"మీ బామ్మా మనవళ్ళ మధ్యనే దేనికిలేండి. పెళ్ళి మాటలు మాట్లాడుకుంటున్నట్లున్నారు."
"నీ పెళ్ళిమాటలు కాదుకదే పిల్లా! సిగ్గుపడకు."
"నాకేం సిగ్గు మీ మనమడే, అలా చూడండి ఊరికే సిగ్గుపడిపోతున్నాడు."
నిజంగానే ఆ సమయంలో మదన్ గోపాల్ సిగ్గుపడుతున్నాడు. బామ్మవడిలో ముద్దు ముద్దుగా గారాలుపోతూ పడుకున్నప్పుడు వైజయంతి రావటం చెట్టంతమగాడ్ని తన్ని అలా చూడటం సిగ్గు కాదేంటి మరీ!
"వాడేం నీలాగా ఆడపిల్లా! నీలా సిగ్గుపడటానికి!" అంది బామ్మగారు.
"నాకెందుకు సిగ్గు, నేనేం సిగ్గుపడటంలేదు" ముక్కు పుటాలెగరేసి అంది వైజయంతి.
అదోలా మెలికలు తిరుగుతున్న మదన్ గోపాల్ ముడుచుకోటం మానేసి స్టడీగా వుండి "ఆడవాళ్ళు వదిలేసిం తర్వాతే మా మగాళ్ళ కంటుకుందండి ఈ మాయదారి సిగ్గు" అని కొంటెగా వైజయంతి ముఖంలోకి చూశాడు.
"నేను....నేను...
"ఏమిటండీ....మీరు....మీరు...?" తెచ్చిపెట్టుకున్న ఆతృతతో అడిగాడు మదన్గోపాల్.
నేతల్చుకుంటే తక్షణం మిమ్మల్ని ఇల్లు ఖాళీ చెయ్యమంటాను."
"నేతల్చుకుంటే తక్షణం ఈ యిల్లు ఖాళీచేసి మరో కొంప చూసుకోగలను. ఈవిజయవాడలో కొంప దొరకదే అందుకే తల్చుకోను. ప్రామిస్ మీరు నామాట నమ్మాలి."
నవ్వకూడదనుకుంది గాని వైజయంతికి నవ్వొచ్చింది. అందుకని ఫక్కున నవ్వింది. కింద ముత్యాలు దొర్లితే ఏరుకుందామని మదన్ గోపాల్ చూశాడుగాని, ఒక్క ముత్యము కనపడలేదు. ఇదేం కాశీమజిలీ కధలో సన్నివేశమా? రాజకుమారి నవ్వితే ముత్యాలు రాలటానికి రాజకుమారి ఏడిస్తే కప్పలు రాలటానికీను! అని సరిపెట్టుకున్నాడు. అలా అని ఊరుకోలేదు వైజయంతితో చెప్పాడు. మగాడు పొగిడితే మురిసిపోని జాతి ఎక్కడయినా వుందేమోగాని ఆడజాతిలో మాత్రం లేదు. అందుకని వైజయంతి మురిసిపోయింది.
మదన్ గోపాల్ ఛాతీ అంగుళం ఉబ్భింది.
"కూర్చోవే పిల్లా!" అంది బామ్మగారు అసింటా వున్నా చాపను ఇసింటా లాగి.
నేకూర్చుంటే మీ కిబ్బంది" అంది వైజయంతి.
"నేనేం నీ భారం మోస్తున్నానుటే పిల్లా! కూర్చొని మాట్లాడు."
"నేకూర్చుంటే మీ మనవడి కిబ్బందే?"
"అబ్బే నాకేం యిబ్బంది?" అన్నాడు మదన్ గోపాల్.
"బామ్మగారి వడిలో పడుకోటానికి లేదుకదా?" కొంటెగా అంది వైజయంతి.
మదన్ గోపాల్ ముఖం గంటుపెట్టుకున్నట్లుండిపోయాడు.
"వాడు నా మనవడు. నా వడిలో పడుకున్నాడు ఎవరి వడిలోను తలపెట్టుకు పడుకోలేదుకదే పిల్లా!" అంది బామ్మగారు.
ఈతఫా మదన్ గోపాల్ ముఖం చింకి చాటంత అయింది.
బామ్మగారు అన్నదానికి వైజయంతికి సిగ్గేసిందిగాని తానిప్పుడు సిగ్గుపడితే అతగాడిముఖం ఊసరవెల్లిలా యింకెన్ని రంగులు మారుతుందో యింకేం గోలొచ్చిపడుతుందో అని సీరియస్ గా ముఖంపెట్టి "మరోసారి వస్తాను మూడ్ బాగుండలేదు" అంది.
"ఎవరి మూడ్?" వెంటనే అడిగాడు మదన్ గోపాల్.
"మీ మూడ్" అని గిర్రున వెనుతిరిగి వెళ్ళిపోయింది వైజయంతి.
వైజయంతి బొంగరంలా అలా వెను తిరగటంవల్ల నల్ల తాచులావున్న జడ వైజయంతి వీపుమీద భరతనాట్యం చేసింది. "ఆ జడ ఏమదృష్టం చేసుకుపుట్టింది. వైజయంతినే అంటిపెట్టుకుని వేలాడుతున్నది కదా! నే అదృష్టవంతుడినై పై జన్మంబున వైజయంతి జడగా జన్మించినచో...


