Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 19

    "ఏమిటి దీర్ఘాలోచన చేస్తున్నారు?" అవతలనుంచి ఇన్ స్పెక్టర్ ని అని చెప్పినాతను అడిగాడు.
   
    "మీరు ఎక్కడ్నుంచి ఫోన్ చేస్తున్నారు?" బన్సీలాల్ అడిగాడు.
   
    "మీ మాటలు ప్రశ్నలు కడు విచిత్రంగా వున్నాయి లాల్ జీ! జోక్ చేస్తున్నారో, నిజంగా అడుగుతున్నారో నాకర్ధం కావటం లేదు. ఇప్పటిదాకా కేసు చూడటంవల్ల మీ యింటికి రాలేకపోయాను...ఈ విషయమే నేను పిలిచి మరీ చెప్పాను...ఇంకా నేను యింటికి వెళ్ళలేదు....స్టేషన్ లోనే వున్నాను...కేసు పూర్తికాగానే మీకు ఫోన్ చేశాను"...
   
    ఇన్ స్పెక్టర్ చెపుతుంటే బన్సీలాల్ పని అయోమయంగా మారింది. మందు సేవించటంవల్ల మైకం కమ్మిందేమోనని ఒకటికి రెండుసార్లు తల విదిలించాడు.
   
    "...కనుక మీరు తప్పదు అంటే మీరు పిలిచారు అన్న సంకతో స్టేషను నుంచి ఇటే బయలు దేరి మీ ఇంటికి వస్తాను. రేపు చూద్దామంటే నా కభ్యంతరం లేదు....చెప్పండి లాల్ జీ మీ రెలా అంటే అలా...." ఇన్ స్పెక్టర్ చెప్పటం పూర్తిచేసి అడిగాడు.
   
    "పోలీసు డ్రస్ తో వస్తారా?" ఆతృతగా అడిగాడు బన్సీలాల్.
   
    "ఆ__"
   
    బన్సీలాల్ ఆలోచించాడు. రాజు, రమణల వేషంతో గతంలో ఇద్దరు తనింటికి వచ్చి తనంతటి వాడి కళ్ళల్లో దుమ్ముకొట్టి, ఓరిదేముడోయ్...ఇప్పుడు వచ్చింది నకిలీ ఇన్ స్పెక్టర్ కాడు కదా! అందువల్లనే కవరు సంగతి చెప్పలేకపోయాడు. తాగటం కూడా ఈ పూట ఎక్కువ అయింది. ఆగి ఆగి కాక ఆబగ తాగేస్తున్నాడు....కనుక వీడు నకిలీ ఇన్ స్పెక్టరా!
   
    "ఏంటి లాల్ జీ! ఓమాట మాట్లాడి మళ్ళీ ఆలోచిస్తున్నట్లున్నారు? ఏమన్నా జరిగిందా?"
   
    ఆ మాట వినంగానే బన్సీలాల్ ఇంకేమి ఆలోచించలేదు.
   
    "ఇన్ స్పెక్టర్ ఇప్పుడు మా ఇంట్లోనే వుండి డ్రింక్ సేవిస్తున్నాడు. అందుకే మీ రెవరిని అడిగాను" అంటూ అసలు విషయం బయటపెట్టాడు.
   
    "కొంప మునిగింది లాల్ జీ! వాడెవడో గజదొంగ. ఈ కేసు తాలూకా వాళ్ళు కూడా వాడి తాలూకా వాళ్ళేమో....! ఎందుకంటే నాకో దరిద్రపు కేసు అడ్డు తగిలింది. నన్ను మీ ఇంటికి రాకుండా అడ్డు తగిలి నకిలీ ఇన్ స్పెక్టర్ అక్కడ ప్రత్యక్షం అయ్యాడంటే ఆలోచించండి ఏం జరిగిందో? అప్పుడు రాజు, రమణలు వచ్చారనుకుని మీరు__"
   
    "ఇంకేమీ మీరు చెప్పవద్దు. అర్ధమయింది....మళ్ళీ నన్ను ఎవరో పెద్ద మోసంలోకి లాగబోతున్నారు. నా మెడచుట్టూ ఉచ్చు బిగుసుకు పోబోతున్నది__"
   
    "మీరు కంగారు పడకండి లాల్ జీ! ప్రతి నిమిషం ప్రత్యర్దులదే పై చేయి అనుకోకండి. ఒకసారి వాళ్ళ మోసంలో పడ్డాము. ఇప్పుడు వాళ్ళు మన ఉచ్చులో పడ్డారు"
   
    "ఇప్పుడు నన్నేమి చేయమంటారు? నా కంతా అయోమయంగా వుంది."
   
    "మీరు నన్ను నమ్మారా? ముందీ విషయం చెప్పండి...."
   
    "మీరు వస్తానన్నారు కదా?" నసుగుతూ అన్నాడు బన్సీలాల్.
   
    "మీరన్న దాన్ని బట్టి మీరింకా నా మాట నమ్మనట్లు కనపడుతున్నది యామై కరెక్టు?"
   
    "అది కాదు..." అంటూ మళ్ళీ నసిగాడు బన్సీలాల్.
   
    "లాల్ జీ! మీరు నా మాటలు నమ్మినా నమ్మక పోయినా నేను ఇన్ స్పెక్టర్ కన్నారావునే. పైగా మనం మనం ఒకటి. నేను ఈ వృత్తిలో వుండి సమయానికి మిమ్మల్ని రక్షించుకోలేకపోతే నేనెందుకు? నా పదవి ఎందుకు? నేను మంది మార్భాలంతో బయలుదేరి ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. మీరు నకిలీ ఇన్ స్పెక్టర్ గదికి అనుమానం రాకుండా చూసుకోండి. వెళతానంటే అక్కడనుంచి వెళ్ళనీయకండి. ఎదురు తిరిగితే నాలుగు తగిలించి బంధించండి....వాడి సంగతి నేను చూసుకుంటాను."
   
    "అలాగే. వెంటనే బయలుదేరి వస్తున్నారు కదూ?"
   
    "ఆపదలో ఆలస్యం అన్ని వేళలా మంచిది కాదు. పిట్ట మనగూటికి వచ్చింది ఇంకా వదులుతానా? అన్నట్లు ఆ బాష్టర్ గదిని నమ్మి మన రహస్యాలు ఏవీ వాడికి చెప్పలేదు కదా?"
   
    బన్సీలాల్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది. "ఏదో ఒకటి రెండు పాత విషయాలు...వాడే మీరనుకుని మాట్లాడాను."
   
    "చాలు లాల్ జీ! యింకేమి చెప్పకండి. నీటిలోవున్నా పడవ మునగడానికి ఒక్క కంత చాలునే వస్తున్నాను.... వాడిని పోనీకండి. జాగ్రత్త."
   
    బన్సీలాల్ పళ్ళు నూరుతూ రిసీవర్ క్రెడిల్ మీద ఉంచి నెమ్మదిగా వెనుతిరిగాడు. అప్పటికప్పుడే ఓ పధకం పన్నాడు. నలుగురు నౌఖర్లని పిలిచాడు. గుసగుసలాడాడు.
   
    ఆ తర్వాత...
   
    బన్సీలాల్ ఏమీ తెలియనట్లు మెట్లు ఎక్కి పైకి వచ్చాడు.

 Previous Page Next Page