Previous Page Next Page 
ప్రయాణంలో పదనిసలు పేజి 22

    "అవతల బాత్రూం కాలీగానే వుంది. అందులోకి వెళ్ళండి__" అని చెప్పడం మినహావారికేమీ సహాయపడలేదతనికి.   
    అక్కడ పనిజరగటం అసాధ్యమని తెలిసేక రాజారావు వెనుదిరిగాడు. అతనికి నడక బాగా అలవాటు. సరదాకూడా! కానీ అక్కడికి సుమారు ఇరవై అంగల దూరంలో వున్నా రెండోబాత్రూంకు నడిచి వెళ్ళడానికి అతను భయపడుతున్నాడిప్పుడు! వానరులు సముద్రాన్నిదాటి లోపలకు వెళ్ళవలసి వచ్చినప్పుడుకూడా ఇంత బెంగపడి వుండరు.   
    వానరులు హనుమంతుడిని పొగిడినట్లు రాజారావు తనకు తానే చెప్పుకుని మొండితనాన్ని పెంచుకుని విసురుగా అటువైపు బయల్దేరాడు. అతనెన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరినో ఒకరిని తొక్కుతూనేవున్నాడు. వాళ్ళశాపనార్ధాలు వింటూనే వున్నాడు. రెండోబాత్రూంకి సమీపించేదాకా అతను సర్వెంద్రియులనూ బాత్రూంపైనే లగ్నం చేశాడు. ఈసారి ఏడెనిమిది నిమిషాలలోనే అక్కడికి చేరుకోగలిగాడతను. బాత్రూం ముందు తన సామానంతా పరుచుకుని పడుకుని వున్నా రహీం కనబడ్డాడు రాజారావుకి. "ఆఖరికిక్కడికి చేరావన్నమాట నువ్వుకూడా-" అనుకున్నాడు రాజారావు. బాత్ర్రూం తలుపులు తెరవడానికి నలుగురు మనుషులుతప్పుకోవాల్సివచ్చింది. లోపల ఎవరూలేనందుకు రాజారావు చాలా సంతోషించాడు.   
    అక్కడికి రావడానికి ఇన్ని ఇబ్బందులుండడంవల్లనో ఏమో- అధి ఎవరూ వాడినట్లులేదు. చాలా శుభ్రంగా వుంది బాత్రూం. రాజారావు తలుపులు వేసుకుని- "మిగతా ప్రయాణమంతా ఇందులో చేయాల్సివచ్చినా సిద్దమే. పెద్ద అవస్థనుంచి కాపాడేవు దేవుడా!" అనుకున్నాడు మనసులో.   
    కొన్ని సులువులు తెలిసిన కారణంగా రాజారావు తిరుగుప్రయాణం మరికాస్త సులభమై- సుమారు అయిదు నిమిషాలలో తనస్థానం చేరగలిగాడు. అతనికిసీటులో కూర్చున్నాక గుడ్డి వాడు బూటుకాళ్ళతో పాదతాండవం చేశాడు. రాజారావు మనసు ప్రశాంతంగా వున్న కారణంగా అతనేమీ విసుక్కోలేదు.   
    "బాత్ర్రూంకి వెళ్ళివచ్చారా?" అన్నాడు ఈశ్వరరావు.   
    "అవును-" అన్నాడు రాజారావు.   
    "ఎలా వుంది ప్రయాణం?" అనడిగాడతను పరిసరాలను గమనిస్తూ రాజారావు వివరాలు చెప్పాడు. "తప్పదుమరి-" అనుకుంటూ ఈశ్వరరావు బయల్దేరాడు. రాజారావు వెళ్ళిరాగలగడం అతనికి ధైర్యాన్ని పెంచింది.   
    ఈశ్వరరావు బయల్దేరి ఇంకా ఒక్క నిముషంకూడా పూర్తికాకుండా కంపార్టుమెంటు అదిరిపోయేటంత ఆర్తనాదం వినిపించింది. చాలామందికి మెలకువవచ్చినా కదిలివెళ్ళి చూసేపరిస్థితి లేక ఊరుకున్నారు ఈశ్వరరావు తిరిగివచ్చేక విషయం తెలిసింది. అతను తన కాలుని మూట అనుకుని బోగీలో క్రింద వెల్లకితలా పడుకున్న మనిషి బొడ్డమీద వేశాడట. ఆర్తనాదానికి అదీకారణం." ఎవరేం తిడితేనేం? ప్రాణమిప్పుడు హాయిగా వుంది_" అన్నాడతను.   
    తెల తెలవారుతున్నట్లుంది. ఒక్కొక్కరే లేస్తున్నారు. ఏదో స్టేషనులో ట్రయిన్ ఆగితే- చాలామంది కంపార్టుమెంటు కిటికీలోంచి అందుకుని వేడివేడి బెడ్ టీ తాగారు. ఈశ్వరరావు కి కాఫీయే కానీ టీ రుచించదు. అయినా అతను గొంతుకలో తడి అవుతుందని కాస్త టీ పుచ్చుకున్నాడు. చౌదరికూడా టీ తాగాడు రాజారావుకి ఏ అలవాటూ లేదు. అతనిప్పుడు మొహం కడుక్కోవడం గురించి ఆలోచిస్తున్నాడు.   
    "డూండ్ లో టిఫిన్ చాలా బాగుంటుంది. బహుశా ఎనిమిదిగంట కక్కడి? వెడతామనుకుంటాను-" అన్నాడు ఈశ్వరరావు ఇటీవలే అతను ఏదోఇంటర్వ్యూవస్తే బొంబాయి వెళ్ళివచ్చాడు. ఆ అనుభవాన్నీ ఇంకా బుర్రలోంచి తొంగినట్లులేదు.   
    ఆకుపచ్చ యూనిఫారం బెర్తు దిగాడు అతను ఒక వైపుకు వెళ్ళబోతుంటే రాజారావు వారించి- "ఈ పక్క బాత్రూం నిండా జనమున్నారు. అటువెళ్ళండి-" అని చెప్పాడు యూనిఫారం వినకుండా అటే వెళ్ళాడు ఏదో గొడవపడుతున్నట్లు వినిపించింది. అతను మొత్తంమీద ఆ బాత్ర్రూంలోని జనాన్ని తన యూనిఫారంతో భయపెట్టి బయటకు లాగ గలిగాడని తర్వాత అందరికీ తెలిసింది ముందు ఈశ్వర్రావూ ఆ బాత్రూంలోకి వెళ్ళి ముఖాలు కడుక్కొచ్చారు. ప్రయాణం మాత్రం ఇంకా చాలా కష్టంగానే వుంది.   
    ట్రయిన్ డూం డ్ (హిందీలో డౌండ్ అని రాసివుంది) లో అనగానే ఈశ్వరరావు కంపార్టుమెంటులోంచి బయటపడడంకోసం కిటికీనే తలుపుగా చేసుకున్నాడు. అటువంటి దుడుకుపని చేసి నెలరోజులక్రితం ఓ చిన్న ప్రయాణంలో అతను గాయపడ్డసంగతి రాజారావుకి గుర్తుంది. అందుకని అతను భయపడ్డాడు. అదృష్టవశాత్తూ ఏ ప్రమాదమూ జరగలేదు.  
    రాజారావు ఏమీతినడంలేదని ఈశ్వరరావుకు బెంగగా వుంది. అందుకని అతను ఫ్లాట్ ఫారంమీద రైల్వే కాంటీన్ లో ఇడ్లీలు తీసుకున్నాడు. అతనికి హిందీ బొత్తిగారాదు. వేళ్ళు చూపించి ఎన్ని కావాలో చెప్పాడు. అతనక్కడే తింటాడు కాబోలనుకుని స్టీలు ప్లేటులో టిఫిన్ ఇచ్చాడు. కాంటీన్ వాడు ఒక ప్లేటు తనకు తీసుకుని ఇంకోప్లేటుకూడా అడిగి అతను ఫ్లాట్ ఫారం మీదకు పరుగెత్తాడు. అది చూసిన ఒక సర్వర్ కాంటీన్ లో కౌంటరులో కూర్చున్న అతనికి చెప్పాడు. అతను కంగారుగా ఈశ్వరరావునుద్దేశించి ఏదో అరిచాడు. అతనువాటికి అందకుండా ఒక్క పరుగున రాజారావుకు టిఫిన్ అందించుట టిఫిన్ అద్భుతంగా వుంది. రాజారావు హడావుడిగా మింగేసి ప్లేటుకాళీ చేశాడు. ఈశ్వరరావుకు థాంక్సు చెప్పి అతను ప్లేటు అందించగా- "ఇంకా తెమ్మంటారా?" అన్నాడు ఈశ్వరరావు. చాలన్నాడు రాజారావు. ఈశ్వరరావుకు వాటర్ బాటిల్ అందిస్తూ. చౌదరి తనక్కూడా టిఫిన్ తెచ్చిపెట్టమని ఈస్వర్రావును కోరాడు. ఈశ్వరరావు రెండు ప్లేట్లూ తిరిగి ఇవ్వగానే- బిడ్డకు పాలిచ్చి తిరిగి తనవద్దను వచ్చిన ఆవును చూసిన పులిలా చూశాడు కాంటీన్ వాడు. ఈసారి ఆకులో టిఫిన్ తీసుకున్నాడు ఈశ్వరరావు. అతను కాఫీతాగి-వాటర్ బాటిల్లో నీళ్ళు పట్టాడు. హఠాత్తుగా అతనికి ప్లాట్ ఫారం మీద బాలకృష్ణ కనబడ్డాడు. ఇద్దరూ పరస్పరం పలకరించుకున్నాడు. ఈశ్వరరావు బృందం జనరల్ కంపార్టుమెంటులో వున్నారని తెలియగానే తననేమైనా సాయం అడుగుతారేమోనని భయపడ్డాడో ఏమో- బాలకృష్ణ- "నాకు హైదరాబాదులో రిజర్వేషన్ దొరికింది-" అనేసి వెళ్ళిపోయాడు. ఈశ్వరరావు కిటికీ ద్వారా కంపార్టుమెంటులో ప్రవేశించాడు.

 Previous Page Next Page