Previous Page Next Page 
క్షమించు సుప్రియా! పేజి 25

           

                                                 25 వసంతాల రచయిత
   
   
    యండమూరి వీరేంద్రనాథ్ రచయితగా కలంపట్టి ఇరవై అయిదు సంవత్సరాలు పూర్తి కావొస్తున్న సందర్భంలో, ప్రముఖ సాంస్కృతిక సంస్థలు రజతోత్సవ సభలు ఏర్పాటు చేస్తున్నాయి.
   
    వీరేంద్రనాథ్ 'తులసిదళం' రచయితగానే చాలామందికి తెలుసు. ఆ తరువాతే ఆయన పాపులర్ అయ్యారని కాబోలు ఆ ముద్రపడింది. తులసిదళం 1980 ప్రాంతాల్లో ప్రచురితమైంది. కానీ వీరేంద్రనాథ్ మొదటి రచన అంతకుముందు పుష్కరం క్రితం ప్రచురితమైంది. నాటకరంగంతో పరిచయం వున్నవారికి 1970 - 80 మధ్య వీరేంద్రనాథ్ నాటక రచయితగా తెలుసు.
   
    నాటకాలు వ్రాయకముందు వీరేంద్రనాథ్ నాలుగయిదు కధానికలు వ్రాశారు. చందమామలలో కథలు వ్రాయటం తన హాబీగా ఆయన పేర్కొన్నారు.
   
    ఆ రోజుల్లో చందమామ సంపాదకవర్గంవారే భేతాళ కథలు వ్రాసేవారు. లేదా వచ్చిన కథల్లో అనువైనదాన్ని బేతాళ కథగా మలచి ప్రచురించేవారు. మొత్తం కథనే ఆ రూపంలో వ్రాయటం ప్రారంభించింది వీరేంద్రనాథే. ఆ చందమామ కథలు చదువుతూ సంపాదవర్గంతో "ఈ రచయిత ఎవరో త్వరలో పైకి వస్తాడు" అని కొడవటిగంటి కుటుంబరావు అనటాన్ని తన మొట్టమొదటి అపూర్వ అనుభవంగా వీరేంద్రనాథ్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
   
    1969లో ప్రచురితమైన ఈ కథల్లో ఈనాటి వీరేంద్రనాథ్ శైలి, శిల్పం స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాకుండా, ఆయన రచనల్లో వుండే (తర్కానికి అందని) క్లిష్టత కూడా కనిపిస్తుంది. చదవండి -
   
   
   
                             -- * * * * --

 Previous Page Next Page