Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 22


    గోపీ ఆమెవంకచూసి- "నన్ను సీరియస్ గా ఉండమని నువ్వంటావు. ఇప్పుడు సీరియస్ గా అడుగుతున్నాను. నాకు జీవితంలో ఎవ్వరూ లేరు. నువ్వు నాకు తోడుగా ఉంటావా?" అనడిగాడు.
    "అందుకు మా అమ్మ ఒప్పుకోవాలి-" అన్నది విశాల.
    "మీఅమ్మ ఒప్పుకుందనుకో-నువ్వొప్పుకుంటావా?"
    "ఊఁ"
    "అయితే ఒక్కమాట-నావల్ల నీకూ, నీవల్ల నాకూ ప్రమాదమున్నది. అందువల్ల మనిద్దరం కొంతకాలంపాటు కలిసి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశ్యం....."
    "పెళ్ళికాకుండా కలిసి ఉండడం నాకునచ్చదు-"
    "నామీద నీకు నమ్మకముంటేనే!" అన్నాడు గోపీ.
    "నమ్మకంకోసం కలిసే ఉండాలా?" అన్నది విశాల.
    గోపీ ఆమెకు వివరించాడు.
    విశాలపై సోము పగబట్టాడు. అతడు ఎప్పుడైనా ఆమెకు హాని తలపెట్టవచ్చును. విశాలకేమైనా అయితే గోపీ భరించలేడు.
    "ఎందుకని?"
    "నేను ఏమైనా చేయగలను. దేనికీ భయపడను. అందువల్ల నన్ను కూడా నేను నిర్లక్ష్యం చేసుకుంటాను. నన్ను నేను నిర్లక్ష్యం చేసుకోకూడదంటే జీవితంపై నాకు మోజుపుట్టాలి. నిన్న నిన్ను చూడగానే నాకు జీవితంపై మోజుపుట్టింది....."
    "మా యింట్లో రెండుగదులున్నాయి. నీ హద్దులు దాటవని నీమీద నమ్మకముంది-" అన్నది విశాల.
    "ఒకవేళ నీ నమ్మకం నిజంకాకపోతే?"
    "వివాహమయ్యేవరకూ- నా శీలానికి సంబంధించినంత వరకూ నువ్వూ, సోము ఒక్కటేనాకు.....ఆ విషయం గుర్తుంచుకోవాలి-" అన్నది విశాల.
    "చాలా బాగా చెప్పావు. నువ్వు నన్ను నీ యింటికి రానిస్తే-ఇక చూడు.....ఆ సోమును ఒక ఆట ఆడిస్తాను-" అన్నాడు గోపీ.
    మళ్ళీ ఇద్దరూ బుల్లెట్ ఎక్కారు. అది తిన్నగా విశాల ఇంటికి వెళ్ళింది.
    
                                         12
    
    అది ఊరి బయట చెరువు చెరువులో తామరలు బాధగా కమలబాంధవుడికి వీడ్కోలు చెబుతున్నాయి. అది సాయం సమయం.
    ఒడ్డునే ఒకరికొకరు ఎదురుగా విశాల, గోపీ కూర్చుని ఉన్నారు. గోపీ కుడిచేతిలో చిన్న గోలీ అప్పుడప్పుడు ఆడుతున్నది.
    విశాల ఆరాధనా పూర్వకంగా గోపీ వంకనే చూస్తున్నది. ఆమెకు పరిసరాల గురించిన ఆలోచనే ఉన్నట్లులేదు.
    దూరంగా నలువైపులానుంచీ సోము మనుషులు వారిని సమీపిస్తున్నారు. చెరువుకు అవతలిగట్టునుంచి ఒకనావ బయల్దేరి మధ్యకు వచ్చింది. అందులోనూ సోము మనుషులున్నారు.
    "విశాలా! చెరువులోనూ, చెరువు బయటా ఊదా మొసళ్ళున్నాయి అవి మనల్ని చుట్టు ముడుతున్నాయి-" అన్నాడు గోపీ ఉన్నట్లుండి.
    "అంటే?" అన్నది విశాల.
    "ఒకసారి చుట్టూ చూడు- నీకే తెలుస్తుంది-" అన్నాడు గోపీ.
    విశాల చుట్టూ చూసింది. నాలుగు పక్కల నలుగురేసి చొప్పున మొత్తం పదహారుగురు. వాళ్ళు కాస్త దూరంగా ఉన్నారు. వారి మధ్య నుంచి సోము-ముందుకు వచ్చి- "అన్నప్రకారం సోము వచ్చాడు-" అన్నాడు అతడి చేతిలో పిస్తోలు ఉన్నది.
    విశాల క్షణమాత్రం భయపడింది. త్వరగా ఒక నిర్ణయానికి వచ్చి గోపీ పక్కనుంచి లేచి సోము వద్దకు వెళ్ళి-అ"సోమూ! నా తెలివితక్కువ తనాన్ని మన్నించు. ఈ క్షణంనుంచీ నేను నువ్వెలా చెబితే అలానడుచుకుంటాను. దయచేసి ఇతన్ని వదిలిపెట్టు- అన్నది.
    సోము ఆమె చేయిపట్టుకుని-"నిన్ను లొంగదీయడం నాకేమీ అసాధ్యంకాదు. కానీ నీ హీరోను వదలడం కలలోని మాట వీడిని వేటాడమని మా బాస్ నాయుడి ఆజ్ఞ...." అంటూ విశాలను వెనక్కు తోశాడు. అతడి ముఠా మనుషులు విషయాలను స్వాధీనం చేసుకున్నారు.
    గోపీ కూర్చున్న మనిషి లేవలేదు. అతడు సోమువంకనే పరీక్షగా చూస్తూ-"నీ భుజం మీద గాయం తగ్గిపోయిందా?" అన్నాడు.
    సోము పళ్ళు కొరుకుతూ-"అది నిన్ను చీల్చి చెండాడమని హెచ్చరిస్తోంది. అందుకే వచ్చాను."- అన్నాడు.
    "అది నీవల్లనవుతుందా?"
    "ఈ సోము సంగతి నీకు తెలియదు-"
    "తెలియకేం-ఇప్పుడు తెలిసింది. ఒక్క మనిషిని కొట్టడానికి మొత్తం పదహారు గురు వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు నా శక్తిని గుర్తించి గౌరవించావు. అందుకైనా నేను నీకు లొంగిపోవాలి..."
    సోము క్రూరంగా నవ్వుతూ- "బాస్ నిన్ను ప్రాణాలతో పట్టమన్నాడు. నువ్వు లొంగిపోతానంటే నాకు సంతోషమే-అంత మాత్రాన నిన్నిలా వదిలిపెడతాననుకోకు. నీ చేతులు, కాళ్ళు తూట్లుచేసి అప్పుడు తీసుకుని వెడతాను. అప్పుడు నేను బాస్ కిచ్చిన మాటా నిలబెట్టుకుంటాను. నా కసీ తీరుతుంది-" అన్నాడు.
    "సమయానికి నా పిస్టల్ బ్యాగులో ఉండిపోయింది. బ్యాగు అదిగో అక్కడ దూరంగా ఉంది. లేకపోతే నువ్విలా మాట్లాడగలిగి ఉండేవాడివి కాదు. మొత్తం పదహారుగురూ పరుగుపందెం వేసుకుని ఉండేవారు..."
    "పిస్టల్ని నీ బ్యాగులో కూడా ఉండనివ్వకూడదు. అదీ నా స్వాధీనం చేసుకుంటాను-" అన్నాడు సోము. అతడు వెళ్ళి బ్యాగులోని పిస్టల్ తీసుకుంటూంటే-"అది నువ్వేం చేసుకుంటావ్-నీలాంటి వాళ్ళు దాన్ని సరిగ్గా పేల్చనుకూడా పేల్చలేదు. అదినాబోటి సమర్దులకోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది." అన్నాడు గోపీ.
    ఈ మాటలకు సోము రెచ్చిపోయాడు- "నా సమర్ధతేమిటో నీకు చూపిస్తాను. నీ పిస్టల్ తోనే నీ వళ్ళు తూట్లు చేస్తాను-" అన్నాడు.
    "దటీజ్ గుడ్ స్పిరిట్-" అన్నాడు గోపీ.
    "కదలడానికి ప్రయత్నించకు. అలాచేస్తే ప్రాణాలే పోగొట్టుకుంటావు. నేను కేవలం చేతులు, కాళ్ళతోనే వదిలిపెడతాను-" అన్నాడు సోము.
    గోపీ అక్కడే బిగుసుకుపోయినిలబడ్డాడు. నాలుగుపక్కలా తనకు మనుషులు కాపలా ఉన్నారని తెలుసు. అందరూ తనకు తుపాకులు గురిపెట్టి ఉంచారనీ తెలుసు. అతడలాగే నిలబడి-"నీ కోరిక మన్నించి నేనిలా నిలబడ్డాడుగానీ నాకు తుపాకీగుళ్ళంటే భయంలేదు. వాటితోనేను తమాషాలు చేయగలను. చావంటే భయపడటానికి నాకు ప్రాణముంటే కదా-" అన్నాడు.

 Previous Page Next Page