Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 24


    కథ పూర్తయేసరికి సింహాద్రికి చెమటలు పట్టేసినయ్.
    టాక్సీ బాంబ్ నిలయానికి రెండొందల గజాల దూరంలో ఆపేశాడు డ్రైవర్.
    "ఇక్కడి నుంచి నడిచివెళ్ళండి సార్! ఇంకా దగ్గరకు పోనీయండి కుదరదు"
    "అదేమిటి? రిస్క్ ఎలవెన్స్ ఇచ్చాం కదా?"
    "అది ఈ వీధిలోకి రావడానికి సార్"
    "మరి ఇంటిదగ్గరికెళ్ళడానికి?"
    "దానికి టైర్ ఖర్చులు ఇప్పించాలి సార్"
    "సింహాద్రి, చిరంజీవి టాక్సీ దిగి కాలి నడకనే ఇంటివేపు బయల్దేరారు.
    "విష్ యూ సేఫ్ రిటర్న్ సార్" జాలిగా అన్నాడు టాక్సీ డ్రైవర్.
    బాంబ్ నిలయం నిజంగా బాంబ్ షేప్ లోనే ఉన్నట్లు కనిపించసాగింది సింహాద్రికి.
    "అదేమిట్రా! తలుపులు మూసి ఉన్నాయేమిటి?"
    "గొప్పోళ్ళ ఇళ్ళెప్పుడూ అంతేరా! మూసే ఉంటయ్"
    "మరి తలుపు కొడదామా?"
    "ఛట్! తలుపులు కొట్టకూడదురా పక్షీ! ఎక్కడో కాలింగ్ బెల్ ఉంటుంది. నొక్కాలి. తలుపు కొట్టావంటే మనం జనతా క్లాస్ పక్షలమని తెలిసిపోతుంది"
    "మరి కాలింగ్ బెల్ ఎక్కడున్నట్లు?"
    "అది కనుక్కోవడమే కొంచెం కష్టం! ఎక్కడో గోడ కలర్ లోనే మాచింగ్ అయిపోయి దాక్కుమంటుంది"
    సింహాద్రి గోడంతా చేత్తో తడమసాగాడు.
    అలా గోడ చివరి కెళ్ళాక పక్కకు ఓ పెద్ద గార్డెన్ కనిపించిందతనికి. అటువేపున్న గోడకి మాంచి మీట ఆకుపచ్చ రంగులో కనబడుతోంది.
    "అదిగోరా! అక్కడుంది" అన్నాడు సింహాద్రి.
    "నేను చెప్పలే! ఎక్కడోచోట ఉంటుంది మొత్తానికి" అన్నాడు చిరంజీవి విజయగర్వంతో.
    "కానీ తలుప్పక్కనే ఉంచకుండా ఈ పక్కన గార్డెన్ దగ్గర ఉంచారేమిటి?" అనుమానంగా అడిగాడు సింహాద్రి.
    "ఈ ఆర్మీవాళ్ళంతేరా బాబూ! శత్రువులకు దొరగ్గూడదని ఇలాంటి పనులు చాలా చేస్తుంటారు"
    సింహాద్రి ఆ బటన్ గట్టిగా నొక్కాడు.
    మరుక్షణం ఆ పక్కనే ఉన్న పెద్ద జయంట్ సైజ్ పంజరం తలుపు సర్రున పక్కకు తొలగిపోవడం, అందులోని రకరకాల చిలకలు, పక్షులు ఝామ్మని కేరింతలు కొడుతూ ఎగిరిపోవడం.... ఒక పావుక్షణంలో జరిగిపోయింది.
    సింహాద్రి కంగారుపడిపోయాడు.
    "కొంప మునిగింది" అన్నాడు అదిరిపోతూ.
    "అవును" ఒప్పుకున్నాడు చిరంజీవి.
    "అంటే ఇది డోర్ బెల్ కాదన్నమాట"
    "కాదనే తెలుస్తోంది"
    "ఇకవేళ ఆ చిలుకల పంజరం తలుపుకి సంబంధించిన మీటేమో"
    "పాజిబుల్!"
    "ఇప్పుడేమిటి చెయ్యడం మరి"
    చిరంజీవి ఆ బటన్ మళ్ళీ నొక్కాడు. పంజర్ డోర్ ఠక్కున మూసుకుపోయింది.
    "సందేహం లేదు. ఇది పంజరానికి సంబంధించినదే"
    'అయితే మనంఇక్కడ నిలబడడం క్షేమం కాదనుకుంటాను"
    "పద. తలాకిటి డోర్ దగ్గరకెళ్ళి తలుపు కొడదాం"
    ఇద్దరూ కొంచెం స్పీడుగానే తలాకిటి తలుపు దగ్గరకు చేరుకున్నారు.
    తలుపు కొట్టబోతూంటే ఠక్కున తలుపులు వాటంతట అవే తెరచుకున్నాయ్.
    "హలో" అంది శ్రీదేవి చిరునవ్వుతో ఎదురుగ్గా నిలబడి.
    "హలో హలో-" అన్నాడు సింహాద్రి.
    "హలో" అన్నాడు చిరంజీవి.
    "మీరా!" అందామె.
    "అవునండీ... మేమే!"
    "నేనింకా మీరనుకోవడం లేదు. బెల్ ఆగకుండా మోగుతుంటే మా కుక్క అనుకున్నాను"
    "కుక్కా?"
    "అవును! మా అల్సేషన్ అలాగే డోర్ బెల్ ఆగకుండా నొక్కుతుంది!"
    "కానీ మేము అసలు బెల్ నొక్కనే లేదుగా?"
    "నొక్కలేదా? అదేమిటి మీరు ఇంకా దానిమీదే నుంచుని ఉన్నారు"
    సింహాద్రి, చిరంజీవి అదిరిపడి పక్కకు గెంతారు.
    సింహాద్రి కాలుకిందే నేలమట్టానికి చిన్నమీట కనిపించింది.
    "నిజమే మీరన్నది! మేమింకా మీటకోసం వెతుకుతున్నాం"    
    "వెతకటం ఎందుకు- క్లియర్ గా కనబడుతోంటే"
    "అఫ్ కోర్స్ అఫ్ కోర్స్" అన్నాడు చిరంజీవి.
    "లోపలకు రండి! మీరు తప్పకుండా వస్తారనే ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను"
    "అలాగాండీ!"
    ఇద్దరూ లోపలకు నడిచి సోఫాలో కూర్చున్నారు.
    శ్రీదేవి వాళ్ళకెదురుగ్గా మరో సోఫాలో కూర్చుంది. ఆమె చేతితో ఏదో నవల ఉంది.
    "చాలా థాంక్సండీ" అందామె.
    "ఎందుకండీ?" అడిగాడు సింహాద్రి.
    "ఇంత శ్రమ తీసుకుని వచ్చినందుకు"
    "ఓ... అదా! ఏం ఫర్లేదండి! మీ కోసం శ్రమ తీసుకోవడంలో అందరం, ఆనందం వగైరాలున్నాయి...."
    ఆమె నవ్వింది.
    సింహాద్రి కూడా నవ్వాడు.
    చిరంజీవి కూడా నవ్వాడు.
    "అన్నట్లు నేను పంపిన యిన్విటేషన్ అందిందా?" అడిగిందామె.
    "ఇన్విటేషనా?"
    "అవును నాలుగు రోజులయింది పోస్ట్ చేసి"
    "అరె! అందలేదే!"
    "అందలేదా?"
    "లేదు"
    "పోస్టల్ వాళ్ళు కొట్టేసి వుంటారు"
    "అదేమిటి? వాళ్ళెందుకు కొట్టేస్తారు?"
    "అలవాటు"
    "అలవాటా?"
    "అవును సాధారణంగా పోస్ట్ లో వచ్చే మాగజైన్లు కొట్టేయడం అలవాటేగా వాళ్ళకు"

 Previous Page Next Page