Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 19

   

      తనమాట విశాల అలా అపార్ధం చేసుకుంటుందని అనుకోలేదు సునీత. విశ్వంవైపు చూసింది. తల దించుకుని చిన్నగా నవ్వుకున్నాడతను.
   
    "నేనా వుద్దేశ్యంతో అనలేదు. పనేమయినా వుంటే నాకు చెప్పు. చదువుకుంటున్న పిల్లలతో చేయించకు" లేచి లోపలకు వెళ్ళి పోయింది.
   
    సునీతకు చాలా బాధ అనిపించింది. వదిన అలా అన్నందుకు కాదు, విశ్వం అంత అవకాశవాదిగా తయారయినందుకు. తప్పు అతడిది కాదు, అతన్నలా తయారుచేస్తున్న విశాలది. విశాల ఎందుకలా ప్రవర్తిస్తుంది? అదంతా భర్తమీద ప్రేమా! వాళ్ళ బామ్మావాళ్ళు చెప్పిన పతివ్రతా లక్షణాలా? ఆ ప్రశ్నలకు సమాధానం కొద్దిరోజుల తర్వాత తెలిసిందామెకు.
   
                                 3
   
    రంజాన్ మూలంగా ఆ రోజు సెలవు. సాధారణంగా అలాంటి సెలవు రోజుల్లో రెండో మూడో సినిమా కేసెట్లు తెచ్చుకుని స్నేహితులందర్నీ పిలిచి కూర్చుంటారు. అనుకోకుండా విశ్వం క్యాంప్ కి వెళ్ళడంతో ఇల్లు ప్రశాంతంగా వుంది.
   
    భోజనాలై తీరిగ్గా కూర్చున్నాక విశాల మంచి మూడ్ లో వుండడం గమనించి అడిగింది సునీత.
   
    "వదినా! కోపం తెచ్చుకోనంటే నేనోమాట అడుగుతాను".
   
    "అడుగు కోపం దేనికి? నాది కాస్త షార్ట్ టెంపర్ అన్నమాట వాస్తవమే కాని అది కాస్సేపే. తర్వాత అంతా మర్చిపోతను ఏమిటది?"
   
    "ఇద్దరు పిల్లల తండ్రయ్యాక కూడా అన్నయ్యకు ఇంటిబాధ్యతలు అప్పచెప్పకుండా ఆడపనులు, మగపనులు నువ్వే చేసుకుంటా వెందుకు? నా వుద్దేశం నీకు అన్నయ్యంటే విపరీతమైన ప్రేమ. నిజమేనా?"
   
    "నా మొహం ప్రతి ఆడదానికీ మొగుడిమీద ఆ మాత్రం ప్రేమ వుంటుంది. కాకపోతే నా వుద్దేశ్యంలో భర్త మన చెప్పుచేతలలో వుండాలంటే అతడు పూర్తిగా మనమీద ఆధారపడేటట్లు చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళరు. ఎంతయినా మగవాళ్ళుకదా మనసు చంచలం మన జాగ్రత్తల్లో మనం వుండక తప్పదు. ఈ రహస్యం నాకు మా బామ్మ చెప్పింది నా అనుభవంలో అది అక్షరాలా నిజమని రుజువయింది కూడా".
   
    "భార్యాభర్తల బంధం అంత సున్నితమయిందంటావా? కొద్దిగా పని చెపితేనే దూరం అయిపోతారంటే నేను నమ్మను అందులో అన్నయ్య బాగా చదువుకున్నవాడు శాస్త్రాలతో సహా అధ్యయనం చేసినవాడు తను అంత బలహీనుడవుతాడంటే నేను నమ్మను".
   
    "ఎంతయినా మగవాడు మగవాడే. అతడి బుద్దే అంత. కాబట్టి మన జాగ్రత్తలో మనం వుండక తప్పదు! నువ్వు మీవార్ని ఒంటరిగా విదేశానికి పంపడం నాకు నచ్చలేదు. ఏదయినా జరిగితే తర్వాత బాధపడాల్సింది నువ్వే. నేనిలా అంటున్నానని ఏమీ అనుకోకు. వాస్తవం చెపుతున్నాను. అసలు నువ్వు అతడితో ఎందుకు వెళ్ళలేదు?"
   
    "ఆయన వెళ్ళింది అరబ్ దేశం. స్త్రీలకు బయటకు వచ్చే స్వాతంత్ర్యం కూడా లేదక్కడ. నాలుగ్గోడల మధ్య మగ్గిపోవాల్సిందే. బయటకు వెళ్ళాలంటే బురఖా వేసుకోవాలి. అలాంటి వాతావరణంలో నేనుండలేను".
   
    "అలా అనుకుంటే ఎలాగ? నేనయితే ఛస్తే మావార్ని వదిలి కొద్దిరోజుల కంటే వుండలేను. అదయినా తప్పనిసరి పరిస్థితులలోనే..." విశాల ఇంకా ఏదో అనబోతూంటే, ఎదురుగా గుమ్మంలో ఆమె బామ్మ కనిపించింది. తన వయసును కూడా మర్చిపోయి "బామ్మా!" చిన్న పిల్లలా పరుగెత్తుకెళ్ళి ఆమెను వాటేసుకుంది విశాల.
   
    మొక్కుబడిగా వాళ్ళ దగ్గర కాస్సేపు కూర్చొని వాళ్ళు కబుర్లలో పడగానే లేచి గదిలోకి వెళ్ళిపోయింది సునీత. ఆమె మనసు నిండా అంతులేని బాధ, నిరాశ.
   
    బామ్మ వచ్చాక ఆ ఇంటిలో పరిస్థితి మరింత ఘోరంగా కనిపించింది సునీతకి.
   
    "ఏం పిల్లా! మీ ఆయనను అలా వదిలేశావేమిటి? ఎవరయినా తగులుకోగలరు. భార్య అన్నాక మొగుణ్ణి ఆకట్టుకుంటుండాలి. లేకపోతే కట్టు తప్పిపోతారు. మా విశాలను చూడు, ఒక్కరోజు అది పక్కన లేకపోతే అలమటించిపోతాడు. అది గీచిన గీటు దాటడు. అలా గుప్పెట్లో పెట్టుకోవాలి తప్ప వొంటరిగా పంపేస్తారా?"
   
    "పోనివ్వండి. తుమ్మితే వూడే ముక్కు ఎన్నాళ్లుంటుంది? చట్టరీత్యా భార్యగా నా స్థానం ఎక్కడకూ పోదూ. అంతగా ఆయన మరెవరినైనా తెచ్చుకుంటే నేను చేయగలిగిందేమీ లేదు. నా బ్రతుకు నేను బ్రతుకుతాను" అంది సునీత వొళ్ళుమండి.
   
    "అదంతా వితండవాదం ఆ పొగరే పనికిరాదు. మగవాడి తోడు లేకుండా ఈ సంఘంలో ఆడది ఒంటరిగా బ్రతకలేదు. ఏ ఆత్మహత్యో చేసుకోవాల్సి వస్తుందంతే".
   
    "మీలాంటి స్త్రీలున్న ఈ సమాజంలో అంతకంటే వేరే పరిష్కారం ఏముంటుందిలెండి" అనబోయి ఆగిపోయింది విశ్వం రావడం గమనించి! అతడు తనకు సపోర్టుచేసి మాట్లాడతాడన్న నమ్మకం పోయిందిప్పుడు.
   
                           *    *    *
   
"వదినా, నేను నాలుగు రోజులు జయా వాళ్ళింటికి వెళ్ళివద్దామనుకుంటున్నాను" అంది సునీత.
   
    "ఎందుకట?" అడిగింది విశాల ముఖం చిటపటలాడిస్తూ.
   
    "ఏం లేదు! పోయిన నెలలో నీకు విషయం చెప్పలేదని ఇల్లంతా కడుక్కుని పసుపు నీళ్ళు చల్లుకున్నావు. ఆ కష్టం నీకు కలిగించకూడదని".
   
    విశాల విషయంలో చాలా పట్టింపు కాబట్టి మరేం మాట్లాడలేక పోయింది. కాస్సేపు ఆలోచించి అంది-
   
    "నీకు తెలియదు సునీతా, ఆ జయ గుణం మంచిదికాదు. అందుకే అభ్యంతరం చెప్పాను. అది మీ అన్నయ్యను వలలో వేసుకోవడానికి ప్రయత్నించింది. పెళ్ళీ పెటాకులూ లేవు. నా కాపురంలో చిచ్చు పెట్టటానికి పూనుకుంది".
   
    "జయ అలా చేసిందా?" ఆశ్చర్యంగా అంది సునీత విశ్వం అన్నయ్య నోరెత్తగానే జయ ముఖం పాలిపోవడం, అత్తయ్య మాటలు గుర్తొచ్చాయి.
   
    "ఆ! మీ జయే మా పెళ్ళయిన కొత్తలో ఎవడివెంటో పడిందని విన్నాను. ఏమయిందో వాడు కాస్తా టోకరా ఇచ్చి పోయాడట. మీ అన్నయ్య అమాయకత్వం తెలుసుగా కన్నేసింది".
   
    "జయకు అన్నయ్యంటే చాలా యిష్టం అని నాకు తెలుసు. అంత మాత్రంచేత అంత దిగజారుతుందని నేననుకొను. నువ్వు అపార్ధం చేసుకున్నావేమో వదినా!"
   
    "అది వ్రాసిన ప్రేమలేఖలు చూపించమంటావా? మీ అన్నయ్య చెయ్యి తగిలితే పరవశించి పోతుందట. ఆయన కౌగిట్లో పదే పదే నలిగి పోవాలనుందట. ఎంత అసహ్యంగా రాసిందో రోజూ మీ అన్నయ్య ఇంటికి ఆలస్యంగా వస్తుంటే ఏమో అనుకున్నాను. తర్వాత తెలిసింది. ఫోన్ లు చేసి ఏడుపులట. ఒకసారి రమ్మని".
   
    "అంటే అన్నయ్య సహకారం కూడా వుందన్నమాట. తనే మన్నాడు?"
   
    "ఆయనేమంటారు? చేసిందంతా అది. పెళ్ళి చేసుకోవడానికి మగవాడే దొరకనట్లు పెళ్ళయిన మగాళ్ళవెంట పడడం ఒకసారి వెళ్ళి శుభ్రంగా దులిపేశాను ఆ తర్వాత వదిలింది. అందుకే నువ్వు అక్కడకు వెళ్ళడం నాకిష్టం లేదు. చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పాను. ఆపైన నీ ఇష్టం ఏదో మనసులో వుంచుకుని పైకి మరొకటి మాట్లాడే స్వభావంకాదు నాది. అందుకే ఫ్రాంక్ గా చెపుతున్నాను".
   
    సునీతకేం చేయాలో తోచలేదు. చాలామంది అదో గొప్ప గుణం అనుకుంటారు. మనసులో ఏదో వుంచుకుని పైకి మరోలా మాట్లాడక పోవటం.
   
    "ఇవన్నీ నాకు తెలియవు వదినా! అన్నయ్యనడిగితే నిన్ను అడిగి వెళ్ళమన్నాడు. ఇప్పుడు నేను మానుకుంటే నువ్వే వద్దన్నావాని అనుకుంటాడే" అంది తెలివిగా.
   
    "అవునులే! అయితే సరే. వెళ్ళిరా కాని నువ్వు నాకో మాట ఇవ్వాలి".
   
    "ఏమిటి?"
   
    "జయ గురించి నాకు సరిగ్గా తెలియదు కాబట్టి చెప్పాను. మీ అన్నయ్య దగ్గర మట్టుకు నేనిలా చెప్పానని తెలియనివ్వకు. బాధపడతారని నేను కూడా ఆ విషయం ప్రస్తావించను".
   
    "అలాగే వదినా! నాకూ తెలుసు ఇవన్నీ చాలా సున్నితమయిన విషయాలు".
   
    విశాల లోపలి వెళ్ళిపోయాక ఆలోచనలో పడింది సునీత జయ తనకు చిన్నప్పటి నుంచీ బాగా తెలుసు. విశ్వం అన్నయ్యంటే ఆమెకు చాలా అభిమానం వున్నమాట నిజమే. కాని ఇంతటి నీచానికి ఎలా పాల్పడింది! అన్నయ్య సహకారం ఎంతవరకూ వుంది! విశాల ఒక కోణం లోంచే జరిగిన విషయం చెప్పింది. జరిగినదేమిటో జయను కూడా అడగడానికే నిశ్చయించుకుంది.
   
                                4
   
    "విశాల నీ దగ్గర తప్పకుండా ఆ ప్రస్తావన తెస్తుందనీ ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నన్నీ ప్రశ్న అడుగుతావనీ నాకు తెలుసు. నువ్వడక్కుండానే చెబుదామనుకున్నాను కాని నీకు మీ విశ్వం అన్నయ్య మీద కొండంత నమ్మకం. వాళ్ళ దాంపత్యం వేలెత్తి చూపించలేనిదని గాఢ విశ్వాసంతో వచ్చావు. నా మాటలు నమ్ముతావో లేదోనని అనుమానించాను" సునీత అడిగిన ప్రశ్నకు జవాబుగా అంది జయ. సునీత స్థాణువులా కూర్చుండిపోయింది.

 Previous Page Next Page