Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 23

   

     "తెలియకపోవడానికి తనేమయినా చిన్న పాపాయా? లేక విదేశాల్నుంచి యివ్వాళే దిగాడా? ఇవన్నీ తెలుసుకోలేనంత బ్రాహ్మవిద్యలా?" సునీత గట్టిగానే అరిచింది. విశాల మొహం కఠినంగా మారిపొయిందొక్కసారిగా.
   
    "తెలుసుకోవలసిన అవసరం మీ అన్నయ్యకు నేను రానివ్వను సునీతా! నేను చేసిన పూజల ఫలితమే అను మరేదైనా అను. మా పిల్లలకు అనుకోకుండా పెద్ద జబ్బులేవీ రావు. అలా వస్తాయేమోనన్న ఆలోచన రావడమే నాకు పాపంగా తోస్తుంది. ఈ రోజు సమయానికి నువ్వు రావడమే చూడు. భగవంతుడెప్పుడూ నాకెలాగో సహాయం అందచేస్తూనే వుంటాడు. అయినా యివాళ పొద్దుట లేవగానే ఎవరి మొహం చూశానో అన్నీ తలనొప్పులే. ఎప్పుడూ లేంది మీ అన్నయ్య కళ్ళనీళ్ళు కూడా పెట్టుకున్నారు" అంది తన కన్నీళ్లు తుడుచుకుంటూ విశాల తన భర్త కన్నీళ్ళు పెట్టుకోవడం ఎనిమిదో వింతగా.
   
    "మొదట దేవుడి మొహం, ఆ తర్వాత నా మొహం చూశావు. దేవుడికంటే దెయ్యంలాంటి నేను శక్తిమంతురాల్ని కాబట్టి నీకు చెడు జరిగింది" అంది సునీత వొళ్ళుమండి.

    "ఏమో అదీ చెప్పలేం 'పొద్దుటే లేచి పిల్లలులేని గొడ్రాలి మొహం చూడకే నీ పిల్లలకు ఏమయినా జరుగుతుంది' అని బామ్మ చాలాసార్లు చెప్పింది. నేనే పట్టించుకోలేదిన్నాళ్ళూ" అని లోపలకు వెళ్ళి పోయింది విశాల.
   
    సునీత దెబ్బతిన్నట్లు చూసింది. విశాల అంత కటువుగా మాట్లాడగలదని అనుకోలేదు. పక్కనే కూర్చున్న విశ్వం ఓదార్పుగా...
   
    "కోపం వచ్చిందా సునీతా? మీ వదిన మాట కరుకు. కాస్త తొందరపాటు పాటు ఎక్కువ. మనసు మాత్రం చాలా మెత్తన. మళ్ళీ వచ్చి 'సారీ' అంటుంది చూడు" అన్నాడు.
   
    "పిల్లల్ని కనకపోవడం తప్పుకాదు అన్నయ్యా! కన్న పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలియకపోవడం అసలయిన తప్పు. నేను బాధపడుతున్నాను నిజమే. కాని వదిన నన్నన్న మాటలకు కాదు. అసలే దెబ్బ తగిలి ఏడుస్తున్న పిల్లను కొట్టడానికి చెయ్యెత్తిన ఆమెను కనీసం నివారించలేని నీ గురించి బాధపడుతున్నాను" అంటూ గదిలోకి వెళ్ళిపోయింది సునీత. అయితే ఈ సంభాషణ విశాల చెవిన పడనే పడింది.
   
    దుఃఖంతో నిండిన మనసు శూన్యమయిపోయింది. శూన్యంలోంచి ఆలోచనలు నిప్పురవ్వల్లా పైకి లేస్తుంటాయి. కన్నీళ్లు మాత్రమే వాటిని ఆర్పగలవు. హృదయం రగిలిపోతూంటే కంటనీరు రాకుండా కూర్చుండి పోయింది సునీత. అలా ఎంతసేపు కూర్చుందో తెలియదు.
   
    "నీతా" పిలుస్తూ వచ్చింది విశాల. సునీత తలెత్తి చూసింది. ఆమె ముఖంలో ఏ భావమూ లేదు.
   
    "సారీ నీతా! నా తొందరపాటు నీకు తెలిసిందే కదా. మనసులో ఏదీ దాచుకోవడం నాకు తెలియదు. పైకి అనేస్తాను. మళ్ళీ వెంటనే ఆ విషయం మర్చిపోతాను. లోపల ఒకటుంచుకుని పైకి మరొకటి అనడం నాకు తెలియదు. ఏమీ అనుకోకు" అంది అమాయకంగా సునీత దానికీ మాట్లాడలేదు. "ఇది నా బలహీనత కాబట్టి హత్యలు చేస్తూ వుంటాను. నన్నుక్షమించండి" అని కోర్టువారిని కోరినట్టు వుంది ఆమె వాదన.
   
    "నిజం చెప్పాలంటే మీ అన్నయ్య ప్రవర్తన నాకూ విసుగు తెప్పిస్తుంటుంది. కానీ ఆయన్ని ఏమీ అనలేను. అది నా బలహీనత ఎప్పుడైనా పొరపాటున ఏదన్నా అన్నానంటే భోజనం చెయ్యకుండా, మాట్లాడకుండా మౌనంతో శిక్షిస్తారు. అది నేనసలు భరించలేను".
   
    'మీరిద్దరూ ఒకరినొకరు ఏమీ అనుకోరు నిజమే. కాని యితరులని బాధపెట్టడానికి సందేహించరు. మీరన్న మాటలని మీరు మర్చిపోగలరు. కాని జరగాల్సిన నష్టం జరిగిపోతుందప్పటికే ఆ మాటలు గుండెల్లో అగ్నిలా రగులుతూనే వుంటాయి. కాలుజారితే తీసుకోవచ్చు-మాటజారితే వెనక్కు తీసుకోవడం కష్టం. ఈ ఇజం నీకు తెలియదు" పైకి అనలేదు సునీత. విశాలతో సంభాషణ పొడిగించడమే అనవసరంగా తోచిందామెకు ఆమె మౌనాన్ని అంగీకారంగా తీసుకున్న విశాల "పద" అంటూ లేపి బయట హాల్లోకి తీసుకొచ్చింది. హాల్లోనే కూర్చున్న విశ్వాన్ని చూసి చిన్నగా నవ్వింది. మా మధ్య ఎలాంటి అపార్ధాలు లేవని అతడికి తెలియచెప్పే ఉద్దేశ్యం- అది విశాలలో ద్వంద్వ ప్రవృత్తి బాగా అర్ధం అయిన సునీత కొద్దిరోజుల్లోనే ఆఫీసుకి దగ్గరలో ఒక యిల్లు చూసుకుని వెళ్ళిపోయింది. ఆ యింటి ఓనరు తన ఆఫీసులో పనిచేసే ఆవిడే కావడంతో వొంటరితనాన్ని ఫీలవలేదామె.
   
                               5
   
    జయలాంటి ముల్లునీ,
రాయిలాంటి సునీతని అడ్డు తొలగించుకొని హాయిగా ఊపిరి పీల్చుకుంది విశాల. కాని ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు.
   
    వారంరోజుల జ్వరం తర్వాత బామ్మకు పక్షవాతం వచ్చింది. కుడికాలూ, కుడిచెయ్యీ పడిపోయిన ఆమెను విశాల తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్ళిపోయారు. దాంతో విశాల రెక్కలు తెగిన పక్షిలా అయిపోయింది. బామ్మలేని లోటు వెంటనే తెలియవచ్చింది. అత్త మామలిద్దరూ ఎంత ఆప్యాయంగా చూసినా వాళ్ళుపోయిన వెంటనే బామ్మ రావడంతో ఆ లోటు తెలియలేదు. ఆమె ఎప్పుడైనా ఊరు వెళ్ళినా వారం పదిరోజులు ఎలాగో సర్దుకునేది. ఇక తనకు అండగా నిలిచేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరనుకున్నప్పుడల్లా ఆమెకు దుఃఖం ముంచుకు వస్తోంది.
   
    మూడు నెలలు గడిచేటప్పటికి విశాల వయసు అయిదేళ్ళు పైబడ్డట్లయి పోయింది. "నేను చేసిన పూజ ఫలితమే అను - మరేదయినా అను - మా పిల్లలకు అనుకోకుండా పెద్ద జబ్బులేవీ రావు - మాకు కష్టాలే రావు" అన్న ఆత్మస్థయిర్యం ఇప్పుడు లేదు. జీవితంలో ఇంటి బాధ్యత మొత్తం తనమీద వేసుకోవడం ఇదే మొదటిసారి. ఒకపక్క ఉద్యోగ బాధ్యత, మరోపక్క పిల్లల చదువు, అనారోగ్యం, వాళ్ళ అల్లరీ, ఇంటికి వచ్చిపోయే జనం, వంటా వార్పూ అన్నీ నెత్తిన పడేసరికి విసిగిపోయింది. ఆ విసుగంతా పిల్లలమీద చూపించేది. దాంతో వాళ్ళలో మొండితనం, కోపంలాంటి దుర్గుణాలు మొలకెత్తాయి. అవి ఆమెఉ మరింత పిచ్చిదాన్నిగా చేశాయి. కొన్నాళ్ళ వరకూ విశ్వం విషయంలో ఆమె ధోరణి మారలేదు. కాని క్రమక్రమంగా అతడిలోని బాధ్యతా రాహిత్యం ఆమెకు బాధ కలిగించటం మొదలుపెట్టింది. కాని పైకి అనాలంటే భయం. నువ్వే నన్నిలా తయారుచేసిందని అంటాడేమోనని బంధువుల్లో తనకున్న మంచిపేరుకి కళంకం వస్తుందని కూడా మరొక భయం. అప్పటికే రెండు మూడు సార్లు విశ్వం దగ్గర మొరపెట్టుకుంది పని చేసుకోలేక పోతున్నానని.
   
    "పోనీ ఉద్యోగం మానెయ్యి విశాలా! మనకేం తక్కువయిందని అది కాకపోతే మంచి వంటమనిషిని చూసి పెట్టుకో" చాలా ఉదారంగా రెండురకాల పరిష్కార మార్గాలు సూచించాడు విశ్వం.
   
    చూస్తూ, చూస్తూ రెండువేలు వచ్చే ఉద్యోగం వదులుకోలేక రెండో మార్గాన్ని ఎన్నుకుంది విశాల. దూరపు బంధువయిన ఒక ముసలావిడను తెచ్చిపెట్టుకుంది. కొద్దిరోజులు బాగానే గడిచింది. ఆ తర్వాత ఆవిడ వారంలో మూడు రోజులు మూలుగుతూ పడుకోవటం మొదలుపెట్టింది. ఆవిడ తనకు చేసి పెట్టడమేమోగాని తనే ఆవిడకు చాకిరీ చెయ్యాల్సి వచ్చేది. అదికాకుండా ఆవిడకు ఒంట్లో బాగుండలేదని చూడ్డానికి వచ్చే వాళ్ళు ఎక్కువయిపోయారు. ఇంట్లో వస్తువులు మాయమవ్వడం మొదలయింది. దాంతో ఆమెను పంపించివేసింది. కొద్దిరోజుల తర్వాత తల్లి మరో యువతని పంపించింది. ఆమెను భర్త వదిలేశాడు. అన్నా వదినా సరిగా చూడక వేరే దిక్కులేక కష్టపడుతోంది. ఆమె వచ్చాక విశాల ప్రాణం తెరిపిన పడ్డట్లయింది. చెప్పకుండానే అన్ని పనులు నీట్ గా చేసేది.
   
    అయితే ఆ సంతోషమూ ఎక్కువరోజులు నిలబడలేదు. విశ్వం ఆమెవైపు దొంగచూపులు చూడటం, తను లేని సమయంలో ఇంట్లోనే గడపడం, ఆమెను పదే పదే పిలవడం గమనించాక విశాల తల తిరిగి పోయింది. ఆవిడ కూడా విశ్వం ఆలోచన పసిగట్టినట్లు చక్కగా అలంకరించుకుని అక్కడక్కడే తచ్చాడటం చూశాక పరిస్థితి తన అదుపులోంచి దాటుతోందని గ్రహించింది విశాల. ఆ పరిస్థితుల్లో ఆమె చేయగలిగింది ఒక్కటే. భర్త నెలాగూ ఏమీ అనలేదు. ఆవిడను పని మానిపించేయగలిగింది. కానీ రోజురోజుకీ మీదపడుతున్న బాద్యతలను మోయలేక సతమతమయిపోయింది. ఏ పనీ పట్టించుకోకుండా బాధ్యత అంతా ఆమెదే అన్నట్లు ప్రవర్తించే విశ్వాన్ని చూస్తూంటే ఆమెకు లోలోపల కోపం రగులుతోంది. కనీసం బయట పనులన్నా చేయకుండా ఎప్పుడూ బయట తిరిగివచ్చే అతడి ప్రవర్తన ఆమెకు అర్ధం అయ్యేదికాదు. అంతా స్వయం కృతం కాబట్టి నోరు విప్పేదికాదు. పిల్లలను తల్లిదండ్రుల దగ్గర వదిలితే గాని తన సంసారం ఒక కొలిక్కి రాదనుకుంది. దానికామె తల్లి వప్పుకోలేదు. "మీ వదినలు ఆఫీసులకి వెళ్ళిపోతారు. వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం అంతా నా బాధ్యతే. మంచంమీద వున్నా బామ్మకు సేవ చేయలేక చచ్చిపోతున్నాను. ఇక మీ పిల్లల్ని చూసుకునే ఓపిక నాకు లేదమ్మా" అని ఫ్రాంక్ గా చెప్పేసింది వాళ్ళమ్మ మింగలేకా కక్కలేకా ఇరుకున పడిపోయి, విశాల పూర్తిగా ఇంటికి అంకితమయిపోయింది. విశ్వాన్ని గురించి పట్టించుకోవడం తగ్గించేసింది.
   
                            *    *    *

 Previous Page Next Page