Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 21


    "సాయంకాలం హాస్టల్ కు రండి. మీతో పర్సనల్ గా మాట్లాడాలి" అని వుంది అందులో, ఉబ్బితబ్బిబ్బై పోయాడు. తెలిసిన వాళ్ళందరినీ పిలిచి ఈ విషయం చెప్పాలనిపించింది. ఈ ఉత్సవం తనకే స్వంత మనిపించింది.
    రూమ్ కి వెళ్ళి ఉన్నంతలో చక్కగా డ్రస్ చేసుకున్నాడు. ఆరు గంటల ప్రాంతాన హాస్టల్ కి వెళ్ళాడు?
    అతని కోసమే ఎదురు చూస్తున్నట్టు మంజుల వచ్చి పలకరించింది.
    "హలో గుడ్ ఈవినింగ్."
    బ్లూ కలర్ మాక్సీలో ఆ సాయంకాలం ఆమె తూర్పు పడమర నాగరికతల సమ్మేళనంలా వుంది. ఆమె ఎత్తయిన గుండెలు వంక చూడలేక తల దించుకున్నాడు. ఆమె ఆ విషయం పట్టించుకోనట్టు వుండిపోయింది.
    తన చెల్లెళ్ళూ అలాంటి డ్రస్సులు వేసుకుంటే బావుండనిపించింది. పాపం తన చెల్లెళ్ళు ఎప్పుడూ చిరిగిపోయిన బట్టలే వేసుకోవడం గుర్తొచ్చి బాదేసింది.
    తను విష్ చేస్తే ప్రతి స్పందించకుండా అలా బొమ్మలా నిలబడిపోయిన అతని వంక ఆశ్చర్యంగా చూసింది.
    "ఏమండీ ఆంజనేయులుగారూ" గట్టిగా పిలిచింది.
    "ఆఁ" అన్నాడు కంగారుగా.
    "ఏమిటిలా శిలలా అయిపోయారు?"
    అతను వెర్రి నవ్వొకటి నవ్వాడు.
    "వస్తారో రారో అనుకున్నాను."
    "ఎందుకు రానండి. పిలిచింది ఎవరనుకున్నారు - గ్రేట్ మంజులా దేవి ప్రళయం వచ్చినా, ప్రపంచ యుద్ధం వచ్చినా వచ్చివుండేవాడినే. దేవత అనుగ్రహిస్తానంటే భక్తుడు రాకుండా వుండగలడా!" అని అనాలి. కానీ అతను నీళ్ళు నములుతూ వుండిపోయాడు భయం- ఎదుటి వాళ్ళంతా తనకంటే గొప్ప వాళ్ళన్న నిమ్నతా భావం, వినయం ఇవన్నీ అలవాటైపోయిన గుణాలు అతనికి రకరకాల అనుభవాలు అతన్ని అలా తయారు చేశాయి.
    చిన్నప్పుడు మరీ బలహీనంగా వుండేవాడు. అందుకే తోటిపిల్లలు అతడ్ని ఆటల్లో చేర్చుకునేవారు కారు.
    "రేయ్ మా జట్టులో వాడు వద్దు" అని రెండుపక్కల వాళ్ళూ చేర్చుకునేవారు కాదు. ఏ ఆట ఆడదానికైనా బలం కావాలి. అది లేని అతన్ని జట్టులో చేర్చుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అదిగో అలాంటి క్షణాల్లోనే తనలో తానే కుంగిపోయేవాడు. తను అందరికంటే తక్కువ వాడన్న భావన రక్తంలో కలిసి పోవడం ప్రారంభించింది. తోటి పిల్లలు పేరుతో పిలిచే వాళ్ళు కారు. 'బక్కోడా - చీపురు పుల్ల- కొంగ' అనే పెట్టుడు పేర్లు వినీ వినీ అతను కొంతకాలానికి తన అసలు పేరే మరిచి పోయాడు.
    ఓసారి మాత్రం ఎంతో ప్రాధేయపడ్డ తరువాత అతన్ని కబాడీ ఆడేందుకు ఓ జట్టులో చేర్చుకున్నారు.
    కబాడీ ప్రారంభమైంది.
    తను చూడడానికి సన్నగా వున్నా తనూ బలవంతుడని వూరికంతా చాటడానికి అంతకంటే మంచి అవకాశం దొరకదనిపించింది. అందుకే చాలా పట్టుగా ఆడడం ప్రారంభించాడు.
    మొదట అవతల జట్టులో వున్న జగదీష్ వచ్చి కూతకూయడం ప్రారంభించాడు. ఆరోగ్యంగా, బలిష్టంగా వున్న అతన్ని పట్టుకోవడానికి అందరూ జంకుతున్నారు. ఇదే మంచి అదననుకున్నాడు ఆంజనేయులు. ఏదో తెలియని శక్తి అతన్ని ముందుకు తోసింది. మెరుపు వేగంతో ముందుకు కదిలి జగదీష్ కాళ్ళు పట్టుకున్నాడు దాంతో మోకాళ్ళు భూమికి రాసుకున్నాయి. జగదీష్ కూత ఆపేసి అబ్బా అంటూ మూలిగాడు అతనికి మోకాళ్ళు గీచుకోవడాన్ని చూసిచుట్టూ మూగినజనం ఎంతో బాధపడ్డారు. 'అయ్యయ్యో' అంటూ సానుభూతి చూపారు. పట్టుకునే విధం అదికాదని రాంగ్ గా పట్టుకున్నాడని అంటూ జనం ఆంజనేయుల్ని దులిపేశారు. జనం అంతా ఎందుకు తనను తప్పు పడుతున్నారో జగదీష్ కు ఏదో చిన్న దెబ్బ తగిలితే ఎందుకంతగా ఫీలైపోతున్నారో అతనికి అర్ధంకాలేదు.
    తిరిగి ఆట ప్రారంభమైంది.
    ఆంజనేయులు కూత కూస్తూ అవతలికి వెళ్ళాడు. దీని కోసమే చూస్తున్న జగదీష్ ఒక్క ఉదుటున అతని పైన పడ్డాడు. అడ్డదిడ్డంగా అంత ఎత్తూ లావూ వున్న అతను మీద పడగానే ఆంజనేయులు తూలి కిందపడ్డాడు. పెదవులు చిట్లి రక్తం కారింది. ముఖమంతా గీసుకుపోయింది. ఒక పన్ను వూడింది. అది నోట్లో పడడంతో అదేమిటో తెలియని ఆంజనేయులు దానిని చేత్తో బయటకు తీశాడు. తెల్లటి పన్ను రక్తంతో తడిసి అక్కడక్కడా ఎర్రగా మారింది. చుట్టూ వున్న జనం అదేదో జోక్ లాగా అనిపించి విరగబడి నవ్వుతున్నారు. పరిహసిస్తున్నారు. గేలి చేస్తున్నారు.
    అతన్ని ఎవరూ లేవనెత్తలేదు. సానుభూతి చూపడం లేదు. పై పెచ్చు జగదీష్ ను మెచ్చుకుంటున్నారు.
    ఆ క్షణంలో అర్ధమైంది. ఆ చిన్నారికి బలవంతుడు గెలిస్తేనే సహజంగా అనిపిస్తుంది జనానికి. తనలాంటి బలహీనుడు బలవంతుడ్ని ఓడించడాన్ని జనం సహించరు.
    పోటీ ప్రపంచంలో డబ్బుదే ప్రధాన పాత్ర. అది మనిషికి ఎక్కడలేని గ్లామర్ ను తెచ్చిపెడుతుంది. పదిమందిని పోగు చేస్తుంది. వాళ్ళంతా తాను చెప్పినట్టు నడుచుకునేట్టు చేస్తుంది.
    తనలాంటి వాడికి నాలుక తెగిపోయినా రక్తం కారిపోయినా ఎవరూ పట్టించుకోరు అదే జగదీష్ కు కొద్దిగా శరీరం గీచుకుపోయినా సంఘం ఏడుస్తుంది. శత్రువు మీద కోపం ప్రకటిస్తుంది. దగ్గరకు తీసుకుని ఓదారుస్తుంది.
    ఇలాంటి అసహజమైన లక్షణాలున్న మనుషులంటే ఆ క్షణంలో భయం పట్టుకుంది అతనికి. వయసు పెరిగేకొద్దీ అది ఎక్కువైంది కానీ తగ్గలేదు.
    అందుకే అతను మంజుల అడిగే ప్రశ్నలకు ఠక్కున జవాబు చెప్పలేక పోతున్నాడు. నేల చూపులు చూస్తున్నాడు?
    "ఎనీ హౌ! నేను పిలవగానే వచ్చారు. థాంక్స్" అంది మంజుల.
    "రండి - అలా కూర్చుందాం" అని ఓ సిమెంట్ బెంచీ వైపు నడిచింది.
    ఇద్దరూ కూర్చున్నారు.
    "చెప్పండి. ఏమిటి విశేషాలు?"
    అతను ఇబ్బందిగా నవ్వాడు. ఎదుటి వాళ్ళకు చెప్పేందుకు అతనికి విశేషాలు లేవు. మొన్నో రోజు సాయంకాలం బాగా ఆకలేస్తే హోటల్ కు వెళ్ళలేక ఎలా ఇబ్బంది పడిందీ చెప్పాలి. గత ఆదివారం నాడు ఇంటికి వెళితే తను కట్టుకోవడానికి బట్టలు లేవని పేచీ పెడుతున్న చెల్లెల్ని నాన్న ఎంత భయంకరంగా కొట్టాడో చెప్పాలి. తన తమ్ముడు సినిమా చూసి తిరిగి వూరెళ్ళడానికి టికెట్టుకు డబ్బు లేకుండా రైల్లో వస్తుంటే స్పెషల్ స్వ్కాడ్ పట్టుకున్న విషయం చెప్పాలి. వారం రోజులపాటు వాడు జైల్లో వుండడాన్ని గురించి వివరించాలి.
    అవి తప్ప అతని దగ్గర ఏమీ లేవు. అవి బాధలుగానీ విశేషాలు కావు. అందుకే అతను నెలలు నములుతున్నారు.
    "మీతో ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి పిలిచాను."
    ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు ఆంజనేయులు ఏమిటది? తనను ప్రేమిస్తున్నానని అంటుందా! తనను ఇంతకాలం నిశ్శబ్దంగా ఇష్టపడుతున్నానని అంటుందా! చదువులాగిపోయాక పెళ్ళి చేసుకుందామని అడుగుతుందా! ఏం చెబుతుందా ఉత్కంఠతో రక్తం చల్లబడ్డట్లనిపించింది.

 Previous Page Next Page