Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 24

                                 

 

                                                       10
    "ఏం చెప్పమన్నారు, కళాసేవో' ధనదాహానికి దాసోహమో ఈ రెండూ తేల్చుకోలేని వాళ్ళందరూ ఎక్కడ చేరాలో అక్కడే చేరింది. మొదట్లో అక్కడ్నించి వచ్చిన వార్తలు నాన్నగారే కాదు, నేనే నమ్మలేదు. నెలా పదిహేను రోజులు చూసి నాన్నగారే బయలుదేరి వెళ్ళేరు. తిరిగి వచ్చినప్పుడు సర్వస్వం కోల్పోయిన వ్యక్తిలా తయారయ్యారు. ఏం జరిగిందంటే మాటాడరు. ఎలాగో కష్టపడి అయన దగ్గిర నేను సేకరించిన సమాచారం ఏమిటంటే ప్రభ అప్పుడు ఒక అసిస్టెంటు డైరెక్టరు తో ఉంటున్నదట. విడుదల అవబోయే ఒక సినిమాలో ఆమెకు మంచి పాత్ర లభించే అవకాశ మున్నదట.
    'నాన్నా, జరిగిందంతా మరిచిపొండి. వీలయితే నన్నే మరిచి పొండి. తీరా యిక్కడికి వచ్చ్జాక వెను దిరగడం దేనికీ, నా అదృష్టం ఎలా ఉంటుందో నన్ను పరీక్షించుకానివ్వండి. నా అవకాశాలకు అడ్డు రాకండి.' అన్నదట.
    'మా అమ్మ నన్ను కాదన్నది' అని దాని కోసం చంటి పిల్లాడు తల్లి కోసం ఏడ్చినట్టు ఏడ్చాడు. చెల్లిని పల్లెత్తు ముక్క అనలేదు. 'భగవంతుడా! మా అమ్మ చెయ్యరాని అపరాధమేమీ చేసేది కాదు. ఎక్కడున్నా దాన్ని రక్షించు' అని ప్రార్ధించారు. ఆ సమయంలో నేనేం చేయాలో నాకేం తోచలేదు. మరొక పదిహేను రోజుల్లో మెడ్రాసు వెళ్ళెను. దాన్ని కలుసుకోడమే కష్టమయింది. కధానాయిక చెలికత్తె గా అది నటిస్తున్నప్పుడు చూడవలసి రావడం నా పూర్వజన్మ దుష్కృతం . పమిట ఎలా సర్దుకోవాలో చెబుతూ దాని భుజాల మీద మాటిమాటికీ దర్శకుడి వేళ్ళు నాట్యం చేస్తున్నప్పుడు నా ఒంటి మీద తేళ్ళూ, జెర్రులూ పాకినట్లయింది. ఈ ప్రపంచమంతా మిధ్యా, మాయా, కృత్రిమమూ అని తెలియజేయడానికి ఏ వేదాంత గ్రంధాలు చదువ నక్కరలేదు. ఒక్క సినిమా షూటింగు చూస్తె చాలు. అక్కన్నుంచే అలా స్టేషనుకు వచ్చేశాను. ఇది జరిగి ఆరేళ్ళయింది. అంతే - అది మళ్ళీ ఇంటికి రాలేదు. కృష్ణ మూర్తి కళ్ళ నీళ్ళు తుడుచుకుని పది నిముషాల దాకా అలా మౌనంగా కూర్చుండి పోయాడు. నేను వూరుకోలేక పోయాను.
    'మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించలేదండీ కృష్ణమూర్తి గారూ, మీరూ అందరి మొగాళ్ళ లాగే చేశారు.'
    'మీరు సరిగ్గా చెప్పేరు. పనికి మాలిన జాలీ, శుష్కమైన విచారమూ ఇవే నాకు మిగిలాయి. అంతే' అన్నాడతడు, మరింత విచారంగా.
    'మళ్ళీ మీరామేను కలుసుకోలేదా?'
    'రెండేళ్ళ క్రిందట మా నాన్నగారికీ చాలా జబ్బు చేసింది. ఒక్కణ్ణి దుఃఖం పంచుకోలేక పోయాను. చెల్లెల్ని చూసి వీలయితే తీసుకొద్దామనిపించింది. స్కూలు పనిమీద వెడుతున్నానని మా ఆవిడతో చెప్పి....'
    'మీకు?'
    'అవును, పెళ్ళయింది. మేనరికం. ముగ్గురు కూతుళ్ళు కూడా. సరే, ఇది వినండి. అప్పుడు మెడ్రాసు వెళ్ళెను. ఈసారి ఏమయినా దానితో మాట్లాడి ఏమాత్రం అవకాశమున్నా తీసుకొద్దామని బయలుదేరాను. మాంబళం లో రెండు రూం లు అద్దెకు తీసుకుని ఉంటున్నదట. రెండు రోజుల అతి ప్రయత్నం మీద గాని అదెక్కడ ఉన్నదో నాకు తెలియనే లేదు. అదీ, దాని అవతారమూ చూడగానే నా ఆత్మ అవురుమని ఏడ్చింది. ఇంతింత బుగ్గలూ అంతంత కన్నులూ- ఈ చెల్లెలే నాకు గుర్తుంది. ఆకాశానికి నిచ్చెనలు వేసి, అందుకోలేక వెల్లకిలా పడి లేచి దులుపు కుని పగిలిన హృదయాన్ని , తగిలిన గాయాల్నీ బహిరంగపరిచే ధైర్యం లేక తల వంచుకు కూచున్న చెల్లెమ్మ మాత్రం కాదు. అసహ్యం కన్నా అభిమానమూ, ద్వేషం కన్న కారుణ్యమూ నాలో కట్టలు తెగి ప్రవహించాయి. అరచేతిలో స్వర్గం చూపించి అన్ని విధాల నాశనం చేశారుట ఆమెను. అయిదేళ్ళ సినిమా అనుభవంలో ఆమె పాత్ర ఎక్ స్ట్రాను మించ లేదుట. ఆరు నెలలై అటు వేపు వెళ్ళటం పూర్తిగా మానుకుందట. ఇద్దరికీ ట్యూషన్లు చెప్పి ఎలాగో బ్రతుకుతున్నదట. నేను ఎన్ని విధాల చెప్పినా ఇంటికి రానన్నది.
    'అన్నయ్యా! లోకంలో ఎందరు బ్రతకం లేదు! వాళ్లతో పాటు నేనూ ఒక్కర్తిని. నేనేమీ అయిపోను. మానాభిమానాలు అమ్ముకుని ప్రపంచంలో గొప్పవాళ్ళు అయినవాళ్ళు కొందరున్నారు. అన్నీ అమ్ముకుని ఎప్పటికీ, ఏవిధంగానూ గొప్ప వాళ్ళు కాలేని నిర్భాగ్యులు కూడా కొందరున్నారు. ప్రపంచంలో నదులే పవిత్రమైనవి అయితే అంతకన్న విశాల హృదయం కల భూదేవి అన్నీ రకాల వారికీ చోటు యిచ్చే కరుణామయి నాకింత చోటు యివ్వకపోదు. ఇంతకీ నాయీ పరిస్థితి నేను చేజేతులా చేసుకున్నది. నాలాంటి వాళ్ళను ఎవరూ సంస్కరించలేరు.'
    కళ్ళలో ఒక్క కన్నీటి చుక్క లేకుండా ప్రభ చెప్పిన ఈ మాటల వలన పరిస్థితులు ఆమెకు ఎంతగా పాఠాలు చెప్పెయో అనిపించింది.
    'చెల్లీ జరిగిందేదో జరిగింది -- నాన్నగారి ఒంట్లో ఏం బాగులేదు. వచ్చెయ్యవె' అన్నాను ఆఖరిసారిగా.
    'నీకేదో అన్నీ తెలుసనుకున్నాను. ఏం తెలీదు . ఫో!'
    ప్రభ అలా ఎందుకందో యింటి కొచ్చాక గాని తెలియలేదు. నేను మెడ్రాసు వెళ్ళేనని ఎలా తెలిసిందో యింట్లో తెలిసిపోయింది. రాగానే మా ఆవిడ నన్ను నిలదీసింది.
    'ఏదీ, మీ వెనక ఆ వగలాడి ఏదీ?'
    'ఎవరూ?'
    'ఇంకెవరు, మహా పతివ్రతా తిలకం -- మీ ముద్దుల చెల్లెమ్మ! ఇంకా నయం వచ్చింది కాదు , గుమ్మంలో పెట్టి కడిగెద్డును.'
    'ఎందుకలా నోరు పారేసుకుంటావ్? నేనెక్కడికి వెళ్ళేననీ?"
    'ఇంకా ఎందుకు నా కన్ను కప్పుతారు? పంపించిన పెద్దాయనకి లేకపోతె పోయింది, మీ బుద్ది ఏమయింది అంట! అయిదేళ్ళుగా అడ్డమైనవాళ్ళ దగ్గర పడి ఏడుస్తోందే, దాన్ని యిక్కడికి తీసుకు రావడానికి నాతొ చెప్పకుండా బయల్దేరడానికి ఎంత ధైర్యం మీకు! ఇదేం సాని కొంపనుకున్నారా, సంసారి కొంపనుకున్నారా?'
    'ఇక చాలు ఊరుకో!"
    'నన్ను కాదు వూరుని వూరుకోబెట్టండి మీకు చేతనయితే, రేప్పోద్దుట ఎదిగి కూచుంటారు మీ అమ్మాయిలకి చెప్పండి సమాధానం. తెలిసి తెలిసి యిలాంటి నీతి లేని కొంపలో పడేసి నా గొంతు ఎలాగా కోశాడు మా నాన్న. ఇంతింత పిల్లలు, వీళ్ళ మొహమేనా చూడండి.'

 

              
    గాయపడిన నా హృదయం అర్ధంలేని ఆమె మాటలకు ఏం సమాధానం చెప్పగలదు? చెడిపోయిన చెల్లెలికి నాలాంటి వాడు ఏం సహాయం చెయ్యగలడు, చాటుగా , మాటుగా దాని పేర ఏదో పాతిక మనియార్డరు చెయ్యడం తప్ప!
    కృష్ణమూర్తి చెప్పడం పూర్తీ చేశాడు. అతి పవిత్రమైన అతని హృదయాన్ని అర్ధం చేసుకోక తక్కువగా వూహించుకున్నందుకు నేనే సిగ్గు పడ్డాను.
    'అప్పట్నించి ఏమాత్రం కలసి మెలిసి తిరిగిన పడుచు వాళ్ళను చూసినా అపాయాన్ని శంకిస్తూ వూహించడం నాకు అలవాటై పోయిందండీ. అది మనో దౌర్భల్యమేమో అని చాలాసార్లు అనుకుంటాను కాని అణచుకోలేక పోతున్నాను. ఆ కారణం చేతే అనుకుంటాను, క్లాసులో నేను చెప్పే పాఠాలలో నీతి పాఠాలే ఎక్కువ.'
    'మీరు హైస్కూల్లో పనిచేస్తున్నారా?'
    'అవునండీ. తక్కిన వాళ్ళిద్దరూ కూడా అంతే. మేం ముగ్గురం ఒక్కచోటే పని చేస్తున్నాం. నా అభిప్రాయాలూ, ఆందోళననూ వాళ్ళకు నచ్చవు. నన్నేదో విధంగా నెప్పించడమే వాళ్ళ ఉద్దేశంలా కనపడుతుంది. వాళ్ళతో ఎందుకు వచ్చానా అనిపిస్తోంది!'
    'ఏం? ఏమంటా రేం?'
    'ఆ, అదంతా అదోరకం. ఎన్నిసార్లు గంగలో మునిగితే అంత భక్తీ అని వాళ్ళ ఉద్దేశం. జలుబుగా ఉండి మొన్న మూడ్రోజుల క్రితం ఒకసారి వాళ్ళతో స్నానానికి రాలేదని 'నాయనా, నాస్తికా!' అని నన్ను పిలుస్తున్నారు. మనుషులు చూస్తె కొబ్బరి బొండల్లా ఉంటారు గాని ఒలిచి చూస్తె అంతా డోలక. ఆ గల్లీల్లో మద్యని ఏ ఏనుబోతేనా అడ్డంగా నిలబడితే అంతటి మహావీరులూ నన్ను ముందుకి తోస్తారు. ఒక్కసారి పడవెక్కి అలా గంగలో షికారు తిరిగొద్దాం రండి అంటే పడవవాడు మధ్యకి తీసుకెళ్ళి ఏ రిస్టు వాచీ అయినా అక్కడ పెట్టమంటేనో అంటారు. ఏం చెప్పను ఖర్మ! ఇంక ఆ మధురగారిని ఎన్నెన్ని మాట లాంటున్నారో నేను చెప్పలేను, మీరు వినలేరు!'
    'అక్కర్లేదు . నేను వూహించగలను. మీ ఆవేదన అర్ధం చేసుకునే అక్క ఒక్కర్తి ఉండనే విషయం మాత్రం ఎప్పుడూ మరచి పోవద్దు. మీరింత పవిత్రమైన ఆశయంతో నాకు హెచ్చరిక ఏరిగించిన విషయం కూడా నేనెప్పుడూ మరిచి పోను.'
    'అంతకన్న నాకు కావలసిందేముంది? ఆరోజు మా చెల్లి నాతొ మాటాడుతున్నప్పుడు 'అమ్మ ఎలాగా లేదు. అక్క అయినా ఉంటె నేనిలా అయేదాన్ని కాదేమో' అనడం మరిచిపోలేను. పొద్దుట కేశవరావు గారూ, మధుర గారూ ఒకే రిక్షాలో నాకు ఎదుట పడినప్పుడు ఆవిడకేమీ తెలియదా, తెలిస్తే యిలా వూరుకుంటున్నారా అనిపించింది. నా మనసులో మాట మీకు చెప్పుకునే దాకా నాకు తోచలేదు. పుస్తకం తీసి చదువుదామని కూచుంటే మా ప్రభే గుర్తు కొచ్చేది. ఏమీ తోచక యిలా పరిగెత్తు కొచ్చాను.'
    'నేను తప్పకుండా కనుక్కుని తగిన చర్య వెంటనే తీసుకుంటాను లెండి. మీ సహాయానికి అన్ని విధాలా కృతజ్ఞులం' అన్నాను.
    'అలాగే, నా అవసరం ఏమున్నా కబురంపడానికి వెనుకాడకండి.'
    అతను వెళ్ళిపోతుంటే వాళ్ళ ఫ్రండ్స్ తిరిగొచ్చారు. వాళ్ళ మాటలు కొద్ది కొద్దిగా వినబడుతూనే ఉన్నాయి.
    'చాలాసేపు వేసినట్టున్నావే మకాం? ఏమిటి ఆ అనుబంధం?'

 Previous Page Next Page