"నాలుగు నలభైకి తలనొప్పి వచ్చింది" అన్నాడు సుబ్బారావు.
"సరిగ్గా నాలుగూ నలభైకే బావ ఒట్టు వేశాడు" అని సుహాసిని ఆశ్చర్యపడింది. ఆ తర్వాత అలాంటి అనుభవాలు మరికొన్ని జరిగాయి. తనకు సుబ్బారావంటే చాలా యిష్టమని సుహాసినికి అనుమానం పెరిగిపోసాగింది.
"మీరేమీ భయపడకండి. మీ బావను నేను మార్చుతాను. ఆయన వివరాలు చెప్పండి!" అన్నాడు సుబ్బారావు.
సుహాసిని అతడికి కొన్ని వివరాలు చెప్పి "మాబావను చూసి అతను మీకు ఎలా అనిపించాడో చెప్పాలి. మీ మాటలు నేను నమ్ముతాను. ఇంకెవరి మాటలూ నమ్మను" అంది.
మర్నాడే సుబ్బారావు ఏదో మిషమీద బట్టలషాపుకు వెళ్ళాడు. అక్కడ అతను ప్రభాకరం గురించి వాకబు చేయకుండా తనే కౌంటర్ దగ్గర చూశాడు. కౌంటర్లో వ్యక్తికి కాస్త వెనుకగా ఉన్న ప్రభాకరాన్ని కూడా చూశాడు. కౌంటర్లో ఉన్న వ్యక్తిని అడిగాడు. "మీ వెనకాల ఉన్న ఆ నల్లటాయన ఎవరూ?" అని.
"ఆయనే మా ప్రొప్రయిటరుగారు" అన్నాడు కౌంటర్లో వ్యక్తి.
"అంటే ఆయన పేరు ప్రభాకరమా?" అన్నాడు సుబ్బారావు.
"మీకెలా తెలుసు?" కౌంటర్లోని వ్యక్తి కాస్త వినయంగానే అడిగాడు.
"ఆయనతో నేను కాసేపు మాట్లాడాలి" అన్నాడు సుబ్బారావు.
సుబ్బారావు, ప్రభాకరం అక్కడకు కాస్త వెనుకగా ఉన్న గదిలోకి వెళ్ళారు.
"నాతో ఏం పని మీకు?" అన్నాడు ప్రభాకరం.
సుబ్బారావుకు ఏం చెప్పాలో తెలియలేదు. ఒక్క క్షణం ఆగి "ఏమీ పనిలేదండి. మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను" అన్నాడు.
ప్రభాకరం చిన్నచ్చుకుని "చూడాలనుకోడానికి నేనే మైనా జూలో జంతువునా?" అన్నాడు. అలా అన్నప్పుడతను జూలో జంతువులాగే ఉన్నాడు.
"మీ మనసు కష్టపెడితే మన్నించండి. నేను వస్తాను" అన్నాడు సుబ్బారావు.
ప్రభాకరం ఆశ్చర్యంగా "ఎందుకొచ్చాడో చెప్పరా?" అన్నాడు.
"నిజంగానే మిమ్మల్ని చూడాలనే వచ్చాను. మా అమ్మ మీద ఒట్టు."
ప్రభాకరం ఆశ్చర్యంనుంచి తేరుకునే లోగానే సుబ్బారావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రం అతను సుహాసినికి జరిగింది చెప్పాడు.
"ఎలా ఉన్నారు మా బావ?" అనడిగింది.
"అచ్చం చింపాజీలా ఉన్నాడు" అన్నాడు సుబ్బారావు.
"చింపాంజీ మా అబావలా ఉంటుందా? వినడమే కానీ నేను చింపాంజీని ఎప్పుడూ చూడలేదు. అచ్చం మీకులాగే చాలా మంది చెప్పారు. ఇంతకీ నాకో అనుమానం. చింపాంజీ అందమైన జంతువేనా?" అంది సుహాసిని.
"కాదు. పరమ వికార రూపం దానిది" అన్నాడు సుబ్బారావు.
"అయ్యో! మీకుకూడా మా బావ నచ్చలేదా?" బాధగా అంది సుహాసిని.
సుబబరావు ఆశ్చర్యంగా "మీ కాయన వచ్చాడా?" అన్నాడు.
"ఎంతో బాగా వచ్చాడు" అంది సుహాసిని అమాయకంగా.
"నా సలహా ఏమిటంటే మీ రాయన్ను పెళ్ళిచేసుకోవద్దు. అలా చేస్తే కాకిముక్కుకు దొండపండులా ఉంటారు మీరు" అన్నాడు సుబ్బారావు.
"మరెవ్వరిని పెళ్ళిచేసుకోను?" అంది సుహాసిని.
"మీ బామ్మగారికి చెప్పేయండి. ఆవిడవల్ల కాదంటే మా అమ్మకు చెబుతాను. మా అమ్మ చాలా పెద్ద వ్యవహారవేత్త!" అన్నాడు సుబ్బారావు.
"నా కెంతో నచ్చాడు. మీకెవ్వరికీ నచ్చడంలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. పోనీ అలాగైనా ఫరవాలేదనుకుంటే తర్వాత నన్ను ఎవరికైనా అమ్మేస్తాడో లేక చంపివేస్తాడోనని భయం వేస్తోంది. ఏమీ తోచడం లేదు" అంది సుహాసిని.
"ముందు మీ బామ్మగారితో అసలు విషయం చెప్పేయండి" అన్నాడు సుబ్బారావు. సుహాసిని అక్కణ్ణించి లేచింది. సుబ్బారావు కదిలాడు. పొదలచాటున రాయుడి బృందమూ కదిలింది
బామ్మగారు, సుభద్రమ్మ ఈలోకం తెలియకుండా కబుర్లలో ఉన్నారు.
"బామ్మా," అంది సుహాసిని.
"ఏమే!" అంది బామ్మ చిరాగ్గా.
"నేను బావను పెళ్ళిచేసుకోను" అంది సుహాసిని గారంగా.
"మరెవర్ని పెళ్ళిచేసుకుంటావు?" అంది బామ్మ పరధ్యానంగా.
"ఎవర్నో ఒకర్ని-ప్రభాకరం బావను మాత్రం పెళ్ళి చేసుకోను."
బామ్మ ఉలిక్కిపడి "ఏమంటున్నావ్?" అంది.
"ప్రభాకరం బావ నల్లగా ఉంటాడు. చింపాంజీ మొహం. అస్తమానూ తాగుతాడు. పేకాడుతాడు. బోగంవాళ్ళింటికి వెడతాడు. అలాంటివాణ్ని పెళ్ళిచేసుకుంటే ఏదో ఒకరోజున నన్ను చంపేస్తాడు. నాకు చాలా భయంగా ఉంది" అంది సుహాసిని.
ఈలోగా సుభద్రమ్మ అందుకుని, "ఏమిటీ, బంగారం లాంటి ఈ పిల్లని నల్లగా ఉండే కుర్రాడికిస్తారా? దీనికి మీ రొప్పినా నే నొప్పను సుహాసిని మొగుడంటే మా అబ్బాయిలా ఉండాలి. అప్పుడే ఈడూ జోడూ బాగుంటుంది" అంది.
బామ్మ కళ్ళు ఎర్రబడ్డాయి. "ఇన్నాళ్ళు ఏదో స్నేహ పూర్వకంగా మాట్లాడుతున్నావనుకున్నాను. నీ బుర్రలో ఇన్ని ఎత్తులున్నాయా తల్లీ! శాఖాంతర వివాహం మా యింటా వంటాలేదు. ఇది జరిగేమాట కాదు."
దాంతో సుభద్రమ్మ విరుచుకుపడింది. "ఎత్తు దనం పోసినా మా పిల్లాడి కింకో శాఖపిల్లనిచ్చిచెయ్యం. ఏదో మాటవరసకి ఈడూ జోడూ గురించి చెబితే దానికిన్ని అర్ధాలు తీసి ఇన్ని మాటలంటారా?"
బామ్మగారూ, సుభద్రమ్మా హోరాహోరీన మాటల పోరాటం మొదలుపెట్టారు.
కథ ఇలా తిరిగేసరికి రాయుడికి మతిపోయినట్లనిపించింది. ఆ యింట్లో బామ్మా, ఈ యింట్లో సుభద్రమ్మ చాలా కీలక వ్యక్తులు వాళ్ళిద్దరూ ఈ పెళ్ళి జరగదని తీర్మానం చేశారంటే ఇంకా జరగదు. సుహాసిని అమాయకురాలు. సుబ్బారావు తల్లి చాటు బిడ్డ. వీళ్ళిద్దర్నీ ఇంతవరకూ లాక్కొచ్చేసరికి నానా అవస్థా అయింది. ఇప్పుడిలా రసాభావం అయితే ఎలా?