Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 24

   
    "శ్యామ్! నాకోసం ఒక చిన్నసహాయం చెయ్యాలి నువ్వు!"    
    "చెప్పు?"    
    ఈ రోజుకి ఈవిడని వొదిలెయ్యి. ఇంకమీదట కల్పించుకోను."    
    శ్యామ్ ఒక్కక్షణం అయిష్టంగా ఊరుకున్నాడు. ఆతర్వాత కన్నుకొడుతూ నవ్వి "ఆల్ రైట్! నీ యిష్టం! నీమాట ఎప్పుడు కాదన్నాను?" అన్నాడు!    
    శ్యామ్ కన్ను కొట్టడంతో తనను ఎంతకు దిగజార్చాడో అర్ధమయింది మోహన్ కు. మాట్లాడకుండా బయటికి నడిచాడు! ప్రసూన అతని వెనకే నడిచింది.    
    ఆ క్లబ్ ఆవరణలోంచి బయటపడ్డాక ప్రసూన ఊరిపి పీల్చుకుంది! థాంక్స్ చెప్పాలని మోహన్ ముఖంలోకి చూసింది. కానీ మోహన్ ప్రసూనవైపు చూడటంలేదు. అతనిని పిలవలేకపోయింది. ప్రసూన ఎన్నెన్నో చెప్పాలని ఉన్నా, దేనికీ మాటలు దొరకటంలేదు.    
    మోహన్ టాక్సీ పిలిచాడు. ప్రసూన కూచున్నాక తలుపు వెయ్యబోయాడు. ప్రసూన "మీరూరండి!" అంది.    
    మోహన్ తనూ లోపల కూచున్నాడు.    
    "నేను......." అంటూ ఏదో చెప్పబోయింది ప్రసూన. మోహన్ విసుగ్గా ముఖం తిప్పుకున్నాడు. దెబ్బ తిన్నట్లు ఆగిపోయింది ప్రసూన.    
    మరికొన్ని క్షణాలు నిశ్శబ్దంలో దొర్లిపోయాయి-ఏదో చెయ్యాలనీ, ఎంతో చెప్పాలనీ ఆరాటపడిపోతోంది ప్రసూన మనసు. దారుణమైన ఆ నిశ్శబ్దాన్ని భరించలేక, దానిని చేదించే మాటలురాక అనాలోచితంగా మోహన్ చేతిని తన చేతిలోకి తీసుకోబోయింది. ఏదో పురుగును విదలించినట్లు విదిలించాడు మోహన్.    
    "మీరు చెప్పదలచుకున్నదేదో అలా కూచుని చెప్పండి. వింటాను. నేను శ్యామ్ ని కాను....."    
    ఆ తరువాత ప్రసూన చెప్పగలిగినదేమీ లేకపోయింది. పెదవిని రక్తంచిమ్మేలా కొరుక్కుంటూ కూర్చుంది.    
    ప్రసూన ఇంటిదగ్గర టాక్సీ ఆగింది. చలనంలేని బొమ్మలాఉన్న ప్రసూనను చూసి "దిగండి!" అన్నాడు మోహన్. వణుకుతోన్న శరీరాన్ని అదుపులో పెట్టుకుంటూ టాక్సీ దిగింది ప్రసూన. వెంటనే టాక్సీ తలుపు వేశాడు మోహన్. టాక్సీ వెనుకకు మరలింది.
    
                                       13
    
    తన ఒళ్ళో వాలి కుమిలికుమిలి ఏడుస్తోన్న ప్రసూనను చూడగానే గుండె బెదిరిపోయింది రాధమ్మకి- "ఏటమ్మా? ఏటయింది? నీ జోలికెవడొచ్చినాడు? సెప్పు తల్లి, పాతేయిస్తా__" అంది.    
    ప్రసూన ఏడుస్తూ ఆగుతూ జరిగిందంతా చెప్పింది, వింటోనే రుద్రకాళి అయిపోయింది రాధమ్మ.    
    "ఈడిజిమ్మడ! ఇంతకు దిగినాడా! రాణీ చెప్తా! మక్కలిరగాదన్నిస్తా! బతికుండగా పూడిపిస్తా- ముదనష్టపెదవ- నా కూతుర్నిట్ట తారుస్తాడా! ఈడి బతుకు మండ - చచ్చినోడు-"    
    పళ్ళు పటపట నూరుతూ టుపుక్కు టుపుక్కున మెటికలు విరిచింది.    
    గబగబ వెళ్ళి సాంబశివానికి ఫోన్ చేసింది. సాధారణంగా రాధమ్మ ఎప్పుడూ ఫోన్ చెయ్యదు. ఇంట్లో ఫోన్ ఉన్నా, ప్రసూన ఫోన్ చేస్తూన్నా, ఆ ఫోన్ రాధమ్మకి ఇప్పటికీ విచిత్రంగానే ఉంటుంది.    
    "ఏరయ్యోయ్! సాంబశివంగోరేనా! అర్జంటుగా రావాలి.....ఆఁ అరజంటంటే.....ఏందయ్యా, కొంపలంటుకు పోతావుంటే.....నువ్వొత్తావా నన్నీపళంగా రమ్మంటావా......ఆ! పనుండమట్టికే! లేకుంటే తిని కూకొని నిన్ను రమ్మంటానేటి? బేగిరండి- అట్టాగే"    
    ఫోన్ పెట్టేసి పైటకొంగుతో మరోసారి ముఖం తుడుచుకుంది రాధమ్మ.    
    "దేవుడు రచ్చించమట్టి సరిపోయింది, లేకపోతే ఏటయ్యేదో? ఈడి పని........."    
    పట్టరాని కసితో భగ్గు భగ్గు మంటోంది.    
    ఒక అరగంటలోనే సాంబశివం వచ్చాడు.    
    వచ్చీరాగానే అతనిమీద విరుచుకుపడింది రాధమ్మ.    
    "చూసినావయ్యా! ఈడేంసేసినాడో, పిల్లదాని బతుకు బజార్నేస్తన్నాడు. ఎట్టా బుద్దిసెపుతావో!"    
    సాంబశివం రావటం చిరాగ్గా వచ్చాడు. కానీ జీవం నశించినట్లు సోఫాలో వాలిపోయిన ప్రసూనను చూడగానే ఆందోళనతో "ఏం జరిగింది?" అన్నాడు. రాధమ్మ ఏడుస్తూ హరిణి తిడుతూ పళ్ళునూరుతూ మెటికలు విరుస్తూ జరిగిందంతా చెప్పింది. నిర్ఘాంతపోయాడు సాంబశివం- ప్రసూన వైపు తిరిగి "నిజమేనా?" అన్నాడు.

 Previous Page Next Page