తయారీ ఆలంబనగా వుండేది.
కాని శాస్త్రీయంగా రూపు చెయ్యడం మూడు చక్రాల కారుని తయారు చెయ్యడం, దాని డిజైన్, సౌకర్యం నిర్వహణల విషయంలో సాంకేతికథ ప్రవేశపెట్టడం 1880 తర్వాతే జరిగింది.
వెస్ట్ జర్మనీకి చెందిన గాట్ ప్రైడ్ డామ్ లెర్ అనే వ్యక్తి ట్రైసైకిల్, కారుకి నాంది పలికితే, ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాన్స్ కి చెందిన పాన్ హార్ట్ కంపెనీ, బ్రిటన్ కు చెందిన రోల్స్ రాయస్, ఆస్టిన్ మోటార్ కంపెనీ, అమెరికాలో ఫోర్డు కంపెనీ, ఇటలీలో ఫియట్ కంపెనీ, జపాన్ లో డాట్సన్ కంపెనీ, టయోటా, దగ్గర్నించి ఎన్నో వందల ఆటోమోబైల్ ఇండస్ట్రీలు, కారుని అత్యాధునికమైన వాహనంగా చేయడానికి కృషి చేశాయి. ఇంకా చేస్తున్నాయి.
1839లో బ్రిటన్ కి చెందిన కిర్క్ ప్యాట్రిక్ మేక్ మిలన్ సైకిల్ కనిపెడితే..... ఫ్రాన్స్ కి చెందిన నికోలస్ కాగ్ నాట్ 1769వన్ స్టీమ్ తో నడిచే కారుని కనిపెట్టాడు. 1888లో జర్మనీకి చెందిన కార్ల్ బెంజ్ పెట్రోలుతో నడిచే కారుని కనిపెడితే.... 1876లో అదే జర్మనీకి చెందిన డైమలర్ కార్పోరేటర్ కనిపెట్టాడు. 1895లోరుడోల్స్ డీజిల్ అనే శాస్త్రవేత్త డీజిల్ తో నడిచే ఇంజన్ ని సృష్టించి, జర్మనీ దేశానికి గొప్ప కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెట్టాడు. డీజిల్ అనే శాస్త్రవేత్త కనిపెట్టబట్టే ఆ ఆయిల్ కి డీజిల్ అనే పేరు పెట్టినట్లు చాలామందికి తెలీదు.
స్టీమ్ ఇంజన్ తయారీని కనిపెట్టిన జేమ్స్ వాట్ దగ్గర్నించి, స్టార్టింగ్ రాడ్ సహాయంతో మానవ శ్రమతో 'స్టార్టు' చేయవలసిన బాధను తప్పించుకుని కారు తనంతట తాను స్టార్టు అయ్యేందుకు 1910 డిసెంబర్ 24ణ ఇగ్నేషన్ బటన్ ను తయారుచేసిన ఛార్లెస్ కెట్టరింగ్ వరకూ ప్రతి ఒక్కరూ కార్ల చరిత్రలో చిరస్మరణీయులే!
మోటారు వాహనాల కోసం రోడ్ల వత్తిడిని తట్టుకునే విధంగా పాల్ విచ్ ఫీల్డ్ అనే వ్యక్తి ఆధునికమైన టైర్లను రూపొందించాడు.
కాగా ఇటీవల 'టోక్యో సైటమా ఎక్స్ పో'లో ప్రపంచ కార్ల ఉత్పత్తిదార్ల దృష్టిని ఆకర్షించిన లీనియర్ మోటారుకారు విద్యుదయస్కాంతపు పట్టాల మీద అతి నిశ్శబ్దంగా, చిన్న కుదుపైనా లేకుండా గంటకు 200 కిలో మీటర్లు... నిజంగా 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే కారు.... ఆ పరిణామంలో భాగమే. ఇండియన్ ఆటోమోబైల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సిలబస్ లో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? ఏమో?
ఇంధన సంక్షోభంతో విలవిల్లాడుతున్న ప్రపంచానికి అతి తక్కువ ఇంధనంతో నడిచే కారు కోసం కలలు కంటున్న వాళ్ళు కొంతమందయితే-
నీళ్ళతో నడిచే కారుని.....
గాలితోనే నడిచే కారుని తయారు చెయ్యడం కోసం తలలు బాదుకుంటున్నవాళ్ళు మరికొంత మంది!
అపారమైన దీక్షతో కొత్తదాన్ని కనుకున్న ప్రతివ్యక్తినీ ఆదిలో సమాజం తృణీకరించింది- గేలి చేసింది-
రైలుబండిని ఆవిరిశక్తితో నడిపిన స్టీఫెన్ సన్ కు జనం మొదట అవహేళన చేశారు. జనం ముందు ఆవిరి యంత్రాన్ని నడిపినప్పుడు పట్టాలు లేనందువల్ల ఆ రైలుబండి వీధుల్లోకి పరుగులు తీస్తే చిరాకుపడిన జనం స్టే ఫెన్ ను తన్నబోయారు.
మనం రోజూ చూస్తున్న రవాణా సాధనాల్లో, ఇంత మార్పు చోటు చేసుకోవడానికి కారణం వాటిని వేగంగా నడిపించే టైర్లను సంగతి మనకు తెలుసు. రబ్బరు.... రబ్బరు విలువ తెలుసుకున్న మేధావి 'గుడ్ ఇయర్' వల్కనైజింగ్ చేసి టైర్లను తయారుచేస్తే జనం అస్సలు పట్టించుకోలేదు. అప్పట్లో న్యూయార్క్ వీధుల్లో రబ్బరు విలువ తెలియజెయ్యడానికి 'గుడ్ ఇయర్' రబ్బరు టోపీ, రబ్బరు కోట్లు, రబ్బరు చెప్పులు వేసుకొని తిరుగుతూ, వచ్చే రోజుల్లో రబ్బరు విప్లవాత్మకమైన మార్పును తెస్తుందని చెపుతూంటే జనం అతన్ని పిచ్చివాడిలా జమకట్టారు.
ఆస్ట్రేలియాకు చెందిన-
డెస్ హిల్ అనే వ్యక్తి గాలితోనే కార్లూ, బస్సులూ నడుస్తాయి అని చెప్పాడు.
"అందుకు నాకు 10,000 డాలర్లివ్వండి. నా ప్రయత్నాలకు ఆటంకము కల్పిస్తూ, నన్ను చంపడానికి చూస్తున్న వ్యక్తుల నుండి నాకు రక్షణ కల్పించండి." అని ప్రపంచానికి విజ్ఞప్తి చేసున్నాడాయన.
"గాలితో కార్లు, బస్సులూ నడుస్తాయా! అది సంభవమా! పిచ్చి ఆలోచన ఇది కలలో కూడా జరగని మాట" అని ఎంతోమంది ఇంజనీర్లు యంత్ర పరిశోధకులు డెస్ హిల్ ఆలోచనని కొట్టిపారేశారు.
డెస్ హిల్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఊహ తెల్సిన నాటినుండి వికాస్ లా కారు రిపేరింగ్ షెడ్లో మెకానిక్ గా పనిచేస్తూ ఆ రంగంలో దరిదాపు 'ఫాదర్'గా పేరు పొందాడు. యాదృశ్చికంగా ఓరోజు వాల్వ్ లోని డస్ట్ ని తొలగించడానికి నోటితో గట్టిగా ఊదగానే దానితో కలిసి వున్న పార్టికర్స్ పైకి కిందకు కదలడంతో 'డెస్ హిల్' మనసులో ఓ అద్భుతమైన ఆలోచన రేగింది. అదే ఫ్రెషర్తో గాలి, కారును ఎందుకు నడపలేదు? గాలితో నడిచే ఇంజన్ ను ఎందుకు తయారు చేయకూడదని, నాటి నుండి డెస్ హిల్ నూతన యంత్రాన్ని కనుక్కునే ప్రయత్నంలో వున్నాడు.
గత 30 ఏళ్ళు డెస్ హిల్ ఇదే పరిశోధనలో వున్నాడు. తాను జీవితాంతం కష్టపడి సంపాదించిన 200, 000 డాలర్లను స్పేర్ పార్ట్స్ తయారీకి ఖర్చుచేశాడు. రిటైరయ్యాక ఆయన ఆదాయం పూర్తిగా పడిపోయింది. తన ప్రయత్నాన్ని కొనసాగించాలన్న కోర్కెతో ఎంతోమంది వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకుల్ని సహాయం అర్ధించాడు.