బాలూ వాళ్ళ గ్రూపులో ఇద్దరు నీగ్రో కుర్రాళ్ళు వున్నారు. ముగ్గురు ఆంగ్లో ఇండియన్సూ, ఒక ఇరానీ, ఒక అరబ్ కుర్రాడూ, నందిత అనే కూచిపూడి డాన్సరూ, బాలూ, సౌదామినీ, గిటార్లు, డ్రమ్సూ, మృదంగం, వయొలిన్, రాక్ మ్యూజిక్, బ్రేక్ డాన్సూ, కూచిపూడి, సరిగమలూ, డో, రే, మీ, పా, సా, టీ లూ -
అన్నీ కలిసిన అద్భుతమైన కలగాపులగపు కాక్ టెయిల్.
కళలో పరిపూర్ణత్వం సాధించడం కష్టం. అకుంఠితమైన దీక్ష కావాలి దానికి. అహూరాత్రులు తపనపడాలి. తపస్సు చేసినట్లు నిరంతరం నిర్విరామంగా కృషి చెయ్యాలి.
కానీ జిమ్మిక్స్ చేయడం చాలా సులభం. జనం నాడి పట్టుకోగలిగితే చాలు.
నాడి కొట్టుకుంటున్నట్టు లైట్లు వెలిగి ఆరిపోతున్నాయి. రంగు రంగుల స్ట్రోబ్ లైట్లు రంగుల కలలా వుంది స్టేజి.
నరనరాల్లో విద్యుత్తు ప్రవహిస్తున్నట్టు ఫీలవుతూ ఊగిపోతున్నారు ప్రేక్షకులు. "ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్" ధీమ్ మ్యూజిక్ తయారుచేసింది బాలూనే.
అతడు నాలుగు రోజులు రాత్రింబవళ్ళు కూర్చుని కంపోజ్ చేశాడు దాన్ని.
తూర్పు పడమరలకు కలుపుతూ వేసినట్లు ఇంద్రధనస్సు మీద ఊపిరాడని వేగంతో ప్రేక్షకుల్ని తీసుకెళ్ళిపోతోంది ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్.
ప్రోగ్రాం సగం అయిన తర్వాత సౌదామిని మైకులో అరిచింది. "కమాన్ గాల్స్ అండ్ గైస్! లెటజ్ సింగ్ టుగెదర్!"
అదొక అమోఘమైన చిట్కా.
కేవలం కళ్ళప్పగించి ప్రోగ్రాం చూడటం వేరు! తాము కూడా అందులో పాలుపంచుకోవడం వేరు.
చాలామంది సీట్ల దగ్గరే నిలబడి సందేహంగా పాదాలు కదుపుతూ పెదాలు కదుపుతూ నెమ్మదిగా పాట అందుకున్నారు.
చప్పట్లు చరుస్తూ, నవ్వు మొహాలతో వాళ్ళని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు బాలూ, సౌదామిని.
కాసేపటి తర్వాత అక్కడి వాతావరణం మారిపోయింది. వీళ్ళకి పాట రాదు. వాళ్ళకి డాన్సు రాదు అన్న భేదం పోయింది. అందరిదీ ఒకే శరీరం అయినట్లు, ఒకే స్వరం అయినట్లూ, ఒకే శ్వాస అయినట్లూ ఆ అనుభూతిని పంచుకోవడంలో మునిగిపోయారు.
గంట తర్వాత కర్టెన్ దిగింది.
చప్పట్లతో మారుమ్రోగిపోయింది ఆడిటోరియం. వాళ్ళు ఆశించిన దానికంటే విజయవంతమైంది ప్రోగ్రాం.
"నధింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్" అని ఇంగ్లీషులో సామెత ఒకటి వుంది. విజయ పరంపర ఒకసారి మొదలయిందంటే ఇంకా పట్టపగ్గాలు వుండవు దానికి. అది నిజమైంది వాళ్ళ విషయంలో.
మర్నాడు పేపర్లు వీళ్ళ ప్రోగ్రాంనే హైలైటు చేశాయి. "స్టాండింగ్ ఓవేషన్" అని రాసింది ఓ ఇంగ్లీషు పత్రిక. ఆడిటోరియం అదిరిపోయింది అని రాసింది మరో తెలుగుపత్రిక నాట్యాన్ని క్షుదం చేస్తున్నారు అన్నాడో విమర్శకుడు.
"సరికొత్త మ్యూజిక్ సెన్సేషన్" అని వర్ణించాడు ఒక మ్యూజిక్ లవర్.
మళ్ళీ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.
ఈసారి టిక్కెట్లు మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి. అదీ ప్రోగ్రాంకి రెండు రోజుల ముందరే.
మళ్ళీ గ్రాండ్ సక్సెస్.
మూడో నెలలో మూడో ప్రోగ్రాం. హాట్ ట్రిక్.
ఆ తర్వాత ఊపిరి తీసుకునే తీరిక లేకుండా పోయింది బాలూకి, సౌదామినికి కూడా.
విజయం....మలయమారుతంలా రాదు. ఝంఝామారుతంలా వస్తూ, సుగంధ పరిమళాల్ని తీసుకొస్తుంది.
వాళ్ళకి అడుగు దూరంలో నిలబడి వాళ్ళు వదిలిన వూపిరిని పీల్చడమే అదృష్టమానుకునే అభిమానులు అసంఖ్యాకంగా తయారయ్యారు.
ప్రోగ్రాంలు ఎక్కువైపోయాయి.
రైల్లో సెకండ్ క్లాసు ప్రయాణాలు వెనకబడిపోయి-
ఎయిర్ కండిషన్డ్ కూపేలూ, ఎయిర్ జర్నీలూ మామూలై పోయాయి.
బ్యాంకులో డబ్బులెయ్యడమే కానీ, తియ్యవలసిన అవసరం రావడంలేదు. అన్ని ఖర్చులూ ఆర్గనైజర్సే భరిస్తున్నారు.
వాళ్ళ డైరీలో పేజీలన్నీ అప్పాయింట్ మెంట్ లతో నిండిపోతున్నాయి. ఆ సంవత్సరంలో ఒక్క పేజీ తప్ప.
ఎవరు ఎంత బలవంత పెట్టినా, ఎంత డబ్బు యిస్తామన్నా కూడా ఆ ఒక్కరోజుకీ మాత్రం ఏ ప్రోగ్రామూ ఒప్పుకోవడం లేదు బాలు. అది వాళ్ళ మారేజ్ డే.
ఆ రోజున తప్పకుండా ఖాళీగా ఉండితీరాలన్నది అతడి నిర్ణయం.
పిల్లాడిని తీసుకుని షాపింగ్ కి వెళ్ళారు. బొమ్మల షాపులో వున్న సగం బొమ్మలు కొనేశారు. బట్టల షాపుకి వెళ్ళి ప్రతీవెరైటీలలో ప్రతి డిజైన్ లో బట్టలు కొన్నారు. బంజారాలో భోజనం చేశారు. తర్వాత టాక్సీ ఎంతోదూరం పరిగెత్తి అందమైన ఒక చిన్న బంగళా ముందు ఆగింది.
జరుగుతున్నది సగం అర్ధం అవుతూంది, సగం అర్ధం కావడంలేదు సౌదామినికి.
ప్రశ్నార్ధకంగా చూసింది అతని వైపు.
"మనిల్లు" అన్నాడు ఆమె అడగని ప్రశ్నకు జవాబు చెబుతూ.
కళ్ళు విప్పార్చి చూసింది.
రెండు బెడ్ రూములు మొత్తం మొజాయిక్ ఫ్లోరింగ్ పైన "గెస్ట్ రూం".
బెడ్ రూమూ, గెస్ట్ రూము, ఎయిర్ కన్డిషన్డ్ బాత్ రూంలో గీజర్లు ఉన్నాయి. లేత గులాబిరంగు బాత్ టబ్ వుంది.
తర్వాత వివరాలన్నీ చెప్పాడు బాలూ. కొత్తగా కట్టిన యిల్లే ఇంకా గృహప్రవేశం కూడా కాలేదు. అమ్మకానికి వచ్చింది. అడ్వాన్స్ యిచ్చేశాను.
ఒకేసారి ఆశ్చర్యంలో ముంచుదామని సౌదామినికి ఈ విషయాలేవీ చెప్పలేదు.
ప్రస్తుతానికి చుట్టు ప్రక్కల ఎక్కువ ఇళ్ళు లేవు. కానీ రెండు మూడేళ్ళలో బాగా డెవలప్ అవుతుంది. ఎదురుగా ప్లాస్టింగ్ కూడా పూర్తికాని ఒక చిన్న యిల్లు వుంది. దాని ఓనరు ఓ ఎన్జీవోగారు. ఎన్ టి ఆర్ దెబ్బతో హఠాట్టుగా రిటైరయిపోయి ఇల్లుసగంలో ఆపేశాడు. ఆయనా, ఆయన భార్యా అందులో కాపురం ఉంటున్నారు. పిల్లల్లేరు. (నిజానికి ఆయన భార్యే ఆయనకి కూతురిగా కనబడుతుంది. వలల వయసుల్లో చాలా తేడా వుంది.)
"ఇకనుంచీ మనం ఏ పౌర్ణమికీ కూడా వేరే ప్రోగ్రాములు పెట్టుకోవద్దు. ప్రతి పౌర్ణమికీ మనకు ఒకటే ప్రోగ్రాం వుందాలి. డాబామీద మల్లెపందిరి క్రింద కూర్చుని తెల్లటి అన్నం, తెల్లటి పెరుగూ తెల్లటి వెన్నెలా కలుపుకు తినటం. ఆ తర్వాత తెల్లటి పరుపుమీద తెల్లటి చీర కట్టుకున్న నువ్వు వెన్నెల్లో పాలరాతి బొమ్మలా కనబడుతూ ఉంటే...."
చురుగ్గా చూసి అతని మాటలకు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టించిందామె.
మరుసటి నెలలో కొత్త ఇంట్లోకి మారిపోయారు వాళ్ళు, ఫ్రెండ్సందరినీ పిలిచి హౌస్ వార్మింగ్ పార్టీ చేసుకున్నారు.
ఆ రాత్రి పడుకునేసరికి బాగా పొద్దుపోయింది. తెల్లవారు జామున చలికి మెలకువ వచ్చింది బాలూకి. రగ్గుకోసం తడుముకుంటూ లేచి కూర్చున్నాడు.
పక్కనే సౌదామిని మోచేతి వంపులో మొహం పెట్టుకుని నిద్రపోతోంది. అది ఆమె అలవాటు. ఆమె గుండెల్లో నిద్రపోతున్నాడు పిల్లవాడు. నిద్రలోనే కొద్దిగా పక్కకు దొర్లి ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి, పిల్లవాడి మొహంమీద వున్నా దోమను తోలి వాడి మీద తన కొంగును కప్పి ఒక్కసారి బాలూవైపు చూసి చిరునవ్వు నవ్వి మళ్ళీ నిద్రలోకి జారిపోయింది సౌదామిని.
మెల్లిగా నిద్రమత్తు వదలిపోయింది. లేచి డాబా పిట్టగోడ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు.
అలా చూస్తూంటే అతడికి ప్రపంచాన్ని జయించినట్లు వుంది.
ఆ ఇల్లు కాస్త ఎత్తుగా, కొండమీద వుండటంతో నగరంలో లైట్లు కార్తీక పౌర్ణమి ద్వీపాల్లా వున్నాయి.
మొత్తం ప్రపంచమే తన కాళ్ళ దగ్గిర వున్న అనుభూతి అది అహం కాదు. తను పడిన కష్టానికి ఒక "బ్రేక్ త్రూ" లభించిన తన కళకి ప్రజలు నీరాజనాలు అర్పిస్తూంటే ప్రతి కళాకారుడికీ ఒక స్టేజీలో కలిగే సంతృప్తి. అది అనిర్వచనీయం, అద్వితీయం.
అతడు అక్కడే నిలబడి సౌదామినివైపు చూశాడు.
వర్షంలో తడిసిన పావురంలా వుంది. వెన్నెల ఆమెని తడుపుతోంది. అతని మనసంతా అదో రకమైన ఉద్విగ్నతతో నిండిపోయింది.
తనని ఈ రోజు ఇంత డబ్బులో, ఇంత కీర్తిలో ముంచెత్తుతున్న ఈ సమాజం, ఒకరోజున తనకి ఎంగిలి విస్తరాకు రాల్చటానికి సంకోచించింది. అప్పుడు ఈ అమ్మాయి-
తన భార్య-
దోసిలిపట్టి తనకి ప్రేమధారల్ని అందించింది. తన నిచ్చెన క్రింద నిలబడి అక్షరాలు వ్రాసింది. మెట్లు అమర్చింది. మంగళసూత్రాన్ని అమ్మి విజయాల్ని సూత్రీకరించింది.
అతడామెవైపు అలాగే ప్రేమగా ఆర్తిగా చూస్తూ "....నువ్వంటే నా కెందు కిష్టమంటే సౌదామినీ-" అనుకున్నాడు మనసులో.
నువ్వంటే నా కెందుకంత ఇష్టమంటే
నువ్వు చాలా మంచి అమ్మాయివి.
మంచి టు ది పవర్ ఆఫ్ మంచి అన్నమాట.
నాకు సంబంధించిన అత్యల్ప విషయాలు కూడా నీకెంతో ముఖ్యం.
నాకు చిన్న చిన్న విషయాలు కూడా అపురూపంగా గుర్తుంచుకుంటావు.
నువ్వు కలవనంతవరకూ ఈ ప్రపంచంలో-
నా కన్నా తెలివైనవాడు లేడు.
మా అకన్నా సిల్లీ ఫెలో కూడా లేడు.
నువ్వు కలిశాక ఆ రెండూ తప్పని తెలిసింది.
నా శరీరంలో సిల్లీ పార్ట్స్ అన్నీ (మెదడుతో సహా)
నాకన్నా నీకే బాగా తెలుసు.
రహస్య స్థలాన్ని శోధించే గూఢచారులం మనం.
నీతో రక్షింపబడటం కోసం
కష్టాల్లో పడ్డట్టు నటిస్తూ వుంటాన్నేను.
నువ్వంటే నాకెందు కిష్టమంటే
నేను విచారంలో వున్నప్పుడు
పక్కన కూర్చుని ఓదార్చవు
విచారం ఎందుకా అని ఆలోచించుకొనే
సందర్భం కలుగజేస్తావు.
నా జీవితంలో ఎవరితో ఏ సంఘటన జరిగినా
నీతో జరిగినదంతా అందంగా వుండదు. అంతకన్నా ముఖ్యం......
నీ దగ్గిర నేను ఇష్టం వచ్చినట్టు వుండొచ్చు.
ఇంకో విషయం -
నువ్వు లేకపోయినా
నువ్వు నా దగ్గిర ఉంటావు.
ఎంత గమ్మత్తయిన విషయం.
నువ్వెప్పుడు గుర్తొచ్చినా అదే!
నా దుఃఖాన్ని గుర్తుంచుకోవటం కోసం
నీ ఆనందాన్ని మర్చిపోతావు
ఇవన్నీ కాదు. అసలు విషయం చెప్పెయ్యనా?
మాట్లాడటమే కాదు.
ఎలా వినాలో కూడా నీకు బాగా తెలుసు!!