Home » Yandamuri veerendranath » రాధ-కుంతి


    అంతలో పైపు నోట్లోంచి తీసి చేతిలో పెట్టుకొని కళ్ళు చిన్నవి చేసి తీక్షణంగా అప్పారావ్ వైపు చూడటం మొదలు పెట్టారు. అప్పారావు కంగారుపడ్డాడు. తనూ ఆయనవైపు పరిశీలించి చూద్దామనుకొని, అంతలో తను వచ్చింది ఆయన అమ్మాయిని చూడటానికని, ఆయన్ని చూడటానికి కాదని జ్ఞాపకం వచ్చి ఆ ప్రయత్నం నుంచి విరమించుకొన్నాడు. నిమిషంపాటు ఎవరూ మాట్లాడలేదు. అప్పారావుకి విషయం అర్ధమయింది.
    సదరు కెప్టెన్ గారికి ఒక్కతే కూతురని, ఒక్కతే కూతురున్నతండ్రులు కాబోయే అల్లుడ్ని యిలా రకరకాల కోణాల్లో పరిశీలిస్తారనీ (ఆ ఛాన్స్ ఒకసారే వస్తుంది కాబట్టి) అదే పదిమంది అమ్మాయిలున్న తండ్రి అయితే ఎవరో ఒకర్లే అని సరిపెట్టుకుంటారనే నగ్నసత్యం అర్ధమయ్యింది- "నేనైతే పెళ్ళిచూపులకి ఒక్కతే కూతురున్న ఇంటికి వెళ్ళనుగాక వెళ్ళను" అని ఆ క్షణాన్నే శపథం పూనాడు అప్పారావు. అంతేకాదు- "నోట్స్ ఆన్ పెళ్ళి చూపులు" అనేదాన్ని తనుగానీ వ్రాస్తే ఈ విషయాన్నే నిర్ధారించాలని నిర్ణయించుకున్నాడు.
    రంగారావుగారి పరిశీలన యింకా పూర్తికాలేదు. ఎందుకన్నా మంచిదని జేబులోంచి పెన్నుతీసి, ఆనాడు సీత రావణుడితో మాట్లాడవలసిన అవసరం వచ్చినప్పుడు మధ్యలో ఒక గడ్డి పరకను పట్టుకొన్నట్టు పట్టుకొన్నాడు.
    అంతలో ఒక అమ్మాయి ట్రేలో రెండు కప్పులు పట్టుకొచ్చింది. రంగారావుగారు ధ్యానంనుంచి చెదిరారు. రొమేంటిక్ గా ఒక చూపు అటు విసిరి, "మీ అమ్మాయా?" అని కాఫీ కప్పు తీసుకొంటూ అడిగాడు.
    రంగారావు సీరియస్ గా- "మా పనిపిల్ల" అన్నారు వస్తున్న కోపాన్ని బిగపట్టి.
    "బాగుంది" అన్నాడు కాఫీ కొంచెం సిప్ చేసి, కామెంటు అమ్మాయిని గురించి అనుకుంటారేమో అని మళ్ళీ తనే ".... కాఫీ" అన్నాడు.
    సంభాషణ ప్రారంభిస్తూ, "చదువయ్యాక ఏం చేద్దామనుకొంటున్నారు?" అని అడిగాడు.
    సోఫాలో వెనక్కివాలి, కాలుమీద కాలు వేసుకొని క్షణం పాటు సీరియస్ గా ఇంటి పైకప్పుకేసి చూస్తూ ఆలోచించి, "వేసవిలో పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను" అన్నాడు అప్పారావు.
    "అది కాదు నా ఉద్దేశ్యం. ఇంకా పైకి వెళ్ళి చదివే ఉద్దేశ్యం" ఆర్దోక్తిలోనే ఆపుచేశారు.
    "పైకి వెళ్ళే చదువుతాను పెళ్లి చేసుకొని" అందామనుకొని, అర్ధమైతే బాగుండదని మానేశాడు.
    "మీ హాబీస్ ఏమిటి?"
    "అప్పు" చటుక్కున జవాబు చెప్పాడు.
    "ఏమిటీ"
    "అప్- అని వెస్టర్న్ కంట్రీస్ లో బాగా డెవలప్ అవుతోంది. ఇంకా మనవైపే రాలేదు. ప్రస్తుతం దాని తాలూకు లిటరేచర్ చదువుతున్నాను. బైదిబై! మీరు తెలుగు నవల్స్ చదువుతారా?"
    "చదవను"
    అప్పారావు విజృంభించాడు. "మొన్నటివరకూ వీక్లీలో ఏభై రెండు వారాల సీరియస్ ఒకటి వచ్చింది. అది నా స్నేహితుడు వ్రాసిందే. మాస్టర్ పీస్ లెండి"
    ఇంకా చెప్పేవాడేమో కానీ, ఇక్కడ అప్పారావు ఒక చిన్న సత్యం మరచిపోయాడు. పెళ్లి చూపులకి కేటాయింపబడిన పదిహేను నిమిషాల్లోనూ రంగారావుగారి బాపతు తండ్రులు తమకి కావలసిన విషయాలన్నీ లాగటానికి ప్రయత్నిస్తారే తప్ప కాబోయే అల్లుళ్ళు చెప్పే ఉపన్యాసాలు వినరు. అందుకే అప్పారావు చెబుతున్న దాన్ని కట్ చేసి, "ఛేస్ చదివేరా ఏమన్నా" అని అడిగాడు.
    ఉపన్యాసాన్ని కొద్దిగా డైవర్ట్ చేసి అదే స్పీడ్ లో- "చదవకేం? అసలు చదరంగం అంటే చెవి కోసుకుంటాన్నేను-"
    "నేను అడిగింది ఛేస్ వ్రాసిన నవల్స్ గురించి!"
    "అది- అలా చెప్పండి మొన్నే ఒక నవల చదివేను. నిజంగా రచయిత అంటే ఛేసే! ఎంత ఉదాత్తంగా వ్రాశాడు! ముఖ్యంగా- సర్వస్వాన్నీ త్యాగం చేసి ప్రేమకోసం బలయిపోయిన-" చటుక్కున ఆపుచేశాడు. ఎదురుగా వున్న రంగారావుగారి మొహం చూస్తూంటే తానెక్కడో పప్పులోకాలు వేసేడని అర్ధమయింది. "మీరు.... అడిగింది."
    "డిటెక్టివ్ నవలలు వ్రాసే ఛేస్ గురించి."
    "ఐ.సీ.!" అన్నాడు అప్పారావు వెనక్కివాలి రంగారావ్ గార్ని ఇమిటేట్ చేసి.
    "మీ బరువెంత?"
    అప్పారావు ఉలిక్కిపడి, "ఏమిటీ?" అన్నాడు కళ్ళు చిట్లించి.
    రంగారావు అదే ప్రశ్నని రిపీట్ చేశారు. "దానితో ఈయన కేమిటి ఇంటరెస్టు?" అని విసుక్కొని జవాబు చెప్పాడు.
    ప్రశ్నల పరంపర సాగుతూనే వుంది.
    దాదాపు పది నిమిషాలు గడిచేసరికి ఈ సోఫాలోనే నిస్త్రాణగా దాదాపు వాలిపోయాడు. ఏదో పెళ్ళి చూపులంటే సరదాగా మైసూరుపాకూ, హాటూ తినవచ్చు అనుకున్నాడేకానీ ఇలాటి విషయ పరీక్ష అవుతుందని అప్పారావు కలలో కూడా అనుకోలేదు. ఈ చూపులకి రాకుండా శుభ్రంగా ఐ.ఏ.ఎస్.కి కట్టి వుంటే కలెక్టరయిపోదునే అని బాధపడ్డాడు.
    "-డు యూ ప్లే టెన్నీస్?"
    "ఎస్" అని ప్రకాశితంగా అని, "బేటూ బాలుతో కాదు" అని మనసులో అనుకొన్నాడు.
    "బాంకు నేషనలైజేషన్ మీద మీ అభిప్రాయం?"
    "పెళ్లికాని కూతుళ్ళున్న తండ్రులకి లాభకరం" ఒళ్ళు మండుతూంటే జవాబు చెప్పాడు.
    "ఏమిటీ!"
    "మొన్న ఈ టాపిక్ మీదే కృష్ణస్వామి ఎడిటోరియల్ చదివాను. చాలా బాగా వ్రాశాడు."
    రంగారావుగారికేమీ అర్ధం కాలేదు. విషయాన్ని పొడిగించకుండా ఇంకో ప్రశ్న వేసేరు. "యూ లైక్ స్విమ్మింగ్?"
    "ఏభయిరెండు" ఈ సారి గట్టిగానే అన్నాడు అప్పారావు.
    "ఏభయి రెండేమిటి?"
    అప్పారావు మాట్లాడలేదు. ఉన్నట్టుండి రంగారావుగారి మీద జాలివేసింది. యాభయి రెండు ప్రశ్నలువేసి ఎదుటి మనిషి ఎలాటివారో కనుక్కోవాలని ఆయన చేసే ప్రయత్నం చూస్తూంటే అల్లుడిమీద ఆయన ఎన్ని ఆశలు పెంచుకున్నాడో అర్ధమయింది. ఇటువంటి వాళ్ళకి చివరికి ఎవడో తనలాటి వాడే అల్లుడుగా వస్తాడు. ఇది మాత్రం తప్పదు- అనుకొన్నాడు.
    అప్పారావుకి అంతలో యింకో అనుమానం వచ్చింది. ఈ తతంగం అంతా చూస్తూంటే అసలీయన అమ్మాయిని చూపించడేమో అని. "అది మాత్రం సహించను" అనుకొని తెగించి అడిగాడు. "మీ అమ్మాయి?"
    రంగారావు ఉలిక్కిపడి, "ఓహో అయామ్ సారీ! ఆ విషయమే మరచిపోయాను(?)" అని లోపలికి చూస్తూ అమ్మాయిని పిలిచాడు.
    "హల్లో!" అన్నాడు అప్పారావు వస్తూన్న అమ్మాయిని చూసి.
    "మీరు మాట్లాడకుండా వుండండి. నేనిప్పుడే వస్తాను" అని నిష్క్రమించారు రంగారావుగారు.
    "హల్లో!" అంది ఆ అమ్మాయి.
    అప్పటివరకూ ఉన్న అలసట అంతా క్షణంలో పోయినట్లు అనిపించింది అప్పారావుకి. దాదాపు అతని స్నేహితులందరికీ, ఆ పరిభాషలో హలో అంటే అయిదు రూపాయలని తెలుసు. అందుకే అతన్నెప్పుడైనా "హలో" అని పలకరిస్తే "సారీ, గురూ" అనో, "అంత ఇచ్చుకోలేను..... గురూ" అనో అనేవాళ్ళే- మళ్ళీ తిరిగి "హలో"(ఇస్తాను) అనేవాళ్ళు లేరు. ఒక్క ఉదుటున లేచి హుషారుగా, "హలో, హలో" అన్నాడు అప్పారావు.
    అప్రయత్నంగా ఒక్క అడుగు వెనక్కి వేసింది ఆ అమ్మాయి.
    "పోనీ ఒక్క హలో... ఒకటి చాలు."
    ఆ రోజే పేపర్ లో విశాఖపట్టణం పిచ్చాసుపత్రి నుంచి ఒక వ్యక్తి పారిపోయాడని పడటం అప్పారావు దురదృష్టం. దాన్ని గంట క్రితమే ఆ అమ్మాయి చదివి వుండటం మరీ దురదృష్టం. అప్పారావు విషయమై ఆ వార్తని అన్వయించుకొని, ఎందుకయినా మంచిదని రెండడుగులు వెనక్కి వేసింది.
    అంతలో అప్పారావు దృష్టి బయట గుమ్మంమీద పడింది. ఉలిక్కిపడ్డాడు. ఎవరు విప్పారో తెలియదుగానీ, ప్రత్యర్ధి గుమ్మం దగ్గర తాపీగా నిలబడి అప్పారావునే చూస్తూ నాలుక చప్పరిస్తోంది. కుక్క చాలా తెలివయిన జంతువు. గొలుసు విప్పగానే లోపలకు రాబోయి తనని సరదాగా వెక్కిరించిన వ్యక్తి లోపలే వున్నాడని తెలిసి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు తను మొరిగి అల్లరి చేస్తే ఎవరో వచ్చి తనని మళ్ళీ కట్టేస్తారనీ, తను బదులు తీర్చుకొనే అవకాశం తప్పిపోతుందని గ్రహించి బయటే నిలబడింది. అనవసరంగా మొరగకుండా ఒక్కసారే మీదకు దూకటం దాని ఆశయం.
    గుమ్మం దగ్గర నిలబడి తనచే వెక్కిరింపబడిన శునక రాజమే అది అనీ, అదీ వీలుకోసమే చూస్తుందనీ, ఈ అమ్మాయి లోపలికి వెళ్లిపోయి తను ఒక్కడే రూంలో మిగిలిన మరుక్షణం, తన పాంటు వెయ్యి పీలికలు కాక తప్పదనీ గ్రహించలేనంత అమాయకుడు కాదు అప్పారావు. అందుకే అప్రయత్నంగా "ఆగండి" అంటూ గట్టిగా అరిచాడు.
    అదే అప్పారావు చేసిన తప్పు.
    "మొదట "హలో, హలో" అనటం, తరువాత "పోనీ ఒక హలో" అని ప్రాధేయపడటం, ఉన్నట్టుండి "ఆగండి" అని అరవటం- ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్న ఈ మాటలతో అనుమానం పూర్తిగా బలపడి ఆ అమ్మాయి లోపలికి పరుగెత్తింది. దీనికోసమే వేచి చూస్తూన్న టైగర్ లోపలికి చూసింది.
    ఒక నిముషంపాటు ఆ ఇంట్లో చిన్న సర్కస్ చేసి చూపించాడు అప్పారావు. రంగారావుగారే యిదంతా చూసివుంటే నిజంగా ఇన్ని కళల్లో అప్పారావుకి ప్రవేశం ఉందని తెలుసుకొని తప్పకుండా తన అల్లుడ్ని చేసుకొనే వారే. ముందు సోఫా మీదనుంచి హైజంప్ చేశాడు. తరువాత గుమ్మం వరకూ లాంగ్ జంప్ దూకాడు. మెట్లు ఒక్క అంగలోదిగి, గేటువరకూ మిల్కాసింగ్ లా పరుగెత్తి, గేటు మీదనుంచి పోల్ వాట్ చేసి ప్రహరీ గోడకి ఆన్చివున్న సైకిల్ మీద వెళ్ళి పడ్డాడు.
    సైకిల్ స్పీడ్ గా తొక్కుతూ - "గురూ! యిక నీకు జన్మలో పెళ్ళవదు పో" అనుకున్నాడు కుమార్ ని తలుచుకొని.
                                            *    *    *  
    అనూరాధ వడివడిగా నడుస్తూ రావటం చూసి కుమార్ మొహం కళకళ లాడింది.
    "మొదటిరోజే ఇంత నిరీక్షణా?" అన్నాడు.
    "చెపుతాను. ఒక క్షణం" అని అలసట పోవటంకోసం ఆగింది.
    "ఇలా కూర్చుందామా?"
    ఇద్దరూ కూర్చున్నారు. బీచ్ లో జనం ఎక్కువగా లేరు.
    "చెప్పండి" అన్నాడు.
    అనూరాధ నవ్వి, "చాలా అనెక్స్ పెక్టెడ్ గా నాన్నగారేదో పెళ్ళిచూపులు అరేంజ్ చేశారు- నాకసలు తెలియదు- ఒక గంట ఆలస్యం అయింది- ఆ వచ్చినతను...." అంటూ జరిగినదంతా నెమరువేసుకొని పొరలు పొరలుగా వచ్చే నవ్వును ఆపుకొంటూ, "....గురూ షర్టూ- సైకిలూ", అని ఇంక ఆపుకోలేక ఫకాలున నవ్వేసి, కుమార్ వైపు చూసి చటుక్కున నవ్వి ఆపి "ఏమైంది కుమార్?" అంది కంగారుపడుతూ. అప్పటికే కుమార్ కి స్పృహ తప్పింది.
                          * శుభం *
        (25వ ఎపిసోడ్ నుంచి ఆరూ - తొమ్మిది అనే కథ వస్తుంది.)

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra