"ఏదోలేమ్మా! ఆ దేవుడే వున్నాడు."
"అవునవును- అందరికీ ఆ దేవుడే దిక్కు! అని కొంతసేపు భక్తితో కళ్ళుమూసి తెరిచి "ఇక్కడ మీకు బాగుంటోందా? అంది ఎంతో ఆప్యాయంగా."
"ఆ! థెరీసామ్మ ఎంతో మంచిది. తల్లీ తోడులా ఉన్నాం?"
"అంతే! అంతే! మంచివాళ్ళకు ఎక్కడైనా మంచివాళ్లే తారసపడతారు" అని కొంచెంసేపాగి శాంతమ్మ ఏమి మాట్లాడక కూచునేసరికి, తనే "ఈ మధ్య ఝాన్సీ ఎప్పుడైనా మీ ఇంటికొచ్చిందా?" అంది.
ఇంతసేపటికి ఆవిడ ఎందుకొచ్చిందో శాంతమ్మకు అర్ధమయిపోయింది. అంతటి అమాయకురాలూ, సాత్వికురాలూ కూడా నవ్వకుండా వుండలేకపోయింది. ఝాన్సీ తల్లి తడబడి "అదికాదు. ఏదో తెలిసీతెలియని వయసు- మనం పెద్దవాళ్ళం జాగ్రత్తగా వుంటే, కొంచెం రోజుల్లో వాళ్ళే మరిచిపోతారు ఇప్పుడు వాళ్ళు కూడబలుక్కొని రివ్వున ఎగిరిపోతే, మీకు మంచిదా? మాకు మంచిదా?" అంది. ఏ మంత్రం శాంతమ్మమీద బాగాపనిచేసేంది. ఇంటికంతకూ ఏకైక ఆధారమయిన కొడుకు కులంకాని కులం పిల్లను చేసుకొని, తమకు కాకుండా పోతే...... శాంతమ్మ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది.
"ఝాన్సీ ఇక్కడికి రాలేదమ్మ! ఆ పిల్లకి మంచీ, చెడ్డా తెలవదూ?"
"తెలీదని కాదు. నిజానికి మా ఝాన్సీలాంటి బుద్ధి మంతురాలు మరొకతెలేదు. కాని వయసు! మన జాగ్రత్తలో మనము వుండాలి- ఈ సారి ఎప్పుడయినా ఇక్కడికొస్తే- వస్తుందనికాదు౦ వస్తే......బుద్ధి చెప్పి పంపండి."
"అలాగే!"
ఝాన్సీ తల్లి వెళ్దామని లేస్తుండగా ఎవరో కరపత్రాలు పంచుతూ ఓ పత్రం ఆ ఇంట్లోకి కూడా వేసారు. కాని, చదవడం మాత్రం రాలేదు. ఆ కాగితం అటూ ఇటూ తిప్పిచూసి "ఏంటో ఇది" అది ఝాన్సీ తల్లి అది అందుకొని చదివి "ఈ ఎం.ఎల్. ఎ. గారికి సన్మానం చేస్తున్నారుట? హరిజనులకి సేవ చేసినందుకు. చేస్తున్నందుకూ- ఈ సారి బ్రహ్మొత్సవాలకి గుళ్లో హరిజనులని ప్రవేశ పెడుతున్నారట! ఇదిగో, ఇటుపక్క ఫోటోకూడా వుంది. ఆ ఫోటో చూడగానే శాంతమ్మ కళ్ళింత చేసుకొని "ఈ బాబుగారు! నాకు బాగా తెలుసు" అంది. ఝాన్సీ తల్లి కుతూహలంగా "ఎలా తెలుసు?" అని అడిగింది.
"అప్పుడోసారి మా ఊరోచ్చాడు. సరాసరి మా ఇంట్లో కొచ్చి మా నులక మంచం మీదా కూచున్నాడు. నాకు బాగా గుర్తు-" నేను మీ వోణ్ణి, మీరంతా నా వాళ్లు! మీ కేది కావలసినా నన్నడగండి. కొండమీది దేవుణ్ణయినా మీ కోసం కిందికి దింపిస్తాను. మీ కాల్లో ముల్లు గుచ్చుకున్నా, నా గుండెల్లో గునపం దిగినట్లుంటుంది" అన్నాడు. అప్పుడందరూ ఏంటేంటో అడిగారు. మా చిన్నాడు. "మీ అందరి ఓట్లు నాకివ్వండి. మీకు మేలుచేసే అవకాశం నాకివ్వండి. మీ వోణ్ణి" అన్నాడు.
సంబరంగా ఫోటో చూస్తూ చెప్పుకుపోతోంది శాంతమ్మ- ఝాన్సీ తల్లి తన కుర్చీ శాంతమ్మ కుర్చీకి కొంచెం దగ్గరగా జరుపుకుంది.
"శాంతమ్మతల్లీ! నిజంగా ఈయన నువ్వేదయినా అడిగితే చేస్తాడా?"
"చేస్తాడు బాపనమ్మా! ఎంత మంచోడనుకున్నావ్?"
"అయితే, నువ్వు నాకో సహాయం చేయగలవా? శాంతమ్మతల్లీ చచ్చి నీ కడుపున పుడతాను."
"అయ్యో, అయ్యో! అంతమాటనకమ్మా? చేసే దేవైనా ఉంటే తప్పకుండా చేస్తాను."
ఝాన్సీ తల్లి అలవాటు ధోరణిలో "చచ్చి నీ కడుపున పుడతాను" అందేకాని, దాని అర్ధం ఉద్దేశించి అనలేదు. అంచేత నాలుక కరచుకొని "నీ మంచి తెలుసు కనుక అడుగుతున్నాను. ఆ ధర్మరాజే ఉంటే, ఇన్ని ఇబ్బందులు లేకపోను, దేవుడిపూజలన్నీ ఆయన చేతిమీద జరిగేవి. మొక్కు బడుల కొచ్చే వాళ్ళంతా ఆయన ఏం చెబితే అది వినేవారు. ఆ రోజులు పోయాయి. కాని, మా వాడున్నాడు. ఇంటర్ చదువుతున్నాడు. హాలెండ్ వాళ్ళు ఎవరో, బాగా చదివే పిల్లలకి స్కాలర్ షిప్ లిస్తున్నారట! ఎవరయినా పూనుకొని ప్రయత్నిస్తే వస్తున్నాయిట! కొందరికి వచ్చాయిట! మా వాడు అన్నిట్లో ఫస్టే! ఎలాగయినా కాస్త స్కాలర్ షిప్ వచ్చేలా చూసిపెట్టు శాంతమ్మ తల్లీ!"
"అయ్యో! ఈ మాత్రందానికి అంత చెప్పాలా? మీ అబ్బాయికి స్కాలర్ షిప్పోస్తే నాకు సంతోషమే! ఎం. ఎల్. ఎ గారి దగ్గరికి తీసికెళ్తాను, అదేంటో నువ్వు చెప్పుకొందువుగాని. అదిసరేకానీ, బాపనమ్మా! మీ ఆయన దేవుడి పూజలన్నీ చేయించేవాడా?"
"అవును"
"ఇప్పటికీ పూజారయ్య నువ్వు చెపితే వింటాడా?"
"ఆ! వింటాడు. గుళ్ళో పూజారులందరికీ నేనంటే చాలా గౌరవం" బుకాయించేసింది.
"అయితే బాపనమ్మా! మా పెద్దబ్బాయికి ఉద్యోగ మొస్తే పూజ చేయిస్తానని మొక్కుకున్నాను, చేయించి పెడతావా?"
"ఒకటి కాదు- లక్ష పూజలు చేయించి పెడతాను దానికేం భాగ్యం!"
శాంతమ్మ పొంగిపోయింది.
"ఆ కాగితంలో ఎం. ఎల్. ఎ. గారెప్పుడొస్తారనుందీ?"
"ఎల్లుండి"
"అయితే ఎల్లుండి ఇక్కడికిరా! ఇద్దరం కలిసి ఆయన దగ్గరకి పోదాం."
"అలాగే నీ కడుపు చల్లగా పదికాలాలపాటు చల్లగా బ్రతుకు" ధారాళంగా ఆశీర్వదించేసి, తన సంచి తీసుకొని ఇంటి కొచ్చేసింది.
ఎం. ఎల్. ఎ. గారు ఊళ్లోకి వచ్చేసారు. ఊళ్ళో మీటింగులూ, ఉపన్యాసాలూ మొదలయ్యాయి- ఒక పక్క గుళ్ళో సినిమా రికార్డుల భక్తిగీతాలు.
శాంతమ్మ ఝాన్సీ తల్లిని తీసుకొని ఎం.ఎల్.ఎ.గారు బస చేసిన గెస్ట్ హౌస్ కి వచ్చింది. ఇలా వెళ్తున్నట్టు కుమార్ కి చెప్పలేదు ఏమంటాడో అని.
యమ్మెల్యేగారు గదిలో వున్నారు. బయట అనేక మంది పడిగాపులుపడి వున్నారు. కొద్దిసేపటికి ఆయన గది బయటికి వచ్చారు. అందరికీ నమస్కరించి చిరునవ్వుతో మాట్లాడుతున్నాడు. శాంతమ్మ ముందుకొచ్చి "బాబుగారూ....." అని చెప్పబోయింది. శాంతమ్మ వాలకం కడగంటితో చూసి, ఆవిడ మాటలు వినిపించుకోకుండా మరొకరివైపు తిరిగిపోయారు యమ్మెల్యేగారు.పాపం, శాంతమ్మ "బాబుగారూ" అంటూ మరో వ్యర్ధప్రయత్నం చేసింది. కానీ అంతలో యమ్మెల్యేగారి కారు వచ్చింది. ఆయన అందరికీ క్షమాపణలు చెప్పుకొని పోయి కారులో కూచున్నారు. కారు రయ్యిమని దూసుకుపోయింది. తెల్లబోయి నిలబడిపోయిన శాంతమ్మని చూసి "ఇదేనా, తెలుసు అన్నావు?" అంది ఝాన్సీ తల్లి.