Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 24

 

    "ఈ దేశంలోని ప్రజల ఆరోగ్యం ముఖ్యమా, లేక మందుల తయారి పరిశ్రమ తాలూకు ఆరోగ్యం ముఖ్యమా అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడల్లా ప్రభుత్వం మందుల తయారీ పరిశ్రమ ఆరోగ్యమే ముఖ్యం అని భావిస్తున్నట్టు పదేపదే రుజువవుతోంది.

 

    "జంటిల్మన్! మీకు తెలిసే వుంటుంది. ఇండియాలో జరిగే ప్రసవాల్లో నూటికి పద్దెనిమిది మంది స్త్రీలకు మాత్రమే సరైన వైద్య సదుపాయం అందుతోంది. ప్రతి ఏటా పుట్టే రెండు కోట్ల ముప్పయ్ లక్షల మంది బిడ్డల్లో కేవలం ముప్పయ్ లక్షల మంది మాత్రమే ఆరోగ్యంగా ఉంటున్నారు. ముప్పయ్ లక్షల మంది మొదటి సంవత్సరం నిండే లోపలే చనిపోతున్నారు. పుట్టిన బిడ్డల్లో ప్రతి ఏడుగురిలో ఒక బిడ్డ అయిదో ఏడు రాకముందే చనిపోతుంది. పదిమందిలో ఒకరు పోషకాహారం లేక అనారోగ్యానికి గురవుతున్నారు. తొంభై లక్షల మంది పిల్లలు ఆకలితో అలమటించిపోయి శారీరకంగా, మానసికంగా ఎదగకుండా వెర్రివాలకంతో ఉండిపోతున్నారు.

 

    "ఇండియాలో వచ్చే వ్యాదుల్లో నూటికి డెబ్బయ్ అయిదు వంతులు పోషకాహారం లేకపోవడం వల్లా, కలుషితమైన నీటిని తాగడం వల్ల , వ్యాధి నిరోధక టీకాలు మందులూ వేయించుకోక పోవడం వల్ల వస్తాయి.

 

    "అందుకని వ్యాధులు రాకుండా నివారించడానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మందుల తయారీ పరిశ్రమని పోషించి పెద్ద చెయ్యడానికి కాదు."

 

    తన భావాలని అతి స్పష్టంగా నిర్దుష్టంగా ప్రకటిస్తున్న తేజస్వి వైపు తదేకంగా చూసింది ఉజ్వల. అతని కనుముక్కు తీరు చేస్తే స్పానిష్ వీరులు గుర్తొచ్చారు. మెక్సికోలో బుల్ ఫైట్ లో ఎర్రటి గుడ్డతో ఎద్దుని కవ్వించి, దానితో సాహసంగా తలపడే మాట డోర్స్ గుర్తొచ్చారు. పెద్దపెద్ద విషయాల్లో, పెద్దపెద్ద వాళ్ళతో తలబడపోతున్నాడు ఇతను. ఇతని గుండె ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే.

 

    "ఫ్రెండ్స్! ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం ప్రకారం మన దేశంలోని పరిస్థితులను బట్టి, ఇక్కడి వాతావరణాన్ని ఇక్కడి ప్రజల శారీరక స్థితిగతులను బట్టి వచ్చే రోగాలని నయం చెయ్యడానికి దాదాపు రెండొందల నలబై ముఖ్యమైన డ్రగ్స్ చాలు.

 

    కానీ మనదేశంలో తయారవుతున్న మండులేన్ని?

 

    దాదాపు నలబైవేలు.

 

    ఐ రిపీట్ ఫార్టి దౌజేండ్!

 

    ఎక్కడ రొండొందలు నలబై! ఎక్కడ నలబై వేలు? కానీ ఆ నలభై వేల బ్రాండ్ నేమ్స్ లో కూడా ప్రజలకు అతి అవసరమైన ఆ రెండొందల డ్రగ్సు ఉండవు. ఉన్నా చాలా తక్కువ.

 

    ఎందుకని?

 

    ఎందుకంటె వాటిమీద నూటికి పదిహేనొందల నుంచి రెండు వేల రూపాయలు లాభం రాదు గనుక.

 

    ఒక అంచనా ప్రకారం మార్కెట్ లో దొరికే మందుల్లో ఎనబై అయిదు శాతం మందులు అనవసరమైనవి. అసంబద్ధమైనవి. అతి ప్రమాదకరమైనవి కూడా.

 

    ఉదాహరణకి అనాల్జిన్. ప్రతి చోటా దొరికే అనాల్జిన్. దీన్ని అమెరికాలో ఇంకా చాలా దేశాల్లో కూడా బాన్ చేశారు. ఇది తీసుకుంటే ప్రాణాలకు ముప్పు కలిగించే రక్త సంబంధమైన వ్యాధులు రావచ్చని తేలింది.

 

    కానీ ఈ డ్రగ్గు ఇండియాలో సులభంగా , ప్రతి చిన్న షాపులో కూడా దొరుకుతుంది. అనాల్జిన్ తో కూడిన డ్రగ్స్ ఇండియన్ మార్కెట్ లో దాదాపు నూట నలబై ఆరు ఉన్నాయి. అలాగే ఆక్సిఫెన్ బుటాజోన్! అలాగే డయేరియాని నిరోహించడానికి వాడే మరో డ్రగ్. చాలా రకాల డయేరియా వాటంతట అవే ఆగిపోతాయి. వాటికీ చెయ్యవలసిన వైద్యం ఏమిటంటే ఎక్కువ నీళ్ళలో చేక్కేరా, ఉప్పు కలిపి తాగించడం. పావలా ఖర్చుతో పోయే ఈ వైద్యానికి బదులు ఖరీదైన ఆ డ్రగ్ వాడితే ఒక్కోసారి అవి వికటించి పక్షవాతం, గుడ్డితనం రావచ్చు.

 

    ప్రాణాలను రక్షించే డ్రగ్స్ తయారు చెయ్యటం కంటే ప్రాణంతకమైన లాభసాటి 'డ్రగ్స్' ని చెయ్యడంలో ఇంట్రెస్టు చూపుతోంది ఈ ఇండస్ట్రి. మార్కెట్ లో మనకు కనబడేవి హెల్త్ డ్రింక్స్, టానిక్స్, విటమిన్స్, డైజేస్టీవ్ ఎన్ జైమ్స్, కాఫ్ ఎక్స్ పెక్ట్ రెంట్స్ , గైఫ్ వాటర్స్ , సెక్స్ స్టిమ్యూలెంట్స్...........

 

    వీటిల్లో చాలా మందులు అవి చేస్తాయని మనం అనుకునే అద్భుతాలు ఎక్కడా చేసినట్లు దాఖలాలు లేవు.

 

    కానీ వీటిని డాక్టర్లు ప్రిస్క్రేబ్ చేస్తారు.

 

    విధిలేక పేషెంట్లు కొంటారు.

 

    ఎందుకు?

 

    జంటిల్మన్! ఈ కొనడంలో ఒక చిత్రం ఉంది. గమనించండి.

 

    మార్కెట్ లో రకరకాల పెన్నులు ఉంటాయి. ఇంకు పెన్నులు, బాల్ పాయింట్ పెన్నులు, రంగురంగుల ఇంకులు రకరకాల కంపెనీలు.

 

    వీటిలో మీకు నచ్చిన పెన్నూ మీకు నచ్చిన ధరలో కొనుక్కోవచ్చు మీరు.

 

    ఆ పెన్నూ బాగుంటే మళ్ళీ కొనేటప్పుడు అలాంటిదే కొంటారు. లేకపోతే బ్రాండు మార్చేస్తారు.

 

    కానీ మందుల విషయంలో అలా కాదే?

 

    ఏ మందు కొనాలి, ఏ బ్రాండ్ కొనాలి. అనేది నిర్ణయించేది మీరు కాదు - మీ డాక్టరు.

 

    ఆ మందు పనిచేసినా పని చెయ్యక పోయినా పనిచెయ్యట్లేదని మీకు అనిపించినా కూడా ఎన్నిసార్లు మీ డాక్టరు చెబితే ఆన్నిసార్లు ఆ మందుని మీరు కొనాలి. అన్ని సార్లు వేసుకోవాలి. మీ డాక్టర్ మీకు డిక్టేటర్! అంతే.

 

    డాక్టర్లు ఫలాని బ్రాండ్ మందునే వాడమని ఎందుకు చెబుతారు?

 

    మాలాంటి మెడికల్ రిప్రేజెంటేటివ్ లు రకరకాల పద్దతుల్లో డాక్టర్ లని కన్ విన్స్ చెయ్యడం వల్ల. అంటే...........

 Previous Page Next Page