Previous Page Next Page 
క్షమించు సుప్రియా! పేజి 26

                 

                                 రాజీ
   
   
    పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని ధించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా స్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు "రాజా, ఒక్కొక్కసారి విశ్వప్రయత్నం వల్ల లభ్యంకాని కార్యసిద్ది దానంతట అదే సంభవిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నీకు ప్రతాపుని కథ చెపుతాను. శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు :
   
    సుదర్సనుడనే రాజు కోసల దేశాన్ని పాలించే కాలంలో, విదేహ దేశాన్ని జయదేవుడు పాలించేవాదు. ఆ రెండు దేశాలకూ మధ్య సత్సంబందాలు లేవు. కావటానికి కోసల దేశమే పెద్దదీ, బలసంపన్నమైనదీ అయినా, తూర్పున వున్న దేశాలతో వర్తక సంబంధాలు పెట్టుకోవటానికి విదేహ పెద్ద అడ్డంకిగా వుండటం చేత, ఈ వైరంవల్ల కోసలకే ఎక్కువ ఆర్ధిక నష్టం కలుగుతూ వుండేది.
   
    విదేహను జయించి లొంగదీసుకోవటం కోసలకు ఎంతో లాభకరం. కాని సుదర్సనుడు పిరికివాదు. డానికి తగ్గట్టు విదేహ రాజైన జయదేవుడు మహా పరాక్రమశాలి. కత్తియుద్దంలో అతను పదహారు కళలు ప్రదర్శించగలడని ప్రతీతి వుండేది. అందుచేత సుదర్శనుడు విదేహతో యుద్దానికి జంకాడు. అయినా విదేహను జయించాలన్న కోరిక మాత్రం ఆయనలో చావలేదు.
   
    సుదర్శనుడికి ప్రతాపుడనే కొడుకు పుట్టాడు. తండ్రిలాగా అతను పిరికివాడు కాడు. మంచి శౌర్యపరాక్రమాలు గలవాడు. యుక్త వయస్కుడయ్యే నాటికి అన్ని యుద్ద విద్యలలోనూ అంతులేని ప్రావీణ్యం వచ్చింది. ప్రత్యేకించి కత్తి యుద్దంలో అసాధారణ ప్రజ్ఞ సంపాదించుకున్నాడు.
   
    సుదర్శనుడికి అవసానకాలం సమీపించినప్పుడాయన తన కొడుకును దగ్గరికి పిలిచి, "నాయనా, నా చిరకాల వాంచితం తీరుస్తానని మాట ఇవ్వు జయదేవుడి ముందు నిలిచే శక్తిలేక, నేను విదేహ మీదికి యుద్దానికి వెళ్ళలేదు. నువ్వు మహావీరుడివి. జయదేవుడు వయస్సు మళ్ళినవాడు. నువ్వు అతనిపై యుద్ధంచేసి, గెలిచి మనకు పక్కలో బల్లెంలా వున్న విదేహను కోసలలో కలుపుకో! ఈ పని నెరవేరినదాకా విశ్రమించనని మాట ఇవ్వు" అన్నాడు.
   
    ప్రతాపుడు తండ్రి కోరిక తీర్చుతానని ప్రమాణం చేశాడు. తరువాత సుదర్సనుడు గతించటమూ, ప్రతాపుడు రాజ్యాభిషేకం చేసుకోవటమూ జరిగింది.
   
    కొంతకాలం రాజ్యాన్ని చక్కదిద్దుకోవటంతోనే ప్రతాపుడికి సరిపోయింది. అయినా అతను తండ్రికి ఇచ్చినమాట మరిచిపోలేదు. మరిచిపోకపోగా అతనికి విదేహ మీదికి దండెత్తి వెళ్ళాలనీ, మహావీరుడని పేరుపడిన జయదేవున్ని జయించి, అంతకన్నా గొప్ప వీరుడనిపించుకోవాలనీ, తన రాజ్యానికి ప్రతిబంధకంగా వున్న విదేహ సింహాసనం కూడా తానే అధిష్టించాలనీ ఎంతో ఉబలాటంగా ఉన్నది.
   
    అయినా ప్రతాపుడు విదేహ పైకి సైన్యాన్ని నడిపించే ప్రయత్నం ప్రారంభించలేదు. అందుకు కారణం జయదేవుడి కుమార్తె చారుమతి.
   
    చారుమతి చక్కదనం గురించి ప్రతాపుడు ఎంతగానో విని, ఆమెనే పెళ్ళాడాలని ఏనాడో నిశ్చయించుకున్నాడు. కానీ వారి వివాహం జరగటం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకు ప్రతాపుడు చేయదగిన ప్రయత్నాలు రెండే రెండు. ఒకటి- విదేహ పైకి దండెత్తిపోయి, జయదేవున్ని జయించి, అతని కుమార్తెను బలాత్కారంగా వివాహం చేసుకోవటం, రెండు తాను తండ్రి ముందు తీసుకున్న ప్రమాణాన్ని గాలికి వదిలేసి, జయదేవుడితో ఏదో విధంగా రాజీపడి, చారుమతిని తనకిచ్చి పెళ్ళిచెయ్యమని అడగటం.
   
    బలాత్కార వివాహాన్ని చారుమతి నిరసించవచ్చు. తన వేడికోలును జయదేవుడు నిరాకరించవచ్చు.
   
    అందుచేత ప్రతాపుడికి గొప్ప విషమ సమస్య తటస్థపడింది. ఆ పరిస్థితిలో ప్రతాపుడు మూడోమార్గం ఒకటి చూసుకున్నాడు. అతను రాచకార్యాలన్నిటినీ కొంతకాలంపాటు మంత్రులను చూస్తూ వుండమని, మారువేషం వేసుకుని, తన పేరు ప్రసేనుడని మార్చుకుని విదేహ దేశం ప్రవేశించాడు.
   
    అతను తగిన అవకాశం కోసం వేచివుండి చారుమత్య్ని కలుసుకుని, తానెవరో చెప్పి, తనకు ఆమెపై గల ప్రేమ వెల్లడించి, ఆమె అభిప్రాయం అడిగాడు. చారుమతి కూడా అతన్ని గురించి వినివున్నది. తమ దేశాల మధ్య శత్రుత్వమే లేకపోతే తమ వివాహం సులువుగా జరిగి ఉండేదిగదా అనుకుంటూ వచ్చింది. అందుచేత ఆమె అతనికి తమ సమ్మతి క్లుప్తంగా తెలియజేసింది.
   
    ఇక జయదేవుడి సమ్మతి సంపాదించవలసి వున్నది. అందుకు కూడా ప్రతాపుడొక పద్దతి ఆలోచించాడు. అది చాలా హేయమైన పద్దతే! కాని దానిద్వారా తండ్రి లోరిక నెరవేరుతుంది. ఆ పద్దతి ఏమంటే, తాను విదేహపై దాడిచేసి దాన్ని గెలిచే బదులు, జయదేవున్ని కోసల గెలవ నివ్వటం!
   
    ప్రతాపుడు మర్నాడు రాజును ఏకాంతంగా కలిసి మాట్లాడటానికి అనుమతి సంపాదించాడు. జయదేవుడు అతన్ని తన సమక్షానికి రానిచ్చి "ఏమిటి నువ్వు నాతో మాట్లాడదలచిన విషయం?" అన్నాడు.
   
    "మహారాజా, నా పేరు ప్రసేనుడు. రాజవంశంవాణ్ణి. చాలా కాలంగా కోసల రాజు కొలువులో వున్నాను. అక్కడి గుట్టుమట్లన్నీ నాకు తెలుసును. తమరు కోసలను జయించదలిస్తే, అందుకవసరమైన సహాయమంతా నేను తమకు చెయ్యగలను" అన్నాడు ప్రతాపుడు.
   
    తాను తలుచుకుంటే జయదేవుడు రక్తపాతం లేకుండానే కోసలను జయించగలడు. ఈ ఉపకారం చేసినందుకు ఆయన తనకు తన కుమార్తె నివ్వటానికి సందేహించడు. తనకూ చారుమతికీ వివాహం అయిన మరుక్షణం రెండు రాజ్యాలూ ఒకటవుతాయి, రెంటికీ తనే రాజవుతాడు. తండ్రి కోరికా నెరవేరుతుంది. తన కోరికా నెరవేరుతుంది.
   
    ప్రతాపుడి ఈ ఎత్తుగడ పారలేదు. దానికి కారణం అతను చారుమతితో మాట్లాడినప్పుడామె ముఖ్య పరిచారిక అంతా విన్నది. ఆమెను ప్రతాపుడు లక్ష్యపెట్టలేదు. ఈ రోజు ప్రతాపుడు రాజుతో మాట్లాడటానికి రహస్య మందిరంలోకి పోవటం ఆ పరిచారికే చూసి, రహస్యంగా వారి మాటలన్నీ విన్నది. జయదేవుడు "ఆలోచించి చెబుతాను నువ్వు ప్రస్తుతం రాజభవనంలోనే వుండు" అని ప్రతాపున్ని అవతలికి పంపగానే ఆమె రాజు వద్దకు వచ్చి, "మహారాజా, ఆ యువకుడి మాటలు నమ్మకండి. అతను కోసల దేశపు రాజు" అన్నది.

 Previous Page Next Page