Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 25

    సుహాసిని ఆతృతగా- "ఆ శకారుడే రాజకుమార్తెను ఎత్తుకుపోయిన మాంత్రికుడు కదూ!" అంది.   
    "అవును-" అన్నాడు సుబ్బారావు.   
    "మరి రాజకుమారుడేం చేశాడు?" కలవరంగా అడిగింది సుహాసిని.   
    సరిగ్గా అప్పుడే బామ్మ, సుభద్రమ్మ అక్కడకు వచ్చారు,  
    "ఏంటర్రా- అలా తడిసిపోయారు-" అంది బామ్మ.   
    "పార్కులో వాన కురిసిందండి. పాపం సుహాసిని తుమ్ములు, చలి! మీ రెప్పుడొస్తారా అని చూస్తున్నాం" అన్నాడు సుబ్బారావు.   
    బామ్మ చాలా కంగారుగా సుహాసిని వంక నడిచి చటుక్కున చీర కొంగులో ఆమె తల తుడిచి "పద, పోదాం" అంది.
    "బామ్మా- ఇంకొంచెంసేపుందాం- సుబ్బారావుగారు మంచి కథ చెబుతున్నారు-" అంది సుహాసిని.  
    "కథ సంగతి రేపు చూసుకోవచ్చు. శుభ్రంగా తడిసిపోయావు. ముందు ఇంటికి వెళ్ళాలి. జ్వరం వస్తుందో ఏమో" అంది బామ్మ కలవరంగా.
     కొద్ది నిముషాల్లోనే అంతా వెళ్ళిపోయారు. రాయుడు దిగులుగా బైటకువచ్చి- "ఈ జంట లాభంలేదు. మనమింకో జంటను వెతుక్కోవాలి-" అన్నాడు.   
    "ఆరంభించింది. మీరు మధ్యలో అలా కంగారుపడితే ఎలా? జంటలో ఈకొద్దికాలంలోనే ఎన్నో మార్పులు తీసుకుని వచ్చాం-" అన్నాడు రచయిత.   
    "నాకేమీ తెలియడంలేదు. నీకేమైనా తెలిసిన మార్పులుంటే చెప్పు."   
    "ప్రభాకరాన్ని ఏమీ అనడానికి వీల్లేదనే సుహాసిని సుబ్బారావతన్ని చింపాంజీ అంటే సహించింది.సుబ్బారావు పరిచయాన్ని కోరిన వనజకు ఇంతవరకూ పరిచయం చేయలేదు. వనజకూ సుబ్బారావుకూ పెళ్ళి అసంభవం అని తెలియగానే సుహాసిని సుభద్రమ్మ కాళ్ళకు మ్రొక్కి వచ్చింది. సుహాసిని సుబ్బారావుపట్ల ఆకర్షితురాలవుతోంది. అదే ప్రేమ అని ఆమెకు ఇంకా తెలియదు. అతడు చెప్పే కథను వింటూ తనను రాజకుమార్తెగానూ అతన్ని రాజకుమారుడు గానూ ఊహించుకుంటోంది! తరచుగా అతడి సమక్షాన్ని కోరుతోంది. అలాగే సుబ్బారావుకూడా ఆమె సమక్షాన్ని కోరుకుంటున్నాడు. ఆరంభంలో లాగ. అతడిప్పుడామెను చూసి సిగ్గుపడడంలేదు. ఆమెవద్ద అతడికి చనువు పెరిగింది. ప్రభాకరానికీ సుహాసినికీ వివాహం జరుగరాదని అతను కోరుకుంటున్నాడు. ఏదో ఒకరోజున వాళ్ళిద్దరూ పరస్పరం ప్రేమించుకుంటారు-" అన్నాడు రచయిత.   
    "వాళ్ళ పెళ్ళి అసాధ్యం. బామ్మ, సుభద్రమ్మ-చస్తే దానికి ఒప్పుకోరు"   
    "మన సినిమాలో వాళ్ళు విలన్సు, కామేడియన్సు, అలాంటి వాళ్ళు తమకు తెలియకుండానే ఈ పెళ్ళికి దోహదం చేస్తారు." అన్నాడు రచయిత.   
    "నానాహంగామాచేసి- వాళ్ళను వానలో తడిపాం! వయసు పొంగులు అనబడుతూంటే ప్రేమ
పలుకులుమానేసి దుప్పటీ తెస్తానంటాడు. వాడు చలిలో చెలి వనుకుతూంటే తెలిసిన వాళ్ళింటికెళ్ళి దుప్పటీ తెస్తామన్న వాణ్ని ఎక్కడైనా చూశావా? ఇద్దరూ శుభ్రంగా తడిసిపోయి- వంటికి అతుక్కుపోయిన బట్టలలో- ఎంతో దగ్గరగా - ఏకాంతంగా ఉన్నారు. ఇలాంటి అవకాశాన్ని పాడుచేసుకున్న యువకుడు చరిత్రలో ఉన్నాడంటావా?"   
    చరిత్ర నా బోటి రచయితలు రాసేదేకదండీ- దాని సంగతి మన కెందుకు! నిజంగా చరిత్రలో అలాంటి యువకుడే లేకపోతే - ఈ నాడుమనం అలాంటి యువకుడి కథను వెండి తెరకెక్కించి చరిత్ర సృస్టించబోతున్నాం. దీనికి మీరు ఇంతగా ఆతృతపడతారెందుకు?" అన్నాడు రచయిత.   
    కథబాగానే ఉంది. కానీ నేను కోరేమలుపు ఎక్కడా కనుచూపు మేరలో కనబడకపోతూంటే అధైర్యంగా ఉంది. వీళ్ళ నింతవరకూ తీసుకొచ్చి ఇలా వదిలేయడం నాకు ఇష్టం లేకుండా ఉంది" అన్నాడు రాయుడు.   
    "మీరేమీ కంగారు పడకండి. నేను తర్వాతిసీను ఆలోచించే ఉంచాను. ఆ దెబ్బతో సుహైస్ని మనసులోంచి ప్రభాకరం అవుటయి పోతాడు. ఆ పైన సుహాసిని అతడి పేరు చెబితేనే షటప్ అంటుంది" అన్నాడు రచయిత.   
    "ఏమిటయ్యా ఆ సీను!" అన్నాడు రాయుడు.   
    "ప్రభాకరం మీదకు మళ్ళీ ఓ పనసతొన లాంటి పిల్లను వదలాలి!"   
    రాయుడు నిట్టూర్చి "ఏం అదృష్టమయ్యా ఆ ప్రభాకరానిది! అయినా ఎంతో అందమైన ఆడపిల్లల్ని-ఆ చింపాంజీ గాడి చుట్టూ తిప్పుతున్నామని నాకు బాధగానే వుంది. ప్రేక్షకులది ఉప్పుతారో ఒప్పరో" అన్నాడు.   
    "ఒప్పేలాగే చూద్దాం. పిల్ల ఒంపు సొంపుల్ని ఎక్కువసేపు చూపించి చింపాంజీగాన్ని జస్టు ఫ్యూ సెకండ్సు చూపిద్దాం. నిమిషానికో కొత్తపిల్లను చూపించామంటే జనమూ మెచ్చుకుంటారు. అంతమంది పిల్లల్ని చూపించదానికి కారణమైన ఆ చింపాంజీగాడి పాత్రమీద కూడా వాళ్ళకు సానుభూతి ఏర్పడుతుంది" అన్నాడు రచయిత.   
    "సరే- పిల్లనుసి గొల్పడం వరకూ బాగానే ఉంది. కాని అస్తమానూ ఒకే పద్దతిలో ఉండకూడదు. ఏదయినా కొత్తదనం ఉండాలి!" అన్నాడు రాయుడు.   
    "కొత్తదనం కోసమే నేనూ చూస్తున్నాను. యిది రాయుడిగారి సినిమా కథా-మరోటా! ఆ విషయం నేనెప్పుడూ మరిచిపోను. రేపు పార్కులో మన కొత్త పథకానికి ప్రాతిపదిక పడాలి" అన్నాడు రచయిత.   
    అయితే మర్నాడు సుహాసిని పార్కుకు రాలేదు. బామ్మగారు కూడా రాలేదు. సుబ్బారావు, సుభద్రమ్మ కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు.   
    రాయుడు, రచయిత కారణం తెలియక వెనక్కు పోయారు.   
    సుబ్బారావు బామ్మగారింటికి వెడతానన్నాడు. శుభద్రమ్మ ఒప్పుకోలేదు. ఏ కారణం వల్లనైనా రాకపోతే - రావడంలేదని కబురెట్టాలి. ఆ మాత్రం మర్యాద తెలియని వాళ్ళింటికి పనిగట్టుకుని నువ్వెందుకు వెళ్ళాలీ?" అందావిడ సుబ్బారావు అయిష్టంగానే తల్లితో కదిలాడు.   
    గతిలేక రాయుడు వాళ్ళనీ వీళ్ళనీ పంపి సుహాసిని గురించి వాకబు చేయించాడు. ఆయనకు వచ్చిన వార్తవిని నివ్వెరపోయాడు. సుహాసిని వళ్ళెరుగనిజ్వరంలో పడి ఉందట. పార్కులో వానలో తడిసిందని తెలిసి తండ్రి మండిపడి ఇంకెప్పుడూ ఆమెను పార్కులకు పంపరాదని ఆదేశించాడట.   
    "ఇన్ని సినిమాల్లో హీరోయిన్సు తడిశారు. ఎప్పుడైనా ఇలాగయిందా?" అంటూ రాయుడు విసుక్కున్నాడు.   
    "అలా జరక్కపోవచ్చు. కానీ ఏ జ్వరమో వచ్చిందని హీరోయిన్స్ కాల్ షీట్సు కాన్సిల్ చేసుకోవడం మనకు మామూలేగదా-ఇప్పుడూ అలాంటి పరిస్థితే ఏర్పడిందనుకుని సరిపెట్టుకుందాం. సుహాసినికి నయమయ్యేవరకూ వేచి చూద్దాం" అన్నాడు రచయిత.   
                                            13   
    సుహాసినికి జ్వరం తగ్గి మామూలు మనిషి కావడానికి మూడు రోజులు పట్టింది. జ్వరం తగ్గినా మర్నాడు ఆమె సుభద్రమ్మ యింటికి వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళింది. అప్పుడు సుబ్బారావు ఇంట్లో లేడు. సాయంత్రం సుబ్బారావు వచ్చే సమయానికి బామ్మ, సుహాసిని వాళ్ళింటికి వచ్చారు.

 Previous Page Next Page