Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 24

"అణు! యు ఆర్ వెరి స్టబరన్ ఐ హేట్ యూ" అన్నాడు జీవన్. గతుక్కుమని వెనక్కు తగ్గింది. అతని కళ్ళు ముసుకునేవున్నాయి. తనని చూడకుండానే అన్నాడు.
ఆ మాటలు అంటే పలవరిస్తున్నాడన్నమాట ఇంతగా అసహ్యించుకుంటూన్నాడా తనని. జలజ అప్పటికే ఆ వార్డు ఇన్ చార్జి డాక్టర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకువచ్చింది. చెయ్యి పట్టుకుని అణుని వెయిటర్స్ లౌంజిలోకి తిసికొచ్చింది. అక్కడ బెంచిల మీద కూర్చున్నారు ఇద్దరు.
"మీ జీవన్......" మాట పూర్తి చేయలేక పొట్ట చేత్తో పట్టుకుని నవ్వసాగింది జలజ. అణు నవ్వలేకపోయింది. జీవన్ ఆ స్థితిలో వుంటే కారణం యేదైనా కాని నవురాలేదు అణుకి.
నవు ఆపుకుని చెప్పింది జలజ. "ఈ మహానుభావుడు భువనేశ్వర్ కి ఎప్పుడూ వూడిపడ్డాడో ఎవరికి తెలియదు. నడిరోడ్డుమీద ఎవరితోనో, ఎందుకో పెద్ద హీరోలాగా పోట్లాటకి దిగాడట. అవతలి వ్యక్తీ ఈయన గార్ని పచ్చడి చేసేస్తుంటే , నలుగురు చేరి విడిపించారట అప్పటికే ఈయన గారు తెలివి తప్పి పదిపోతే ఆ పోగైన జనంలో ఒకడు తీసుకొచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేశాడట. ఖరీదైన రిస్టు వాచీ, సిల్కు లాల్చి అవన్నీ చూసి యెవడో డబ్బున్న వాడే అని భయపడి తమ ఫీజులు తమకి ముడ్తాయన్న ధైర్యంతో ఈ ప్రవైటు నర్సింగ్ హోం వాళ్ళు వైద్యం చేస్తున్నారట పాపం యింత దూరం వచ్చినా నీకు తప్పలేదు. డాక్టరు ఫీజులకి డబ్బు సిద్దం చేసుకో." మళ్ళీ విరగబడి నవింది జలజ. అణు మాట్లాడలేదు.
డబ్బు కోసం ఆమె ఎప్పుడూ బాధపడలేదు. జీవన్ కోసం అవసరమైతే తన వొంటి మీద వున్న కొద్దిపాటి నగలు అమ్మడానికి సిద్దంగానే వుంది. కానీ జీవన్ ఎందుకంతగా తనని అసహ్యంచుకుంటున్నాడు. ఇప్పటికి తప్పంతా తనదేనని అతని అభిప్రాయమా? ఒక వంక అభిమానం, మరో వంక రోషము పోటీలు పడుతున్నాయి. ఆమె మనసులో ఏది ఏమైనా వొంటినిండా కట్లతో కళ్ళు తెరిచే వోపిక లేకుండా మూలుగుతున్న జీవన్ మీద కోపం నిలుపుకోలేకపోతోంది. అతడిలో కొన్ని చోట్ల బలహినతలుండొచ్చు గాని రాగ మీద ప్రేమ లేదని మాత్రం ఆరోపించలేదు అయితే ఎప్పట్లాగే తెలివి తక్కువగా పొరపాటు నిర్ణయం తీసుకున్నాడు.
"నేను డాక్టర్ ని జీవన్ పరిస్థితి గురించి అడిగాను ఇవాళ రాత్రి గాని, రేపు గాని తెలివి రావచ్చు అంటున్నారు. జీవన్ కి యెందుకో నీ మీద పట్టరాని కోపంగా ఉందట. సరిగ్గా తెలివి వొస్తున్న దశలో నువు యెదుట పడితే అతడు ఎమోషనల్ గా అప్సెట్ అయ్యే ప్రమాదం వుందంటూన్నారు డాక్టర్లు భార్యగా నీ హక్కు నిరుపించుకుంటూ జీవన్ ఆరోగ్యం ఏమైపోయినా సరే యిక్కడే వుంటానంటావా? లేకపోతే మిగిలిన విషయాలన్నీ స్థిమితంగా ఆలోచించుకోవచ్చునని ప్రస్తుతానికి నన్ను జీవన్ దగ్గర వుండమంటావా? నీ యిష్టం" అల్లరి నవు జలజ పెదాల మీద- లక్కి ప్రాణ సంకటం పిల్లికి చెలగాట- అన్నట్లుంది. ఏం మాట్లాడకుండా హాస్పిటల్ నుంచి యింటికొచ్చేసింది.
ఇంట్లో వందన వుంది. ఇన్ స్పెక్టర్ మనోహర్ కూడా వున్నాడు. అయినా ఆ యిల్లంతా శ్మశానంలా తోచింది. కూతురు తప్పిపోయింది. భర్త సీరియస్ గా వుంటే అతని దగ్గర తను వుండే అవకాశాలు లేకపోగా తన యిర్ష్యకు కారణమైన వన్నెల విసినికర్ర దగ్గరుండి సపర్యలు చేస్తోంది.
"మేడమ్! మాకు కొంత సమాచారం తెలిసింది. దాని గురించి మీతో మాట్లాడాలి" అన్నాడు మనోహర్.
"చెప్పండి"
"కాన్వెంటులో రాగ దగ్గరికి యెవరు వచ్చేవారో పాపతో ఎవరెవరు మాట్లాడేవారో విచారించాము సిస్టర్ చాలా పెద్ద లిస్టు యిచ్చారు. వాళ్ళు పాపకి యెలా దగ్గిరయ్యారో మీరు చెప్పగలరా?"
తెల్లబోయి చూసింది అణు కాన్వెంటులో వున్న పాప దగ్గరకి ఎవరైనా వచ్చి మాట్లాడుతున్న విషయమే ఆమెకి తెలియదు.
"చాలా పెద్ద లిస్టా! ఎవరు వాళ్ళు?"
"పేర్లు చదువుతాను వినండి. ఇక్బాల్, బలరామ్ మిశ్రా, మాయాధర్, కుశామదా, బ్రజిమోహన్, సరూప్ కిషన్, బీమ్స్, రావెన్ షా, మధ్యూ, అనంత ఝూపడా......"
మనోహర్ పేర్ల లిస్టు చదువుతుంటే అణు ఖంగారు పడిపోయి, "ఆగండాగండి! ఈ పేర్లలో ఒక్కటి కూడా నాకు తెలియదు. వీళ్ళలో యెవరితోను నేను యెప్పుడు మాట్లాడలేదు. వీళ్ళంతా రాగని చూడటానికి యెందుకు వస్తున్నారో దాంతో ఏం మాట్లాడుతున్నారో నేనూహించలేకుండా వున్నాను." ఈ వార్త అణుకి కలిగించిన షాక్ ఆమె మోహంలో స్పష్టంగా కనిపిస్తోంది. లిస్టు మడత పెట్టి జేబులో పెట్టుకున్నాడు మనోహర్" నేను వీళ్ళల్లో చాలామందిని కలుసుకుని స్వయంగా మాట్లాడాను."
"వాళ్ళు రాగ దగ్గర కెందుకోస్తున్నారట?"
"వాళ్ళలో ఐదారుగురు మాత్రం నిజం సమాధానం చెప్పేశారు. మిగిలిన వాళ్ళు ఏదో వంకరిటింకర మాట్లు చెప్పారు. అయితే అందరిది వొకటే వుద్దేశమని నా నమ్మకం"
"ఏమిటది?"
"వాళ్ళు చెప్పినమాటలు చెప్తున్నాను. మీరేం అనుకోకూడదు"
"చెప్పండి"
"రాగ తల్లి డాన్సర్ గా బోల్డు సంపాదిస్తున్నది, అందమైంది స్వతంత్ర భావాలతో మొగుణ్ణి వొదిలేసి కూతురితో ఈ మారుమూల ఒరిస్సా రాష్ట్రంలో వొంటరిగా వుంటోంది. కూతుర్ని మంచి చేసుకుంటే సినిమాలల్లోలాగ, కూతురి ద్వారా తల్లికి దగ్గర కావచ్చు."
అణు ముఖం కిందికి వాలిపోయింది. ఈ సమాజం స్త్రీకి ఎన్నెన్ని చిత్రమైన సమస్యలు సృష్టించి పెడ్తోంది.
"క్షమించండి వాళ్ళు చెప్పిన మాటలు మీకు చెప్పాను. మీరు చదువుకున్నవారు. మీ జీవితాన్ని ఏ రకంగా గడపాలో నిర్ణయించుకునే హక్కు మీకుంది. అయితే నాదొక చిన్న సందేహం. రాగ వీళ్ళల్లో ఎవరి గురించి మీతో ఎప్పుడూ చెప్పలేదా?"
తల అడ్డంగా తిప్పింది అణు ఆమెకి ఇది నమ్మశక్యం గాకుండా వుంది. రాగ తన దగ్గిర ఏదైనా రహస్యంగా దాచాగలదని యేనాడు భావించలేదు. జలజ అన్నట్లు పెద్దవాళ్ళు చిన్నపిల్లల కేమి తెలియదనుకుంటారు గానీ వాళ్ళదైన ప్రపంచం ఎంతో వుందని యిప్పుడిప్పుడు అర్ధమౌతుంది చేతులు కాలాక .
"అన్ని పేపర్లలోను ఫోటోతో సహా వార్త ప్రచురించాం. టి.వి.లో ఫోటోతో సహా ఎనోన్సు చేయించాను. రేడియోలో వుదయం వార్తల్లోనూ, సాయంత్రం వార్తల్లోనూ చెప్పించాము ఇప్పటి వరకూ జాడ తెలియకపోవడమే ఆశ్చర్యంగానే వుంది. ఇంతవరకూ తెలుసుకున్న సమాచారాన్ని బట్టి- క్షమించాలి యెవరైనా మీ కూతుర్ని అడ్డుగా పెట్టుకుని మీ ప్రేమ పొందాలని దాచి వుంటారో- లేక డబ్బు కోసం ఎవరైనా నాటకం ఆడుతున్నారో- లేక మీ భర్త జీవన్ గారే......."
నో.....జీవన్ లో ఎన్నో బలహీనతలు వున్నాయి కాని కుత్సితం లేదు పైగా అతడిప్పుడు  వొంటి మీద తెలివి లేకుండా దెబ్బలతో హాస్పిటల్ లో వున్నాడు."
"ఆ విషయం కూడా తెలిసింది. అతని దగ్గిర జలజ గారు వున్నారని కూడా తెలిసింది" ఆగి సూటిగా అణు మొహంలోకి చూశాడు మనోహర్ భరించలేకపోతోంది అణువేద. ఒక్కసారిగా ఎన్నెన్ని అవమానాలనేదుర్కోవలసి వస్తోంది. ఈ మనుష్యులందరి దగ్గిరనుంచి దూరంగా పారిపోయి ఎక్కడో ఏకాంతంలో దాక్కుని కరువుతీరా ఎడవాలనుంది. కాని ఈ సమాజం- ఈ మనుషులు తన్ని వదలటంలేదు.

 Previous Page Next Page