Previous Page Next Page 
జీవాత్మ పేజి 19


    సరిగ్గా అప్పుడే నదిలో ఓ పురుషుడి శవం తేలుతూ వచ్చింది. దాన్ని తాకడానికే ముచ్చెమటలు పోశాయి నాకు. అయినా తప్పదు కదా! ఆ శవాన్ని ఒడ్డుకు లాగి తొడ, కండరాలు కోయసాగాను.

    ఆ శవం భయంకరమైన దుర్గంధం కొడుతోంది. భయం, ఆందోళన, కంగారువల్ల శవాన్ని కోస్తుండగా నా చేతివేళ్ళు రెండు కోసుకు పోయి రక్తం ధారగా కారసాగింది.
    
    అలాగే కోసిన మాంసం పట్టుకొని అఘోరీకి యిచ్చాను. అతడు తెగిన నాచేతివేళ్ళ వంక చూసి దగ్గరకొచ్చాడు. నేను బిత్తర చూపులు చూస్తుండగా అతడు నా వేళ్ళని తాకాడు.
    
    ఆశ్చర్యం....!
    
    తెగిన నా చేతివేళ్లు నుంచి కారుతున్న రక్తం ఆగిపోయింది. అక్కడ గాట్లు కూడా మటుమాయమై పోయాయి. అప్పుడు పోయింది నాలో ఆ అఘోరీ మీదున్న అనుమానం- భయం.
    
    'ఈ మాంసం ముక్కలుగాకోసి, కుండలో వేసి వండు. అదిగో పొయ్యి కట్టెలు' అంటూ ఓ మూలకి చేయి చూపించాడతను. అతడు చెప్పినట్లే చేశాను. ఆకులు యిచ్చి- 'వడ్డించు మనిద్దరికీ' అన్నాడు.
    
    'మనిషి మాంసం నేను తినబోతున్నాను ఇప్పుడు' అన్న ఊహ నాలో కంపరం కలిగించింది. అయినా అతను చెప్పినట్లే రెండు ఆకులలో వడ్డించాను. కుండలోంచి తీసి ఆకులో వేసిన పదార్ధం చూసి నాకే మతి పోయినంత పనైంది. అది మాంసం కాదు. నాకెంతో ఇష్టమయిన గులాబ్ జాం.
    
    "ఇందులో మాంసం లేదులే తిను" అన్నాడతను. మౌనంగా తిన్నాను. చాలా రుచిగా వుందది.
    
    'ఎలా వుంది?' నన్ను ప్రశ్నించాడతను. చాలా బాగుందన్నాన్నేను. అఘోరీల గురించి ఇంతకుముందు విన్నా, చూడటం అదే మొదటిసారి.
    
    'నువ్వు కాస్సేపు విశ్రాంతి తీసుకో. నేను ధ్యానం చేయాలి' అని అఘోరీ కళ్ళు మూసుకున్నాడు.
    
    నా మెదడంతా ఆలోచనలు, ప్రశ్నలతో చిందర వందర అయిపోయింది.
    
    ఎక్కడో మాట్లాడుకున్న మాటలు నదిలో శవం కొట్టుకొస్తున్న సంగతీ ఇతనికెలా తెలిశాయి? దివ్యదృష్టి తెలుసా ఇతనికి? ముందు తారసపడిన యోగి సాత్వికంగా, సాంతంగా వుంటే ఇతడేమిటి ఇలా అసహ్యంగా వున్నాడు? పైగా మాంసం తింటానంటున్నాడు. స్నానం చేసి ఎన్నాళ్ళ యిందో.... ఆ దుర్గంధంతో ఎలా మనగలుగుతున్నాడో? అసలేమిటి అఘోరీల జీవన విధానం?
    
    నా ఆలోచనల్ని చెదరగొడుతూ 'నిన్ను విశ్రాంతి తీసుకోమంటే ఎందుకు అన్ని ఆలోచనలు చేస్తున్నావ్?' అని గంభీరంగా వినిపించింది అఘోరీ కంఠం. నేను తప్పు చేసినవాడిలా అతని వంక చూశాను. అప్పుడతను నా చెంతకొచ్చి కూర్చున్నాడు.
    
    "ఆహ్గోరీల జీవన విధానం తెలుసుకోవాలని వుందా?" అని సౌమ్యంగా అడిగాడు.
    
    ఒకే మనిషిలో రెండు విభిన్న కోణాలు. "ఇందాక కఠోరంగా మాట్లాడినది ఇతనేనా? ఎంత సౌమ్యంగా తన మనసులో విషయాన్ని అడిగాడిప్పుడు" అన్పించింది నాకు. అతని ప్రశ్నకు తలూపాను.
    
    "అఘోరీలంటే తాంత్రికులు నేనూ అఘోరీనే. ఏ వ్యాధులనైనా అఘోరీలు నయం చేయగలరు. ప్రాణశక్తికన్నా సూక్ష్మమైన రహస్యాలు మాకు తెలుసు. ఈ సూక్ష్మశక్తి ఇహ పరాలకి వారధి...." అని ఆగాడు అతను. నాకు కొంచెం ధైర్యమొచ్చి "మీరు శవాలు ఎందుకు తింటారు?" అనడిగాను.
    
    "ఇది శవం ఎందుకయింది? ఇదిప్పుడు మనిషి కాదు. దీనిని ఎవ్వరూ వాడటం లేదు.
    
    నీవు ఇది మనిషిదనుకుంటావు. ఎవరూ వాడని దాన్ని నేను వాడుకుంటాను. నేనో శాస్త్రజ్ఞుడిని పదార్ధం, శక్తి, నియమాల గురించి ప్రత్యక్షంగా ప్రయోగాలు చేస్తున్నవాడిని పదార్ధాన్ని ఒక రూపం నుండి మరో రూపానికి మార్చుతున్నాను.
    
    ప్రకృతిమాత నా గురువు, ప్రకృతి పలురూపాలలో వుంటుంది. నేను ఆమెనే అనుసరిస్తున్నాను.
    
    ఈ గుహలో పదమూడు సంవత్సరాలుగా వుంటున్నాను. ఇంత వరకూ నాకోసం ఎవ్వరూ రాలేదు. నా రూపం చూస్తే అందరికి భయం.
    
    నేను మురికిగా వుంటానని, చేపలు, శవాలు తింటానని నన్ను అసహ్యించుకుంటారు. అయినా ఫర్వాలేదు. నాకు ఎవ్వరూ అక్కర్లేదు.
    
    మాకు రూపాలు మార్చే శక్తి వుంది. అదుగో ఆ శిలని తీసుకురా' అని ఎదురుగా కన్పించిన ఓ రాయిని చూపించి అన్నాడు. నేను వెళ్ళి ఆ రాతిని అతనికి అందించాను. అఘోరీ చేతిలో చూస్తుండగానే ఆ శిల పొడిగా అయిపోయింది.
    
    దాన్ని కొంచెం నా నోటిలో వేశాడతను అది తియ్యగా వుంది. "ఇప్పుడు ఇది చక్కెర" అన్నాడతను. నేను అతని చేతిలో మిగిలిన చక్కెరని తీసుకుని ఓ డబ్బాలో భద్రపరుచుకున్నాను..."
    
    "ఇప్పుడు మీ దగ్గరుందా అది" అడిగాడు అభిరాం.
    
    "ఉంది...." అంటూ బ్రీఫ్ కేసులోంచి ఓ డబ్బా తీశాడు వరప్రసాదం.
    
    అభిరాంకి ఎగ్జయింట్ గా వుంది. 'ఓ  తాంత్రికుడి మహిమవల్ల చక్కెరగా మారిన శిలని చూడబోతున్నాడు తను' అనుకున్నాడు. వరప్రసాదం డబ్బా మూత తీసి అభిరాంకి చూపించాడు. అందులో తెల్లగా మెరుస్తూ కన్పించింది చక్కెర. అయితే చాలాకాలం అయిపోవడంతో తేమ పట్టేసి వుండది. వరప్రసాదం డబ్బాలోంచి చూపుడువేలితో కొంత చక్కెర తీశాడు. అది పాకంలా వెలికి అంటుకుని వుంది.
    
    "రుచి చూడండి" అంటూ అభిరాం వేలికి కొంచెం పూశాడు.
    
    అభిరాం వేలుని చప్పరించాడు. తియ్యగా వుందా జిగురు, వరప్రసాదం కూడ వేలికున్న చక్కెరని చప్పరించి డబ్బా మూత పెట్టి బ్రీఫ్ కేసులో దాన్ని దాచేశాడు. "తరువాత ఏమైంది?" అడిగాడు అభిరాం.
    
    "ఆ రాత్రికి అఘోరీ గుహలోనే ఉండి మర్నాడు బయలుదేరాను. నేను వెళ్ళిపోయే ముందు ఆహోరీ మరికొన్ని అద్భుతాలు చేసి చూపించాడు. ఎంతో ఆదరంగా మాట్లాడాడు. అతడు మహామేధావి పండితుడు. ఆయనకు సంస్కృత భాష కూడా వచ్చు. ఆఖరి క్షణంలో నాకు తెలిసిన సత్యాలివి.

 Previous Page Next Page