Previous Page Next Page 
సుహాసిని పేజి 26


    "నీకు జాతకాలంటే నమ్మకం లేదా?"

    "ఎలా వుంటుంది? బంగారు చెంచా నోట్లో వుంచుకుని పుట్టాను. అల్లారు ముద్దుగా పెరుగుతానని జాతకంలో ఉంది. కానీ రాబందువుల్లాంటి బంధువులు నన్ను క్రమశిక్షణ పేరుతో నానా హింసలూ పెట్టారు. ఆ హింసలన్నీ భరించే, క్రమశిక్షణ కూడా పాటించాను. నేను చెడిపోవాలనీ, చేతకానివాడిగా తయారయి అన్నింటికీ వాళ్ళ మీదే ఆధారపడి బ్రతకాలనీ వాళ్ళ కోరిక. చిన్నప్పుడే వాళ్ళకు సరిగ్గా అర్ధం చేసుకుని వాళ్ళ నాటకానికి ప్రతినాటకమాడేవాణ్ణి...."

    "ఎలా?" అంది ఆమె కుతూహలంగా.

    "నా బంధువుల్లో కొందరు నన్ను తిట్టేవారు. వాళ్ళే మళ్ళీ తమలో మరికొందరిని ప్రోత్సహించి నా చుట్టూ తిరగమనేవారు. వాళ్ళు నన్ను దురలవాట్లకి ప్రోత్సహించేవారు. నేను దురలవాట్లకి లోనయినట్లూ పెద్దలనుంచి తప్పించుకున్నట్లూ నటించేవాడ్ని. అలా మేజర్నయ్యేదాకా కత్తిమీద సాము లాంటి జీవితం గడిపాను. ఒకసారి మేజర్నయ్యాక నా విశ్వరూపం చూపించాను. మొత్తం పెద్దలందరినీ అదుపులోకి తీసుకున్నాను__"

    హాస ఉత్సాహంగా, "సినిమా కథల వుంది. నువ్వు నీ బంధువులందరి మీదా రివెంజి తీసుకున్నావా?" అంది.

    "నాకు రివెంజి మీద నమ్మకం లేదు" అన్నాడు రమణ.

    "నిన్ను హింసించిన వాళ్ళని కూడా వదిలిపెట్టేశావా?"

    "హాసా! ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళు కాదు. అందరూ చెడ్డవాళ్ళూ కాదు. అవకాశమున్నంతలో ప్రతి మనిషీ ఎదుటివాణ్ణి అంతో యింతో హింసించి ప్రయోజనం పొందాలనే చూస్తాడు. స్వప్రయోజనం కోసం ఎదుటి మనిషిని హింసించడం తప్పని నేననుకోను. నా బంధువులు ఆ పని చేశారు. వాళ్ళను హింసించడం వలన నాకేమీ ప్రయోజనం లేదు. చెప్పాలంటే నేను మేజర్నయ్యాక వాళ్ళు నా దయాదాక్షిణ్యాలమీదే ఆధారపడ్డారు. నేను మేజర్నయినా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడ్డా అన్న కోరికతో నన్ను హింసించిన వాళ్ళని ఆ తర్వాత నేను హింసిస్తే వాళ్ళకూ నాకూ తేడా ఏమిటి?"

    "నువ్వు చాలా గొప్పవాడివి...." అందామె.

    "కాదు, వాళ్ళను హింసించకపోవడంలో నా ప్రయోజనమేముంది?

    హాస ఆశ్చర్యంగా "ఏమిటది?" అంది.

    అతడామెను చూసి క్షణం ఆగాడు.

    వాన తుంపర ఎప్పుడో ఆగిపోయింది. అప్పుడు హాస మంచుకు తడిసిన పువ్వులాగుంది.

    రమణ గుటకలు మ్రింగి "జీవితంలో నాకున్న లోపమల్లా ఒక్కటే అది ప్రేమ" అన్నాడు.

    హాస కళ్ళలో జాలి!

    అతడా జాలిని చదివాడు. "హాస! చిన్నతనంలోనే తలిదండ్రుల్ని పోగొట్టుకోవడం వల్ల ప్రేమ అంటే ఏమిటో తెలియకుండా పెరిగాను. నాకు ప్రేమ కావాలి. పుస్తకాల్లో చదివాను. క్షమలోంచీ ప్రేమ పుడుతుందని. అందుకే నేను నా బంధువులిని క్షమించాను. కానీ వాళ్ళకు నాపట్ల ప్రేమ పుట్టడం లేదు. ఒకప్పుడు వాళ్ళు నన్ను భయపెట్టారు. ఆ గతం వాళ్ళను వెంట తరుముతోంది. అందులోని వాళ్ళు నేనంటే భయపడుతున్నారు.

    "చిత్రంగా వుంది" అని నిట్టూర్చింది హాస.

    "ప్రేమ ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది- అని ఆక్రోశించాను. తలిదండ్రుల్ని దత్తత చేసుకోమన్నారు కొందరు. నా బంధువులు నాకు తలిదండ్రుల వంటివారే! వాళ్ళలో ఆశ, భయం, తమ బిడ్డలా గురించిన స్వార్ధం తప్ప నాపట్ల ప్రేమ లేదు. అప్పుడు...." ఆగాడతడు.

    "ఊఁ" అంది హాస కుతూహలంగా.

    "ఒక రోజు నిన్ను చూశాను...."

    హాస ముఖం క్రిందకు వాలింది. తల బరువుగా మారుతున్న సిగ్గునామె ఓర్చుకుని క్రమంగా తల పైకెత్తి అతణ్ణి చూసింది.

    "అప్పుడు తెలిసింది నాకు- నా కోర్కె తీరబోతోందని!"

    హాస చటుక్కున "కానీ, నేను నిన్ను ప్రేమించలేదుగా" అంది. ఆ మాటలన్నప్పుడామె ముఖం ఎంతో అమాయకంగా వుంది.

    "నిజమే! కానీ నిన్ను చూడగానే నాలో ప్రేమ పుట్టింది. అప్పుడే ప్రేమంటే ఏమిటో నాకు తెలిసింది. ప్రేమంటే తెలియగానే ప్రేమ గొప్పతనం అర్ధమయింది. అంతకాలం నేను ప్రేమించబడాలని పరితపించాను. ప్రేమించడంలో కూడా ఎంతో ఆనందముందని నాకర్ధమయింది. నాలో పుట్టిన ప్రేమ అప్పుడే పుట్టిన లేగదూడలా కొద్ది క్షణాల్లోనే తన కాళ్ళమీద తనే నిలబడి నడకలు నేర్చుకుంది. అప్పుడు నేను మీ యింటికొచ్చాను"

    "ఊఁ" అంది హాస.

    "హాసా! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమతోపాటు నువ్వేం కావాలన్నా నీకిస్తాను. నేను మాత్రం నీనుంచి కోరుకునేది ఒక్కటే....అదే ప్రేమ!" అన్నాడు రమణ.

    "నిజం చెబుతున్నాను. ప్రేమంటే ఏమిటో నాకు తెలియదు" అంది హాస.

    "నేను చెప్పేక కూడా తెలియలేదా?" అన్నాడు రమణ.

    "ఒక్క విషయం తెలిసింది. మనిషికి రెండు కాళ్ళయితే ప్రేమ నాలుగు కాళ్ళ జంతువని నాకర్ధమయింది నువ్వు చెప్పినదాన్ని బట్టి."

    రమణ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు.

    హాస అమాయకంగా నవ్వుతోంది. కానీ ఆమె తన మాటలు ఎంతో శ్రద్ధగా వింది. అందులోంచి ఎంత తెలివిగా ఎలాంటి భావం లాగింది?

    "ఈమె చాలా లోతయిన మనిషి!" అనుకున్నాడతను.

    "ఏమీ అనుకోకు. అన్ని విషయాలూ నాకు సరదాగా అనిపిస్తాయి. జేబులో పైసా లేకుండా నెత్తిమీద క్వింటాలు బరువు మోసే కూలీ నవ్వు ముఖంతో చకచకా తేలికగా అడుగులు వేస్తూంటే, షేర్ మార్కెట్లో ఆ రోజు పది లక్షలకు బదులు ఏడు లక్షలే లాభం వచ్చిందని అన్నీ పోగొట్టుకున్నవాడిలా దిగులుగా బరువుగా అడుగులు వేసే మరొకణ్ణి చూసినప్పుడు బరువు శరీరం మీద లేదనిపిస్తుంది. మనసు తేలిగ్గా వుంటే ఏ బరువూ మనిషిని బాధించదు. అలాంటప్పుడు మనిషి మనసును తేలికగా వుంచుకోడేం?" అంది హాస.

    "అంటే?"

    "నీ బరువు నీ వంటిది కాదు. మనసుది. అది దింపుకుందుకు నీక్కావలసింది ప్రేమ కాదు. నిన్ను నువ్వే మార్చుకోవాలి...."

    "అందరూ నీకులా వుండగలిగితే ఈ ప్రపంచంలో సమస్యలే వుండవు. హాసా! నన్ను మార్చుకోవడం నా వల్లకాదు. నువ్వే నాకు సాయపడాలి...."

    "నువ్వు నా పెద్ద వాళ్ళతో మాట్లాడేవుగా...."

    "మాట్లాడేను. కానీ నీతో మాట్లాడకుండా?"

    "మా వాళ్ళ మాటే.... నా మాట!"

    "అయితే పెళ్ళి ముహూర్తం...."

    "సారీ_అందుకు మాత్రం నా మాటే పై మాట...."

    "నీ మాటేమిటో తెలుసుకుందామనే యిక్కడికొచ్చాను...."

    ఆ విషయం హాసకు తెలుసు.

    తను ఎమ్మే చదువుతానంది. ఎమ్మే పూర్తయ్యేదాకా పెళ్ళి చేసుకోనంది. మొదట్లో ఇంట్లో అంతా దీనికొప్పుకున్నారు. కానీ యిప్పుడు వాళ్ళ మనసులు మారాయి. ఊరికే సంబంధాలు చూడ్డం మొదలెడుతున్నానన్నాడు తండ్రి. పెళ్ళి మాత్రం ఎమ్మే అయ్యాకేనని మాటిచ్చాడు. ఆ మాటకు వాళ్ళు సీరియస్ గా తీసుకోలేదని హాసకు తెలుసు. అందుకే రమణ సబంధం రాగానే ఊగుతున్నారు.

    హాస తన పెళ్ళి విషయంలో చాలా సీరియస్ గా వుంది. ఎమ్మే పూర్తి చేయాలని ఆమె పట్టుదల.

    అందుక్కారణముంది.

    దక్షిణామూర్తికి బాగా జాతకాల పిచ్చి వుంది. ఆయన హాసకు పదేళ్ళప్పుడు ఆమె జాతకం మరోసారి పండితుల చేత పరీక్షింప జేయించాడు. ఆ ప్రకారం హాస పెళ్ళి చాలా విచిత్రంగా జరుగుతుంది. అందరూ ఓ రకంగా అనుకుంటే అదింకోరకంగా జరుగుతుంది. అలా జరిగినప్పుడామె భారతదేశపు చరిత్ర మార్చే వంశాంకురానికి మాత అవుతుంది.

    అలాకాక మామూలుగా వివాహం జరిగిపోతే ఆమె అందరిలాంటి గృహిణే అవుతుంది.

    హాసకు సంబంధం వెతుక్కుంటూ వస్తుంది. దానికామె ఒప్పుకుంటే అదే ఆమె జీవితాశయానికి ముగింపు.

    వచ్చిన సంబంధం వాయిదా వేయగలిగితే ఆమె జీవితాశయం నెరవేరుతుంది. రెండు పదులు నిండేకనే ఆమె కళ్యాణం జరగాలి!

    హాస ఈ జాతకాన్ని నమ్మిందో లేదో తెలియదు కానీ చిన్నప్పటినుంచీ దాని గురించే ఆలోచిస్తోందామె. సాధారణ గృహిణిగా తన జీవితం గడిచిపోకూడదని ఆమె బలమైన కోరిక ఎమ్మే చదువు పేరుతో అది సాధించవచ్చునని ఆమె ఆశ!

    ముహూర్తం విషయంలో హాస గట్టిపట్టు పట్టింది. అది మొండిపట్టు. కానీ ఈ విషయంలో ఇంట్లో ఆమెనెవరూ సపోర్ట్ చేయడంలేదు. ఒక్క దక్షిణామూర్తి తప్ప. ఆయన కూడా మరీ అంత సీరియస్ గా సపోర్ట్ చేస్తున్నాడనిపించదు. ఆయన సపోర్ట్ నెవరూ అంత సీరియస్ గా తీసుకోవడం లేదు కూడా!

    అదీకాక ఏ పాయింటు మీద హాస వాదిస్తోందో ఆ పాయింటునే తీసుకుని ప్రతివాదం మొదలు పెట్టింది పార్వతమ్మ.

    ఆడదానికి సాధారణ గృహిణి జీవితంలోనే సుఖముంటుందంటుందావిడ.

    రచయిత్రులు మొగుళ్ళనొదిలేస్తున్నారు. రాజకీయ నాయకురాండ్రు రోజుకిరవై గంటలు పనిచేస్తూ శత్రువుల్ని పెంచుకుని చివరకు తుపాకి గుళ్ళకు బలైపోతున్నారు. క్రీడారంగంలో పేరు శాశ్వతంకాదు. బాగా ఉన్నన్నాళ్ళూ పూలమాలలు. పరాజయం పొందితే రాళ్ళ దెబ్బలు.

    సాఫీ జీవితం సాధారణ గృహిణికే వుంటుంది. అందులో సాధించేదేమీ లేదనుకోవడం తెలివి తక్కువ నిస్వార్ధంగా భర్తనీ, పిల్లల్నీ సేవించుకుంటూ సంసారాన్ని స్వర్గం చేసుకుంటే అది సామాన్యమా! ఒక దేశపు సుఖశాంతులు సాధారణ గృహిణి మీదే ఆధారపడి వున్నాయి.

    "నా మనుమరాలికి ఊరూ, పేరూ వద్దు. సుఖశాంతులు కావాలి. కాబట్టి వెంటనే ఈ సంబంధం స్థిర పర్చేయండి" అంది పార్వతమ్మ ఆర్డర్ జారీ చేస్తున్నట్లు.

 Previous Page Next Page