సంయమనం
"నాన్సెన్స్! నేనమ్మను" అన్నాడు చేతిలో కార్డు పడేస్తూ.
"అదో సైకాలజీ....అంతే" అన్నాడు డాక్టరు.
రాత్రి తొమ్మిదయింది. బయట సన్నగా వర్షం పడుతూంది. ఆట మందకొడిగా సాగుతూంది.
"ఏమిటి విషయం?" అప్పుడే వచ్చి ఆటలో కూర్చున్న మూర్తి అడిగాడు డాక్టరు చెప్పటం మొదలుపెట్టాడు.,
వినేవాళ్ళుంటే చాలు, చెప్పిందే విసుగు లేకుండా ఈ డాక్టరు ఎన్నిసార్లయినా చెబుతాడు.
"సారధి అని ఒకతను నా దగ్గరికి వచ్చాడు. పుట్టుగుడ్డి అతను...." చెప్పసాగాడు. "చిన్నతనంనుంచీ ప్రపంచంలో అందాలన్నిటినీ వూహించుకుంటూ వుండేవాడనుకుంటా. నేను అతన్ని పరీక్షచేసి చిన్న ఆపరేషన్ ద్వారా కళ్ళు వస్తాయని చెప్పినప్పుడు అతని ఆనందం వర్ణనాతీతం. 'అన్నీ చూడగలను గదా- అన్నీ చూడగలను కదా' అని రెట్టించి అడిగాడు. ప్రపంచాన్ని గెలవబోతున్నంత సంతోషం అతడిలో కనిపించింది" కార్డ్స్ పంచడం కోసం డాక్టర్ ఆగాడు.
బయట వర్షం కొద్దిగా ఎక్కువైంది.
"ఆపరేషన్ జరిగి అతడికి కళ్ళు వచ్చేయా?"
"వచ్చాయి" డాక్టర్ అన్నాడు - "కానీ ఆ తరువాత అతను పదిరోజులకి చెకింగ్ కి వచ్చినప్పుడు ఒక దారుణమైన విషయం కనిపెట్టేను. ఒక 'నర్వ్' దెబ్బతిన్న కారణంగా అతడి చూపు మళ్ళీ పోబోతోంది. ఈసారి అతనికి ఏ ఆపరేషనూ రెండోసారి కళ్ళు తేలేదు. ఈ వార్త వినగానే అతడు నిశ్చేష్టుడై చాలాసేపు మాట్లాడలేదు. మొహం రక్తం లేనట్లుగా పాళీపోయింది. చాలా హీనమైన కంఠంతో 'మళ్ళీ ఎన్నాళ్ళకి నేను నా పూర్వపు దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోతాను డాక్టర్' అని అడిగేడు.
చెప్పాను. అతను తనలో తానే ఆలోచించుకుంటున్నట్టు అతడు చేతిగోళ్ళకేసి చూసుకుంటూ కుర్చీలో అలాగే కూర్చుని, "ఆ తరువాత మౌనంగా అతను లేచి వెళ్ళిపోయాడు మళ్ళీ నా దగ్గరకు రాలేదు" డాక్టర్ చెప్పడం ఆపాడు.
"ఇందులో సైకాలజీ ఏముంది?" అడిగాడు మూర్తి.
"అసలు పాయింటు ముందే వుంది" అన్నాన్నేను.
"సారధి సైట్ సీయింగ్ కోసం బయల్దేరేడని తరువాత నాకు తెలిసింది. కళ్ళున్న నాలుగు నెలల్లోనూ అందాలన్నీ చూసెయ్యాలనుకోవడంలో చిత్రమేమీలేదు. కానీ....." ఆగి, నెమ్మదిగా అన్నాడు - "రెండు నెలలు తిరిగేసరికల్లా సారధి తన కళ్ళని తానే పొడిచేసుకున్నాడు. అంటే స్వభావసిద్దంగా పోవటం కోసం నాలుగు నెలలూ ఆగలేదు."
"ఫెంటాస్టిక్" అన్నాడు మూర్తి "కానీ ఎందుకు?"
"అదే ప్రసన నేనూ వేశాను" అన్నానునేను. "అదేం సైకాలజీయో నాకర్ధం కాలేదు."
"రోజలు గడుస్తున్నకొద్దీ ఆ ఆనందం ఇకముందు వుండదు అన్న అసంతృప్తి, దాన్ని అనుభవించేటప్పటి సంతృప్తికన్నా ఎక్కువై అలా ప్రవర్తించి వుంటాడు" సమర్ధిస్తున్నట్టు అన్నాడు డాక్టర్.
"నాన్సెన్స్! వాదు పిచ్చివాడై వుంటాడు. కళ్ళు వున్నంతకాలం శుభ్రంగా అనుభవించక అదేం పోయేకాలం?" అన్నాడు మూర్తి.
"ఓ.కే- మీరిద్దరు, నేనొక్కన్ని. అది సైకాలజీ కాదు, పిచ్చితనమే సరేనా" అన్నాడు డాక్టర్. మా మెజారిటీ నిర్ణయాన్ని ఒప్పుకుంటున్నట్టు. నా ఆలోచన గతంలోకి జారింది.
"స్వప్న" గుర్తొచ్చింది. నా భార్యకూడా గుర్తొచ్చింది.
* * *
"టైమెంతయింది?" తలుపు తీస్తూనే అడిగింది మహాలక్ష్మి అందులో వ్యంగ్యం గ్రహించి మాట్లాడలేదు నేను.
"మిమ్మల్నే అడుగుతోంది" అంటూ గొంతు కొద్దిగా పెద్దది చేస్తూ రెట్టించింది. టై విప్పుతున్న వాడినల్లా ఆగి నెమ్మదిగా అన్నాను - "ఆలస్యమైంది క్లబ్ ....." ఏదో చెప్పబోతూ వుంటే "క్లబ్బు..... క్లబ్బు.... క్లబ్బు.... ఆ క్లబ్బునే పెళ్ళాడలేక పోయారా?" అంది.
రాత్రి పదకొండయింది. తెరచివున్న విండోస్ లోంచి మాలతీ తీవె తాలూకు పరిమళం అలలు అలలుగా వస్తూంది. డ్రెస్సింగ్ టేబుల్ బెల్జియం అద్దంలోంచి డబుల్ కాట్ మీద వేసిన తెల్లటి దుప్పటి మల్లెపూవులా మెరుస్తూంది.
"ఈ మధ్య ఇదొకటి నేర్చుకొన్నారు."
"ఏది?" తాపీగా బూట్లు విప్పుకుంటూ అడిగాను.
"ప్రతిదానికీ మీకు కాదన్నట్టు మౌనంగా వుండిపోవటం....."
నిజమే. ముందు నేనూ మాట్లాడేవాణ్ణి. నా కలలు ఒక్కటొక్కటే కళ్ళముందు కరిగిపోతూ వుంటే నిస్సహాయతని ఆపుకోలేక మాటకు మాట చెప్పే వాణ్ణి.
కోపం భావుకత్వాన్ని చంపేస్తుంది.
ఈ నిజం గ్రహించాక ఇంట్లో నా మాటలు వినిపించటం మానేశాయి. చప్పట్లు కొట్టే రెండో చెయ్యి లేకపోవటంతో ఇంట్లో స్మశాన నిశ్శబ్దం పేరుకుపోయింది. అప్పుడప్పుడూ పాప అల్లరీ, బాబు మాటలూ తప్ప ఇంకేం వినిపించేవి కావు.
"భోజనాని కొస్తారా?"
"ఆకలి లేదు."
"ఎందుకుంటుంది? పేకాటలో ఎవడికో బాగా డబ్బొచ్చి వుంటుంది. వారు అందరికీ బాగా తాగించి వుంటాడు."
నెమ్మదిగా కళ్ళెత్తి చూశాను. జీవితాంతం కలిసి వుండి ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోవాల్సిన నా అర్ధాంగి, ఎందుకు ప్రతిక్షణం నాలో తప్పుల్నే ఎంచటానికి ప్రయత్నిస్తూంది?
నుదుటిమీద అరచెయ్యి పెట్టుకొని అలసటగా కళ్ళు మూసుకొన్నాను.
గదిలో బెడ్ లైట్ కాంతి మందంగా పరచుకొని వుంది. లోపల వాష్ బేసిన్ దగ్గిర ఏదో కడుగుతున్న చప్పుడు.
వచ్చి పక్కన చేరి "ఊ.....జరగండి ఇక" అంది.
ఆ "ఊ" "ఇక" లాటి చిన్న చిన్న పదాలు నన్ను బాధపెడుతూ వుంటాయి. పైకి వ్యక్తం చేసుకోవటానికి వీల్లేని బాధ......గుండెల్ని లోతుకంటా సున్నితంగా కోసే బాధ.
"ఏమన్నానని అంత కోపం?" మోచేతిమీద పక్కకి తిరుగుతూ అంది.
కళ్ళు మూసుకునే అన్నాను - "కోపమా!"
"లేకపోతే మునీశ్వరుడిలా ఆ పడుకోవటం ఏమిటి?"
భారంగా పక్కకి తిరిగాను.....
గరుగ్గా తగిలే నేతచీర- నూనెతో ఎండిన జుట్టూ-కిటికీ అవతల వాడి రాలిపోయిన మల్లెలు - మొక్కుబడికోసం వున్నట్లుగా మమ్మేలియడ్ గ్లాండ్స్ దూరంగా కుక్క ఎదుస్తూంది తెల్లటి పక్కకీ, ఆవేశపు శరీరానికీ మధ్య శవం- అచేతనం, న్యూటన్ మూడో సిద్దాంతం ఏమైంది? బలమైన కడలి తరంగాల ఆవేశానికి కొండరాళ్ళు కూడా కదులుతాయే..... ఫార్మల్, ఫార్మల్ దీన్నించి పైకి వెడితే అపరిహార్యమూ, అబాధితమూ, పరమార్ధమూ, పూర్ణ సత్యమూ అయిన ప్రేమ..... కిందికొస్తే అనిశ్చతమూ, అవ్యక్తమూ, అసిద్దమూ, అసంపూర్ణమూ అయిన వాస్తవం. పురుషుడి మనసుని శారీరకంగా గెలవటం అనే కళ ఎందరు ఈవ్ లకు తెలుసు? మల్లెపూల.....
"ఏమండీ"
ఆలోచనలు చెదిరాయి..... "ఊ"
"ఈ రోజు పనికుర్రాడు రాలేదు."
ఉప్పెనలా పడే నయాగరా జలపాతపు ధారలకి ఆనకట్ట వేసి సహారా ఎడారిలో నింపాలనే అసందర్భపు ఆలోచన....
"వింటున్నారా?"
"ఊ....."
"రేపటికి కూరగాయలు లేవు. వెంకన్ని తెమ్మంటే సాయంత్రం వస్తానని మళ్ళీ రాలేదు."