Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 24

  

     కాని తీరా ఆ సమయం వచ్చేసరికి ఇంటినుంచి బయటపడలేకపోయాను. భయంకాదు రవీ, నన్ను నమ్ము నేనేదో ఎవరికో భయపడి వుండిపోలేదు. సందిగ్ధంతో ఆగిపోయాను. ఇన్నాళ్ళు ఆగగలిగాను. ఇంకో పది సంవత్సరాలు ఆగితే ఈ కట్టె వెళ్ళిపోతుంది. వెళ్లకపోయినా కోర్కె నశిస్తుంది. నువ్వు అడగవచ్చు మరి ఈ ఆలోచనంతా నాకు ఉత్తరం వ్రాసే ముందే వుండొచ్చు కదా - అని. కొన్ని చర్యలకి తర్కం వుండదు రవీ! నువ్వు అర్ధం చేసుకోగలవు, చేసుకుంటావనే ఈ ఉత్తరం క్షమాపణలతో!
   
    నువ్వు ఫోన్ చేసినప్పుడు వెంటనే పెట్టేసినందుకు కూడా నన్ను క్షమించాలి. నీతో మాట్లాడితే, ఇప్పుడిప్పుడే పునర్నిర్మించుకుంటున్న ఈ స్థయిర్యం తిరిగి కుప్పకూలిపోతుందనే భయం.
   
    దయచేసి నన్ను పరికించటానికి ప్రయత్నించకు. నన్ను నేను కూడగట్టుకోనివ్వు, ఇదొక్కటే నేను మిమ్మల్ని కోరేది. వాస్తవం కన్నా ఊహ బావుంటుంది. ఊహని వాస్తవం చేసుకోవాలనుకుని, కానీ మళ్ళీ వర్తమానాన్ని భవిష్యత్తులో ఊహించుకొని, అడుగు వెనక్కి తీసుకున్న నీ స్నేహితురాలు......
   
    క్రింద సంతకం లేదు.
   
    అతడు ఉత్తరాన్ని నలిపి విసిరికొట్టాడు.
   
    మొహాన్ని చేతుల్లో పెట్టుకుని అలాగే చాలాసేపు వుండిపోయాడు. దాదాపు పది నిముషాల తరువాత తేరుకున్నాడు. పడివున్న ఉత్తరాన్ని తీసి కాగితాన్ని తిరిగి సాపు చేశాడు. మళ్ళీ చదివాడు. మళ్ళీ..
   
    అతడి మనసంతా ఒక విధమైన కోపంతో నిండిపోయింది ఆమె మీద. తనమీద......ఎంత దూరం. కానీ ఎంత దగ్గిర......ఆమె పేరుకూడా తెలీదు. ఎంత వ్యధ అనుభవించో ఆమె ఈ నిర్ణయం తీసుకుని వుండవచ్చు. కానీ తనవైపునుంచి ఆలోచిస్తే...
   
    మామూలుగా వెళుతున్న పడవని సుడిగుండంలోకి తోసినట్టు చేసింది. కష్టమో నష్టమో తన బ్రతుకు తను బ్రతుకుతున్నాడు. అటువంటివాడిని తట్టి లేపింది. ఒక రోజంతా ఆతృతతో, తరువాత జీవితమంతా నిరాశతో గడిపేలా చేసింది. ఆమెకేం? ఒక చిన్న ఉత్తరం వ్రాసి 'నేను మనసు మార్చుకున్నాను'- అని అనేస్తే సరిపొతుందా? ఈ ఆడవాళ్ళంతా ఇంతే. వెనుకనుంచి భుజం తట్టి, వెనుదిరిగేసరికి మాయమవుతారు. దానికి అందంగా 'భయం' అని పేరు పెట్టుకుంటారు. మరికొంచెం తెలివైన వాళ్ళయితే 'నైతికం' అని నాజూగ్గా అంటారు.
   
    అయిదు సంవత్సరాలు తన గురించి ఆలోచిస్తే లేని తప్పు- అయిదు నిముషాలు తనని కలుస్తేనే వస్తుందా? దేనికింత అనాలిసిస్, ఇంత మధనం దేనికి? అసలేమనుకుంటుంది ఆవిడ తన గురించి? ఎందుకు ఈ విలువలకి ఇంత ప్రాముఖ్యత ఇవ్వటం? తన భార్య గుర్తించని విలువలు.... ఆవిడ భర్త పట్టించుకోని విలువలు? అసలు మనిషి ఎందుకు కట్టుబాట్ల మధ్య పెరగాలి? సమాజం కోసమా? సమాజం అంటే ఏమిటి? భార్యా, స్నేహితులూ వీళ్ళేగా! సెక్రటరీతో మాట్లాడుతూ వుంటేనే తనకీ ఆమెకీ మధ్య సంబంధం అంటగట్టిన భార్య.....ఆమె దృష్టిలో తనెప్పుడూ గొప్పవాడు కాలేడు. మరిక దేనికి వీటికి విలువ ఇవ్వటం....అతడు పిడికిలితో అరచెయ్యి కొట్టుకున్నాడు.
   
    కొంచెంసేపు పచార్లు చేశాడు.
   
    తరువాత ఆగి, తన జ్ఞాపకాలనుంచి ఆ విషయం చెరిపేస్తున్నట్లుగా అగ్గిపుల్లతో ఆ ఉత్తరాన్ని అంటించి, పూర్తిగా కాలే వరకూ చూశాడు.
   
                             14
   
    కాగితాన్నైతే కాల్చేశాడు. జ్ఞాపకాల్ని తుడిచెయ్యాలనుకున్నాడు. కానీ రోజులు గడుస్తున్నకొద్దీ అంత సులభం కాదనిపించింది. ఎప్పుడు ఫోన్ మ్రోగినా ఆమె దగ్గిర్నుంచే అన్న ఆత్రంతో చప్పున ఫోన్ అందుకునేవాడు. ఎన్నోసార్లు ఫోన్ చేద్దామని చెయ్యి అక్కడివరకూ వెళ్ళి ఆగిపోయేది. కష్టంమీద నిభాయించుకునేవాడు.
   
    అతడి హృదయంలో ఒక భాగం నిరంతరం దీన్ని గురించే ఆలోచిస్తూ వుండిపోయింది. క్రమక్రమంగా అది పూర్తిగా ఆక్రమించుకుంది. ఆమెమీద కోపంతో తనేదో చేసి ఆమెకు అన్యాపదేశంగా అది తెలియజేయాలన్న తపన ఎక్కువయింది. కొన్ని ఆలోచన్లకి అర్ధం వుండదు. నువ్వొక్కదానివేనా ఈ ప్రపంచంలో... 'కో'అంటే కోటిమంది అన్న ఫీలింగ్ నీ ఒక్కదానికేనా ఈ విలువలన్నీ? అందరికీ వుంటాయి. కానీ ఏదో బాధవుండబట్టేగదా, దాన్నించి బయటపడటానికి అందరూ ఇలా చేసేది. దీన్ని ఎత్తి చూపించే హక్కు నీకేముంది?
   
    ఆ తరువాత అతడి ఆలోచన్లు మరో విధంగా సాగేవి. ఆ రోజు తను హోటల్లో ఎదురుచూస్తూ వుండగా ఆవిడ ఇంట్లో ఏమని ఆలోచిస్తూ వుండివుంటుంది? తన పట్ల జాలితో అయ్యో పాపం వీడు లక్ష్మణరేఖదాటి వచ్చేసేడే అనుకుని వుంటుందా? నాకున్నపాటి నిబ్బరంకూడా లేకపోయిందే అని నవ్వుకుని వుంటుందా? ఆడది అనగానే ముక్కు మొహం హేలియకపోయినా పరుగెత్తాడు అని తేలిక అభిప్రాయం ఏర్పర్చుకుని వుంటుందా?
   
    రవితేజకి ఇటువంటి మధనతో పనిమీద ఆసక్తి తగ్గింది. వారంరోజులు గడిచాయి.
   
    కాలమే గాయాల్ని మాన్పుతుందంటారు.
   
    అదీ అతడి విషయంలో నిజం కావొచ్చు. నెమ్మదిగా అతడు తేరుకుంటున్నాడు. ఇలా వుండగా ఆ రోజు అతడికి ఇంటర్ కమ్ లో పెర్సనల్ ఆఫీసరు ఫోన్ చేశాడు.
   
    "సార్! మన పాత సెక్రటరీ కోలుకోవటానికి మూడునెలలు పడుతుందట. టెంపరరీగా మరో సెక్రటరీని తీసుకొమ్మని చెప్పారు."
   
    "అవును."
   
    "మీరు ఇంటర్వ్యూ చేస్తారా?"
   
    "అక్కర్లేదు, మీరు చేయండి. తొందరగా జాయిన్ అవ్వాలని మాత్రం చెప్పండి."
   
    "అలాగే సార్!" ఆ తరువాత రెండ్రోజులకి జాయిన్ అయింది. ఆమె పేరు ప్రియంవద!
   
                           *    *    *
   
    "మే ఐ కమిన్ సర్"

    టేబిల్ డ్రాయర్ లోంచి కాగితాలు తీసుకుంటున్న రవితేజ తలెత్తి చూశాడు. గుమ్మం దగ్గిర నిలబడి వుంది ఆమె.
   
    చిన్నపిల్లలా, అప్పుడే కాలేజీనుంచి వచ్చిన అమ్మాయిలా వుంది. "పిల్చారుట-"
   
    ఆ అమ్మాయి చేతిలో వున్న షార్ట్ హాండ్ పుస్తకం బట్టి కొత్తగా చేరిన స్టెనో అని తెలుసుకున్నాడు.
   
    "రండి. కూర్చోండి."
   
    ఆమె కళ్ళలో భయం కన్నా, అదో రకమైన ఎగ్జయిట్ మెంటు కనపడుతూంది.
   
    "మీ పేరు?"
   
    "ప్రియంవద."   
   
    "ఇదే మొదటి ఉద్యోగమా?"
   
    "అవును సర్ మొన్న మార్చిలోనే బి.యస్సీ పాసయ్యాను. అప్పుడే స్టెనో గ్రఫీ కూడా..... ఇదే మొదటి ఉద్యోగం. టెంపరరీ అన్నారు. మూడు నెలలే అట...." ఆమె గడగడా చెప్పుకుపోతుంది.
   
    "డిక్టేషన్ తీసుకుంటారా?"
   
    ఆమె వాక్ ప్రవాహం ఆపి పెన్సిల్ తీసుకుంది.
   
    అతడు అడ్రసు చెప్పి "డియర్ సర్స్" అని ఉత్తరం ప్రారంభించాడు. "మీరు కోరినట్టు అనంతపురం రిటైల్ ఏజెన్సీ విషయం పరిశీలించాం. హేమమాలిని చీరెలమీద పదిశాతం, శ్రీదేవి చీరెలమీద ఐదు శాతం రిబేటు ఇవ్వటానికి మాకు అభ్యంతరం లేదు పోతే...." అతడు ఆపై, ఏమిటన్నట్టు చూశాడు.
   
    "హేమమాలిని చీరలకు ఇప్పుడు డిమాండ్ లేదు సార్. శ్రేదేవి చీరలకే డిమాండ్. వాటికి కన్సెషన్ అనవసరం."
   
    "నేను చెప్పింది వ్రాస్తారా? మీరు చెప్పిన సలహా నేను వినాలా?"
   
    "సారీ సర్" అని ఆమె తిరిగి వ్రాయటం ప్రారంభించింది. అతడు చెప్పటం పూర్తిచేశాడు. పూర్తిచేసి తలెత్తేసరికి ఆమె పెన్సిల్ చెక్కుతూ కనిపించింది. "ముల్లు సరీగ్గా వుందో లేదో లోపలి కొచ్చేముందు చూసుకోనక్కర్లేదా".
   
    "వచ్చేవరకూ బాగానే వుంది సార్. వ్రాస్తూంటే విరిగిపోయింది."
   
    "అలాటప్పుడు - ఆగమని నాతో చెప్పాలి-?"
   
    "అక్కర్లేద్సార్ ఉత్తరం నాకు కంఠతా వచ్చేసింది" అంటూ అతడు చెప్పినదాన్ని తిరిగి పొల్లుపోకుండా చెప్పింది. అతడు ఆశ్చర్యపోయాడు. అయితే దాన్ని బయట పెట్టకుండా, 'గుడ్' అన్నాడు. "వెళ్ళి టైపు చేసి పంపించండి."
   
    ఆమె కుర్చీలోంచి లేవకుండా, "మిమ్మల్ని ఒకటి అడగొచ్చా-" అంది. "ఏమిటి" అన్నాడు విస్మయంతో.
   
    "మేం కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆర్.టి. చీరెలంటే అందరికీ క్రేజ్ సార్. రవితేజా టెక్స్ టైల్స్ లో ఉద్యోగం అనగానే గమ్మత్తుగా అనిపించింది. కానీ ఇక్కడికొచ్చాక సాక్షాత్తు రవితేజకే స్టెనో అంటే భలే థ్రిల్లింగ్ గా అనిపించింది.. సార్."
   
    అతడికి నవ్వొచ్చింది. ఆమె 'సాక్షాత్తు' అనే పదం ఉపయోగించటం చూసి.
   
    "సార్.....ఏ బాడీ స్ట్రక్చర్ కి ఏ చీర బావుంటుందో మీకు బాగా తెలుసు. ప్లీజ్ - నేనెలాంటి చీర కట్టుకుంటే బావుంటుందో చెప్పరా?"

 Previous Page Next Page