పిడుగుపాటు
ఇదియేమీ! నిజమా! మహాత్ముఁడిక లేనేలేఁడ! యీ వార్త వ
ట్టిది కాదా! కరుణాసముద్రుఁ డగు తండ్రిన్ హత్యగావించిరా!
ఇదియేమీ! ఇదియేమి! ఏమిటిది! స్వామీ ఈ విషంబేమి - మ్రిం
గుదుమా - మ్రింగకతప్పదా - జగము గగ్గోలెత్తి వాపోయెడిన్.
హింస యహింసపై పగవహించె, నవోదయశక్తి మీద వి
ధ్వంసకశక్తి దూఁకిన, దధర్మము ధర్మము నాక్రమించె, దు
ర్మాంస బుభుక్షు రాక్షసకరమ్ము ప్రశాంత మరుత్తరంగిణీ
హంసము నేసె, సాంధ్యసమయమ్మున విశ్వము విహ్వలింపఁగన్.
క్రొత్త వెలుంగుబాట నెటకో గొనివచ్చి, స్వతంత్ర భారతో
దాత్త నిదర్శనంబగు ప్రదర్శనమంచు మహా భయంకరో
న్మత్త పిశాచినీ వికట నాట్యము చూపితివేమి? ఈ కరా
వృత్తము చూడలేము - తెరవేయుము -దీపము లార్పు మో ప్రభూ!
తీరని లోటు
గుండెలు జాఱిపోయె ప్రజకున్, కనుగోనల నశ్రువాహినుల్
నిండె నభమ్ము బ్రద్దలయి నెత్తిపయింబడె, దద్దరిల్లి బ్ర
హ్మాండము కృంగిపోయినది. అంతటి తండ్రిని ధూర్తుఁడైన పు
త్తృండు కిరాత హస్తములతో వధియించె నటన్న వార్తకున్ -
మెత్తని గుండెనుండి పుడమిం బ్రవహించెడు పూజ్యబాపూజీ
నెత్తురు ద్రావుచున్ కనులనీరిడె మృత్యువు, బాపులేమికిన్
సత్తెము చిన్న పోయినది, శాంతి కృశించె, నహింస యేడ్చె డ
గ్గుత్తికతోడ, ధర్మము దిగుల్పడె, క్రుంకెను కర్మసాక్షియున్ !!
నిండు మనస్వి - విశ్రుత వినీత పునీత యశస్వి - సాత్వికా
ఖండ తపస్వి - సత్యసహాకారము చిట్టచిటారు కొమ్మపై
పండినపండు -బ్రహ్మఋషి - భారతభాగ్యవిధాత - ప్రార్ధనా
మండప వేదిమీఁద నిఁక మా కనుదోయికి విందొనర్పఁడా?
మౌనలేఖిని
'వ్రాయుము వ్రాయు' మంచు బలవంతము సేతువు నన్ను భావనా
ప్రేయసి! స్వేచ్చకై పరితపించెడి నల్వదిరెండుకోట్ల దే
శీయుల మైత్రికోసము కృశించి కృశించి నశించిపోయె జా
తీయమహాతపస్వి గురుదేవుఁడు; చాలు - నికేమి వ్రాయుదున్?
'వ్రాయుము వ్రాయు' మంచు బలవంతము సేతువు దేవి! దేనితో
వ్రాయుదు? శాంతి దేవత యురమ్మున చిందెడు రక్తధారతో
నా! యమునా స్రవంతి నయనాంచలకజ్జల బాష్పధారతో
నా! యెటువ్రాతు విశ్వహృదయమ్ము కలంచు విషాదకావ్యమున్?
ఏమని వ్రాయుదున్ ? బ్రతుకు లిచ్చిన బాపు ఋణంబు తీర్చుకొ
న్నామనియా? స్వరాజ్యభవనంబున శాంతికి శాంతి చేసికొ
న్నామనియా! అఖండ కరుణానిధి తండ్రికి కాన్కలిచ్చుకొ
న్నామనియా కృతఘ్ననయనమ్ముల ఘోరవిషాగ్నిగోళముల్ ?
ధన్యజీవి
'ప్రేమార్ధ్ర హృదయుఁడౌ' జీమూతవాహను
జాలిగుండెల మధ్య జననమంది -
'నిరుపమానత్యాగనిధి' దధీచి మునీంద్రు
నాశ్రమ ద్రుమరాజి నల్లువెట్టి -
'కరుణారసామృతగంగాలహరి' బుద్ధ
భగవాను కన్నీట చిగురుతొడిగి -
'ధర్మరక్షాప్రియదర్శనుం'డగు అశో
కునిచల్వ నాల్గు దిక్కులకు ప్రాకి -
చను నహింసా లతా మతల్లిని మహాత్ముఁ
డంచితమ్ముగ పూలుపూయించినాఁడు;
మాలలం గూర్చి భారతమాత కంఠ
సీమ నర్పించి దివికి వేంచేసె నేఁడు !!
బాలబాపూజీ
విషపాత్రమెత్తి త్రావెడి 'మహాయోగి' కన్
గొనలలో తాండవించిన యహింస
హృదయేశ్వరిని వీడి కదలు 'ప్రేమ తపస్వి'
బరువు చూపుల పొంగిపొరలు కరుణ
సిలువపై నిండు గుండెలు గ్రుమ్మరించు 'ద
యామూర్తి' నుదుట పారాడు శాంతి
శిరసు వంచక స్వేచ్చ కొఱకు పోరాడు 'వీ
రాగ్రణి' హృదయాన నలరు దీక్ష
ఏకమై - భారత ప్రజానీక పూర్వ
పుణ్యసంపత్తి పొత్తిళ్ళ పొదుపుకొన్న
పుత్తలీబాయి ప్రక్కలో నొత్తిగిల్లె
పోరుబందరులో నొక్క పురిటియింట !!
మహా ప్రస్థానము
ఏ మహాత్ము ప్రేమహృదయ ముప్పొంగెనో
కరుణవారిరాశి గట్లుతెగెనొ !!
పొర్లి పాఱుచుండె బిర్లాగృహమునుండి
జనమువైపునకు ప్రజాస్రవంతి !!
రత్నశిఖరి మీఁది రాయంచయే కాదు
చెట్టుమీది పరిగపిట్టకూడ
వెక్కివెక్కి యేడ్చె వేఁడి బాష్పాలతో
సాగిపోవు బాపు శవము గాంచి.
శాంత్యహింస లనెడు శస్త్రాస్త్రములు దాల్చి
సత్య కవచ మొడల సంతరించి
దండు నడిపినట్టి దండి సత్యాగ్రహి
కదలుచుండె శాంతి సదనమునకు !!
ఆగ్రహము లేదు - కలది సత్యాగ్రహంబె !
ఏ గృహము లేదు - కలది కారాగృహంబె !
దేశమున కెల్ల సత్య సందేశ మతఁడు -
లోకమున కెల్ల నవనవాలోక మతఁడు -
సత్యసహకారమున కహింసా లతా మ
తల్లికను మెల్లమెల్లఁగా నల్లువెట్టి
పూలు పూయించి తేనెలు జాలువార్చు
కర్మచంద్రుఁడు మన కింకఁ గానరాఁడు!!
నయనములు మూసికొని బోసినవ్వుబాబు
తల్లి ప్రక్కనను నాఁడొత్తిగిల్లె నట్లు !
నయనములు మూసికొని యమునానదీ మ
తల్లి ప్రక్కను నేఁ డొత్తిగిల్లె నిట్లు !!
బాపు - ప్రియబాపు - భారత పారతంత్ర్య
బంధములు బాపు మా ప్రియ బాపు - నేఁడు
పాంచభౌతిక దేహ మర్పించుచుండె
కొడుకు లంటించు నీ యగ్ని కుండమందు !!
నెత్తురులు చింద తన మొండి కత్తితోడ
దేశమును చీల్చె నా 'ఖాయిదే అజాము'
మంచిగందపుచెక్కల మధ్యనేఁడు
భగ్గుమని మండుచుండె మా బాపుగుండె !!
చేతికఱ్ఱ వీడి చెప్పులు విడనాడి
కదలిపోయినాఁడు గాంధితాత !
'ఎగుడు దిగుడు' లేని 'హెచ్చుతగ్గులు' లేని
'తేళ్ళు ముళ్ళు' లేని దేశమునకు -
ప్రాక్సతీ స్వర్ణగర్భాన ప్రభవమంది,
తమ్ములను లేపి, నూత్న చైతన్య మొసఁగి
ధ్వాంత మెడబాపి, స్వాతంత్ర్ర్య కాంతు లిడిన
'భువనబంధుఁడు' పశ్చిమాంభోధిఁగ్రుంకె.
బ్రతికి పేరు ప్రతిష్టలు వడయలేక
చచ్చి గొప్పవా రగుదురు చాలమంది;
బ్రతికియుం జచ్చియును ఈ ప్రపంచమందు
మూడు కాలమ్ములకు మహాత్ముఁడవు నీవు !!