భూమిపై వరుసగా వాతావరణపు పొరలు ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, అయినోస్పియర్.....ప్రొఫెసర్ ఆగేడు.
.....అయినోస్పియర్- మూడు పరమాణువుల ఆక్సిజన్.
ఎలుక బ్రెడ్ మీద దుమ్ముని దులుపుతోంది. దుమ్ముతో పాటుగా బ్రెడ్ పొడుం పొడుంగా రాలుతోంది! క్రింద పడిన పొడుంతో దుమ్ము మళ్ళీ కలుస్తోంది.
మూడు పరమాణువుల 'ఓజోన్'ని ఆక్సిజన్ గా విడగొడితే......మిగిలిన ఒక పరమాణువూ దాని చుట్టూ తిరుగుతూ దాంట్లో కల్సిపోవటానికి ప్రయత్నిస్తూంది. ఈ ఘర్షణలో భూమి చుట్టూ, యాంటి మేగ్నటిక్ ఫీల్డ్' తాత్కాలికంగా ఏర్పడుతుంది.
చాలు..... ఆ స్వల్పకాలం ఆకర్షణని నిరోధించగలిగితే చాలు.....చేయవలసిందల్లా ఓ జోన్స్ ని సూపర్ సానిక్ వైబ్రేషన్స్ ద్వారా ఆక్సిజన్ గా విడగొట్టడమే.....వచ్చేసింది! సమస్యకి పరిష్కారం దొరికింది!
ప్రొఫెసర్ కుర్చీలోంచి ఒక్క ఉదుటున లేచి "యురేకా" అని బిగ్గరగా అరిచేడు. తన వయసు కూడా మర్చిపోయి చేతులు గాలిలోకి విసిరి నాట్యం చేసేడు. భయపడి పరిగెడుతూన్న ఎలుకని చూసి గట్టిగా నవ్వేడు. కుర్చీని వెనక్కి తోసి గుమ్మం దగ్గరికి వచ్చి తలుపు తోసేడు.
పది అడుగుల ఎత్తున్న తలుపు హుందాగా నిలబడి వుంది......బయట తాళం వేయబడి ఆటోమేటిక్ లాక్!!!
ప్రొఫెసర్ మొహం మీద చిరునవ్వు మాయమైంది. తలుపు దబదబా బాదసాగేడు.
* * *
దాదాపు నాలుగురోజుల్నుంచీ ప్రతీరోజూ రాత్రి పదకొండు గంటలకి భూమి కంపించటం, బీటలు వారటంతో పల్లె ప్రజల్లో కొంతమందికి బాబావారిమీద విశ్వాసం సన్నగిల్లింది. అందులో భూషణం ఒకడు.
అంతకు క్రితం రోజు రాత్రి వచ్చిన భూకంపంలో బాబావారు శయనించివున్న ఇంటికప్పు కూలి మీదపడి, ఆయన కుడికాలు విరిగింది. అందరికీ తాయెత్తులు కట్టడంలో నిమగ్నమై ఆయన. తన చేతికి కట్టుకోవటం మర్చిపోయినందువల్లే ఈ అనర్ధం జరిగిందని భక్తులు ఏకగ్రీవంగా నిర్ణయించేరు.
పెద్ద కామందు భూషణం దగ్గరికి వచ్చేడు.
"ఏమనుకుంటున్నారయ్యా ప్రజలు?" చుట్ట నుసి రాలుస్తూ అడిగేడు భూషణం.
"మన పల్లెకి పర్లేదంటున్నారు."
"ఎందుకంట?"
"ఊరు చుట్టూ మన బాబావారు నిమ్మకాయలు కోసి రసం పిండుతారంట."
"నాకు నమ్మకం లేదయ్యా, సావు తప్పదేమో అనిపిస్తూంది". ఆ విషయం నమ్మడానికి ఇష్టపడని కామందు విషయం మారుస్తూ, "రాజయ్యగాణ్ణి ఏం చేద్దాం?" అన్నాడు.
"ఒకేపున అందరి పేణాలే పోతావుంటే ఇక రాజయ్య సంగతంటావేమిటి?" అన్నాడు భూషణం చుట్టముక్కను తుపుక్కున వూస్తూ.
"దేన్దారి దాన్దే. అయినా మన పేణాలు పోతాయనే అపనమ్మకం ఎందుకు? బబావారు వున్నంతవరకూ పర్లేదు."
"సూద్దాంలే ఆ పదిహేడో తారీకేదో దాటనీ-"
"అంతకాలం ముడుసుక్కూసుంటే అవతలోళ్ళు నవ్వుకుంటారు. ఆన్ని ఎట్టాగయినా కాల్చెయ్యాల లేకుంటే, అన్నమాట నిలబెట్టుకోలేనోళ్ళమని రేపట్నుంచి సిన్నకుర్రోడు కూడా మనని లెక్కసెయ్యడు."
"ఆన్ని కాల్చెయ్యటమే కదా కావల్సింది, ఇదో ఈ పదిహేడో తారీఖు కానివ్వు. ఆ తర్వాత సూసుకుందాంలే-"
"ఆ తర్వాతంటే....."
"సూద్దాంలేవయ్యా తొందరేముంది?" లేచిపోయేడు భూషణం.
అరగంటలో ఈ వార్త రంగారావుకి పాకింది, రాజయ్యకి తెలిసింది. అతడు సంతోషించాడు. పొలం పో.....తే ప.....ర్లే....దు.... ప్రా.....ణా....లు.....పో....క...పో...తే... చాలు.
ఆగష్టు పదిహేను
తెల్లవారు ఝామున ఐదున్నర.
ప్రకాశరావుకి మెలకువ వచ్చింది. అసలు నిద్రపోయిందెక్కడ? కన్ను మూస్తే చావు గుర్తుకొస్తుంది.
మనిషి చచ్చి ఎక్కడికెళ్తాడు?
భ్రూణ హత్యచేస్తే రౌరవనరకానికీ, సోదరిని వాంచిస్తే తప్తలోహ నరకానికీ, తండ్రిని ద్వేషిస్తే క్రిమిభక్ష నరకనైకీ, అవేమీ కాకపోతే రుధిరాంధ నరకానికో వైతరణికో......
తనే నరకానికి వెళ్తాడు?
అతను వణికిపోయేడు.
కాలుతున్న పెనాలూ, వ్రేలాడకట్టబడిన శవాలూ, భయంకరమైన యమభటులూ-ప్రజ్వరిల్లుతున్న మంటలూ- అన్నీ వూహించుకొని వణికిపోయేడు.
ఇంకా మూడు రోజులే.
మరణం అనివార్యం. చచ్చిపోవాల్సిందేనా.....
అందరూ..... అందరూ చావల్సిందేనా.....
ఈ సాయంత్రాలూ.... ఈ తోటలూ..... ఈ ఆఫీసూ...... క్యాంటీన్ లో కబుర్లూ.... సినిమాలూ... గోపీతో ఆడుకోవడం..... భోజనం చెయ్యటం.....ఇవేమీ వుండవా.....
శరీరాన్ని వదిలేసిన తర్వాత ప్రాణం ఇంకో జీవిని చేరుకొంటుందని అంటారు. అసలు భూమ్మీద జీవి అన్నదే లేకపోతే ఈ ప్రాణాలన్నీ ఏమవుతాయి? నిర్మానుష్యమైన ఈ నల్లటి భూగోళం చుట్టూ ప్రేతాత్మలన్నీ తిరుగుతూ వుంటాయా? తనూ అందులో ఒకడవుతాడా?
అసలు చావు అంటే ఏమిటి?
కపాలమోక్షం అంటే ఏమిటి?
గుండె ఆగిపోవటం తెలుస్తుందా?
బాధతో శరీరం సుడులు తిరుగుతుందా?
అతని కేడుపొచ్చింది. ఎవరన్నా ఇదంతా కల అని చెప్తే ఎంత బావుణ్ణు? కాదు కాదు..... ఇది కల కాదు.
పక్కమీద బోర్లాపడుకుని అతను తలగడలో మొహం దాచుకొని చాలాసేపు ఏడ్చేడు.
తనో అల్పజీవి.
ఎవరూ తనని రక్షించలేరు.
ఆఫీసులో హెడ్ క్లర్క్ బారినుంచీ, భూమ్మీద చావు బారినుంచీ, తనని ఎవరూ రక్షించలేరు.
అతను లేచాడు-
అందరూ నిద్రపోతున్నారు.
లేచి బయటికొచ్చేడు.
సర్కస్ అయిపోయిన తర్వాత వుండే డేరాలా వుంది బయట. రోడ్డు వూడ్చేవాదు లేక- నీళ్ళురాక- కరెంట్ లేక - చెత్తకాగితాలు, దుమ్ము.....అంతా అస్తవ్యస్తంగా...... అయోమయంగా వుంది. చెత్తకుండీ పక్క కుక్క ఒకటి నిర్లిప్తంగా పడుకొని వుంది. అంతా నిర్లిప్తతే. ఎక్కడ చూసినా స్తబ్ధతే శూన్యం.
దూరంగా ఎక్కడో పెద్ద చప్పుడు-
వెనుకనుంచి ఎవరో తరుముకొంటూ వస్తున్నట్లుగా.
అతడు పరుగెత్తాడు.
వెనుకనుంచి చావు పరుగెత్తుకుంటూ వస్తూ వుంది. అతడు పరుగెత్తుతున్నాడు. రాళ్ళు గుట్టలు, కొండలు.....అన్నీ దాటుకొంటూ వెళుతున్నాడు.
ఆఫీసునుంచీ, ఫైళ్ళ మధ్యనుంచీ, భయంనుంచీ, దూరంగా పరుగెత్తుకు వెళ్ళిపోవటానికి పరుగెడుతున్నాడు ప్రకాశరావు.
ప్రళయం తరుముకొంటూ వస్తూంది.
ఊరి బయట స్మశానం చేరుకున్నాడు.
కపాలాల మధ్యనుంచీ, సమాధుల మధ్యనుంచీ పరిగెడ్తున్నాడు. ముళ్ళు అతడి శరీరాన్ని గాయపరుస్తున్నాయి. కాళ్ళు రక్తంతో తడిసిపోయేయి. చెమట ధారాపాతంగా కారుతోంది. ఆయాసంతో వగర్పొస్తూంది.
చప్పున అతడు ఆగేడు.
స్మశానం మధ్యలో అతడు వున్నాడు.
తూర్పు దిక్కునే సూర్యుడు ఉదయిస్తున్నాడు. అంతా ప్రకాశవంతమవుతోంది.
ఎర్రటి సూర్యుడికేసి చూస్తూ అతనో క్షణం నిలబడ్డాడు.
అప్పుడో చిత్రం జరిగింది.