అప్పట్లో మనకు పూరిళ్లు రెండు వుండేవి. ఒక దాంట్లో వంట, రెండో దాంట్లో నిద్ర.
పత్తిపంటలో నాన్నకు బాగానే డబ్బులొచ్చాయి.
దాంతో పెంకుటిళ్ళు కట్టుకుందామని నాన్న ప్రపోజల్ పెట్టాడు. దానికి అమ్మ ఒప్పుకోలేదు.
"పిల్ల పెద్దదైపోయింది. రేపోమాపో పెళ్ళి చేసెయ్యాలి. డబ్బులు ఖర్చయ్యే పని.
ఆ పిల్ల వెళ్ళిపోతే మనిద్దరి శేషజీవితానికి ఈ గుడిసిళ్ళు చాలవా?" అంది.
"నా మనసులో వున్న భావన కూడా సరిగ్గా అదేనే. ఆడపిల్ల వున్నవాళ్ళం మనం. ఇల్లూ వాకిలే బావుంటే గొప్పింటోళ్ళయినా సరే అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడతారే" అన్నాడు.
అదీగాక మా ఇంటిముందు నాలుగు కుటుంబాలు వుండేవి. వాళ్ళ పెద్దలకాలంతో అది సమిష్టి కుటుంబం. ఉన్న ఇల్లుని నాలుగు భాగాలు చేసి నాలుగు కుటుంబాలుగా విడిపోయారు.
ఇప్పుడు వాళ్ళు కూడా వున్న అడ్డాపిండ్లను కూలదోసి మిద్దెలుగా కట్టుకోవాలని ప్లాన్ వేశారు. వాళ్ళు మనకు బంధువులవుతారు కూడా.
దాంతో విధిలేక అమ్మకూడా ఒప్పుకుంది.
పెద్దకష్టం పడకనే ఇళ్ళు పూర్తయ్యాయి. మేం పెంకుటింట్లోకి మారితే ఆ నాలుగు కుటుంబాలూ మిద్దెంట్లోకి కాపురం పట్టాయి.
ఆ నాలుగిళ్లలోని వాళ్ళతో నాకు బాగానే కాలక్షేపం అయ్యేది.
మా ఇంట్లోంచి ఆ ఇంట్లో దూరే వీధిలోకి పోవాలి. ఇంటిజాగా ఎక్కువ లేకపోవడం వల్ల ఆ పద్ధతి కొనసాగేది.
ఆ ఇంట్లో మొదట ఉత్తరంవైపున రెండుగదులు ఎదురెదురుగా వుంటాయి.
గదులు రెండే అయినా పెద్దవే. ఓ కుటుంబం సులభంగానే కాపురం చేయొచ్చు.
ఉత్తరంవైపున అంటే ఇంటి పై భాగాన ఎడమచేతివైపు జ్యోతిర్మయి పిన్నివాళ్ళ ఇల్లు.
ఆమె వితంతువు. నాకు స్పృహ వచ్చినప్పట్నుంచీ ఆమె వితంతువుగానే వుంది. ఆమె చెల్లెలు, చెల్లెలి భర్త- వాళ్ళ ఇద్దరు కొడుకులు వుంటారు.
ఆ ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు సురేష్ కి పాతికేళ్ళు పైమాటే- ఇంకా పెళ్ళికాలేదు. చిన్నోడికి ఇరవై రెండేళ్ళుదాకా వుంటాయి.
ఇక కుడివైపున రామ్మూర్తి వుంటాడు. ఆయనకి ఒక కొడుకు, ఒక కూతురు.
ముందువైపున్న ఓ భాగంలో శేఖరం బావ, ఆయన భార్యా వుంటారు. దానికెదురుగా వున్న పోర్షన్ లో బాలయ్య, అతని భార్య సుందరి కాపురం. వాళ్ళకు మూడుసంవత్సరాల పాప వుంది.
ఆ వీధిలో చాలామంది మన బంధువులే వుండేవాళ్ళు. అయినా మన ముందరిల్లు కాబట్టి, ఆ ఇంట్లోంచే వీధిలోకి రావాలి కాబట్టి ఆ నాలుగిళ్ళతోనే నాకు చనువెక్కువుగా వుండేది.
నేను ఒక్కదాన్నే కూతుర్ని కనుక అమ్మావాళ్ళ దగ్గర నాకు బాగా గారాబం వుండేది.
అందుకే కాబోలు నాకు చదువుమీద వుండాల్సినంత ఇంట్రెస్ట్ వుండేది కాదు. ఢక్కీలు మొక్కీలు తిని పదవతరగతికి వచ్చేలోపు నాకు పదిహేడేళ్ళు వచ్చాయి.
హైస్కూల్ చదువుకి వెంకటగిరికి వెళ్ళాల్సిందే మొత్తం నాలుగు కిలోమీటర్లు నడిచి రోజూ స్కూల్ కి పోయి వస్తుండేవాళ్ళం. ఊర్లోంచి దాదాపు పదిమందిదాకా ఆడ, మగ పిల్లలం హైస్కూల్ లో చదువుతుండే వాళ్ళం. అందర్లోకి నేనే బొద్దుగా, పొడవుగా వుండేదాన్ని.
ఊర్లోంచి దాదాపు ఓ ఫర్లాంగ్ దూరం నడిస్తే తార్రోడ్డు వస్తుంది. తార్రోడ్డు ఎక్కినప్పట్నుంచి వెంకటిగిరి వైపు వెళ్ళే వాహనాల్ని ఆపేవాళ్ళం. అవి ఆపి ఎక్కించుకుంటే స్కూల్ దాకా నడిచే బాధ తప్పుతుందని మగపిల్లలు చేతులూపుతుండేవాళ్ళు.
"రూపా! నువ్వు ఆపు- నువ్వు ఆపితే లారీల వాళ్ళు నిలబెడతారు" అని ప్రకాష్ నన్ను ఎప్పుడూ బ్రతిమాలుతుండేవాడు.
విధిలేక ఆపుతుండేవాడ్ని.
అతని ఆలోచన కరెక్టే- నేను చేయి ఎత్తి ఊపితే వెళుతున్న వాహనం ఠక్కున సడెన్ బ్రేక్ తో ఆగింది. లారీ ఆగగానే అందరూ గుమిగూడి పోయేవాళ్ళు. ఎంచక్కా దాన్నెక్కి హైస్కూల్ దగ్గర దిగిపోయే వాళ్ళం.
ఇలాంటివి చిన్న విషయాలు కావచ్చేమోగాని జీవితంమీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. అలా వాహనాలు ఆగినప్పుడు నా అందచందాల మీద నాకే ఓ కాన్ఫీడెన్స్ ఏర్పడ్డేది. నేను వయసులో వున్న ఆడపిల్లను అన్న విషయం గుర్తొచ్చేది.