గంటల తరబడి ఆమెని చూస్తూ కూర్చుండేవాణ్ణి, కాలం తెలిసేది కాదు. ప్రేమ అంటే అదేనేమో, ఎందుకో నాకు తెలీదు కాని, ఆమె ఎప్పుడూ నాకు కొత్తగానే వుండేది. ఆమెని మొట్టమొదటిసారి స్పృసించటం కూడా నాకొక మరువరాని అనుభూతే. ఆ రోజు నాకింకా జ్ఞాపకం ప్రతీ సంఘటనా - ప్రతీ ఆలోచనా-
"ఈ లేక్ వ్యూ చాలా బాగుందికదూ!"
తలూపాను.
తెరిచివున్న కిటికీల్లోంచి గాలి అలలుగా వీస్తూంది. గెస్ట్ హౌస్ పక్కనే వున్న చెరువు విశాలంగా, నీలంగా కనబడుతూంది. కెరటాలు నెమ్మదిగా లేచి, తీరంవైపు వస్తున్నాయి. టేప్ రికార్డర్ లోంచే తాహిర్ హుస్సేన్ గజల్ నెమ్మదిగా వినిపిస్తూంది.
సృష్టి మౌనంగా ఏదో రసానుభూతిలో లీనమైనట్టు స్తబ్దంగా వుంది. పిల్లగాలి స్పర్శకి ఆమె తెల్లచీర అంచులు నెమ్మదిగా కదులుతున్నాయి.
ముందుకు వంగాను.
అసష్టమైన ఉద్వేగంవల్ల నుదురుమీద చెమట పడుతూంది. కళ్ళు నేలకు వాల్చి చూస్తోంది ఆమె. భయంతో క్రింద పెదవి వణకటం స్పష్టంగా తెలుస్తూంది. మొట్టమొదటిసారి పురుషస్పర్శకి ఆయత్తమవుతున్న శరీరం చిగురుటాకులా కంపిస్తోంది. భుజాలచుట్టూ చెయ్యివేసి, నెమ్మదిగా దగ్గరకు తీసుకొని..... మెడ వంపులో వెచ్చదనం, కురుల నీడలో చీకటి, చెక్కిళ్ళ నునుపు దనం.....
ఆమె "ఏమిటీ తడి -?" తన చెంపమీద వేలితో తాకుకొంటూ ఆశ్చర్యంగా చూసింది. "ఏమిటీ - మీరు....మీరేడుస్తున్నారా?"
విషాదంగా నవ్వాను. "అయుండవచ్చు. భరించలేని సౌందర్యం నన్ను దిగులుతో ముంచెత్తి వేస్తోంది."
"చిన్న పిల్లాడిలా ఏమిటిది?"
జుట్టులో చెయ్యి జొనిపి, దగ్గరకు తీసుకుని, హృదయానికి హత్తుకొంటే.....
అమ్మా..... అమ్మా..... ఎన్నాళ్ళమ్మా మళ్ళీ నీ ఒడి వెచ్చదనాన్నీ, నీ చేతులమధ్య నిశ్చింతనీ పొందుతూన్న అనుభూతి- క్షణాలు ..... నిముషాలు..... గంటలు.
"ఏమిటిది?"
"ఏమిటి?" కదలకుండా అడిగాను.
"ఇలా ఉండిపోవటం-"
"అస్థిత్వం-"
"అంటే....."
"ఉహుఁ..... నాకే తెలీదు. కాని కదిలితే కల చెదిరిపోతుందేమోనన్న భయం."
"నా గురించి మీకేం తెలుసు?"
అక్కర్లేదు. ఏం తెలుసుకోవాలి? భార్యని ప్రేమించలేని దౌర్భాగ్యుడికి శీలం పట్ల నమ్మకం ఏమిటి? ప్రేమకి అందంతోనూ, సెక్స్ తోనూ సంబంధం లేదంటే నేను నమ్మను. నేను నిను ప్రేమిస్తున్నాను స్వప్నా. నీ అందాన్నీ నీ లాలిత్యాన్నీ, అణువణువునా సుకుమారత్వాన్ని నింపుకొన్న నీ స్త్రీత్వాన్నీ..... ఇంకేం చెప్పను? చెప్పటానికి నాకున్న భాషాపరిజ్ఞానం సరిపోదు. నాకేడుపొస్తూంది. అంతా చెయ్యిజారిపోతుందేమోనన్న భయం.... స్వప్నా, స్వప్నా..... ఇంతకాలం ఏమైపోయావు నీవు? ఒక భావుకుడి మనసు తూట్లు తూట్లు పడి, పూర్తిగా పనికిరాకుండా పోయేదాకా ఎక్కడ ఉండిపోయావు నువ్వు! పువ్వుల్లో దాక్కొని లాలిత్యాన్ని సంతరించుకుంటూ నన్ను మర్చిపోయావా? నీ మంచు బిందువులతో ఆడుకొంటూ నన్ను గమనించకుండా వుండిపోయావా? ఓహో - ఈ ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతే ఎంత బావుణ్ణు! పిచ్చిగా వుంది నాకు - నా గతాన్ని ఎలా మర్చిపోను నేను? మహాలక్ష్మి నువ్వు చచ్చిపోకూడదూ-బాబోయ్.....ఏమిటి నా ఆలోచనలు - ఇంత భయంకరంగా వున్నాయి? ఆలోచనల్లో మహాలక్ష్మిని చంపగలిగాను గానీ, నా రక్తంలో జీర్ణించుకుపోయిన నీతిని ఎలా చంపగలను? చిన్నప్పటినుంచీ నూరిపోసిన సంస్కారాన్ని ఎలా చంపగలను? "ఇదంతా తప్పు- అదంతా తప్పు" అని ఎవరో లోపల ఎక్కడో గుండె లోతుల్లోంచి వినిపించే ధ్వని - నలువైపులనుంచీ చుట్టుముట్టి- తప్పు....తప్పు..... తప్పు.....
చటుక్కున లేచి, బయటకొచ్చి కారు డోర్ తీసి కూర్చొని అరవై మైళ్ళ స్పీడులో ఇంటికొచ్చాను...
అక్వేరియంలో నెమ్మదిగా కదిలే చేపపిల్లలు.......
వాటి నిశ్చింతని చూస్తే ఈర్ష్యగా వుంది.
* * *
"ఈ మధ్య మీరు మారిపోతున్నారు" నావైపు పరిశీలనగా చూస్తూ అంది మహాలక్ష్మి.
"ఏం మారాను?"
"అంతకుముందు కొద్దిగానన్నా మాట్లాడేవారు. ఇప్పుడదీ లేదు."
నిజమే అన్యాయం చేస్తున్నాను. ఏడడుగులు నడిచిన నమ్మకంతో తన ఊరిని, తన వాళ్ళందర్నీ వదిలేసి వచ్చిన ఒక స్త్రీకి..... నేను చేస్తున్నదేమిటి? మెదడులో రక్త నాళాలు పగిలిపోయేలా పరస్పర విరుద్ద భావాలు.
"సాయంత్రం తొందరగా వచ్చి పిల్లల్ని అలా బయటికి తీసుకు వెడదామనన్నా వుండదు....." గొణుగుతూంది.
బయటికొచ్చి కార్లో కూర్చున్నాను.
ఈసారి ఎక్కడికి వెళ్ళను?
* * *
"ఈసారి ఏమైనా సరే, ఈ ఆనందాన్ని వదులుకోదలుచుకోలేదు" అడుగు ముందుకువేస్తూ అన్నాను.
అరవిచ్చిన మందారంలా నవ్వింది స్వప్న.
"లేదు, మనం అనుభవించలేం....."
"ఏం, ఎందుకని?"
లేచివెళ్ళి కిటికీ ఊచల్ని పట్టుకొని, బయటికి చాలాసేపు చూస్తూ వుండిపోయింది. కొంచెంసేపటికి తనలో తనే ఆలోచించుకొన్నట్టు ఆమె కంఠం నెమ్మదిగా వినిపించింది.
"ఎలా? ఎలా అనుభవించగలం..... నా వయసు ఇరవై రెండు. ఇంకో రెండేళ్లు నిండిన తర్వాతయినా పెళ్ళి చేసుకోవాలన్న విషయం ఎలా మర్చిపోగలను? ఊహల్లో వ్యక్తికి మనసు అర్పించినా, చేసుకొన్న మనిషికి తనువు అర్పిస్తే అదో సంతృప్తి. సెంటిమెంట్సేమిటి అనుకొంటాంగానీ, అవి మనం పుట్టినప్పుడు మనల్ని చుట్టుముడతాయి. కాదంటారా?"
ఉహూఁ......వదులుకోలేను. ఇంత లోతుగా ఇంత సున్నితంగా ఆలోచించే ఈ స్త్రీని వదులుకోలేను.
ప్రపంచం తిరగబడ్డా సరే!
ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేచేను. "నేను పెళ్ళి చేసుకుంటాను స్వప్నా!"
ఆమె విషాదంగా నవ్వింది. "అధీ మీ బాధని పోగొడుతుందని అనుకోను."
"ఏం, ఎందుకని?"
"చేసుకొంటే అనుభవించే ఆనందంకన్నా, చేసుకున్నందువల్ల ఎవరికో చేసిన అన్యాయమే ఎక్కువ బాధ పెడుతుంది. దాన్నించి తప్పించుకోవటం అంత సులభం కాదు."
నిజమే!
ఈ కట్టుబాట్లని భౌతికంగా చేదించుకొన్నా, ఆ తరువాత మానసికంగా ఏర్పడే వ్యధని తప్పించుకోవటం కష్టం.
మరెలా?
అదే ప్రశ్న అడిగేను.
ఆమె నెమ్మదిగా నావైపు తిరిగింది. "రెండే దార్లు ఇంకో రెండు సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయం మరచిపోయి చేతికందినన్ని సౌఖ్యాలు అనుభవించటం ఇక రెండో దారి.....ఇప్పుడే విడిపోవటం...." ఆమె చెబుతోంది. దూరంనుంచి విమానశబ్దం హోరుమని చెవులలో.....భరించలేని చేదు నిజపు హోరు గుండెలలో.
చెప్పటం పూర్తిచేసి అంది. "ఏ నిర్ణయమయినా బాధాకరమే. రెండురోజులు ఆలోచించి, రెంటిలో ఏది మీకు నచ్చిందో చెప్పండి. మీ మనస్సుకు నచ్చేది ఏదయినా చెయ్యటానికి ఈ స్వప్న సిద్దమే. మీకు ఆనందం కలుగుతుందంటే, శరీరం అర్పించటానికి కూడా...."
మనిషిమీద కసి తీర్చుకోవటానికి దేవుడు ఈ ప్రేమ అనే అనిర్వచనీయమయిన బాధని సృస్టించాడు కాబోలు! ఆలోచనలతో నిద్ర దూరమయింది. మెదడులో కాల్చే ఆలోచనలు. రెండు రోజుల తర్వాత ఆమె సూచించిన దాంట్లో రెండవ దారే మంచిదని అతికష్టంమీద చెప్పగలిగేను.
తప్పదు!
ఏదో ఒకటి ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అదే మంచిది.
* * *
ఇది జరిగిన కొన్నాళ్ళకి మూర్తి, డాక్టరూ, నేనూ, రామారావు టేబిల్ చుట్టూ కూర్చుని ఉన్నాం.
"రెండు నెలల్లో కళ్ళుపోతే పోవచ్చుగాక! డానికి ఇప్పుడే కళ్ళు పొడిచేసుకోవటం దేనికి? ఈ రెండు నెలలూ హాయిగా అనుభవించవచ్చు!" అన్నాడు రామారావు డాక్టర్ చెప్పిన కథ విని.
"అదో సైకాలజి-ప్రతి మనిషిలోనూ అది అంతర్లీనమై వుంటుంది" డాక్టర్ సమర్ధించుకో చూశాడు.
"నాన్సెన్స్, అది పిచ్చితనం."
"సరే మీరు ముగ్గురు.....నేనొక్కన్ని అది పిచ్చితనం. సరేనా" అన్నాడు డాక్టర్ ఓడిపోయినట్టు.
"కాదు డాక్టర్, నేను మీ వైపే ఇద్దరటు ఇద్దరిటు" అన్నాను.
ముగ్గురూ నావైపు ఆశ్చర్యంగా చూశారు. ముఖంలో ఏ భావమూ ప్రతిబింబించకుండా పేకముక్కలు కలుపుతూ అన్నాను. "చేతిలో ఇప్పుడున్న ఆనందం, కొంతకాలం అయ్యేక పోతుందని తెలిసినప్పుడు..... ఇక అది ఆనందాన్ని ఇవ్వదు."
ఎవరూ మాట్లాడలేదు.
చేతిలో ముక్కలు కలువలేదు. డ్రాప్ చేసి పేక పడేసి, లేచి కిటికీ దగ్గిరకొచ్చి నిలబడ్డాను. బయటంతా చీకటి నల్లగా..... మనసులో వేదనలా.
స్వప్న జ్ఞాపకం వచ్చింది.
ఆ రోజునుంచీ మళ్ళీ కలవని స్వప్న.....
ఇప్పుడెక్కడుందో?
--* * * --