ఆమె మాట పూర్తీ కాకుండానే పెద్ద గాలి దుమారం చెలరేగింది. ఎండుటాకులు గిరగిరా తిరుగుతూ ఆకాశంలోకి లేచాయి. ఇసుక రేణువు ఒకటి వచ్చి భరత్ కంట్లో పడింది.
ఎండిపోయిన చెట్టు ఒకటి వాళ్ళ కళ్ళ యెదుటనే ఫెళఫెళ శబ్దం చేస్తూ విరిగి, టెలిఫోన్ తీగెల మీద పడింది. టెలిఫోన్ స్తంభం మెలికలు తిరిగి ఒరిగి పోయింది. ఎదురుగా ఉన్న ఎలేక్రక్ పోల్ మీద భగ్గుమని మంట లేచి, "ఫట్" మని శబ్దం వచ్చింది.
వెంటనే దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. గాడాంధకారం అలముకుంది. వడగళ్ళ వాన మొదలయింది.
"మైగాడ్! వడగళ్ళు పడితే ద్రాక్షపళ్ళు దెబ్బతింటాయి" అంది సుదీర.
మేనేజరు రెయిన్ కోటు తీసుకుని కంగారుగా పరిగెత్తి వచ్చాడు. కోటు ఆమెకి అందించబోయాడు.
అందుకనే ప్రయత్నం చెయ్యలేదు సుదీర.
"ఏం చేద్దాం అమ్మాయిగారూ?" అన్నాడతను వణికిపోతూ. ఆ వణుకు చలివల్లో, భయం వల్లో తెలియడం లేదు.
"ఏం చేద్దాం? తోటకంతా రెయిన్ కోటు కప్పుదామా? చేసేదేమీ లేదు" అంది చిరాగ్గా.
"లక్ష రూపాయల పంట........."
"పోనీ!"
"మీకు రెయిన్ కోటు........"
"నువ్వెళ్ళు!"
మేనేజరు ఆశ్చర్యంగా చూస్తూ వెళ్ళిపోయాడు.
వెంటనే చిన్నపిల్లలా వంగి ఉత్సాహంగా వడగళ్ళు ఏరడం మొదలెట్టింది సుదీర. "రండి భరత్, సాయం చెయ్యరూ?"
భరత్ కూడా వడగళ్ళు ఏరాడు. కొన్ని వాళ్ళ తలల మీదా, వీపుల మీదా పడ్డాయి.
నవ్వుతోంది సుదీర. కాటేజీ తిరిగి వచ్చేసరికి ఇద్దరూ తడిసి ముద్దయిపోయారు.
కప్ బోర్డులో చూసింది సుదీర. తనవి ఒక చీరా, సూడ్ జీన్స్ షర్టు ఉన్నాయి. మగవాళ్ళు బట్టలేమీ లేవు.
ఈ చీరని మీరు లుంగీగా కట్టుకోండి. నేను జీన్సు షర్టు వేసుకుంటాను" అంది సుదీర.
పూలపూల ఆ డిజైన్లతో ఉన్న చీరని లుంగిలా కట్టుకున్నాడు భరత్. పైన షర్టు, బనీను లేవు. కంక్రిట్ బ్లాక్ లాగా బలిష్టంగా కనబడుతోంది అతని చాతి. గుండెల మీద గుబురు వెంట్రులు.
అంతకుముందు ఎవరూ చూడకుండా ఆ ఇంట్లో ప్రవేశించిన నల్లత్రాచు ఒకటి చూరు పట్టుకుని పాకుతూ ఫానుకి చుట్టలా చుట్టుకుంది.
వెచ్చటి సువాసనలు వెదజల్లుతున్న ట్రే తెచ్చి, డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు హనుమాండ్లు.
మూతలు తీసి చూసింది సుదీర. వెజిటబుల్ బిర్యానీ, బగారా బైగన్ అనబడే వంకాయ కూర, ఉల్లిపాయ పెరుగు పచ్చడి , డబుల్ కా మీఠా అనబడే బ్రెడ్డుతో చేసిన స్వీటూ.
అచ్చమైన హైదరాబాది వివాహ భోజనం.
"మనం కాబోయే భార్య భర్తలం అన్న సంగతి ప్రపంచానికంతా తెలిసిపోయినట్లు ఉంది" అంది సుదీర నవ్వుతూ.
భోజనం చేస్తున్నంత సేపు కన్ను నలుపుకుంటూనే ఉన్నాడు భరత్.
పాము బద్దకంగా కదలడం మొదలెట్టింది ఫాన్ మీద.
భోజనం పూర్తి అయ్యాక, "ఉండండి. నేను కంట్లో ఉదుతాను." అని అతణ్ణి లేవదీసి , మంచం మీద కూర్చోబెట్టింది సుదీర. 'ఉఫ్' మని కాసేపు ఉదింది. అప్పటికి పోకపోతే , అతను లుంగీలా కట్టుకున్న చీర కొనను నోటి దగ్గర పెట్టుకుని ఆవిరి చేసి, భరత్ కంటి మీద పెట్టింది.
ఇబ్బంది పడిపోతున్నాడు అతను.
ఆమెకు నవ్వొస్తోంది. తను ఇంత చనువుగా , దగ్గర దగ్గరగా వస్తున్నా, అతను ప్రవ్యరాఖ్యుడిలా ముడుచుకుపోయే వుంటున్నాడు. అతన్ని ఇష్టంగా చూసింది. కళ్ళు మూసుకునే ఉన్నాడు భరత్. బలమైన శరిరం అతనిది. అందులోనే ఒక రకమయినా నాజూకుతనం. దానికి తోడు పూల చీర.
తనో!
తోడలకి మృదువుగా అంటి పెట్టుకుని ఉన్న సూడ్ జీన్స్ వేసుకుని ఉంది. పైన షర్టు!
తమ స్వభావాలు కూడా అంతే! అతను ఆడపిల్లలా సంకోచంగా ఉంటాడు. తను మగవాడిలా డామినేటింగ్ గా వుండగలదు.
పైన పాము మళ్ళీ కదిలి, ఒక్కసారిగా పట్టుతప్పి, కిందకు జారి సుదీర వీపు మీద పడింది.
ఒక్క క్షణం సేపు, సుదీర రెండు జడలు వేసుకున్నట్లు కనిపించింది భరత్ కి. తరువాత పాము ఆమె చేతి మీరుగా కిందికి జారింది.
"అమ్మో! అని భరత్ మీద వాలిపోయి, అతన్ని గాడంగా వాటేసుకుంది సుదీర.
పాము జరజర పాకుతూ , కలుగులోకి దూరిపోయింది.
------------
రాత్రి ఎనిమిది గంటలయింది.
జరగబోయే దారుణం చూడలేక ప్రకృతి చలించిపోతున్నట్లు వుంది. ఊరంతా కరెంటు పోయింది. చిమ్మ చీకటి! ఫేడేలుమని ఉరుములు! మెరుపులు! జడివాన!
ఆ కారు చీకట్లో కారు నలుపు రంగులో ఉన్న దెయ్యం లాంటి పెద్ద కారు ఒకటి రత్నాకరరావు ఇంటిముందు నిలబడి వుంది. డ్రైవింగ్ సీట్లో సారధి కూర్చుని ఉన్నాడు. వెనక సీట్లో చింతకాయల బాబా, సీతా, రత్నాకరరావు కూర్చుని వున్నారు.
పసుపూ, కుంకుమా తీసుకున్నారా?" అన్నాడు బాబా.
"తీసుకున్నాం స్వామి!" అంది సీత.
"మడ్డు కత్తి?"
"ఛోటూ పదును పట్టించి తెచ్చాడు. డిక్కీలో వుంది.
"రక్తం పట్టడానికి వెండి గిన్నె ఉందా?"
"ఉంది స్వామి!"
"మరింక ఆలస్యమెందుకు? పదండి!"
కారు బయలుదేరింది.
` --------------
పేరా సైకాలజీలో ఇ.ఎస్. పి. అని ఒకటి ఉంది. ఎక్స్ ట్రా సేన్సరి పెర్ సెప్షన్ అంటారు. అతీంద్రియ శక్తి అనొచ్చు దానిని. జరగబోయే కీడు కొంతమందికి ముందరే తెలుస్తుందంటారు.
అటువంటిది నిజంగా ఉందొ లేదో తెలియదు గానీ, దయాకర్ ఎందుకో ఆ రాత్రి హఠాత్తుగా ప్రాణ భయం లాంటిది కలిగింది. ఒక వైపు వర్షం ధారగా పడుతున్నా, చెమట పట్టి షర్టు తడిసిపోయింది. దెయ్యాలు నవ్వుతున్నట్లు చింతల తోపులో నుంచి రివ్వున వీస్తూ శబ్దం చేస్తోంది గాలి. జుట్టు విరబోసుకున్న పిశాచాలలాగా తలలు ఊపుతున్నాయి చింతచెట్లు.
అతను సన్నగా వణికాడు. ఎందుకు తన మనసు ఇవాళ ఇలా వుంది?
బేజారెత్తిన గుండెతో కాసేపు అటూ ఇటూ పచార్లు చేసి, చివరికి అక్కడ ఇంక ఉండలేనని నిశ్చయించుకుని, గొడుగు తీసుకుని సినిమా దియేటర్ వైపు నడిచాడు.
అప్పటికి గండం గడిచింది.
-----------
చిక్కటి చీకటి పరదలా, సుదీర జుట్టు తల, మొహాన్ని కప్పేస్తూ ఉంటే , హఠాత్తుగా మెలకువ వచ్చింది భరత్ కి.
తన మీద మల్లెపూల కుప్ప పోసినట్లు బరువుగా.
ఎవరు ఇది?
సుదీర!
ఉలికిపడి కదిలాడు. సుదీర అతని మీద నుంచి బద్దకంగా పొర్లి, పక్కన పడుకుంది. మృదువుగా, కఠినంగా , నగ్నంగా తగులుతోంది ఆ అమ్మాయి ఒళ్ళు!
ఊపిరాగిపోయినట్లయింది భరత్ కి. తన ఒంటివైపు చూసుకున్నాడు. తన ఒంటిమీద బట్టలు లేవు!
అతనికి జరిగినదంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది. తన కంట్లో నలక పడితే సుదీర ఆవిరి పట్టడం, ఆమె మీద పాము పడడం- తరువాత-