ఇలాంటి ఉత్తరాలు నిండు కోర్టులో బయటపడ్డాయి. అందరూ శర్మను చూసి నవ్వటం మొదలుపెట్టారు. అవమానంతో శర్మ తల ఎత్తలేక పోతున్నాడు. ఉత్తరాల సంగతి లోకానికి వెల్లడయ్యాక విమల మరింత కృంగిపోయి మంచం మీదనుంచి దిగలేని దశకు చేరుకొంది. శర్మ దగ్గిర కూచోని ధైర్యం చెప్తున్నా, తలఎత్తి అతని ముఖం చూడలేకపోతోంది.
న్యాయవాదుల వాదోపవాదాలు తీవ్రంగా సాగుతున్నాయి.
ఉత్తరాలనుబట్టి శకుంతల రమేష్ కూతురని రుజువవుతోంది. రమేష్ విమలను గుళ్ళో పెళ్ళి చేసుకొన్నాడు. ఉద్యోగరీత్యా రమేష్ విమలకు కొంతకాలం దూరంగా వుండాల్సి వచ్చింది. ఆ కాలంలో విమల రమేష్ ను వంచించి, శ్రీధర్ శర్మని వివాహం చేసుకుంది. అప్పటినుండీ రమేష్ తన కూతుర్ని తనకియ్యమని కోరుతూనే వున్నాడు. విమల ఒప్పుకొక పోవటంతో చివరకు కోర్టుకి రావల్సివచ్చింది. తన కూతురు పరాయి మొగవాడి దగ్గర వుండటం రమేష్ సహించలేకపోతున్నాడు __ఇదీ రమేష్ లాయర్ వాదన.
విమల రమేష్ ని ప్రేమించింది నిజమే కావచ్చు. కానీ, రమేష్ ఆమెని మోసంచేశాడు. సాధారణ స్త్రీలలా కృంగిపోకుండా, తన బిడ్డను ఏ అనాధ శరణాలయానికో అప్పగించకుండా ధైర్యంగా నిలబడింది విమల. శర్మను వివాహం చేసుకోవటంలో ఆమె తన జీవితం చక్కదిద్దుకొందుకే కాని, ఎవరినీ వంచించలేదు. శకుంతలను పసితనం నుంచీ పెంచి పెద్ద చేసిన శర్మే శకుంతలకు నిజమైన తండ్రి__ఇదీ శర్మ తరపు లాయర్ వాదన.
ఈ విచిత్రమైన కేసులో ఎలా తీర్పు చెప్పాలో తెలియక జూరీలు తికమకపడ్డారు, శర్మ శకుంతల కన్నతండ్రి కాడని తెలిసాక, ఆమె శర్మ దగ్గరే ఉండాలని చెప్పలేకపోయారు.
రమేష్ ని చూడగానే, 'డెవిల్' అని తిట్టే శకుంతలని 'అతడే నీ తండ్రి అని అతనితో పంపలేకపోయారు.
13
కేర్ హోమ్ లోంచి బయటపడ్డ శకుంతలకీ, వెనుకటి శకుంతలకీ పోలికలేదు. ఆకారంలోనే కాదు__ అంతరంగంలో కూడా.
ఇప్పుడు శకుంతలకి వెనకటి బాబ్డ్ హెయిర్ లేదు. బారెడు జడ ఉంది__చివర మెలికలు తిరిగి ఊగుతూ. స్కర్ట్ వేసుకోవడంలేదు. సన్నని జార్జెట్ చీర కట్టుకుంది. వెనుకటి నిర్లక్ష్యమూ, పెంకెతనమూ లేవు-చిరునవ్వుతో మర్యాదగా మాట్లాడటం నేర్చుకొంది. కానీ, చిన్నప్పుడు తల్లిదండ్రులు కలిగించిన ఆత్మ విశ్వాసం మాత్రం చెక్కుచెదరలేదు. అందుకే కేర్ హోమ్ లో ఎన్నెన్ని అనుభవాలు ఎదురయినా, చిరునవ్వుతోనే బయతాకు రాగలిగింది. అక్కడ అనేక రకాల బాధితులను చూసింది. తల్లిమరొకరితో లేచిపోగా_సవతి తల్లిచేత అన్యాయం చెయ్యబడ్డవాళ్ళు, తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోగా__బంధువుల విషపు కోరలకి గురిఅయినవాళ్ళూ, తల్లిదండ్రులిద్దరూ ఉండి -బీదరికానికి బలి అయిపోయినవాళ్ళూ మారుటి తండ్రి తల్లితోపాటు తననూ కబళించబోగా, దిక్కుతోచక తల్లడిల్లినవాళ్ళూ __ఇలా ఎందరో....
కేర్ హోంలోకి మొగవాళ్ళు రాకూడదు. శకుంతల హోంలో ఉన్నంతవరకూ, తండ్రులిద్దరిలో ఎవ్వరూ రాకూడదని న్యాయస్థానమే ఆంక్ష విధించింది. తల్లిని తలుచుకున్నప్పుడల్లా శకుంతలకు ఎంత నిగ్రహించుకున్నా దుఃఖం ఆగేదికాదు. 'తమఇంట్లో శకుంతలకు ఎంత నిగ్రహించుకున్న దుఃఖం ఆగేదికాదు. తమఇంట్లో శకుంతలను చేతులలోపెట్టుకొన్నమేనకను విశ్వామిత్రుడు తిరస్కరించే రవివర్మచిత్రం ఉండేది. తల్లి తరచుగా ఆ చిత్రం చూస్తూ కూచునేది. అప్పుడప్పుడు ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగేవి. ఆరోజులలో ఆ కన్నీళ్లకు అర్ధం తెలిసేది కాదు__కానీ, ఇప్పుడర్ధమవుతోంది. తన తల్లి క్షోభ - పాపం! అలనాటి మేనకలా తన బిడ్డను అరణ్యాలలో పారెయ్యకుండా తానే పెంచి పెద్దచెయ్యాలని ధైర్యంగా నిలబడింది. కానీ, ఆమె పాలిటికి ఈ సమాజమే ఒక మహారణ్యమయి పోయింది. ఎక్కడకు వెళ్ళి ఉంటుంది? అసలు బతికి ఉందా? నో - నో! అమ్మ చావదు-అమ్మకు చావులేదు! అమ్మా! నువ్వెందుకింత పిరికిదానిలా పారిపోయావే? ఈ లోకమంతా మనకు తరమికొట్టినా, నాకు నువ్వూ- నీకు నేనూ లేమా?'
తల్లి గురించిన ఆలోచనలు ఎప్పుడు వచ్చినా, కన్నీళ్లు నిగ్రహించు కోలేక పోయేది శకుంతల. ఆ కన్నీళ్ళు తుడిచేవారు లేక, చివరకు తన కన్నీళ్ళు తనే తుడుచుకుని జీవితాన్ని ఎదుర్కోవటానికీ సాధనచేసేది.
ఆ కేర్ హోమ్ లో శకుంతల ఒక చిన్నసైజు సమాజాన్ని చూసింది అనేక చిన్న పాముల్నీకూడా పెద్దపాముల్నీ, బురదపాముల్నీ చూసింది.
తన పెట్టెలోంచి డబ్బులూ, స్నో, పౌడర్ లూ దొంగిలించాలని చూసే సత్యవతిని చూసింది. అందరికంటే తహనేదో గొప్ప అయినట్లూ అందర్నీ ఎత్తి పొడుస్తూ మాట్లాడే అనసూయను చూసింది.
కేర్ హోంలో ఉన్నా ఎలాగో కడుపు తెచ్చుకుని, తన పురుడు తానే పోసుకుని, కళ్ళు తెరవని పసిగుడ్డును కిటికీలోంచి పారేసిన అరుంధతని చూసింది. హోం చూడటానికి వచ్చి, బ్రహ్మాండంగా ఉపన్యాసాలిచ్చి, పూలదండలు వేయించుకుని, నీతులువల్లించి, చప్పట్లు కొట్టించుకొన్న ప్రముఖులే - వార్డెన్ ద్వారా అక్కడి అమ్మాయిలకు రాయబారాలు పంపటం చూసింది.
ఒకసారి వార్డెన్ శకుంతలనే అడిగింది. "ఫలానా పెద్దమనిషికి నవ్వు నచ్చావు. వెళతావా?" అని, శకుంతల చిరాకుపడితే ఒప్పుకుంటే అది ఎంత అదృష్టమో నోరూరేలా వర్ణించింది.
శకుంతలకు వొళ్ళు మండి తండ్రికి - శ్రీధరశర్మకి ఫోను చేసింది దాంతో చాలా పెద్దగొడవ జరిగింది. కానీ ఆ పెద్దమనిషి నిక్షేపరాయుడిలా అలాగే ఉన్నాడు. వార్డెను మాత్రం డిస్ మిస్ అయింది. ఈ సంఘటనతో ఏది ఎలా జరిగినా-తక్షకుడిలాంటి విషసర్పాలు ఎలాగో బయటపడి విషం కక్కుతూనే ఉంటాయనీ, ఎటూ కాని బురదపాములు మాత్రం దెబ్బలు తింటాయనీ కళ్ళారా చూసి తెలుసుకుంది.
ఆ తరువాత వచ్చిన వార్డెనులమీద కోపం బదులు జాలి కలిగేది. వాళ్ళూ పొట్టకూటికి వచ్చినవాళ్ళే ప్రముఖులు మాటలు కాదంటే వాళ్ళ ఉద్యోగాలకే ముప్పు హోంలో ఉన్నపిల్లలంటే _ 'ఏదో చెడిపోయిన వాళ్ళే' అన్న చిన్నచూపు.