కొద్ది క్షణాలకు తన అనూహ్యమైన ఆలోచనా స్రవంతినుంచి తేరుకొని ఆమెవేపు చూసాడు ఓసారి.....కాస్తంత స్థయిర్యాన్ని కూడ దీసుకొని-
నెమ్మదిగా కుర్చీలోంచి లేచాడు. ఇక మాట్లాడవలసిందేమీలేదన్నట్లుగా రెండు చేతులు జోడించి మనస్పూర్తిగా నమస్కరించాడు.
తనలోనే ఎంతటి మార్పు!
అరగంటక్రితం ఆమెను చూసిన తొలిచూపులో, ఆమె అందాల్ని, ఎత్తుపల్లాల్ని, కట్టుబొట్టును మానసికంగా ఎంజాయ్ చేసిన తను-కేవలం అరగంట తర్వాత ఆమెలో ఎలాంటి మహనీయురాళ్ళను చూడగలిగాడు!
ఇక శెలవు ఇప్పించమన్నట్లుగా ఆమెవేపు చూసాడు.
ఆమె మొహంలో ఏ భావమూ కనిపించలేదు. అదే ప్రశాంతత, అవే చూపులు, అదే గంభీరత.
వెనుదిరిగి ఒక్కో అడుగు వేస్తూ నెమ్మదిగా ద్వారబంధం వరకు వచ్చాడు. డోర్ మీద చేయివేస్తున్నప్పుడు వినిపించిందామెమాట.....
"మీ ఫ్యాక్టరీ స్థితిగతుల్ని, భవిష్యత్తులో అది బాగా రన్ అయ్యేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించేందుకు ఈ రాత్రికే నా మనుష్యులు బయలుదేరతారు.
పోతే ఒకటి గుర్తుంచుకోండి-ఇంతకాలం-దోపిడీవర్గం, పెట్టుబడి దారీవర్గం, పారిశ్రామికవర్గం, ప్రభుత్వం అంటూ దోడిడీలు అంటూ కేకలేస్తూ వస్తున్నారు మీ కార్మికవర్గం- ఆ సందర్భంలో రాష్యాన్ని, చైనాని యుగోస్లేనియాని, క్యూబాని చూపిస్తూ వచ్చారు.
వార్నెవరూ సమర్థించటంలేదు మీకు వారు అన్యాయం చేస్తున్నారన్నది అనాదిగా ఆసాంతం ఎరిగిన విషయమే.
కాని మీరుచేసే దుశ్చర్యళగురించి ఎవరూ ఎత్తిచూపటంలేదు. మీకు రష్యాని ఎత్తిచూపినప్పుడు జపాన్ ని _మీరు చైనాని ఎత్తిచూపినప్పుడు కొరియాని, ఆయాదేశాల కార్మిక వర్గపు దేశభక్తిని, సిన్సియారిటీనీ, వారికై వారు గుర్తించే బాధ్యతల్ని ఎవరూ ఇంతకాలం ఎత్తి చూపలేరు.
కాని త్వరలో అదీ రాబోతోంది. ఇదిమాత్రం గుర్తుంచుకోండి" అంటూ ఆమె సీట్లోంచి లేచింది.
అప్పుడు ఆమెను పూర్తిగా చూడగలిగిన ఆదిత్యకు కనురెప్పపాటు కాలంలో మదర్ తెరిస్సా రూపం స్ఫురణకు వచ్చింది.
ఈ వయస్సుకే ఇన్ని ఆలోచనలా? ఇంతవరకూ ఎవరికిలేని ఆలోచనా దృక్పథం?! ఆ ఆలోచనల్లో గొప్ప దేశభక్తి-ఆ ఆలోచనల్లో ఓ సరికొత్త కోణం?!!
కృతజ్ఞతలుచెప్పి బయటకు నడిచాడు ఆదిత్య-కేవలం ముప్పై అయిదు నిముషాలకే కొన్ని పదులవయస్సు పైబడిన వార్థక్యం! ఎప్పుడూ లేని ఆలోచనళ ఘర్షణ-ఎన్నడూ చవిచూడని ఉద్రిక్తత.....!!
ఆదిత్య అలా వెళ్ళిపోగానే సాహితీ తన ముందున్న రెడ్ కలర్ ఫోన్ పై చేయి వేసింది.
మరో నిమిషానికి ఇద్దరు వ్యక్తులు ఆమె ముందున్నారు.
ఆమె చెప్పుకొంటూ వెళుతోంది.
* * *
ఇద్దరువిద్యార్థులు ఏదో ప్రమాదం ముంచుకువస్తోందన్న భావాన్ని, చూపిస్తున్నట్లుగా పరిగెత్తుకువచ్చి అప్పటికే రూమ్ నుంచి బయటికి వచ్చి ఉన్న నాగ్ ముందు ఆగి ఓ క్షణం ఆయాసం తీర్చుకొని "రక్తపాతం జరగబోతోంది....." అన్నారు.
నాగ్ ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు.
అప్పటికే నాగ్ వెనక్కిచేరిన క్రాంతి, సుబ్బారావు , రాజు రానున్న ప్రమాదాన్ని పసిగట్టారు.....అప్రయత్నంగా వారి చేతులు నాగ్ భుజం మీద పడ్డాయి సపోర్టు ఇస్తూన్న భావాన్ని తెలియజేస్తూ.
నాగ్ ఓ క్షణం చురుకుగా ఆలోచించి అలాగే ఉన్న పలాన వారితో బయలుదేరాడు ఆ వార్తను మోసుకొచ్చిన ఇద్దరూ తిరిగి పరుగందుకొన్నారు.
ఏదో ముంచుకు వస్తుందన్న భావం వారి కాళ్ళ వేగంలోనే నాగ్ కి స్పష్టమైపోతోంది.
నాగ్ లో వేగం పెరిగింది.... వీర్ని అందుకొనే ప్రయత్నంలో క్రాంతి, సుబ్బారావు, రాజు అప్పటికే విపరీతంగా ఆయాసపడిపోతున్నారు.
అక్కడకు చేరుకొనేసరికి సరిగ్గా నిమిషం పట్టింది- దూరాన్నుంచే ఆ దృశ్యాన్ని చూసిన నాగ్ నవనాడులు స్తంభించిపోయాయి.