Previous Page Next Page 
క్షమించు సుప్రియా! పేజి 24

   

    (దీని ముందు కథ- "సంయమనం" వ్రాసిన పది రోజుల తరువాత వ్రాసిన కథ ఇది).
       
                
                                      నీకు
   
   
    ప్రభా!

    దయచేసి దీన్ని చింపి వెయ్యకు, నామీద దయవుంచి దీన్ని పూర్తిగా చదువు. ఒకసారి పైనుంచి కిందికి చూసేసి "ఏమిటీ సొద" అని ఉండచుట్టి నీ ఆఫీసు అయిదో అంతస్తు నుంచి ఈ వుత్తరాన్ని విసిరెయ్యకేం!
   
    నీ రూమ్ బైటనున్న విజిటర్స్ నీ, నిముషాని కొకసారి మోగే నీ టెలిఫోన్ నీ కొద్దిగా ప్రక్కకు నెట్టి దీన్నిశ్రద్దగా చదువు నాకు బాగా వ్రాయటంగానీ, మనసులో మాట విపులంగా చెప్పటంగానీ రాదు. ఈ "సరీగా చెప్పలేకపోవటమే"గా మనమధ్య దూరాన్ని పెంచింది. 'మనమధ్య దూరం ఏమిటి' అని ఆశ్చర్యపోకు ప్రభా! వుంది.
   
    కొద్దికొద్దిగా ఇది పెరిగింది.
   
    ఈ రాత్రి దీన్ని బ్రద్దలు కొట్టాలనే నిశ్చయించుకున్నాను.
   
    ప్రభా- ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు చెప్పాలని అనుకొని కూడా చెప్పలేకపోతూ ఉంటాను. అయినా యీ విషయాన్ని ఎలా చెప్పటం? కొంచెం భయం, కొంచెం సిగ్గూ కూడా వేస్తుంది. అందులో నువ్వు ఏదయినా మాట్లాడబోతే తల తిప్పి ఒక్కక్షణం సూటిగా 'జీవితం అనే బిజినెస్ లో ఇది పనికి వచ్చే మాటేనా?' అన్నట్టు చూస్తావు. అంతే! ఇక నోటివెంట మాటరాదు. అందుకే యీ నిశ్శబ్దపు అర్దరాత్రి యిలా ఒంటరిగా కూర్చుని ఇది వ్రాస్తున్నాను. అంత నిశ్శబ్దంగానూ దీన్ని నీ బ్రౌను కోటు జేబులో పెట్టేశాను. నీ టైంటేబుల్ ప్రకారం మంగళవారం నువ్వు తొడుక్కునేది బ్రౌవును కోటేగా.
   
    క్షమించు ప్రభా! నీ విలువయిన సమయాన్ని వృధా చేస్తున్నాను. ఎన్నో చెప్పాలి. ఎలా మొదలు పెట్టాలో అర్ధం కావడం లేదు. అసలు ఈ చెప్పాలనుకొన్నవి కొట్ట సంగతులేమీ కావు. మనిద్దరికీ తెలిసినవే. కానీ వాటిగురించి ఒక్కసారయినా నువ్వు ఆలోచిస్తావా అని నా అనుమానం! అయినా నా గురించి ఆలోచించడానికి నీ టైంటేబిల్ లో సమయం కేటాయింపబడలేదుగా.
   
    లైఫ్ ని చాలా మామూలుగా తీసుకుంటావు నువ్వు. ఏదో పుట్టినందుకు కొన్ని పనులు చెయ్యాలి కాబట్టి రొటీన్ గా చేసుకుపోతావు. ఆ చేసేదానికి ఓ ఫీలింగ్ అనేది ఉండదు. అదే నాకు బాధగా ఉంటుంది.
   
    నీకు తెలియదుకానీ, నేను ఒక్కదాన్నీ చేసుకునే ప్రార్ధనలో నీ గురించి ఏం ప్రార్దిస్తానో తెలీదు కదూ "దేవా! నేనంటే నా భర్తకు కొద్దిగా ప్రేమా, కొంచెం దయా, జాలి, అనురాగం అనేవి పుట్టించి, ఈ ఇంట్లో నేను అనేదాన్ని ఒకదాన్ని వున్నానని గుర్తింపు కలిగించు" అని ప్రార్ధిస్తూ వుంటాను.
   
    నీ కిదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. 'ఇప్పుడు నువ్వేం కష్టపడుతున్నావ్?' అని అడుగుతావ్. కష్టమంటే పెద్ద కష్టమేమీ లేదు. ఈ ఏమీ లేకపోవటమే నన్ను బాధిస్తోంది. ఎప్పుడూ ఏదో సంపాదించుకోవటం, తినటం, పడుకోవటం అయిపోయింది. నాకు పిల్లలు, నీకు ఆఫీసు..... అంతే.
   
    నేను ఎంతగా ఎదురుచూస్తానో తెలుసా ప్రభా! ఇంటి చాకిరీతో అలసిపోయి నీక్కనిపించినప్పుడు - దగ్గరకు తీసుకుని ప్రేమగా ఒక్కమాట అంటావేమోనని ఎంతో చూస్తాను. ఒక్క క్షణం ప్రేమతో చూస్తావని ఆశపడతాను. దినం అంతటిలో ఒక్కక్షణం ఎక్కువసేపు కాహ్డు. కాని నువ్వు నా అలసటని గుర్తించవు. ఇళ్ళు సర్దుకోవటం నా బాధ్యత, ఆఫీసు కెళ్ళటం నీ బాధ్యత. ఇద్దరం మన పనులు ఎంతో క్యాజువల్ గా పని చేసుకుపోతున్నామో ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా గుర్తించావా? గుర్తించవు! బైట ఎన్నో పనులు నీకు. అసలు నీకా ధ్యాసే వుండదు. షేవింగ్ క్రీమూ, న్యూస్ పేపరూ, రాత్రి డిన్నర్ లోకి సూపూ, కళ్ళజోడూ, భార్యా.....అంతా ఒకే వరుసలో ఉండాలి.
   
    ప్రొద్దున్నే ఆఫీసుకువెళ్తూ, గుమ్మంవరకూ సాగనంపటానికి వచ్చినదాన్ని ఒక్కసారి దగ్గరకు తీసుకొన్నా -మ్ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి నావైపు చూసి నవ్వినా ఇక మళ్ళీ నువ్వు తిరిగివచ్చేవరకూ ఎంత తృప్తిగా ఉంటుందో? నువ్వేమో హడావుడిగా వెళ్ళిపోతావ్. నాకేమో అంతా రొటీన్, రొటీన్.
   
    ఈ విషయమే ఎప్పుడైనా ప్రస్తావిస్తే "ఆ ఏముంది అందులో -'అంటావు. ఏమీ లేకపోతే మరి - మన పెళ్ళయిన కొత్తలో ఎందుకు ఎప్పుడూ మనిద్దరిమధ్యా ఆ ఒంటరితనం కోసమే ఎదురుచూసే వాడివి? నేను ఏ మాత్రం ఒక్క అడుగు వెనక్కి వేసినా ఎందుకు నీ కంత కోపం, విసుగూ వచ్చేవి? దీనికి నువ్విచ్చే సమాధానం "నా ఆవేశాన్నీ వేడినీ పాడుచేసింది నువ్వే" అని. మరి దానికి నా సమాధానం చెబుతాను విను.
   
    ప్రభా! ఇవన్నీ చెప్పుకుంటున్న నన్ను బొత్తిగా సిగ్గులేని దానిగా అనుకుంటున్నావా? అయినా నా సంగతులు నీకుగాక ఇంకెవరికి చెప్పుకోను?
   
    మన పెళ్ళయిన కొత్త జ్ఞాపకం వుందా ప్రభా! నీలో అప్పట్లో ఎంత ఆవేశముందో నాకైతే ఏమీ తెలీదు. ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారని చిన్నప్పుడెప్పుడో బామ్మ చెప్పినమాట తప్ప, అదే అనుకొనేదాన్ని కడుపుచీల్చి కుట్టటం గురించి, పిల్లలు పుట్టడం గురించి ఎంత భయపడేదాన్నో.
   
    ప్రేమని ప్రకటించటం సరిగ్గా రాకపోవడమే నా తప్పా ప్రభా? ముద్దు పెట్టుకుమ్తున్నప్పుడు మెడచుట్టూ చేతులు వెయ్యాలన్న సంగతి పెళ్ళయిన రెండు నెలలవరకూ నేను గుర్తించలేదే అనుకో.....మామూలుగా నిలబడి వుండిపోయానే అనుకో.... అదేమంత తప్పని? మొదటిరోజు నీ కళ్ళలో కనబడిన అసంతృప్తి ఇన్నాళ్ళయినా ఇంకా నాకు జ్ఞాపకం వుంది. నిజం చెప్పొద్దూ - ఆ రోజు నువ్వు ఒక్కో అడుగు ముందుకు వస్తూంటే ఎవరో పెద్ద రాక్షసుడు మీదకొస్తున్నట్టు భయం వేసింది. (ప్రేమెక్కడా? అంతా భయమే) కళ్ళు గట్టిగా మూసుకున్నాను. వళ్ళంతా చల్లగా అయిపోయింది. అలాంటి దాని దగ్గర్నుంచి నువ్వేం "ఎక్స్ పెక్ట్" చేస్తావు ప్రభా? దానికితోడు నీ తొందరపాటు. నిజంగా ఆ నెలరోజులూ ఎంత నరకం అనుభవించానో..... నాలో ఏదో తప్పుందేమో అన్న భయం. అందరిలాంటి ఆడదాన్ని కాదేమో అన్న అనుమానం - ఏమీ తెలియకపోవడం ఎంత బాధాకరం!
   
    ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం

    పెళ్ళయిన నెలరోజులకు!
   
    కిన్నెరసాని పక్క గెస్ట్ హౌస్ లో అద్దాల గదిలో వెన్నెల నిండుగా లోపలి పడుతూన్న సమయాన.... పెద్ద పెద్ద చెట్లనీడలు నిశ్శబ్దంగా మనని గమనిస్తూన్న సమయాన....చంద్రుడి తాలూకు కిరణం అద్దాల కిటికీలోంచి పక్కమీద 'ఎర్రగా' విశ్లేషించిన సమయాన..... జ్ఞాపకం ఉందా ప్రభా!
   
    ఏదో గొప్ప విజయం సాధించిన వాడిలా నువ్వు హాయిగా పడుకున్నావు. ఎందుకో తెలీదుగానీ, ఎంత ఏడుపొచ్చిందనీ! ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడుకున్నాను. నన్ను ఓదార్చాలన్న ధ్యాసే నీకు లేకపోయింది. హాయిగా నిద్రపోయావు. మళ్ళీ తరువాత గంటకి మెలకువ వచ్చింది. నువ్వేమో వెల్లకిలా పడుకుని నిద్రపోతున్నావు. (నవ్వకు) లాగ్ లా.....మొద్దులా, చాలాసేపు నిన్ను చూస్తూ కూర్చున్నాను. అరణ్యంలా రొమ్ములమీద పెరిగిన జుట్టు అక్కడ తలపెట్టి పడుకుని కళ్ళెత్తి చూస్తే - మొనదేలిన గడ్డం, ముదురైన చెంపలు. నెమ్మదిగా ముందుకు జరిగి నీకు నిద్రాభంగం కలిగించాకుండా ముద్దు పెట్టుకోవటం ఆ రోజు తారీఖూ మొదటిసారి నా అంతట నేను నిన్ను ముద్దు పెట్టుకోవటం. ఆ రోజు తారీఖూ, సమయం - అన్నీ నాకు గుర్తే మన ఈ నిస్సారమైన జీవితంలో కొద్దిగానైనా సంతోషం కలిగించేవి అలాంటి (చాలా కొద్ది) మధుర క్షణాలే.
   
    ఆ రోజు గురించి ఇప్పటికీ నన్నేడిపిస్తూ వుంటావు. చెప్పు ప్రభా! అదేమీ లేకుండా, మొదటిరోజే నేను చాలా అనుభవంతో నిన్ను సంతృప్తి పరచి వుంటే నువ్వు సంతోషించి వుండేవాడివా? ఇప్పటి ఈ క్యాజువల్నెస్ లేకుండా ఉండేదా? ఇలా నెమ్మది నెమ్మదిగా దగ్గరికి రావడం నీకు ఇష్టం లేకపోయిందా?
   
    నా పట్ల నీకు ఆసక్తి లేకపోవటాన్ని నెమ్మది నెమ్మదిగా గమనిస్తూ వస్తున్నాను. అంటే నీకు వేరే స్త్రీతో సంబంధం ఉందనిగానీ, లేక ఏ వ్యసనానికో అలవాటు పడ్డావనిగానీ నింద వెయ్యటం లేదు నేను. కానీ జాగ్రత్తగా గమనిస్తే మనింట్లో ఒక రకమైన నిశ్శబ్దం. స్మశానాల్లో వినిపించేది..... ఇక్కడా తాండవిస్తున్నట్లు అనిపించడంలేదూ? నిర్లిప్తంగా ఎవరి పని వరు చేసుకుంటూ పోవటం మొదట్లో నువ్వెంత హుషారుగా వుండేవాడివి నా పట్ల!
   
    ఏం చెయ్యను ప్రభా! అప్పటికి నా మైండ్ అంత మెచ్యూర్ కాలేదు. నా వయసెంతని అప్పుడు? పద్దెనిమిది. నువ్వు పదే పదే కోరుకోవడాన్ని వద్దనేదాన్ని నిన్ను ప్రేరేపించాల్సినంత హుషారు నాకు లేకపోయింది ఆ రోజుల్లో.
   
    నే నెప్పుడైతే మేల్కొని నువ్వున్న స్టేజిలోకి వచ్చేనో, దురదృష్టం కొద్దీ నువ్వా స్టేజీ దాటి ముందుకు వెళ్ళిపోయావు. ఇల్లూ నేను మామూలై పోయాం కానీ ఆనాడు నీలో ఎంత వేడి ఉండేదో, ఇప్పుడు నాకూ..... (అదిగో నవ్వుతున్నావ్ కదూ! ప్లీజ్ నవ్వకు) నిన్ను వూరికే చూడాలనీ, నిన్ను తాకాలనీ ఒకోసారి ఎంత పిచ్చికోర్కె పుడుతుందో అప్పట్లో నా తాలూకు ఏ చిన్న విషయమైనా నిన్నెలా కదిలించేదో..... ఇప్పుడు నాకూ అర్ధమవుతోంది. నా యీ చిన్న ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నీ సంగతి వేరు. నీకెన్నో వ్యాపకాలు.
   
    నీ వైపునుంచి సమర్ధించుకోవడానికి చాలా వుండవచ్చు. కానీ ప్రభా....ఈ పరస్పర నిందలూ సమర్ధించుకోవటాలు వద్దు. ఇద్దరం ఆలోచిద్దాం. కొద్ది సంవత్సరాల్లోనే ఒకరి కొకరం సాధారణ వస్తువులమై పోయామా? మనిస్సారం రాత్రిపూట కలుసుకోవటానికి సాయపడే సత్రం తప్ప ఇంకేమీ కాదా ఈ ఇల్లు? ఇదంతా వ్రాసినందుకు నా మీద కోపం తెచ్చుకోకు ప్రభా! ఇప్పుడు నువ్వు నన్ను సంతృప్తి పరచడంలేదని నేననను. కానీ కొంచెం ప్రేమగా, ఇంకొంచెం సరదాగా, కొంచెం దయగా చాలు. ఇంతకన్నా నాకేమీ వద్దు. నన్ను మాటిమాటికీ తీసి పడెయ్యకుండా, నన్ను అర్ధం చేసుకుంటూ.....నా ఫీలింగ్స్ ని కొద్దిగా గమనిస్తూ......అంతే! అంతకన్నా నేనేమీ ఎక్కువ కోరను.
   
    ప్రభా!
   
    పెళ్ళయిన పది సంవత్సరాల తర్వాత నేను నీకు వ్రాస్తున్న ఈ మొదటి ఉత్తరంలో నేను నీకు చెప్పగలిగేది ఒకటే! అర్ధం చేసుకుంటావా? జీవితాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మొదలుపెట్టలేం. అది అలా జరిగిపోతూనే వుంటుంది. ఇంతకన్నా ఇంకేం విడమర్చి ఏం చెప్పను?
   
                               *    *    *
   
    ముడతలు పడ్డ కాగితాన్ని సాఫీచేసి, చదివి ఇచ్చేస్తూ "ఎక్కడ దొరికింది నీకు?" అని అడిగేడు రామమూర్తి.
   
    "ఆఫీసునుంచి బైటకొస్తుంటే పై నుంచి ఉండచుట్టి విసిరేసేరెవరో, చాలా రోజుల క్రిందట" అన్నాను. "చాలా టచింగ్ గా వుంది ఆ ఉత్తరం అందుకే దాచేను."
   
    "ఆ ప్రభ అనేవాడు ఎవడో ఇడియట్ లా వున్నాడు" అన్నాడు.
   
    నేను మాట్లాడలేదు.
   
    ఇద్దరం ఇంటివైపు నడవటం ప్రారంభించేం. సాయంత్రం సిటీ బస్సులకోసం ఎదురుచూడటం కన్నా నడకే మంచిది.
   
    రెండు కిలోమీటర్లు నడవడానికి గంట పట్టింది. బాగా చీకటిపడింది.
   
    ఎప్పుడూ మాట్లాడుతూ వుండే రామమూర్తి కొంచెం మూడీగా, ఏదో ఆలోచిస్తూ వుండిపోయాడు. ఇళ్ళకి విడిపోయే టైం వచ్చినప్పుడు - ఎంతో స్ట్రగుల్ పడి, చెప్పాలనే నిర్ణయానికి వచ్చినవాడిలా, "కొంచం ఆలోచిస్తే మా ఆవిడా ఇదే అభిప్రాయంలో వున్నట్టు వుందోయ్" అన్నాడు.
   
    అస్పష్టమైన చీకటి నీడల్లో అతడి మొహం వాడిపోయి వుంది.
   
    కొంచెం కాన్ ఫ్లిక్టు. కొంచం ఘర్షణ.
   
    నేను మాట్లాడలేదు.
   
    "గుడ్ నైట్" అన్చెప్పి అతను వెళ్ళిపోయాడు.....
   
    నేనలాగే నిలబడి వున్నాను.
   
    నేనూ అలాగే.
   
    .......అందుకేగా ఎక్కడో ఆ వుత్తరాన్ని ఇంతకాలం దాచి వుంచింది.
   
   
   
                                   -- * * * * --

 Previous Page Next Page