కానీ నీ లెటర్స్ కార్యక్రమంవల్ల నాకు పర్సనల్ గా లాస్__
కనుక ఇకపై అలాంటి దిక్కుమాలిన ఐడియాలివ్వకు" వేమూరి గగ్గయ్య లెవెల్లో తన ఆగ్రహావేశాల్ని వెలిబుచ్చుతూ అన్నాడు నారాయణరావు.
"ఒక సామాజిక ఉద్యమంకోసం, ఒక సమిష్టి కార్యాచరణకోసం మేం ఉత్తరాలు రాస్తే, నీకు పర్సనల్ గా లాస్ అంటావేంట్రా.....నీకెలా లాసో చెప్పు......" అడిగాడు జుత్తులజిన్నా ఒకింత ధైర్యాన్ని ఎరుపు తెచ్చుకుంటూ.
"నువ్వు రాసిన ఉత్తరాలు, రాష్ట్రంలో అన్ని కాలేజీలకు వెళ్ళాయా?"
"అవును.....స్టాంపులదీ శుభ్రంగా అంటించాం కాబట్టి.....శుభ్రంగా వెళతాయి___"
"డొంక తిరుగుడు జవాబు చెప్పకు.....తిన్నగా చెప్పు"
"వెళతాయి__ఎందుకు వెళ్ళవూ?"
"అన్నిచోట్లకూ వెళ్ళినట్టే మా అనకాపల్లి కాలేజీకి కూడా వెళతాయా?"
"అవును.....వెళతాయి"
"అప్పుడే అసలు గొడవ మొదలవుతుంది"
"వివరంగా చెప్పు"
"అక్కడ అనకాపల్లి కాలేజీలోనే మా సురభి చదువుతోంది......"
"సురభి ఎవరు?"
"మా మేనమామ కూతురు"
"ఈ విషయం ఆవిడకు తెలిస్తే తప్పా"
"తప్పా..... తప్పున్నరా.... పెద్ద గొడవలై పోతాయి.....కాలేజీ నోటీస్ బోర్డులో అంటించిన ఈ న్యూస్ ను చదివి, ఠారెత్తిపోయి మా సురభి వాళ్ళ నాన్నతో చెపుతుంది.....వాళ్ళ నాన్న, అంటే మా మేనమామ సత్యనారాయణ, ఎడ్లబండిమీద మా ఊరొచ్చేసి, మా ఇంటిదగ్గర పంచాయితీ పెడతాడు.....దాంతో మా బామ్మ ఆగ్గి సీతలా అంతెత్తున లేస్తుంది."
"అగ్గిసీతా__ఆవిడెవరు.....సురభి వాళ్ళక్కా?" బిత్తరపోతూ అడిగాడు జుత్తులజిన్నా.
"కాదురా ఇడియట్" అగ్గిరాముడులా ఆవిడ ఎగిరి గంతులేస్తుందని అర్ధం"
"ఒరేయ్ చిట్టితండ్రీ....అందరికీ ఈ న్యూస్ తెలవడానికేగదరా ఈ గోలంతా."
"అందరికీ తెలవొచ్చుగా.....గానీ మా బామ్మకు తిక్క" యముడు టైపులో అన్నాడు నారాయణరావు.
"ఏం?"
"అసలే ఆవిడ వీక్ హార్ట్ పేషెంట్.....ఆ న్యూస్ విని బాల్చీతన్నేసిందనుకో.....నాకు రాయాల్సిన లక్షల ఆస్థి, నాకు రాయకుండానే పోతుందిరా బాబూ" దీనంగా అన్నాడు నారాయణరావు.
"నీమీదనాకు జాలేస్తుందిరా___ఇప్పుడెలగరా.....ఆ సంధ్యను క్షమించడానికి, ఆ తర్వాత పెళ్ళిచేసుకోవడానికీ.......కమిట్ అయిపోయావుగదరా" కొంచెం జాలిగా అన్నాడు జుత్తులజిన్నా.
"ఒరేయ్ జుత్తులజిన్నా......నీకు నక్కజిత్తుల జిన్నా......అని ముద్దుపేరు పెట్టింది నేనే గదరా" విషాదముఖుడై అన్నాడు నారాయణరావు.
"అవున్రా......నువ్వు నా తెలివితేటల్ని, నా జ్ఞానాన్ని ఆనాడే గుర్తించి__ఆ పేరు పెట్టావురా.....నాకా కృతజ్ఞత అణువణువులోనూ వుందిరా......ఒరేయ్.....నారాయణరావూ చెప్పరా ..... నీ కష్టం.....నా కష్టం కూడా చెప్పు.....మీ బామ్మ లక్షలు నీకు రావాలంటే నన్నేం చేయమంటావో చెప్పు" చాలా సిన్సియర్ గా పాత సినిమాలో ముక్కామల అడిగినట్లుగా అడిగాడు జుత్తులజిన్నా.
కొంచెంసేపు ఆలోచనాపరుడై పోయాడు నారాయణరావు.....గత రెండు రోజుల సంఘటనవల్ల, అతగాడి బ్రెయిన్ రూమ్ డోర్స్ గట్టిగా మూసుకుపోయాయిగానీ, లేకపోతే వెంటనే ఐడియా షౌడా గ్యాస్ గా బయటకు పొంగును.
కానీ ప్రస్తుతం ఆ జ్ఞానగ్యాస్ ఆలస్యంగా పొంగింది. ఆ ఎక్సయిట్ మెంట్ ను తట్టుకోలేక అతగాడు చిన్నగా అరిచాడు.
"ఏవైందిరా......దోమ కుట్టిందా" అడిగాడు జిన్నా.
"కాదురా__భామ కుట్టింది.....ఒరేయ్ జిన్నా! నాకొ మంచి ఐడియా వచ్చిందిరా.....ఒకపక్క ఈ సంధ్యాప్రణయోదంతం ఇలాగ వైజాగ్ సిటీలో జరుగుతుండగానే ఇంకోపక్క మా బామ్మను పూర్తిగా మచ్చిక చేసుకునే మార్గం ఆలోచిస్తే" ఫెళఫెళమని నవ్వుతూ తన ఐడియాను జుత్తులజిన్నాముందు పరిచాడు.
మరీ భరించలేని ఆనందం వస్తే 'ఫెళఫెళమని' నవ్వడం చిన్నప్పటి నుంచి నారాయణరావుకి అలవాటు.
దాంతో జిన్నాగాడికి కోపం వచ్చింది.
"ఒరేయ్......నీ బెస్ట్ ఫ్రెండ్ గా చెపుతున్నాను.....దేవదాసుసినిమా చూసావా నువ్వు...."
"ఓ.....అరవయ్ సార్లు చూశాను."
"సదరు సినిమాలో దేవదాసు చచ్చిపోయే చివరి సీనులో సడన్ గా పార్వతి, దేవదాసు ఎదురుగా వచ్చి ఆ దాసుని చూసి ఫెళ ఫెళ మని నీలా నవ్విందనుకో....ఎలా వుంటుందీ....." చికాగ్గా అడిగాడు జిన్నా.
"పరమ అసహ్యంగా వుంటుంది......ట్రాజడీ సీన్ లో లాఫులేంటని అందరూ, ధియేటర్ లోకి పేడ డబ్బాలతోనే వెళ్ళే వాళ్ళు...." అన్నాడు నారాయణరావు.
"కదా.....ఎప్పుడూ వలాన్ వుంది.....నీ నవ్వు సీరియస్ టైమ్ లో ఎవరయినా నవ్వినా, జోకువేసినా, నాకు అసయ్యమని నీకు తెల్సుకదా? ముందు పాయింటుని డిస్కస్ చెయ్యి మీ బొమ్మను మచ్చిక చేసుకునే ప్లాన్ ఏంటో చెప్పు.....అది బాగుందో లేదో నేను చెప్తాను....." హుషారుగా సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు జుత్తుల జిన్నా.
కాసేపు చింతా క్రాంతుడయ్యాడు నారాయణరావు.
"ఉరేయ్....జిన్నా....చిన్న ఐడియా.....మా బామ్మకు, చిన్నప్పటి నుంచీ కలెక్టర్లన్నా, గవర్నర్లన్నా ఎందుకో ఇష్టం, మెండు......సో.....సదరు వీక్ నెస్ తో మనం డ్రామా ఆడితే.....?"
"బేషుగ్గా వుంటుంది. ఇటు ప్రేమా నిలబడుతుంది.....అటు ఆస్తీ నీ పేరున వచ్చేస్తుంది..... చెప్పు..... ప్రవాహంలా వచ్చే ఐడియాను ఆపొద్దు. చెప్పు ఏం చెయ్యమంటావో చెప్పు....." ఆత్రంగా, ఆత్రాన్ని ఆపుకోలేక అన్నాడు జిన్నా.
"నాకు అర్జంటుగా ఒక కలెక్టర్ కావాల్రా.....అంతే....ఆ పని చేసి పెట్టు....."
ఆ మాట విని, ఊబిలో కూరుకుపోతున్నవాడిలా అయిపోయాడు జిన్నా.
"చిట్టితండ్రీ......కలెక్టర్లు అంటే__కానిస్టేబుల్స్ అనుకున్నావ్రా ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర నిలబడడానికి?"
"పోనీ గరవ్నర్స్ ను సంపాదిస్తావా?" మరింత ఆశగా అన్నాడు నారాయణరావు.
"రాష్ట్రానికి ఒక్కడే గవర్నర్ వుంటాడ్రా___సదరు గవర్నర్ గారు ఎలా వస్తార్రా?"
మళ్ళీ ఫెళఫెళ మని నవ్వాడు నారాయణరావు.
"నీకు అనవసరంగా నక్కజిత్తుల జిన్నా అని బిరుదు ఇచ్చాన్రా నా బిరుదు నాకిచ్చెయ్. చూడు ఖన్నా___గవర్నర్ అంటే నిజమయిన గవర్నర్ కాదురా.....కలెక్టరంటే, నిజమయిన కలెక్టరు కాదురా.... కరెక్టుగా ఆ వేషాలకు సరిపోయే కేరక్టర్లు కావాలి__అంతే__"
"అంటే నీ ఉద్దేశ్యం ఏంటో స్పష్టంగా చెప్పి తగలడు." జ్ఞానజ్యోతి వెలిగినట్టుగా ప్రకాశవంతమయిన మోముతో అడిగాడు జిన్నా.
"జాగ్రత్తగా విను__నువ్వొక అందమయిన రోడ్డునపోయే వెధవను తీసుకొస్తావ్....వాడికి మనం సూటూ, బూటూ వేస్తాం.....ఫలానా జిల్లా కలెక్టరని చెప్తాం. సదరు కలెక్టరుకి మనమే ఓ కారు అద్దెదన్న మాట.....మా బామ్మను కలుస్తారన్నమాట. నీ మనవడ్ని నాకుఅల్లుడిగా చెయ్యమని అడుగుతారన్న మాట_ఎలా వుంది ఐడియా ....."ఆయాస పడిపోతూ, ఎక్సయిటింగ్ గా చెప్పాడు నారాయణరావు.