Home » Yandamuri veerendranath » మంచు పర్వతం

   

      బామ్మకి మూడు రోజులనుంచి ఆరోగ్యం సరిగా లేదు. విశాలకారోజు ఉదయంనుంచీ చాలా చిరాగ్గా వుంది. ఆరోజు కార్తీకసోమవారం. ఉదయమే లేచిస్నానం ముగించుకుని పూజయ్యేటప్పటికి ఆలస్యం అయిపోయింది. సునీత సాయంతో వంట ఎలాగో పూర్తిచేసి పిల్లలను బడికి పంపింది. విశ్వానికి క్యారియర్ పంపి బామ్మకు కావలసినవన్నీ అందించి బయలుదేరేటప్పటికి ఆలస్యం అయిపోయింది. సమయానికి బస్సూ అందలేదు. ఆటోలో వెళ్ళినా ఆఫీసుకి అరగంట ఆలస్యంగా చేరుకుంది. సెక్షన్ ఆఫీసర్ మంచివాడు (ఆమె దృష్టిలో) తమకు దూరపు బంధువవుతాడు. కాబట్టి ఆలస్యంగా వచ్చినా, త్వరగా  వెళ్ళిపోతున్నా ఏమీ అనదు. ఆయన అండ చూసుకొని ఇంటికి కావలసిన బజారు పనులన్నీ ఆఫీసువేళల్లోనే చేసుకుంటుంది. ఆయనెందుకో సెలవు పెట్టాడీరోజు. ఆ సీటులో కూర్చున్న మరో ఆఫీసరు ఆలస్యంగా వచ్చినందుకే మొహం మాడ్చుకున్నాడు. నాలుగు ఫైళ్ళు పంపించి పని ఈ రోజే జరగాలని చెప్పాడు. విశాల ఆ రోజు త్వరగా వెళ్ళిపోవాలనుకుంది. విశ్వం ఊరు వెళ్ళాడు. మధ్యాహ్నానికల్లా వచ్చేస్తానన్నాడు. అతడింటిలో వుంటాడన్న సమయానికి తను లేకపోతే ఆమె కెలాగో వుంటుంది. ఇంటికెళ్ళి పోవాలని ఆరాటపడుతోంది. కాని పని ముగించకుండా వెళ్ళడానికి వీలుపడలేదు. ఆమె సీరియస్ గా పని చెయ్యడం ప్రారంభించింది. అసలే ఉపవాసం వుందేమో ఆ టెన్షన్ తో  మధ్యాహ్నానికల్లా ఆమెకు తలనొప్పి వచ్చేసింది. అంత బాధలోనూ ఆమె ఆలోచించిన మొదటి విషయం- ప్రొద్దుటే లేచి ఎవరి ముఖం చూశానా అని.
   
    పడగ్గదిలోనే ఎదురుగా దేవుడి పటాలు తగిలించిందామె. తనుగాని, భర్తగాని లేవగానే వాటినే చూడాలి. బెడ్ రూమ్ లో దేవుడి పటాలేమిటని ఎవరో నవ్వినందుకు చాలా కోపం వచ్చిందామెకు.
   
    "భగవంతుడు సర్వాంతర్యామి అతడి కంటపడకుండా మనకు ప్రైవసీ వున్న స్థలం ఏదీలేదు. అతడి దగ్గిర మనకు సిగ్గెందుకు?" అని దులిపేసింది.

    "అలాంటప్పుడు నువ్వు కళ్ళు తెరవగానే కనిపించేది భగవంతుడేగా దానికి విడిగా పటం పెట్టాల్సిన అవసరం ఏమిటి?"
   
    "అది నా ఆత్మ సంతృప్తికోసం ఉదయం లేవగానే పటాలను చూస్తే ఆ రోజంతా ఎంతో మనశ్శాంతిగా వుంటుంది. ఎలాంటి కీడు జరగదన్న నమ్మకం కలుగుతుంది".
   
    "ఇన్నేళ్ళ నీ జీవితంలో మార్పు రాదుకదా? మరీ నీకెప్పుడూ ఎలాంటి కీడూ జరగలేదా? మీవారి కిప్పటికి పదిసార్లు స్కూటర్ యాక్సిడెంట్లయ్యాయి పిల్లలకయితే ఎప్పుడు చూసినా ప్లాస్టర్లు కనిపిస్తూనే వుంటాయి. నడుస్తూ నడుస్తూనే కాలుజారి పడ్డావు నువ్వుకూడా అవన్నీ ఎందుకు జరిగినట్లు?"
   
    "అదే నేను చెప్పేదికూడా. రోజూ ఉదయం భగవంతుడి మొహం చూడబట్టే ఇన్నిసార్లు ఇన్ని యాక్సిడెంట్లయినా ఏదీ పెద్ద ప్రమాదంగా మారలేదు. ఎంతమంది కాలుజారి కాళ్ళు విరగ్గొట్టుకోవడం లేదు. యాక్సిడెంట్లయి ఎంతమంది ప్రాణాలు పోవడంలేదు?" అని తిరుగు ప్రశ్న వేసేది ఎదుటివారు మరి మాట్లాడకుండా.
   
    ఆ రోజు ఉదయం లేవగానే దేవుడి పటాలకు నమస్కరించి బయటకు రాగానే హాల్లో కనిపించింది సునీత. ఆమె పలకరించడం వల్లే తనకీ తలనొప్పి అని నిర్దారణకు వచ్చేసింది విశాల.
   
    అక్కడ సునీతకూ ఆఫీసులో పనిచెయ్యడానికి మనస్కరించడంలేదు. ఉదయం వచ్చేటప్పుడు బామ్మ చాలా నీరసంగా కనిపించింది. ఆమె ఎలాంటిదైనా కానీ తనకు అమాయనికి అన్నీ అమర్చిపెట్టే మనిషి తను లీవు పెడతానంటే విశాల వద్దంది. తనే త్వరగా వచ్చేస్తానంది. కాని ఒకవేళ రాలేకపోతేనో, పిల్లలు స్కూలునుంచి రాగానే చాలా గొడవ చేస్తారు. ఆమెను చాలా విసిగిస్తారు. ఇదంతా ఆలోచించి సునీత మధ్యాహ్నంనించి లీవు పెట్టి వచ్చేసింది. రెండు బస్సులు మారి వచ్చేటప్పటికి సమయం నాలుగు కావస్తుంది. ఇంటిలో అడుగు పెడుతూనే అక్కడి పరిస్థితి చూసి అదిరిపడి పోయిందామె.
   
    స్కూలునించి ఇంటికి వస్తూన్న సృజన రిక్షాలోనే ఫ్రెండుతో దెబ్బలాడుతూ జారి కిందపడిందట. కణతకు పైన తలమీద గట్టిదెబ్బే తగిలింది. రక్తం ధారగా కారుతుంటే భయపడ్డ రిక్షావాడు వెంటనే ఇంటికి తీసుకువచ్చాడామెను. ఇంట్లో బామ్మకు మూసినకన్ను తెరవకుండా జ్వరం. అదృష్టవశాత్తూ విశ్వం అప్పుడే ఊర్నించి వచ్చాడు. రక్తంతో మొహం, బట్టలు తడిసిపోయిన సృజనను అతడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు రిక్షావాడు.
   
    విశ్వానికి కాళ్ళూ, చేతులూ వణుకుతున్నాయి. ఏం చేయాలో తోచలేదు. బామ్మను లేపడానికి ప్రయత్నించాడు. ఆమె మగతగా పడుకునుంది. సృజన గాయంనించి రక్తం కారడం ఆగలేదు. దాన్నెలా ఆపాలో తెలియక అతడు టవల్ ని నీళ్ళలో ముంచి మొహం తుడిచాడు. నీళ్ళలో కలిసిన రక్తం బట్టల మీదంతాపడి సృజన రూపం మరింత భయంకరంగా తయారయింది. వంటింట్లో వస్తువుల్ని చూడలేదేమో డబ్బాలు కిందా మీదా ఒలికిపోయాయి. అతడి ఒంటినిండా కారం పడింది. అంతలో దేవుడి గూటిదగ్గర పసుపు గుర్తొచ్చింది. అటు పరుగెత్తాడు. విశాల దేవుడి దగ్గర ముగ్గు వేయడానికి ఉపయోగిస్తుంది. దాంట్లో సున్నం, కుంకుమా కూడా పడ్డాయి. అవేమీ చూసుకోకుండా విశ్వం ఆ పసుపుని తెచ్చి సృజన గాయంనిండా చల్లాడు. అందులో కారం చెయ్యేమో సృజన బాధతో విలవిల్లాడింది. అది చూడగానే అతడికి మరింత గబహరా పుట్టింది. అతడికి కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. ఆ సమయంలో ఏ డాక్టరుంటారు? ఎక్కడుంటాడు? ఆ పిల్లను స్కూటర్ మీద తీసుకెళ్ళడం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క అతడు నిస్సహాయంగా చూస్తూండి పోయాడు.
   
    సునీతకు అక్కడి పరిస్థితిని అర్ధం చేసుకోవడానికి అరనిముషం కూడా పట్టలేదు. వెంటనే దూది పట్టుకు వచ్చి సృజన మొహం బాగా తుడిచింది. డెట్టాల్ లేక ఆఫ్టర్ షేవ్ లోషన్ తో తుడిచింది. తర్వాత దూది అడ్డంపెట్టి సన్నటి బట్టతో తలకు కట్టుకట్టింది. వెళ్ళి ఎదురుగా కనిపించిన రిక్షావాణ్ని పిలుచుకువచ్చి సృజనను తీసుకుని వెళ్ళిపోయింది డాక్టర్ని వెతుక్కుంటూ.
   
    విశ్వం అంతా చూస్తూ తృప్తిగా నిట్టూర్చాడు పరిస్థితిని తన అధీనంలోంచి సునీత తీసుకోవడం అతడికి రిలీఫ్ నిచ్చింది.
   
    ఎలాగో పని ముగించుకుని ఆఫీసరుకి చెప్పి ఇల్లు చేరుకున్న విశాల, విశ్వం మొహం చూసి గాభరా పడింది. అతడికి ఆరోగ్యం సరిగా లేదేమోనని భయపడిందామె. జరిగిన విషయం విన్నాక పెద్ద ప్రమాదమేమీ జరగలేదని తెలుసుకుని ఇంటినిండా కనిపిస్తున్న రక్తపు మరకల్ని తుడుస్తూ సృజనని తిట్టుకోవడం మొదలు పెట్టింది.
   
    "పదేళ్ళు దాటినయ్. ఇంకా చిన్న పిల్ల ననుకుంటుంది. అయినా రిక్షాలో ఆటలేమిటట? రానియ్యండి చెప్తా దాని పని" అని గొణుక్కుంటూనే వుంది.
   
    ప్రక్క వీధిలో ఎప్పుడో చూసిన డాక్టర్ నేమ్ ప్లేటుని గుర్తుతెచ్చుకుని సునీత సృజనను తీసుకుని ఆ యింటికి వెళ్ళింది. అదృష్టవశాత్తూ డాక్టర్ ఇంటిలోనే వున్నాడు. మందువేసి కట్టుకట్టి కుట్లు వేయించాలి హాస్పిటల్ కు తీసుకెళ్ళమన్నాడు. సునీత జనరల్ హాస్పిటల్ కు వెళ్ళి కుట్లు వేయించి వాళ్ళు రాసిచ్చిన మందులే కాకుండా బ్రెడ్, పళ్ళు కూడా కొనుక్కొచ్చింది. ఆమె ఇల్లు చేరేసరికి ఆరున్నరయింది.
   
    నెత్తిన బ్యాండేజీతో బట్టలనిండా రక్తం మరకలతో కనుపిస్తూన్న సృజనను చూడగానే విశాల కోపం కట్టలు తెంచుకుంది.
   
    "ఏమిటే, ఆడపిల్లవు కావూ? రిక్షాలో గెంతులేమిటి? ఉన్నదానివి వున్నట్లుండకుండా ఏదో ఒకటి తెచ్చిపెడతావు నెత్తిమీద" అంటూ చెయ్యెత్తింది. ఆమె మాటలు వింటూ నిశ్చేష్టురాలై నిలబడ్డ సునీత పట్టుకోకపోతే సృజన వొంటిమీద దెబ్బపడేదే సునీత మారు మాట్లాడకుండా సృజనను లోపలకు తీసుకెళ్ళింది. బట్టలు మార్చి పడుకోబెట్టింది. పళ్ళరసం తీసి తాగించి నిద్రపోయాక బయటకు వచ్చింది. విశ్వం హాల్లోనే కూర్చున్నాడు ఏమీ జరగనట్లుగా.
   
    "అన్నయ్యా, నీ ధోరణి నాకేం నచ్చలేదు. గాయపడిన పిల్లకు ఫస్ట్ ఎయిడ్ యివ్వడం, డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళడం కూడా తెలియక పోతే ఎలా?" మందలింపుగా అంది సునీత. ఆమె అనుకున్నట్లుగానే విశాల వంటింటిలోంచి వచ్చింది విసురుగా.
   
    "దానికి దెబ్బ తగిలినందుకు నువ్వొక్కదానివే బాధపడుతున్నట్లు మాట్లాడకు. మాకు మాత్రం లేదా బాధ? నేను వచ్చేసరికి మీ అన్నయ్య కళ్ళనీళ్ళ పర్యంతం అయి కూర్చున్నారు తెలుసా?"
   
    "తెలుసు! అంతకుమించి ఏం చెయ్యాలో ఆయనకు తెలియదు. ఒక పక్క గాయం నుంచి రక్తం కారుతోంటే ఆయన కళ్ళల్లోంచి నీళ్ళు జలజల రావడం ఎంత గొప్ప సన్నివేశం! అంతేకాని చెయ్యాల్సిందేమిటో తెలియదు" కోపంగా అంది సునీత.
   
    "పసుపు వేశాగా అదీ యాంటి సెప్టికేగా?" అమాయకంగా అన్నాడు విశ్వం.
   
    "అవును వేశారు. అందులో కాస్త ఉప్పు, కారం కూడా కలిపావు- ఇంటిలో చిన్నపిల్లలున్నప్పుడు ఎమర్జెన్సీకి కావలసిన మందులు తెచ్చి పెట్టుకోకపోతే ఎలా? ఆ డాక్టరు నన్ను చీవాట్లు పెట్టాడు పసుపు పెట్టడమేమిటని నువ్వు వెళ్ళుంటే తెలిసేది".

    "ఆయనకేం తెలుసని? ఎప్పుడన్నా డాక్టరు దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం వస్తే గదా?" అంది విశాల.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra