"ఇప్పుడిలాగే అంటారు- తర్వాత పిల్లాడి మీద ఈగ వాలితే చాలు- నా మీదకు దండెత్తి బండబూతులు తిడతారు! ఇవన్నీ నాకెందుగ్గానీ మీ పిల్లలకి మీరే ఇంటి దగ్గర డిసిప్లిన్ నేర్పించండి!"
మేమింక మాట్లాడలేక వెనక్కు తిరిగాం.
"ప్రిన్సిపాల్ అన్నది నిజమే! మన పిల్లల్ని మనమే డిసిప్లిన్డ్ గా పెంచాలి" అన్నాడు హనుమంతరావ్.
మేము ఇల్లు చేరుకునేసరికే శీనుగాడు ఇంటి దగ్గరున్నాడు.
"వేడిని నేను చాలా జాగ్రత్తగా, తెలివిగా టాకిల్ చేస్తా" అంటూ విజయ్ యాదవ్ వాడి దగ్గరకెళ్ళాడు.
"ఏరా శ్రీనూ! ఎలా వుంది స్కూల్?"
"చాలా బోర్ అంకుల్! అందుకే నెక్స్ట్ ఇయర్ నెహ్రూ గ్రామర్ స్కూల్లో చేర్తా-"
అందరం షాకయ్యాం.
"ఎందుకు?"
"అక్కడయితే రికార్డ్ డాన్స్ పోటీలుంటాయ్-"
"వాట్? నీకు రికార్డ్ డాన్స్ పోటీలు కావాల్సి వచ్చినయ్యా! ఇదంతా ఆ టీవీ చానెల్స్ తాలూకు ప్రోగ్రామ్స్ ఎఫెజ్ట్ - ఒరేయ్! ఇక నుంచీ నేను సెలక్ట్ చేసిన చానెల్సే నువ్ చూడాలి! తెల్సిందా" అన్నాడు హనుమంతరావ్.
శ్రీను నిర్లక్ష్యంగా చూశాడతని వేపు.
"మీకూ నాకూ కుదిరేట్లు లేదుగాని- మీరు సెపరేట్ టీవీ కొనుక్కోండి-"
"ఆ! అంటే.... ఆ టీవీ నీకిచ్చి మేము ఇంకో టీవీ కొనాలా! అసలు నువ్వు టీవీ చూడ్డానికే వీల్లేదు-" ఆవేశానికి అరిచాడతను.
"ఏంటంకుల్? డాడీ కేమయిందివాళ! ఓవర్ యాక్టింగ్ జేస్తున్నాడు?"
"నీ బిహేవియర్ నచ్చక!"
"మా మమ్మీ, డాడీ బిహేవియర్ నాకూ చిన్నప్పటి నుంచీ నచ్చటం లేదు- అయినా నేను అడ్జస్ట్ అవటం లేదూ?"
"అసలు నువ్ స్కూల్లో చదువూ సంధ్యా లేకుండా చేస్తున్న పనులేంట్రా?
"చాలా వుంటయ్. చెప్తే మమ్మీకీ నీకూ హార్ట్ ఎటాక్ వస్తుంది! ఒకటి రెండుసార్లు సిగరెట్ తాగా!"
"ఆ! సిగరెట్లా?"
"ఆ షాకింగ్ ఎక్స్ ప్రెషన్సే వద్దన్నా! సినిమాల్లో హీరోలు హీరోయిన్లు సిగిరెట్లు తాగుతూంటే అద్భుతంగా నటించాడంటారు. అదే నేను చేస్తే కొంపలు మునిగినట్లు ఫీలింగ్ లు! ఎలాంటి జెనరేషన్ దొరికార్రా బాబూ"
"ఒరేయ్! ఇంక నిన్ను టోలరేట్ చేస్తే నాదీ తప్పు! చూడ్రా! ఈ క్షణం నుంచీ ఒక్క చిల్లరపని చేసినా- చావగొడతా!"
"వాట్? సెవెంత్ క్లాస్ చదివే వాడిని కొడతావా? అయిపోతావ్ డాడీ!"
హనుమంతరావ్ కి కోపం ఆగలేదు.
"ఏంట్రా! నేనేమయిపోయేది?" అంటూ ఎడాపెడా వాయించాడు వాడిని.
"ఆల్ రైట్! కొట్టావ్ కదా! ఇంక నా రియాక్షన్ చూస్కో-" అనేసి కోపంగా ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తాడు.
"వాడెక్కడికయినా పారిపోతాడేమో! అనవసరంగా కొట్టారు-" అంటూ హనుమంతరావ్ భార్య వర్రీ అవుతుంటే-
"నువ్వేం వర్రీ అవకు సిస్టర్! వాడెక్కడికెళ్ళినా వెతికి తీసుకొస్తాం" అని అందరం సర్దిచెప్తున్నాం-
అంతలోనే శ్రీను ఒక ఎస్సై, ఒక కానిస్టేబుల్ తో లోపలికొచ్చాడు.
పోలీసుల్ని చూసి మేము ఉలిక్కిపడ్డాం.
"ఇదుగో - ఈయనే మా డాడీ!" హనుమంతరావ్ ని పోలీస్ కి చూపించాడు శ్రీను.
"ఏంటండీ? ఏం జరిగింది?" ఆదుర్దాగా అడిగాడు హనుమంతరావ్.
అతనివేపు ఒక ఎన్ కౌంటర్ చూపు విసిరాడు ఎస్.ఐ. "ఏం జరిగిందో చెప్పాల్సింది నువ్వు! నేను కాదు-"
మేమంతా షాకయ్యాం.
"నేనా? నాకేం అర్ధం కావటంలే-"
"ఎందుకర్ధమవుతుంది? లాకప్ లో వేసి నలుగు తోమితే అర్ధమవుతుంది-"
"లాకప్ లో తోస్తారా? ఎందుకు?"
"ఎందుకేంటీ? నువ్వేం నేరం చేశావో నీకే తెలీదా?" అడిగాడు ఎస్సై.
"నేను నేరం చేయటమేంటండీ? ఏం నేరం చేశాను?"
"గృహహింస!"
"గృహహింసా! ఆ పేరే వినలేదు ఇంత వరకూ? దానర్ధం ఏమిటి?"
"మూడు సంవత్సరాలు జైల్లో ఉంటే అప్పుడు మొత్తం అర్ధం అవుతుంది-"
"అసలు మావాడు చేసిన తప్పేంటో చెప్పకుండా బెదిరిస్తారేంటండీ?" అడిగాడు శంకరమూర్తి జోక్యం చేసుకుంటూ.
"నీ పేరేమిటి?" కోపంగా అడిగాడు ఎస్.ఐ.
"శంకరమూర్తి-"
"నేను అతనిని ఇంటరాగేషన్ చేస్తూంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావ్?"
"ఎందుకేంటండీ? నేనీ అపార్ట్ మెంట్స్ సొసైటీకి కల్చరల్ సెక్రటరీని-"
"కల్చరల్ సెక్రటరీవయితే స్టేజిమీద డ్రామాలేసుకో- ఇక్కడ డ్రామాలాడకు-"
"దిసీజ్ టూమచ్ ఉన్నయ్- మా కల్చరల్ సెక్రటరీతో అలా మాట్లాడటం- నేను ఆబ్జెక్ట్ చేస్తున్నయ్-" అన్నాడు హమీద్ మియా.
ఎస్.ఐ.కి చిరాకేసుకొచ్చింది.
"వీళ్ళందర్నీ జీపెక్కించి స్టేషన్ తీసుకెళ్ళి లాకప్ లో పడెయ్ లక్ష్మణ్" అన్నాడు కానిస్టేబుల్ తో.
"ఏంటి వాళ్ళను లాకప్ లో పడేస్తారా? ఆయనెవరనుకుంటున్నారు! మా ప్రెసిడెంట్! మొత్తం మూడొందల ఫ్లాట్ వాళ్ళం వచ్చి నీ స్టేషన్ ముందు ధర్నా చేస్తాం" అన్నాడు విజయ్ యాదవ్.
ఎస్.ఐ. కొంచెం తగ్గాడు.
"ఈ గొడవంతా ఎందుకు సార్- నేను చేసిన తప్పేంటో చెప్పండి-" అడిగాడు హనుమంతరావ్.
"అదేనయ్యా! గృహహింస! ఈ చిన్నపిల్లాడిని కొట్టి, నానా హింసలూ పెట్టినందుకు గృహహింస చట్టం కింద కేస్ రిజిస్టర్ చేశా! ఇప్పుడర్దమయిందా?"
అప్పుడర్ధమయింది విషయం అందరికీ.
ఏంట్రా శ్రీనూ! నాన్నగారేదో ఒకటి వేస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్తావా?" అడిగింది వాళ్ళమ్మ.
శ్రీను నిర్లక్ష్యంగా చూశాడు. "ముందే వార్నింగిచ్చా! వినకపోతే ఇంకేం జేస్తాం?"
"అయినా నా కొడుకును ఓ దెబ్బవేసినంత మాత్రాన అది నేరమయినట్లు మీరు కేస్ రిజిస్టర్ చేయటమేంటండీ? మా ఫాదర్ నన్ను కొట్టలా? నేను పోలీస్ స్టేషన్ కెళ్ళానా? మీ ఫాదర్ చిన్నప్పుడు మిమ్మల్ని ఒక్క దెబ్బకూడా వేయకుండానే పెంచారా? మీ నాన్న మీద మీరూ కంప్లెయింట్ ఇచ్చారా మరి?"
ఎస్.ఐ. బుర్ర గోక్కున్నాడు క్యాప్ తీసి.