ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా వున్నది. ఏదయినా పర్వదినమో లేక ప్రత్యేకమైన పూజలేమైనా జరుగుతున్నాయేమో తెలియదు కానీ ఏదో ఉత్సవానికి వచ్చినట్టు జనం కోలాహలంగా వున్నారు. హడావుడిగా అటూ, ఇటూ తిరుగుతున్నారు.
అలాంటి సందర్భంలో ఒక సామాన్య భక్తుడు విష్ణును కలుసుకోవాలంటే గంటల తరబడి ఎదురు చూడవలసిందే. ఫోన్ చేసీ మరీ ఆహ్వానించాడు కాబట్టి తన కోసం విష్ణు శిష్యులు ఎదురు చూస్తున్నారని వినయ్ ఇట్టే గ్రహించాడు.
"రండి సార్.......మీరు వచ్చిన వెంటనే గురువుగారు పూజా మందిరానికి తీసుకు రమ్మన్నారు " అన్నాడు ఒక శిష్యుడు.
తను ఈ ఆశ్రమంలోకి గతంలో మూడుసార్లు అడుగుపెట్టాడు.
అప్పటికీ, ఇప్పటికీ తనపట్ల మర్యాద చూపడంలో ఎంత మార్పు వచ్చిందో!
మొట్ట మొదటి సారి విష్ణు ఎవరో తెలుసుకుందామని రహస్యంగా ప్రవేశించి, అతని పద్దతులు చూసి ఆశ్చర్యపోయాడు.
రెండోసారి ఒక అడ మనిషిని అనుమానిస్తూ విష్ణుని ప్రశించడానికి........మూడవసారి ఆ ఆడమనిషిని పట్టుకోవడానికి వెళ్ళాడు. కానీ, ప్రతిసారీ తను భంగపడ్డాడే తప్ప తన దర్యాప్తులో ఎలాంటి ప్రోగ్రెస్సు సాధించలేకపోయాడు.
ఈరోజు విష్ణు తనకు స్వయంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించడంలో ఏదో విశేషం వుండి వుండాలి.
కీలకమైన అంశం ఏదో తనతో సంప్రదించడానికి పిలిపించి వుండవచ్చు.
అది ఏమై వుంటుందో వూహించే ప్రయత్నం చేశాడు కానీ, వినయ్ కుమార్ వూహకు ఆ కారణం అంతు బట్టలేదు.
"లోపలకు వెళ్ళండి సర్......" అంటూ అంతవరకూ వినయ్ కుమార్ ను తీసుకొచ్చిన శిష్యుడు మందిరం బయటనే ఆగిపోయాడు.
ఆలోచన్లను కట్టిపెట్టి లోపలకు అడుగు పెట్టాడతను.
"రండి ఇన్ స్పెక్టర్."
అటూ ఇటూ ఆ మందిరంలో పచార్లు చేస్తున్న విష్ణు ......ఇన్ స్పెక్టర్ ను గమనించగానే సాదరంగా ఆహ్వానించాడు.
వినయ్ కుమార్ అయన ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూశాడు.
అస్థిమితంతో, సతమతమైపోతున్న ఛాయలు విష్ణు ముఖంలో ఎంత వద్దనుకున్నా స్పష్టంగా తాండవించడం పసిగట్టాడతను.
"విష్ణుజీ......ఎనీ ధింగ్ రాంగ్ హియర్"
"అవును ఇన్ స్పెక్టర్ .....అందుకే మిమ్మల్ని పిలిచాను. స్వయంగా చూపించాలనే రమ్మని కోరాను. అటు చూడండి. నేను నిత్యమూ పూజించే త్రిమూర్తులు......శివకేశవులు వేరు కాదు అనే అద్వైతాన్ని పదిమందికి చాటి చెప్పాలనే ధ్యేయంతో సృష్టి స్థితిలయకారుకులయిన త్రిమూర్తుల విగ్రహాలను ప్రయాగ నుంచి ప్రత్యేకంగా తెప్పించి ప్రతిష్టించుకున్నాను. నిత్యమూ నేను పూజించే ఆ ప్రదేశాన్ని చూడండి.....ఇప్పుడు ఎలా కళావిహీనంగా వున్నదో.....'
విష్ణు ఏం చెప్పాలనుకుంటున్నాడో .......ఏం చెప్పబోతున్నాడో అసలు ఏమాత్రం అర్ధం కాని వినయ్ కుమార్ అయోమయంగా ఆయనవైపు చూశాడు.
తన కళ్ళకు విష్ణు చెప్పినట్టు ఎలాంటి కళావిహీనత అక్కడ అతనికి కనిపించలేదు.
భక్తులు సమర్పించిన విలువయిన కానుకలతో త్రిమూర్తుల విగ్రహాలకు డైమండ్స్ పొదిగిన వెలకట్టలేని ఆభరణాలు చేయించి అలంకరించారు నా శిష్యులు. వాళ్ళ అభిమతాన్ని కాదనలేకపోయాను, సచ్చిలత నిరాడంబరత, నిత్యమూ వేద ఘోష పఠించే నా మందిర ప్రాంగణంలో ఎలాంటి ప్రలోభ వ్యామోహాలకు అవకాశం వుండదని ఇంత కాలం నమ్ముతూ వచ్చాను. అందుకే ముచ్చటపడి అలంకరించిన అమూల్యాభరణాలను వద్దని వారించలేకపోయాను....."
వినయ్ కుమార్ కు అప్పటికి విషయం కొద్దికొద్దిగా బోధపడింది.
"నిన్న రాత్రి నేను పొద్దుపోయే వరకూ మెలకువతోనే వున్నాను. ప్రాతకాలం లేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజకు ఉపక్రమించబోతుండగా త్రిమూర్తుల విగ్రహాలు లేని విషయం గమనించాను."
విగ్రహాలను నగలతో సహా ఎవరో దొంగిలించటం వలన కంప్లయింట్ చేయడానికి తనను పిలిపించాడన్న మాట అనే అభిప్రాయానికి వచ్చాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.
"ఎలాగో పూజాదికాలను నిర్వర్తించి, సుదీర్ఘంగా ఆలోచించిన మీదట మీకు ఫోన్ చేశాను. ఎంతో పవిత్రంగా భావించే ఈ ఆశ్రమ మర్యాదలను కాపాడవలసిన నేనే పోలీస్ కంప్లయింట్ ఇచ్చానంటే భక్తుల మానసిక స్థితి దెబ్బతింటుంది, అలా అని మౌనం వహిస్తే ఇప్పుడు ఇది జరిగింది , రేపు ఇంకేం జరగనున్నదో అనే సందేహము కలుగుతుంది."
"మీరూ సర్వమూ గ్రహించాగాలవారు కదా......ఇలా జరుగుతుందని ముందుగానే మీకు తెలియదా?" వినయ్ కుమార్ తన అక్కసునంతా తన ప్రశ్నల్లో గుప్పించాడు.
"అంతేకాదు ఇన్ స్పెక్టర్ ....ఈ నేరం ఎవరు చేశారో తెలుసుకోలేదా అని కూడా మీరు నన్ను ప్రశించవచ్చు......." అని ఒక క్షణం మౌనం వహించాడు విష్ణు.
ఈసారి వినయ్ కుమార్ ఉలిక్కిపడ్డాడు.
సరిగ్గా తను మనసులో అనుకుంటున్నది అదే........'
తన మనసును చదివినట్టు అంత ఖచ్చితంగా ఎలా వూహించగలిగాడు?
అసలు నిజంగా విష్ణులో దివ్య శక్తులు వున్నాట్టా.......లేనట్టా?
"కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వుండవు. ఏ యోగి పుంగవుడయినా భూత భవిష్యత్ వర్తమాన కాలల మీద కమాండ్ సాధించినా కేవలం జరిగింది తెలుసుకోగలడే తప్ప జరగకుండా నిరోధించలేదు. ఎవరి కర్మఫలం ప్రకారం వాళ్ళు ప్రవర్తించక తప్పదు. సృష్టి క్రమాన్ని నిరోధించడానికి ఎవరు ప్రయత్నించినా అదోట్టి చేతకాని పక్రియగానే మిగిలిపోతుంది" అంటూ చెప్పుకుపోతున్న విష్ణు మాటలను మధ్యలో అడ్డుకున్నాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.