"కాని ఆ అమ్మాయి చాలా బావుంది" అన్నాడొకడు.
"మామూలుగా బావుండడమేమిటి? గొప్పగా వుంటేను" అన్నాడు ఇంకొకడు సిగరెట్ పొగ విలాసంగా వదులుతూ.
"అంత గొప్పగా వున్న అమ్మాయి ఇన్నాళ్ళు మన కళ్ళపడక పోవడమేమిటి?"
"బహుశా తరుచు బయటకు వచ్చే గుణం కాదనుకుంటాను. అటూ ఇటూ తల త్రిప్పయినా చూడకుండా నడుస్తుంది."
"చూస్తే _ ఈ కాలం పిల్లలా లేదురా!"
"అందుకనేరా ఆ అమ్మాయిలో అంత ఆకర్షణ!"
పది నిమిషాలు గడిచాయి. ఉన్నట్లుండి అల్లంత దూరాన ఓ కాంతిరేఖ తళతళమని మెరిసినట్లయింది.
"అదిగో, వచ్చేస్తుంది. వచ్చేస్తూంది" అన్నారు స్నేహితులు ఉత్సాహంగా.
యోగి మాట్లాడలేదు. కన్నార్పకుండా ఆ అమ్మాయినే చూస్తున్నాడు.
క్రమక్రమంగా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చేసింది కుడిచేత్తో చిన్న స్టీల్ క్యారియర్ పట్టుకుని, అటూ ఇటూ చూడకుండా మెల్లగా నడిచి వెళ్ళిపోతోంది.
యోగి ఆ అమ్మాయిని లైక్ చేస్తున్నాడని వాళ్ళకు తెలుసు. అందుకని మెదలకుండా చూస్తూ నిలబడ్డారు. లేకపోతే కేకలు వేసి, ఈలలు వేసి అల్లరి చేసేవారే.
ఆమె వాళ్ళని దాటి వెళ్ళిపోయింది.
"ఇప్పుడే వస్తానుండండీ" అంటూ యోగి స్కూటర్ స్టార్ట్ చేసి ఎక్కి కూర్చున్నాడు. స్కూటర్ ముందుకు దూకింది.
తన ప్రక్కనుండే ఇంచుమించు రాసుకుంటున్నట్లు ఏదో వాహనం కదిలినట్లయ్యేసరికి ప్రజ్ఞ ఉలిక్కిపడి తలత్రిప్పి చూసింది.
అతన్ని తానెప్పుడూ ఇదివరలో చూడలేదు. భయంతో ఆమె శరీరం వణికింది.
"ఎక్కడికి?" అన్నాడు యోగి స్కూటర్ మెల్లగా పోనిస్తూ.
ప్రజ్ఞ మాట్లాడలేదు. అడుగులు తడబడుతున్నా, గబగబ నడవడానికి ప్రయత్నిస్తోంది.
"నిన్నే"
ప్రజ్ఞ చేతిలోని క్యారియర్ పడిపోతుందేమోనన్న భయంతో హ్యాండిల్ లో పట్టుకుని వున్న వ్రేళ్ళు గట్టిగా బిగించింది.
"ఇదిగో _ నీ పేరేమిటి ?"
ప్రజ్ఞ గుండె గబగబ కొట్టుకుంటోంది. వళ్ళంతా చెమటలు పడుతోంది.
"నువ్వు వెళ్ళేది హాస్పటల్ కా ?"
"........."
"మీ వాళ్ళెవరయినా హాస్పటల్ లో వున్నారా ?"
"........."
"మాట్లాడతావా? మాట్లాడవా ?"
"........."
అతని చెయ్యి ముందుకు సాగి ఆమె జడ పట్టుకు లాగింది. తృళ్ళిపడి అటు ప్రక్కకి గెంతినట్లు అడుగు వేసి, తూలి పడబోయి సర్దుకుంది.
యోగి నవ్వాడు.
"మరీ అంత కంగారు పడకు _ ఇప్పుడు నిన్నేమీ చెయ్యబోవడం లేదులే..."
ఇంతలో రోడ్డు మీద జన సంచారం ఎక్కువగా వుండే ప్రదేశం వచ్చింది. యోగి ఆమెను దగ్గరగా ఫాలోకావడానికి వీల్లేకపోయింది ఆమెకు కొంత దూరంలో స్కూటర్ పోనిస్తూ, ఎటువెడుతుందో గమనిస్తున్నాడు.
దాదాపు ఫర్లాంగూ, ఫర్లాంగున్నరా వెళ్ళాక ఆమె ఓ హాస్పటల్ ఆవరణలోకి అడుగు పెట్టడం చూసి, 'ఇక్కడికేనా' అనుకుంటూ బ్రేకు వేశాడు. ఒక్కక్షణం అలా చూస్తూ నిలబడి, తర్వాత వెనక్కి మరలాడు.
* * *
ఆ రాత్రి ఎనిమిది గంటల వేళ యోగి రూమ్ లో స్నేహితులంతా కలసి 'మందు' సేవిస్తున్నారు.
"గురూ ! ఆ అమ్మాయి గురించి వివరాలన్నీ సేకరించాను" అన్నాడు అప్పుడే లోపలకు అడుగుపెట్టిన ఒకడు _ తాను కూడా గ్లాసు చేతిలోకి తీసుకుని నింపుకునే ప్రయత్నం చేస్తూ.
యోగి ఎర్రబడ్డ కళ్ళతో అతనివంక చూశాడు.
"ఆ అమ్మాయి పేరు ప్రజ్ఞ గోపీగాడి
"గోపీగాడెవడు ?"
"ఉన్నాడులే ఒకడు. కాలేజీ ఎగ్గొట్టి ఆడపిల్లల వెంట పడుతూ వుంటాడు" అన్నాడు. తామంతకన్న ఘనకార్యం చేస్తున్నట్టు.
ఒక్క క్షణం నిశ్శబ్దంగా మారింది.
"వాళ్ళ నాన్నకి ఆపరేషన్ మీ అన్నయ్య హాస్పటల్లోనే జరిగింది. రోజూ అక్కడికే వెడుతుంది క్యారియర్ తీసుకుని."
ఆ విషయం యోగికి అంతకుముందే తెలుసు.
"షి ఈజ్ ఎక్స్ లెంట్. ఐ లైక్ హర్" అన్నాడు తడబడే కంఠంతో.
* * *
డాక్టర్ దయాకర్ తన ఇంట్లో స్టడీ రూమ్ లో మెడికల్ జర్నల్స్ తిరగేస్తూ కూర్చున్నాడు. అతను నైట్ డ్రెస్ లో ఉన్నాడు. రాత్రి పదకొండు దాటిపోయింది.


