వృద్దాప్యంలో ఉన్న తన గుండె పనికిరాదు. ఈ ప్రపంచంలో తమకు ఉన్న ఒకే ఒక గుండెను దానం చేసేవాళ్ళెవరుంటారు?
అప్పటికే చాలా ప్రకటనలిచ్చాడు. పెద్ద మొత్తంలో ఆఫర్ చేశాడు. కానీ తన కూతురికి గుండెను దానంచేసే దాతలే కరువయ్యారు. డబ్బు ఏ పని అయినా చేయిస్తుందని ఎవరన్నారు? మనిషిని బ్రతికించలేని మనీ.... తనకు ఎంత వుంటే ఏం లాభం?
బ్లడీ కలర్ కరెన్సీ.... కసిగా అనుకున్నాడు మహాపతి.
తను ఆఫర్ చేసే పెద్ద మొత్తానికి, అనారోగ్యం వున్నవాళ్ళు, బ్లడ్ గ్రూప్ కలవని వాళ్ళూ వచ్చారు. ఉపయోగమేమిటి? నో యూజ్...?
"ఏంటి నాన్నా... ఆలోచిస్తున్నావు?"
"ఏమీ లేదమ్మా... ఒకరి ఆయుష్షుని మరొకరికి ధారపోసే వరం దేవుడు మనిషికి ఇస్తే బావుండేది. కనీసం సైన్స్ అయినా ఆ దశలో ముందంజ వేస్తే బావుండు".
అద్వైతి మాట్లాడలేదు. మౌనంగా కాన్వాసు దగ్గరికి వెళ్ళింది. కుంచెను చేతిలోకి తీసుకుంది.
బాధయినా, సంతోషమైనా కన్నీటి చెమ్మయినా ఆమె మౌనంగా కుంచెను ఆశ్రయిస్తుంది.
ఆమె చేతివేళ్ళు బ్రష్ ని పట్టుకున్నాయి.
మౌనంగా మహాపతి అక్కడ్నుంచి కదిలాడు.
* * *
"మేడమ్! మీకు కంట్రీక్లబ్ నుండి ఫోన్..." అంటూ అందించింది కాదంబరి.
"హల్లో!"
"హల్లో! విరజగారా?"
"యస్...."
"మేడమ్! రేపు మన క్లబ్ మెంబర్స్ అందరికీ కార్ రేసింగ్.... 'ట్రెజర్ హంట్' వుంది. సర్క్యులర్ మీకు ఈరోజు పోస్ట్ లో వస్తుంది. కారు రేసింగ్ లో ఎవ్విరియర్ ప్రైజు గెల్చుకునే మీరు, ఈసారి కూడా పార్టిసిఫేట్ చేసి, మమ్మల్ని ఆనందింపచేయాలి. ప్లీజ్ మేడమ్! తప్పక రావాలి. క్లబ్ దగ్గర్నుండి నైనో క్లాక్ కి ట్రజర్ హంట్ స్టార్ట్ అవుతుంది. వస్తారు కదూ!" రిక్వెస్టింగ్ గా ఆమె అడుగుతోంది అవతలి నుండి.
విరజ అభినయ్ వైపు చూసింది. అతను ఏదో ఫైల్ చూసుకుంటున్నాడు దీర్ఘంగా. అతను విననే లేదు. వెళ్ళాలా? వద్దా! అన్న మీ మాంసలో పడింది విరజ.
"ప్లీజ్ మేడమ్!"
కిందటిసారే అభినయ్ కోప్పడ్డాడు. మళ్ళా ఇప్పుడు...
"సరే! చూస్తాను" అంది విరజ కన్ ఫర్మ్ చేయకుండా.
"నో... మేడమ్... మీరు రావాలి....మీరుంటేనే రేసింగ్ లో థ్రిల్లింగ్ వుంటుంది".
ఇంక కాదనలేక పోయింది విరజ.
"ఓ.కె. వస్తాను".
"థాంక్యూ.... వెరీమచ్....' ఫోన్ డిస్ కనెక్ట్ అయింది.
విరజ ఫోన్ పెట్టేసింది.
అభినయ్ ఇంకా బిజీగా ఫైల్ చూడ్డంలోనే ఉన్నాడు. కాదంబరి అడిగింది..."ఏమంటున్నారు మేడమ్" అని.
"ఏముంది! 'ట్రెజర్ హంట్' వుందిట. కంట్రీక్లబ్ లో పార్టిసిపేట్ చెయ్యమని" అంది.
ఈసారి అభినయ్ తలెత్తాడు.
"ఏవిటి?"
చెప్పింది విరజ.
"నథింగ్ డూయింగ్..... లాస్ట్ టైం కూడా వద్దంటే వెళ్ళావు. నేనొప్పుకోను".
"ఈ ఒక్కసారికి వెళ్ళనీ అభీ!"
"నీ రాష్ డ్రైవింగ్ అంటేనే భయం నాకు. ఇక రేసింగ్ అట. రేసింగ్...నెవ్వర్... నే వెళ్ళనివ్వను."
"పోన్లెండి సార్! మేడమ్ పాపం సరదా పడుతున్నారు కదా! పైగా ఫ్రైజ్ కూడా తనకే వస్తుంది గ్యారంటీగా!" అంది కాదంబరి.
"అవసరం లేదు. ఆ ఫ్రైజ్ కి డబుల్ ఎమౌంట్ నేనిస్తాను".
"నేనేం డబ్బుకోసం పార్టిసిపేట్ చెయ్యడం లేదు" విరజ కోపంగా అంది.
"మరి?"
"థ్రిల్లింగ్! జస్ట్ అదో ఎక్స్ పీరియన్స్!"
"వద్దు విరజా! అలాంటి కారు రేసింగ్ లు నాకిష్టం వుండదు. నీకేమైనా అయితే, ఐ కాంట్ బేర్.... ప్లీజ్! ట్రైటు అండర్ స్టాండ్ మీ..."
విరజ ఏం మాట్లాడలేదు.
"సార్! పోనీ నేనూ తోడుగా వెళ్ళనా మేడమ్ కి?"
"మీ ఇష్టం ఉన్నట్లు చేయండి" అంటూ కోపంగా అవతలకి వెళ్ళిపోయాడు అభినయ్...
"ఎందుకో మేడమ్! సార్ కి ఇష్టం లేనిపని...." అంది కాదంబరి.
"రేపటి సంగతి కదా! చూద్దాం లే..." అంది విరజ.
* * *
మర్నాడు ఉదయానికి ఎలాగైతేనేం అభినయ్ ని ఒప్పించి బయలుదేరింది విరజ కారు రేసింగ్ కి.
వెంట కాదంబరిని కూడా తీసుకువెళ్ళింది. అభినయ్ సలహామీద.
అతనికి అర్జెంటు పని వుండడంతో ఆగిపోయాడు.
తొమ్మిది కల్లా... కంట్రీక్లబ్ చేరుకున్నారు. అప్పటికే పార్టిసిపెంట్స్ చాలామంది వచ్చారు.
'ట్రెజర్ హంట్' రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఎక్సప్లయిన్ చేశారు ఆర్గనైజర్లు.
తొలుతగా కంట్రీక్లబ్ నుండి స్టార్ట్ అవుతుంది హంటింగ్. క్లూల ద్వారా అన్నీ చేదించుకుంటూ ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి టైంటీఫైవ్ థవుజండ్ క్యాష్ మరియు గిఫ్ట్ యాంపర్స్.
* * *
రేస్ మొదలైంది. అభినయ్ కు టెన్షన్ గా వుంది. డ్రైవింగ్ లో విరజ ఎంత ఫాస్టో తెలుసు. అయినా టెన్షన్ గానే వుంది.
విరజ చాలా కాన్ సెంట్రేషన్ గా డ్రైవ్ చేస్తోంది. తను ఓడిపోదన్న నమ్మకం. అయినా ఈ రేస్ లో పాల్గొన్న వాళ్ళంతా ప్రొఫెషనల్సే.
రేస్ లో పాల్గొన్న కార్లన్నీ గాలిలో తేలుతున్నట్టు వెళుతున్నాయి. అభినయ్ తన కారుకు ఎదురుగా నిలబడి, తన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తోంది.
ఆ మాత్రం కిక్ చాలు ఆమెకు. ఆమెలో హుషారు పెరిగింది. యాక్సిలేటర్ ఆమెకు దాసోహమంది. స్టీరింగ్ విష్ణుచక్రమే అయింది. ఆమె సున్నితమైన వేళ్ళు చకచక కదులుతున్నాయి.
ఆ దారికి రెండు వైపులా ఉన్న జనం యాంగ్జయిటీగా చూస్తున్నారు. ఒక్క విరజ తప్ప, అంతా పురుషులే ఒక్కో కారును దాటుకుంటూ స్పీడుగా వెళ్తోంది.
వన్...టూ...త్రీ...
కౌంట్ డౌన్ మొదలయింది.
త్రీ...టు... వన్... జీ....రో...
ఒక్కసారిగా అభినయ్... 'హిప్.... హిప్.... హుర్రే" అని అరిచాడు.
వి..ర..జ... గె...లి...చిం...ది....
* * *
"చూశావా! అభీ! నా డ్రైవింగ్ ని అందరూ ఎంత మెచ్చుకుంటున్నారో?" చెయ్యి గిల్లుతూ ... అంది విరజ.
ఆ సాయంత్రం క్లబ్ మెంబర్స్ అందరి సమక్షంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పార్టీ వున్నాయి.
దానికే అటెండ్ అయ్యారు కాదంబరి, విరజ, అభినయ్.
"ఆ! నీ డ్రైవింగ్ సరే, నువ్వు సరే, నీ కేమన్నా అయితే.. నాకేం కాదు...ఏదో లక్ బావుండి... నీకేం కాలేదు. అయినా మగరాయుడిలా కారు రేసింగ్ లో పాల్గొనడం ఏమిటి?" కోపంగా అన్నాడు అభినయ్.
"నేను గెలిచానని నీకు కుళ్ళు" మరింత గట్టిగా అతని చేతిని గిల్లుతూ అంది విరజ.
"ఆ! మరే..." అన్నాడు వెక్కిరిస్తూ.