Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 20


                                     భూమ్యాకాశాలు

  

వాళ్ళిద్ధర్నీ ఉరితీశారని
అరవ పత్రికలో చదివినప్పుడు
వాళ్ళిద్దర్నీ చంపేశారని
డైరీలో నోట్ చేసుకున్నాను

ఒద్దు కన్నీటి కవిత్వం
రాయొద్దు

సమాజానికి కాలం పెట్టిన అప్పును
ప్రాణాలతో తీర్చుకున్నారు వాళ్ళు
ఎల్లప్పుడూ వారిలో రిగిలే పగ
ఎన్నటికి తీరుతుందో మరి

వాళ్ళలో ఆరని ఆశ
తీరేరోజు చేరువలోనే వుంది

బతికే అర్హతలేని పందల్నీ పండుల్నీ
చంపడమే వాళ్ళు చేసిన నేరం
చీకటిని పిడికిళ్ళతో పిండి
చెడుగును చీల్చి చెండాడారు.

చెరిగిపోని వాళ్ళ శిలాశాసనం మీద
నక్షత్రాలు సాక్షి సంతకాలు చేశాయి

బతకడం అంటే సెక్సడం అయితే
వాళ్ళెప్పుడో చచ్చిపోయారు
బతకడం అంటే చంపడం అయితే
వాళ్ళెప్పుడూ బతికే వున్నారు

మరణంలేని మహదాశయమే
మనకి వాళ్ళిచ్చిన నిధి
    
రోజెన్బర్గ్ దంపతుల్లాగా2 వాళ్ళు
మేధావులు కారు
    
శాకోవాంజెట్టీ3 ల్లాగా
మెతక మనుషులుకారు
వాళ్ళిద్దరిలో ఒకడు భూమి
రెండోవాడు ఆకాశం.
                                                                           రచన : 3 - 12 - 1975
                                                    ముద్రణ: జ్యోతి మాసపత్రిక, డిసెంబరు, 1975
                                      పునర్ముద్రణ: మరో ప్రస్థానం, విరసం ప్రచురణ - మే, 1980
1. భూమయ్య(1922.19.12.75)కిష్ణా హౌడ్ లు (1930-1.12.75): తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట కాలం నుంచీ కూడా ఎర్రజండాను నమ్ముకున్న కార్యకర్తలు. గట్టుపల్లి మురళిదళంలో పనిచేసి, పోరాట విరమణానంతరం ఆయనతోపాటు సి.పి.ఐలో పనిచేశారు. శ్రీకాకుళం, నక్సల్బరీ ఉత్తేజంలో చారుమజుందార్ పార్టీలోకి ఆకర్షితులయ్యారు.
కిష్టాగౌడ్ ది ఆదిలాబాద్ జిల్లా తిర్యాని. భూమయ్యింది కరీంనగర్ జిల్లా పుట్నూరు. అయితే
ఇద్దరివీ గోదావరికి ఆ ఒడ్డున ఈ ఒడ్డున వున్న ఇరుగుపొరుగు గ్రామాలే. ఉద్యమంలో ముప్ఫై ఏళ్ళపాటు కలిసే పనిచేశారు. రూపంలో, స్వభావంలో, వ్యక్తిత్వాల్లో ఇద్దరికీ చాలా తేడా ఉంది.
కోనుగంటి భూమయ్య పెద్దమనిషి 48 ఏళ్ళు. పెద్ద శరీరం, బట్టతల, నెమ్మదైన మనిషి, జంగమ వృత్తి. ఆవృత్తికోసం ఇచ్చిన మాన్యాన్ని భూస్వామి ఆక్రమించుకున్నాడు. మళ్ళా ఆ భూమి సాధించుకోవాలని, భార్యని, కూతుర్ని సాకాలని ఆయన ఆరాటం.
గున్నాల కిష్టాగౌడ్ కి 45 ఏళ్ళు గౌడవృత్తి. కార్మిక ప్రవృత్తి. ఉంగరాల జుట్టు, కోరమీసం. ఎన్నో చెట్లగురించి, పిట్టల గురించి, పాటల బాణీల గురించి తెలుసు.
ఆదిలాబాద్ జిల్లా గిన్నెబరి భూస్వామిని ఈ ఇద్దరూ హత్య చేశారన్న ఆరోపణపై జిల్లా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష వేసింది. హైకోర్టు సుప్రీంకోర్టు కూడా దృవపరిచాయి. 1974 నవంబరులో వీళ్ళను ఉరితీయాలని ఆర్డర్  పాసైనప్పుడు సికింద్రాబాద్ కుట్రకేసు ముద్దాయిలుగా విప్లవ రచయితలు ఆ జైల్లోనే వున్నారు. వీళ్ళిద్దరిని గంజ్ (కండెమ్డ్ సెల్) లో కలిసి మాట్లాడారు. అప్పుడే వీళ్ళను, విప్లవ రచయితలను చూడ్డానికి శ్రీశ్రీ జైలుకి వచ్చాడు. ఉరిశిక్ష రద్దుకోసం ఉద్యమం ఉధృతం కావడం, ఆ ఉద్యమానికి ఎంతో చురుగ్గా శ్రీశ్రీ నాయకత్వం వహించడం జరిగింది. '74 నవంబర్ నుంచి'75 జూన్ లో ఎమర్జెన్సీ పెట్టేవరకు న్యాయవాదులు పత్తిపాటి వెంకటేశ్వర్లు, కె.జి. కన్నబిరాన్ ల చొరవతో, అనేకుల సహకారంతో ఉరిశిక్ష రద్దు ఉద్యమం దేశవ్యాప్తంగానేకాదు, దేశదేశాల్లో కూడ సాగింది. అందుకే ఎమర్జన్సీ నిశ్శబ్ద వాతావరణంలోగాని ఇందిరా వెంగళరావుల ప్రభుత్వం వీళ్ళను ఉరి తీయలేకపోయింది(1-12-75) ఉరిశిక్ష రద్దు కమిటీ '74 నవంబర్ లో ఒకసారి, 11 మే 75 న మరొకసారి ఉరి అమలును ఆపగలిగింది. '74 నవంబర్ లో ఉరిశిక్ష మొదటిసారి ఆగిపోయిన  తర్వాత  ఉరిశిక్ష పూర్తిగా రద్దు చేయాలని ఏర్పాటైన సభల్లో శ్రీశ్రీ చురుగ్గా పాల్గొన్నాడు. ముఖ్యంగా హుజురాబాద్ బెల్లంపల్లి  సభలు చెప్పుకోదగ్గవి. హుజురాబాద్ సభకు ముందు ఆయన స్వయంగా ఒక చిన్న కరపత్రం రాశాడు.
అందులో "రోజెన్ బర్గ్ దంపతుల్లాగా వాళ్ళు మేధావులు కారు. సాంకో పాలజెట్టిలాగా మెతక మనుషులు కారు" అని మొదటిసారి రాశాడు. జార్ చక్రవర్తి డాస్టోవస్కీ ఉరిశిక్షను ఆఖరిక్షణంలో రద్దు చేశారని చెపుతూ "ఇందిరాగాంధీకన్నా జార్ చక్రవర్తే మేలని అనిపించుకోకూడదంటాను" అని కూడా హెచ్చరించాడు.
కాని ఆ తర్వాత కొద్దికాలానికే ఉరి తీసి  ఇందిరాగాంధీ జార్ ని, హిట్లర్ ని, ముసోలినీని, చివరకు స్పానిష్ నియంత ఫ్రాంకో కంటె కూడా గొప్పదాన్ననిపించుకుంది. ఇది డిసెంబర్1, 1975న  భూమయ్య కిష్టా గౌడ్ లను ఉరితీసినప్పుడు రాసిన కవిత.
2. రోజెన్ బర్గు దంపతులు: జూలియాన్ రోజెన్ బర్గు (1918 - 53) ఎలక్ట్రికల్ ఇంజనీరు. ఏథెల్ రోజెన్ బర్గు (1916-53) ఆయన భార్య. రష్యాకి వీళ్ళిద్దరు అణు రహస్యాలను చేరవేశారనీ, కుట్రచేశారని కేసుపెట్టి విచారణ జరిపించి చంపేసింది అమెరికా ప్రభుత్వం.
3. శాకో నికోలా:(1891 - 1927) బొరొలేమియా వాన్ జెట్టి (1888 -1927) వీరిద్దరూ అమెరికాలో స్థిరపడ్డ ఇటాలియన్లు. వీరిలో ఒకరు చెప్పులు కుట్టుకునేవారు. ఇంకొకరు చేపలమ్ముకునేవారు. వీళ్ళిద్దరూ కమ్యూనిస్టులనే కక్షతో అమెరికన్ ధర్మశాస్త్రం మరణదండన విధించి అక్రమంగా హత్య చేసింది.

 Previous Page Next Page