"డాక్టరు"
"ఊ"
"ఏమిటిది"
"అదే అర్ధం కావటంలేదు"
"అతని స్థితి ఏమిటి?"
"స్పష్టంగా చెప్పలేను సారధిగారు-వెనుకటికి పిచ్చివాడు. మళ్ళీ బ్రెయిన్ కి దెబ్బతగిలింది. ఇది ఘోరమైన దెబ్బ తీస్తుందనుకున్నాను లేదా ఇంకేదైనా అవుతుందనుకున్నాను-అలాంటిది క్లుప్తంగా చెప్పటానికి యేమీ జరుగలేదు-కానీ కొంచెం కొంచెంగా అతని మనసులో మార్పు వచ్చింది అంతే"
"అంటే వివరంగా చెప్పండి"
సిగరెట్ వెలిగించి చెప్పసాగాడు.
"ఏమీలేదు సారధి-ఇంతకు పూర్వం అతని అభిప్రాయాలు కొన్ని మారిపోయాయ్-డాక్టర్లంతా రాక్షసులనుకున్నాడు-ఇక ఆ హాస్పిటల్స్ అంతే-ఎందుకు చెప్పాలి లేక-మందులు విషాలు అనుకుంటున్నాడు-ఇంజెక్షన్స్ ని బల్లెంపోటుగా భావిస్తున్నాడు-ఇవి అతనికి భయంకరమైన స్వప్నాల్లా మారిపోయాయి"
"అయితే"
"అదే భయం వేస్తోంది. అంతే కాకుండా తోటి మనుషులని చూస్తే కూడా అతనికి అసహ్యం వేస్తోంది. పొరుగునే సహించ లేకుండా వున్నాడు. మనుషులుచే తీవ్రంగా మోసగించ బడ్డాననుకొని ఆ మానవులనందరిని ద్వేషించటం ప్రారంభించాడు"
ఆయన మాటలకి అడ్డు తగులుతూ అన్నాడు.
"కాని సార్......ఆ విషయంలో కొంత పొరపాటు జరుగుతోంది-అతను అందర్నీ ద్వేషించటం లేదు. మనం పరీక్ష చేయలేదు కూడా- డాక్టర్లంటే భయపడి పారిపొమ్మన్నాడు-నన్ను చూచి ఎందుకో ఆగ్రహంతో బయటికి వెళ్ళమన్నాడు-కానీ అతను గీతతో చాలా సౌమ్యంగా ప్రేమగా మాట్లాడాడు-ఆమె చెప్పినట్లుగా విన్నాడు-దీనికి......."
"అదే అర్ధం కావటం లేదు"
"......"
హఠాత్తుగా ఏదో తోచినట్లు అన్నాడు డాక్టరు.
"ఒక నిమిషం సారధీ......"
పక్కగదిలో వెళ్ళాడు కొద్ది క్షణాల తర్వాత స్టాఫ్ నర్స్ మిస్. ప్రేమలీల ఆయన వెంట వచ్చింది. ఇద్దరూ కలిసి గురుదేవ్ ఉన్న స్పెషల్ రూమ్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు బయట నిల్చున్నారు. ప్రేమలీల ఔన్సు గ్లాసులో మందు పోసుకుని ఒక్కక్షణం తటపటాయించి లోపలికి వెళ్ళింది.
అతన్ని లేపుతున్న శబ్దం వినిపించింది. అర నిమిషం ఏమీ వినిపించలేదు. తర్వాత ఔన్సు గ్లాసుని విసిరేస్తే పగిలిన శబ్దం వినిపించింది. కెవ్వున కేక వేసింది ప్రేమలీల.
"గెట్ వుట్ రాస్కెల్.....ఈ వేషంతో ప్రపంచాన్నే దోచుకుంటున్న పాషాణి! నన్ను బంధించింది చాలక ఇంకా ఇంకా విషాలు పోయటానికి వస్తావా? గెటవుట్.....లేదా నేను వెళ్ళిపోతాను....ఊ.....లేదా నీవు-నీవు--' ఒక్క త్రోపులో బయటికి వచ్చి పడింది ప్రేమలీల. డాక్టరుగారి ముఖంతో కందగడ్డలా అయింది. కత్తివేటుకి నెత్తురులేని ముఖంతో అవమానంతో తలంచుకుని నిలుచుంది ప్రేమలీల. డాక్టరుగారు ఆమెని స్టాఫ్ రూముకి వెళ్ళిపొమ్మన్నారు తలవంచుకుని వెళ్ళిపోయింది.
త్వరత్వరగా లోపలికి వెళ్ళిపొమ్మని గీతాంజలి సైగ చేశాడు సారధి-
"మిస్టర్ సారధీ-" డాక్టరుగారివేపు చూశాడు.
"ఇది చాలా చిత్రంగా వుంది-ఎందుకో అతనికి గీతాంజలిగారిపై తెలియరాని ఒకవిధమైన గురి ఏర్పడింది. డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్లు అంటే అతనికి మనసులో ఓ విధమైన ఏహ్యత తో కూడుకున్న భావం ఏర్పడింది-ఇది ట్రీట్ మెంటుకి అందే కేసు కాదు-ఇక్కడే ఓ డాక్టరుగారు ఉన్నారు. ఆయన ప్రైవేటు ప్రాక్టీసు పెట్టారు. ఈవిధంగా మనస్చాంచల్యంతో బాధపడే రోగులకి ఆయన ప్రత్యేకంగా వైద్యం చేస్తారు- ఆయనతో సంప్రదిద్దాం రండి.....అంతకుమించి గత్యంతరం లేదు"
మెల్లగా డాక్టరు వెంట కడలి బయటికి వెళ్ళాడు. రెండు నిమిషాల తర్వాత కార్లో బయటికి వెళ్ళారు ఇద్దరూ.
15
"మధూ!......"
"......."
"మధూ......"
"......"
"మధూ.........మధూ......"
తలుపు తీశాడు ఇంట్లోకి హడావుడిగా ప్రవేశిస్తూ అంది.
"నాకేమిస్తావ్?"
దగ్గరగా వెళ్ళి ప్రేమగా రెండు అరచేతులతో చెంపలు రాస్తూ అన్నాడు.
"నాప్రాణం......"
మెల్లగాచేతులు తొలగిస్తూఅంది.
"పో......అదికాదంటే......నీకునేనో మంచికబురు.......చాలాచాలా మంచి మంచికబురు చెపుతాను.....నాకేమిస్తావ్?"
"ఏం కావాలో కోరుకో"
"అడిగితే ఇచ్చే వాళ్ళు ఏమిస్తార్లే"
"సరే"
"అదికాదు మధూ"
"......."
"అబ్బ! అలా చూడకు"
"ఇంకెలా"
"కళ్ళుమూసుకో"
"......"
"మరిమంచి కబురు చెపితే నాకేమిస్తావ్"
దగ్గరగా వచ్చి ఎదురుగా నిలబడి ఒక్కక్షణం అలా కళ్ళల్లోకి సూటిగా చూసి అన్నాడు.
"ఎందుకో ఏమిటో తెలియకుండా మాట ఇవ్వటం అంతమంచిది కాదు మధూ......"
అతను అలా మధురాతిమధురంగా తననిపిలిచే సరికి మీనాక్షికి తనువున పులకలు రేగాయి-సంతోషధారలనిచిందేట్టుగా నవ్వింది. కుర్చీ ఆమెకి ఎదురుగా లాక్కుని కూర్చుని అన్నాడు.
"కూర్చో మీనా?"
కూర్చుంది.
"మీనా"
"ఊ"
"ఏమిటామధుర వార్త"
"చెప్పరాదూ"
"నీవుముందు చెప్పరాదూ ఏమిస్తావో"
"అడుగు"
"మళ్ళీమొదలు"
"లేదులే-చివరే-నీమాటవింటాను"
"ఆల్ రైట్"
"మరి"
పైటచాటునుంచి పేపరుతీసి ఎదురుగా పెట్టుతూఅంది.
"ఇదేమిటో చూడు"