ఈ సందడి తో తనకేవీ నిమిత్తం లేదన్నట్టుగా, హాయిగా పడుకుని నిద్ర పోతుంది శాంత.
'ఛీ, ఇంత సోమరితుగా ఉండేదీ ఓ మనిషా?' అని చాలా చిరాకని పించింది రామానికి. 'అయినా అడవి మృగం లా ఆ పల్లెటూర్లో పెరిగిన దాన్ని వెళ్లి గొంతుక్కి కట్టుకుని ఇప్పుడిక అనుకుని ఏం లాభం, అని తనలో తనే సర్దుకుంటూ మెల్లిగా మంచం దగ్గరి కెళ్లి 'శాంతా' అని పిల్చాడు. పల్కలేదు శాంత.
'హు' ఇంత అందమైన రూపాన్నిచ్చిన ఆ దేవుడు, అందుకు తగ్గ మంచి హృదయాన్నేందు కివ్వలేదో' అనుకుంటూ , మళ్ళీ 'శాంతా' అని పిలుస్తూ , కప్పుకున్న దుప్పటిని తొలగించాడు.
'అబ్బ, ఏవిటండి' అట్నుంచి ఒత్తిగిలి మళ్ళీ పడుక్కుంది శాంత
`'ఇంట్లో ఒక మూల అంత హడావుడి పడుతుంటే, మనకి చెయ్యడం ఎలాగూ చేత కాదు. పోనీ కాస్త చేస్తున్నవన్నా చూడనన్నా చూడొచ్చుగా. ఏవిటీ పడక' మందలించాడు రామం.
'అబ్బబ్బ, ఈ ఇంట్లో నిద్రపోవడానీక్కూడా వీలవదు బాబూ' విసుక్కుంటూ లేచి కళ్ళు నులుముకుంటూ కూర్చుంది శాంత.
'ఎవరికి, నీకేనా?'
'మరి, మీ తమ్ముడున్నంత సేపూ ఆ రేడియో ని ఆ వరసని మొరిగిస్తూనే వుంటాడు. ఇక అతడు అపేసరికి , బేవ్ బేవ్ మనుకుంటూ ఆవిడ గారు వీణ ప్రారంభించేస్తుంది. ఇక పడుక్కు చచ్చేదేప్పుడు.'
తన తల చితక్కొట్టుకుందామా అన్నంత చిరాకేసుంది రామానికి. హు పాములు, పసిపిల్లలూ కూడా మైమరుపుతో వినే పాటంటే ఇంత వేగటా' అని తన భార్య మూర్ఖత్వానికి ఎంతో బాధపడ్డాడతను.
'నీకెందు లోనూ లోకజ్ఞానం లేదు శాంతా. అందుకే ఇలా జడంగా ఎందులోనూ రసికత్వం లేకుండా వున్నావు లేదు అయినా ఇది నీ తప్పు కాదులే, నువ్వు ఎందు పెరిగిన వాతావరణం అటువంటిది -- '
'చాల్లెండి మహా ఎరిగినట్లు---'
'హు తల్లి పుట్టినిల్లు మేనమామ వద్ద పొగడాలా అన్నట్టు పొద్దున్న కావలసినవన్నీ చేయించుకు తిని పడుక్కున్నాడంటే , ఇక ప్రపంచానికి తనకీ సంబంధమే లేనట్టు 'ఈపూట ఏం వండారూ ' అనుకుంటూ రాత్రి తిండి వేళకి లేచే మీ నాన్న సోమరితనాన్ని నేనేరగందా. అయినా ఇప్పుడిక వాళ్ళనని లాభం ఏమీ లేదు గాని నువ్వు తప్పనిసరిగా మారే తీరాలి. తెలిసిందా?' ఏమీ మాట్లాడలేదు శాంత.
'రోజల్లా ఇలా వృధా కాలక్షేపం చెయ్యకపోతే, సుధ వద్దో, అత్తయ్య వద్దో ఏవన్నా నేర్చుకోరాదూ.'
'నాకేం వస్తుందనీ ఇప్పుడూ' సిగ్గుగా అంది శాంత చిన్న బుచ్చుకుంటూ.
'శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే మహారాజులా వస్తుంది. అంతేకాదు నాలుగు రకాల్లోనూ ప్రవేశం ఉన్నప్పుడే విద్యలోనూ రసికత్వం కల్గడం. ఇందాకన్నావ్ చూడు పాట మొరిగిస్తారని....' ఇంకా ఆ తాపం అణగలేదతనికి నయాన్న నచ్చజెప్పి భార్యకి ఆసక్తి కల్గిస్తేనే కాని లాభం లేదనుకున్నాడు రామం.
'నిజంగా వస్తుందంటారా?' భర్త చెప్పిందీ నిజమేననుకుంది శాంత
'ప్రారంభించి చూడు శాంతా. తరవాత నీకే తెలుస్తుంది.' అంటూ భార్యనీ త్వరగా రమ్మని హెచ్చరించి తను కింది కెళ్లి పోయాడు రామం.
రామం కింది కెళ్లే సరికే తయారిం పులన్నీ జానకి చేయించేస్తే వాట్లని వింత వింత అందాలతో తెల్లగా గుడ్డలు పరిచిన బల్ల మీద గాజు ప్లేట్ల ల్లో అమర్చింది సుధ. హాయిగా నిద్రపోయి లేచిన తన భార్య సావకాశంగా ముస్తాబై అతిధులంతా వచ్చేసరికి అక్కడ కొస్తే, అప్పటి వరకూ అంత చాకిరీ చేసిన జానకీ, సుధా, తీరా ఆ సమయానికి చాటుకి వెళ్ళపోవడం చూచినా పార్వతమ్మ గారికే కాక రామాని క్కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 'ఇన్ని విద్యల్నీ ప్రసాదించిన దేవుడు సుధకీ ఒక్క వంకరా పెట్టి ఎందుకిలా బాధించాలీ' అనుకుని చాలా బాధపడింది వారి మనసు.
విందుకొచ్చిన వారిలో చాలామంది ఉత్తర హిందూస్తానానికి చెందిన వారవడం వల్ల ఈ కొత్త కొత్త పద్దతుల్లో తయారించిన విందు ని ఎంతో మెచ్చుకున్నారు. పార్వతమ్మ గారికి హిందీ గాని ఇంగ్లీషు గాని రాదు. అయితే అంత ఆడంబరంగా అలంకరించుకుందుకు తెలిసిన శాంత కి ఒక్క తెలుగు తప్ప మరే భాషా రాకపోవడం చూసి శర్మ గారు, రఘూ మొదలైన వారందరి తో పాటూ ఆ వచ్చిన వారూ కూడా ఎంతో ఆశ్చర్య పోయారు.
ఎవ్వరేమడిగినా అర్ధం కాకుండా అందరి ముందూ అలా తిరగడం శాంత కీ చెప్పరాని అవమానాన్ని కల్గించింది. అయినా ఆ రెండేళ్ళ బట్టీ జానకినీ, సుధనీ అంత లోకువ తనంగా చూసి, ఇప్పుడెం మొహం పెట్టుకుని వార్ని విద్య నేర్పవలసింది గా అర్దిస్తుందని తను? మరి వేరే మార్గం! పాతికేళ్ళు పైబడ్డ తనిప్పుడు బయటవారి వద్ద మొదట్నుంచీ నేర్చు కోవడమంటే, అంతకన్నా అవమానం మరొకటుంటుందా?'
అయినా, అసలు జానకినీ, సుధనీ గురించి తన భర్త వద్ద కొన్ని విషయాలు తెల్సుకోవాలని అన్నాళ్ల తరవాత అప్పటి కనిపించింది శాంతకి.
సుధ పెద్దదైనాక తనకే సిగ్గనిపించడం వల్ల ఇల్లు కదలడం మానేసింది గానీ, అదివరకు ఏదన్నా మంచి సినిమా అదీ చూడాలనంటే రఘు అమిత జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొచ్చే వాడు. పెరిగి పెద్దదయ్యాక ఎక్కడికీ ఇల్లు కదలడం మానేసిన సుధని చూస్తె అందరికీ చాలా కష్టంగా వుంటుందేది ఒకసారి వో మంచి సినిమా వచ్చి, అందరూ ఆ సినీమా కి రెండేసి మూడేసి మార్లు చూస్తుండడం విని, సుధ ఆ వెళ్లిన వార్నడిగి కధ వింటుండేది. రఘు తీసు కెళ్తనంటే సుధ ఎందువల్లో వెళ్లలేదు. అయితే అతనితో సుధ ఎందుకు వెళ్లలేదో అర్ధం చేసుకున్న రామం ఎవ్వరికీ కనిపించకుండా నీకు సినిమా చూపించి తీసుకొచ్చే పూచీ తనదంటూ, పంతంగా సుధని ప్రయాణం చేయించాడు. రామం మాటిచ్చిన ప్రకారం లైట్లు అర్పి , అట ఆరంభం అవుతున్నప్పుడు సుధని ఎవ్వరూ పరిశీలనగా చూడ కుండేటట్లుగా తీసుకెళ్లి కూర్చో పెట్టి మళ్లీ ఆఖర్నా అలాగే లైట్లు వేసేలోగా తీసుకొచ్చి కార్లో కూర్చో పెట్టేశాడు రామం. ఇక ఆరోజు సుధ ఆనందానికి మేరె లేదు. ఆ మర్నాడు ఇంట్లో వాళ్ళందరూ వో ముఖ్య స్నేహితులింటికి పెళ్లికి వెళ్ళవలసొచ్చి కొంచెం అనారోగ్యం కారణంగా ఇంట్లో వుండి పోయిన రఘుని సుదకి సాయంగా వుంచి మిగతా అంతా వెళ్లారు.
'మొన్న ఏదో సినిమా చూసోచ్చినట్టున్నావ్. ఏవిటి కదా' అని అడిగాడు. చాలాసేపు సుధకి పాఠాలు చెప్పడం అయ్యాక అన్నాడు రఘు.
'అదా?' అంటూ ఉత్సాహంగా ఆ కధంతా చెప్పింది సుధ. అదొక ప్రేమ జీవుల గాధ.
'ఆ పిక్చర్ చూశాక నీకే మనిపిస్తుంది?' అన్నాడు తాపీగా రఘు.
'నాకా! దైవ కృప వల్ల నీ భవిష్యత్తూ అలాగే ఆనందంగా గడిచిపోవాలని అనిపించింది బావా' తృప్తి నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ అంది సుధ.
'అంటే ఏ విషయం లో'
'ఒకటేమిటి అన్ని విషయాల్లోనూ. అలాగే చదువుకున్నదై అలాగే కుడి భుజం లా నీతో పాటు తనూ ఉద్యోగం చేస్తూ, అలాగే నాట్యం, సంగీతం కారు డ్రైవింగ్ ....అబ్బ అంత అందమైన పిల్ల నీకూ వొస్తే, ఎంత బాగుంటుంది బావా?' చిన్న పిల్లలాగ సంతోషం పట్టలేక కేరింత కొట్టేసింది సుధ 'నిజంగా నువ్వలాగ అనుకుంటూన్నావ్?' ఆశ్చర్యపోతూ అడిగాడు రఘు.
'నీకు తగిన అటువంటి చెలాకీ అయిన భార్యతో నువ్వు--'
'సుధా. అపు' రఘు హృదయం లో ఏదో అర్ధం కాని ఆందోళన బయల్దేరింది. 'అబ్బ నిజంగానే గనక అలా ఒక సుందరాంగిని గనక తను వలచి వరిస్తే! అప్పుడీ అమాయకపు సుధని, మనసంతా తన మీదుంచుకుని ఉన్న పాటి, శక్తేదో ఎప్పుడూ తన సదుపాయాలకే వినియోగిస్తూ, ఇలా నిష్కపటంగా మసులు కుంటుంటే సుధని ఇలా చనువుగా ప్రవర్తించనిస్తుందా? ఆ వలపుల రాణి అసలు సుధతో కలసి వుండడానికీ సుధని చూడ్డానికీ కూడా అపార్ధాలు బయల్దేరితే అప్పుడూ? భగవంతుడా నా బుద్ది అలా చలింప జేసి ఈ అమాయకురా లికి ద్రోహం తలపెట్టకు. నాకు స్థిరభావం మనో నిబ్బరం ప్రసాదించు ' అని మనసారా తన ఇష్ట దైవాన్ని ప్రార్ధించు కున్నాడు రఘు.
'ఏవిటి బావా! అంతాలోచనా! అప్పుడే ఆ అందాల రాణి గార్ని తలచి ఊహ ప్రపంచం లో తేలి పోతున్నావా?' కిలకిలా నవ్వింది సుధ.
'లేదు సుధా' చాలా శాంతంగా అన్నాడు రఘు. సుధ కింత సరసమైన భావాలు తెలుసునని ఇంతవరకూ ఎప్పుడూ అనుకోలేదు రఘు. 'మాటలూ, ఆటలూ పెరిగి పెద్దదవుతున్న కొద్దీ వాటంతటవే వచ్చి నట్టు యుక్త వయసొచ్చే సరికే ఈ భావాలూ వాటంతటవె వస్తాయి గావల్ను ' అనుకున్నాడు రఘు.
'పాపం మధ్య మధ్య మాట్లాడించి నీ తలంపుల కంతరాయం కల్గిస్తున్నాను గావల్నేం' జాలిని అభినయిస్తూ అంది చేతులోని అల్లికను ఆపేసి.
'సుధా'
'ఏం బావా?'
'నేనోకటడుగుతాను నిజం చెప్తావా?'
'అడుగు బావా!' రఘు మొహంలోకి చూస్తూ అంది.
'నీకు ఆ మోస్తరు గా వుండాలనేదా'
'అంతే?'
'అదే ఇందాక వర్ణించావే . నాకు తగినటువంటి--'
'నువ్వు కూడా నన్ను పరిహసిస్తున్నావా బావా!' ఒక్కసారిగా సుధ మొహం ముకుళించుకుపోయింది.
'అబ్బెబ్బే? యదార్ధం గానే అడిగాను సుధా సుధ ముహాభావం చూసి కలవర పడుతూ అన్నాడు రఘు.
'తాహతు కి మించిన వస్తువుల కోసరం తత్తరపడే స్వభావం కాదు బావా నాదీ' సుధ కళ్ళల్లో నీరు తిరిగింది.
'సుధా!' గాభారపడుతూ సుధ వేపుకి వంగాడు కూర్చున్న పళాన్నే కుర్చీతో సహా రఘు.
'ఎంతవరకూ దేనికి ఆశపడ వచ్చో, ఎంతవరకు నే చనువు తీసుకో వచ్చో, అంతవరకూ వుండేందుకే నేనలవాటు చేసుకున్నాను బావా!'
'అబ్బ నువ్వు నా మాటని సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు సుధా! భగవంతుడు అందర్నీ ఒక్కలాగే పుట్టించాడు. అందరికీ ఒకలాంటి హృదయాన్నే ఇచ్చాడు కూడా. అలాంటప్పుడు అందరి వాంఛలూ ఒకేలా వుండడం లో తప్పేమ ఉందీ' అన్న భావం తోటే నేనిలా అడిగాన్నిన్ను.
'కాదు బావా, కాదు దేవుడందర్నీ ఒకలాగే పుట్టించాడు, హృదయాన్నిచ్చాడు. అయితే అందరి హృదయాలలోనూ అన్ని సుఖాల్ని మనం కూడా అనుభవించాలి ' అన్న వాంచల్నిచ్చిన ఆ దేవుడు , అందరికీ ఒకేలాంటి అదృష్టాన్ని మాత్రం ఇవ్వడం లేదు. పెద్దలన్నట్టు ఇది విధి కృతాన్నీ పూర్వజన్మ సుకృతాన్నీ బట్టి ఏర్పడుతుందనుకున్నా , ఇప్పటి వారన్నట్టూ ఈ విషయం లో తగన హెచ్చరింపు తీసుకొని కారణంగా స్వయం కృతం వల్ల సంభవిస్తుందన్నా దీని అనుభవం మాత్రం ఒకే విధం గనుక వారి వారి అదృష్టానికి తగినట్టూ వారి వాంఛల్నీ పరిమితం చేసుకోవడం మాత్రం చాలా విదాయకం కదా బావా? అలా చేసుకోగల్గితేనే జీవితంలో కొంచెం శాంతి లభించడం ' శూన్యం లోకి చూస్తూ అంది సుధ.