13
సమయం 9-30 కావొస్తూంది.
ఆ సాయంత్రం ప్రెస్ మీటింగ్ కి ఏర్పాటు చేస్తున్నాడు ఒక డైరెక్టరు. దేశద్రోహుల కార్యకలాపాలకు రవితేజ టెక్స్ టైల్స్ ని వాడుకోవటం తమకు చాలా మనస్తాపం కలిగిందని పేపర్ స్టేట్ మెంట్ ఇస్తాడు సాయంత్రం. అరగంట క్రితం వరకూ తామెలా దీన్నించి తప్పించుకోవాలా అన్న ఆలోచనలో వున్నవారు, ఇప్పుడు దీన్ని ఖండిస్తూ మాట్లాడతారు. అదీ సొసైటీ.
ఒక చిన్న వార్త పేపర్లో రాకుండా వుండటానికయ్యే ఖర్చు యాభైవేలు అది సామాజిక గౌరవం విలువ!
టైమ్ 9-45 అయింది.
ఈ విజయాన్ని పంచుకోవటం కోసం సాయంత్రం పార్టీ ఏర్పాటు చేస్తున్నాడు మరో డైరెక్టర్. అంతా హడావుడిగా వుంది.
పది అవుతున్నకొద్దీ రవితేజకి టెన్షన్ ఎక్కువ అవుతూంది. సాధించినది ఒకవైపు, జరగబోయేది మరొకవైపు.
పదికి ఇంకో పది నిమిషాలుందనగా అతడు హోటల్ కి బయలుదేరాడు. కారు పార్కింగ్ లో ఆపి, రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, లాంజ్ లో కూర్చున్నాడు. అయిదు నిమిషాలు గడిచాయి. అతడు అసహనంగా వాచీ చూసుకున్నాడు.
సరిగ్గా పది అయింది.
ఆమె ఎక్కడకు వస్తానని వ్రాసింది? రిసెప్షన్ దగ్గరకా? కాఫీ బార్ కా? లంచ్ రూమ్ కా?
అతడు వడివడిగా అన్నీ వెతికాడు.
10 - 10 అయింది.
ఈ లోపులో ఆమె రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఎదురు చూస్తుందేమో అన్న అనుమానం కలిగింది. మళ్ళీ హడావుడిగా అక్కడికొచ్చాడు. అక్కడ నలుగురైదుగురు మొగవాళ్ళు తప్ప ఎవరూ లేరు. క్షణాలు గడుస్తున్నకొద్దీ అతడికి ఆతృత ఎక్కువవుతూంది.
పదింపావు...
పదిన్నర...
అతడు ఉత్తరం మరోసారి చదువుకున్నాడు. మరోసారి అన్నిచోట్లకీ వెళ్ళి చూశాడు. ఆమె జాడలేదు.
సమయం నెమ్మదిగా కదులుతూంది. అతడికి ముళ్ళమీద కూర్చున్నట్టు వుంది. వాళ్ళ కార్ల నెంబర్లు అతడికి తెలీదు. పార్కింగ్ ప్లేస్ కి వెళ్ళి చూశాడు. కారేదీ లేదు. తిరిగి రిసెప్షన్ కి వచ్చాడు. ఆమె జాడలేదు.
అతడికి పిచ్చెక్కుతున్నట్టు అనిపించింది.
పదకొండున్నర....పన్నెండు.
అతడు ఫోన్ చేద్దామనుకున్నాడు. ఆమె వచ్చి తను కనపడక తిరిగి వెళ్ళిపోయిందేమో అన్న అనుమానం. ఆమెమీద కాస్త కోపం కూడా వచ్చింది. ఉట్టి 'తాజ్' అని వ్రాయక- సరిగ్గా చోటు కూడా వ్రాయొచ్చుగా, అనుకున్నాడు.
ఏదో చేతివరకూ వచ్చి ఆగిపోయిన ఫీలింగు! ఊరించింది ఊహించుకున్న తరువాత నిజం కాకపోతే కలిగే ఉక్రోషం ఎవరిమీదో తెలియని కోపం. అసహనంగా చాలాసేపు అటూ ఇటూ కదిలాడు.
పన్నెండున్నరకి ఇక లాభం లేదనుకుని ఇంటికి బయల్దేరాడు.
కొద్దిసేపు తటపటాయించి, రిసీవర్ తీసి నెంబర్ డయల్ చేశాడు. అవతలివైపు నుంచి ఫోన్ రింగవుతున్న ధ్వని, దాన్ని మించి అతడి గుండెలు కొట్టుకుంటున్న ధ్వని.
అర నిముషం తరువాత అట్నుంచి ఎవరో రిసీవర్ ఎత్తారు.
అతడు ఊపిరి బిగపట్టాడు.
"హల్లో-" అట్నుంచి తీయటి కంఠం వినపడింది.
"హలో" అన్నాడు.
"మిసెస్ శర్మ హియర్ ఎవరు కావాలండీ?"
"నేనూ-రవిని..."
అతడింకా ఏదో చెప్పబోతూ వుంటే ఫోన్ కట్ అయింది. అతడు చేతిలోని రిసీవర్ వేపు చూసుకున్నాడు. ఆమె ఫోన్ కట్ చేసిందన్న వాస్తవం అతడిని మరింత ఉక్రోషంతో నింపింది. మళ్ళీ డయల్ చేశాడు- ఈసారి మొగ కంఠం "శర్మని మాట్లాడుతున్నాను" అని వినిపించింది.
ఫోన్ పెట్టేశాడు.
మరో గంటవరకూ అతడికి ఏం చెయ్యాలో తోచలేదు. బహుశా ఆయన పక్కనుండబట్టి ఫోన్ లో మాట్లాడటం ఇష్టంలేక పోయి వుండవచ్చు.
మాధవి ఇంట్లో లేదు. ఎక్కడో 'ఫ్లవర్ షో' వుందంటే వెళ్ళింది. ఇల్లంతా నిర్మానుష్యంగా వుంది. అతడు బెడ్ రూమ్ వరకూ కూడా వెళ్ళే ఓపికలేనట్టు ముందు హాల్లోనే సోఫాలో పడుకున్నాడు.
పదిహేను సంవత్సరాల క్రితం ఆ సంఘటనని మననం చేస్తూ పడుకున్నాడు. అది నిద్రకూడా కాదు. ఊరికే కళ్ళు మూసుకున్నాడు.
రెండున్నర అవుతూ వుండగా ఫోన్ మ్రోగింది. చటుక్కున ఎత్తాడు శర్మగారు.
"ఏమయ్యావ్ ప్రొద్దున్నించీ?"
అతడు మాట్లాడలేదు.
"నీ కెలా థాంక్స్ చెప్పాలో అర్ధంకావటం లేదోయ్. రాత్రంతా నిద్రలేదు. తొమ్మిదిన్నరకి మన డైరెక్టర్లు చెప్పేదాకా నాకు తెలీదు. నీ కోసం అడుగుతే ఇప్పుడే వెళ్ళిపోయావన్నారు. నువ్వే స్వయంగా చెప్పి వుంటే బావుండేది. చాలా గొప్పగా ప్లాన్ వేసావ్...."
అతడు వినటం లేదు. ఆమె తప్ప మిగతా ఏ ఆలోచనయినా నిరాసక్తంగానే ఉంది.
".....ఏమిటి ఫోన్ సరీగ్గా పని చేయటంలేదా?"
"ఏ.....ఏమి.....టి?"
"నేను చెప్పేది వినపడుతుందా?"
"ఆ!"
"ఏడింటికి వెళ్ళిపోయావు హడావుడిగా అన్నారు. ఇంకేమైనా ప్రాబ్లెమ్మా."
"అబ్బే అటువంటిదేమీలేదు. మీరెక్కన్నించి?"
"ఆఫీసునుంచి, వస్తావా?"
"ఇంకో గంటలో వస్తాను."
ఆయన ఫోన్ పెట్టేశాడు. రవితేజ వెంటనే ఇంటికి డయల్ చేశాడు. ఆమే ఎత్తింది. "హలో...." అంది.
"నేనూ రవితేజని."
వెంటనే కట్ అయింది ఫోన్.
ఆ విషయం తెలుసుకుని, పెద్ద చప్పుడుతో తనూ పెట్టేశాడు. అతడికి కసిగా వుంది. ఆమె ఎందుకిలా చేస్తుందో అతడికి అర్ధంకాలేదు.
ఆ క్షణాన డ్రైవ్ చేసుకుంటూ ఆమె ఇంటికి స్వయంగా వెళ్ళి ఎందుకు ఇలా నాతో ఆడుకుంటున్నావు అని ఆడగాలనిపించింది. ఎందుకిలా వూరించి, తిరిగి ఏమీ తెలియనట్టు వూరుకుంటున్నావు అని నిలదీయాలనుకున్నాడు.
అసలా ఉత్తరం ఆమె వ్రాయలేదేమో అన్న అనుమానం వచ్చింది. కానీ, ఇంత వివరంగా ఆనాటి సంగతులు తెలిసినవారు ఎవరూ లేరు. అదీగాక శర్మగారి రెండో భార్య తండ్రి ఒకప్పుడు ఎమ్మెల్యే అనీ, బాగా చితికిపోయాడనీ కూడా ఎవరో చెప్పుకుంటూ వుండగా విన్నాడు.
మరెందుకామె ఇలా ఫోన్ కట్ చేస్తూంది. తనతో మాట్లాడటానికి ఎందుకు నిరాకరిస్తోంది?
రెండ్రోజులపాటూ ఈ మధనతోనే గడిపాడు. ఎప్పుడూ అదే ఆలోచన. ఆఫీసు విషయాల్లో నిర్లక్ష్యం ఎక్కువైంది. ఆమెని బలవంతంగానైనా కలుసుకోవాలన్న కోర్కెని నిగ్రహించుకోవటం కష్టమైంది. ఇలా వుండగా ఆ మరుసటిరోజు పోస్టులో ఉత్తరం వచ్చింది. అదే చేతి వ్రాత.
వణికే చేతుల్తో గబగబా దాన్ని విప్పేడు. అతడు తన జీవితంలో ఎప్పుడూ అంత అలజడీ, ఆతృత ఫీలవలేదు.
ఉత్తరంతో పాటూ గులాబీ పూరేకులు పడినయ్ మొదట. రవి ఆత్రంగా ఆ ఉత్తరాన్ని విప్పి చదవటం ప్రారంభించాడు.
రవీ,
ఈ ఉత్తరం చదివి నువ్వు నన్ను అసహ్యించుకుంటావనీ, నా మీద అమితమైన కోపం వస్తుందని నాకు తెలుసు. "ఏమిటి ఈమె! మాటమీద అసలు నిలబడలేదు" అని తిట్టుకుంటావని కూడా తెలుసు. కాని అశక్తురాలిని, క్షమించు.
ప్రతి స్త్రీ చుట్టూ ఒక నైతిక విలువల లక్షణరేఖ వుంటుందనుకుంటున్నాను. దీన్ని పురుషుడుగానీ, సమాజంగానీ నిర్మించలేదు. స్త్రీ తన చుట్టూ తనే ఏర్పరచుకుంటుంది. దీన్నించి బయటపడటం అంత సులభం కాదు. ఎన్నో సంవత్సరాలుగా మనసుతో సత్సంబంధాలు లేక, ఇంట్లో సుఖంలేక - ఈ గీత దాటదామనుకున్నాను. ఉహు కాదు. కేవలం అదొక్కటే కారణం కాదు నువ్వు కూడా నా అలజడికి కారణమే.
లోపల్నుంచి ఉబికి వచ్చే లావా- అగ్నిపర్వతాన్ని చేదించుకుని బైటపడినట్టు ఈ విలువల వలయాన్ని ఛేదించుకుని కోర్కె బయటపడి నాచేత నీకు ఉత్తరం వ్రాయించింది.