టేంకర్ నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళిందో లేదో వేగంగా ఓ పోలీసు జీపు దాన్ని ఓవర్ టేక్ చేసుకుంటూ వెళ్లి లారీ ముందు ఆగింది...
జరుగుతున్నదేమిటో యాదయ్యకి అర్ధమయ్యేలోగా ఎక్సైజు అధికారులు, పోలీసులు అతడ్ని కస్టడీలోకి తీసుకోవడమే గాక లారీని సీజ్ చేశారు.
అదే రాత్రి ఓ ప్రభుత్వ లేబరేటరీలో స్పిరిట్ విషపూరితమైందన్న నిజం నిర్ధారించబడింది. డిస్టిలరీపై రైడ్ జరిగడంతోబాటు డిస్టలరీ జనరల్ మేనేజర్ని అరెస్టు చేశారు.
తెల్లవారేసరికల్లా యీ వార్త దావానలంలా పొక్కిపోయింది.
రామనాథచౌదరి కంపించిపోయాడు. నేరం ఎలా జరిగిందీ అన్న ఆలోచనగాని, నేరం నుంచి బయట పడడం అన్న సమస్య గురించి గాని అతడు భయపడలేదు కాని ఉదయం పదిగంటలకల్లా తను స్పిరిట్ సప్లై చేసే ప్రముఖ మందుల కంపెనీల నుంచి ఆర్దర్సు కాన్సిల్ చేస్తూ ఫోన్ కాల్స్ అందుకున్నాడు.
ఎలా-
ఈ దారుణం జరిగింది ఎవరి మూలంగా-
రాత్రి పది గంటల దాకా ఆధారాలు సేకరించాలని ప్రయత్నించి విఫలమైన చౌదరి తన సిబ్బందిపై గావుకేకలు పెడుతుండగా ఫోన్ వచ్చింది.
మళ్ళీ కృషి నుంచే-
"నేనే మిస్టర్ చౌదరీ" కృషి గొంతు ఎగతాళిగా వినిపించింది. "సరిగ్గా ఏడాది క్రితం మా గ్రాండ్ ఫాదర్ మెషిన్ టూల్ ఫ్యాక్టరీ కేంటిన్ ఫుడ్ లో విషాన్ని కలిపించి మా తాతయ్యని నేరస్థుడిగా నిలబెట్టావని తెలిసి చిన్న ప్రయోగం చేసి నిన్ను మరోసారి చావుదెబ్బగొట్టాను. ఇంకో డిఫీట్ తట్టుకోలేకపోతున్నావా - పట్టించుకునేదాన్ని కాదేమో కాని పాపం విస్సుని మళ్ళీ ప్రయోగించావుగా - తప్పనిసరయింది - అంతే చౌదరీ - నువ్వు పోరాటం ఆపనంతకాలం నేను పోరాడుతూనే వుంటాను" ఫోన్ క్రెడిల్ చేసింది కృషి.
ఏ డబ్బుని అస్త్రంగా వాడి మనుషుల్ని వినియోగించి చౌదరి అరాచకాల్ని సృష్టిస్తాడో అదే డబ్బుని ఆయుధంగా వాడిన కృషి, పర్సనల్ మేనేజరు శరత్ చంద్ర ద్వారా ఓ మనిషిని డబ్బుతో ఎంప్లాయ్ చేసింది. పకడ్బందీగా స్పిరిట్ లారీలో పాయిజన్ కలిపించి ఆ విషయాన్ని సీక్రెట్ గా పోలీసులకి తెలియచేసింది.
ఇలాంటి నిస్సహాయ స్థితి ఒకటుంటుందని సోదాహరణంగా చౌదరికి తెలియచెప్పిన కృషి రిలాక్సయి ఏదో మేగజిన్ చదువబోతుండగా నౌకరు వచ్చాడు.
"విస్సు అట...మీ కోసం వచ్చాడమ్మా"
ఉలిక్కిపడింది కృషి...
అప్పుడు గుర్తుకొచ్చింది ఒప్పందం అమలు చేయడానికి విస్సు రాత్రి పదిగంటలకి వస్తానన్న విషయం...
ఆమె ఫాలభాగం స్వేదం పేరుకుంటుంటే లేచి నిలబడింది...
"మన ఒప్పందం ప్రకారం వెళ్ళాల్సింది మీ బెడ్ రూంలోకి" కృషి వెనుకే ఆమె పర్సనల్ చాంబర్ లోకి నడుస్తున్న విస్సు అన్నాడు ద్వారం దగ్గర నిలబడి.
"మిస్టర్ విశ్వనాథ్" జుగుప్సగా చూసింది. రోషం, ఉద్వేగం, క్రోధం చుట్టు ముడుతుంటే "నేనెవర్ననుకుంటున్నావ్" సాధికారంగా ప్రశ్నించింది.
ఎగతాళిగా నవ్వాడు. అతడి చూపుల్లో వ్యక్తమవుతున్నది కాంక్షో లేక కారణం లేని ప్రతీకారమో ఆమెకీ అర్ధం కావడం లేదు.
"నువ్వో విశ్వ సౌందర్యాన్ని సవాల్ చేసే పాల పుంతవైన సింధూరాంబరం నుంచి రసాతలం దాకా విస్తరించిన ప్రకృతిలా ఏ భంగిమలో నైనా చూడదగ్గ పొంకం గల గంధర్వ కన్యవైనా యిప్పుడు నాకు లొంగిపోవాల్సినదానివి...ఒక రాత్రి సుఖం కోసం నీ కన్యత్వాన్ని అర్పించాల్సిన దానివి...అవునా.
అది ఆందోళన కాదు. భగ్గుమంటున్న మస్తిష్కంలో బాధాకరంగా రేగుతున్న ఆరాటం. నౌకర్లని పిలిచి అతడ్ని బయటకి సాగనంపే ప్రయత్నానికింకా తను సిద్దపడలేక పోతూందేం... ఒప్పందంగా నోరు జారిన పాపానికే ఇదంతా తాను భరిస్తూందా...
"కామంచ యౌవనే..." రెండడుగులు ముందుకు నడిచి ఆమె కటి భాగాన్నో లేక నైటీ వెనుక వివృత దిగంత ద్వారాల్నో నవలోక ప్రాకారాల్నో ఊహించుకుంటూ స్వప్నంలోలా అన్నాడు "యవ్వనంలో వున్నప్పుడే విద్యతోబాటు కామాన్నీ సేవించి తీరాలంటాడు వాత్స్యాయనుడు....పైగా తామరమొగ్గలా సుతిమెత్తగా వుండేది- పువ్వులాంటి నాసిక గలది- సంపంగి కలువలు శరీరఛాయతో శోభిల్లుతూ కాదంటూనే ప్రియుడ్ని రా రమ్మనేది పద్మినీ జాతి స్త్రీ అని నీలాంటి అమ్మాయి గురించి అద్భుతంగా నిర్వచించేడు కూడా."
లిప్తలు గడ్డ కట్టుకుపోతుంటే ఉద్రేకాన్ని నిభాయించుకోటానికి ఆమె విశ్వప్రయత్నం చేస్తూంది.
"తనూలత" మరింత ముందుకొచ్చాడు.
"లతవంటి తనువు గలది అని కదూ.....ఉపమానోత్తర పదకర్మధారయం. సమానం కరెక్టో కాదో నాకు తెలీదు. కాని ఒకనాడు యీ పదానికి అర్ధం తెలీకపోయినా నిన్ను చూస్తే నిజమనిపించింది కృషీ...కమాన్ ఇంకా ఆలస్యం దేనికి"
పిండుకోవాల్సిన ఉషస్సు గురించి గుర్తు చేస్తున్నాడు.
నిమ్మలంగా చూసింది నిర్వేదంగా అతడ్ని గమనించింది.
ఒక కార్యసాధన కోసం ఆ రోజు అంత గాయపడీ గాయాన్ని గోప్యంగా వుంచి చివరిదాకా పోరాడిన విస్సుని గుర్తుచేసుకుంటూ అంది. "నిజమే - ఒకనాడు అసంకల్పితంగా నువ్వన్న ఒప్పందానికి నేను అంగీకరించాను - ఏ దురదృష్టకరమయిన క్షణంలో నేను సరేనన్నానో కాని యిప్పుడు నేను అన్లేదని బుకాయించను - జ్ఞానం తెలిసాక ఏ మగాడికీ అలాంటి అవకాశం కాదు- అలా మాట్లాడే అవకాశమే యివ్వని నేను నీ విషయంలో ఎవరో మంత్రించినట్టు మూగదాన్నయినా ఓ సభ్యతగల మగాడివా నువ్వు రియాక్టవుతావనుకున్నాను. నోరు జారేక యిలా ఆలోచించడం నేరమే అని నాకూ తెలుసు. కాని నీ గెలుపు మనసారా కోరుకున్న నేను నువ్వు గెలిచావని నిరూపించేదాకా అవిశ్రాంతంగా పోరాడాను. ఆ తర్వాతనైనా నీ అభిమానానికి పాత్రురాలినవుతానని ఎదురు చూశాను."
"నన్ను గెలిపించింది రాజేష్ తో నువ్వు ఓడిపోకూడదని...కాని నన్ను పోటీకే రాకుండా ఆపాలని ప్రయత్నించింది నీ మీద నేను గెలవకూడదని."
"నో" ఆవేశంగా అరిచింది "నిన్ను ఆపాలని గూండాల్ని ప్రయోగించింది నేను కాదు. నువ్వు పొరపడుతున్నావ్"
"నీకు కాక మరెవరికి అంత అవసరం వుంటుంది"
"తన కొడుకు ఓడిపోకూడదని చౌదరియే ఆ పని చేయించి వుండొచ్చుగా"
"నేను గెలిస్తే ఎక్కువగా నష్టపోయేది నువ్వు కృషీ." అర్ధం చేసుకోడేం-
నిర్లక్ష్యంగా అన్నాడు "నిజానికి నేను కావాలీ అనుకుంటే పోలీసులకి చిక్కిన క్రిమినల్ చేత దోషులెవరో చెప్పించడం కష్టం కాదు కృషి- కాని అక్కడా నీ డబ్బు నన్ను ఓడిస్తుందేమో అన్న అనుమానంతో నీకు తిరుగులేని బుద్ది చెప్పాలని మన ఒప్పందం అమలుచేయడానికి ఇలా వచ్చాను."
నిర్లిప్తంగా చూసింది. అంతకుమించి అర్ధం లేని అతడి తర్కానికి జాలి పడింది. "ఓ మగాడిగా నా మీద గెలుపు కోసం మాత్రమే ఆలోచించే నిన్ను చూసి ఆ రోజు గెలిపించడానికి నేను పడ్డ శ్రమకిప్పుడు బాధపడుతున్నాను విశ్వనాథ్. డబ్బున్న వాళ్ళ గురించి నీకింత నీచమయిన అభిప్రాయం ఎందుకేర్పడినా గాని యీ క్షణంలో నేను చెప్పాలనుకున్నది ఒక్కటే- నువ్వు కోరుకుంటున్నది క్షణికానందం - డబ్బుకోసం ఏదన్నా చేయగల మనిషిగా నాకు పరిచయమయిన నువ్వు యిప్పుడు డబ్బు కన్నా యీ సుఖాన్నే ఎందుకిష్టపడుతున్నవో నాకు తోచడం లేదు - నిజం విశ్వనాథ్ - దానికి బదులు పది లక్షలు చెల్లించమంటే నీ వ్యక్తిత్వాన్ని గౌరవించేదాన్ని అసలు ఒక్కరాత్రి సుఖంతో నువ్వు పొందే ఆనందం కండరాల రాపిడేగా- నైతిక విలువల్ని నీలాగే మరిచిపోతే అది నాకూ పెద్ద విషయం కాదుగా.... వందరూపాయలు పారేస్తే ఏ వేశ్య దగ్గరయినా దొరికేదేగా... అందులోనూ ఉన్నింటి ఆడపిల్ల మీద యిలాంటి విజయాన్ని కోరుకోవడమే నీ ధ్యేయమైతే."
"స్టాపిట్" అసహనంగా అన్నాడు నమ్మింది ఆమె ఉపదేశాన్ని వినటానికి కాదు ఇంకా మానని గాయాల ప్రేరణతో ఆమె మీద కసి తీర్చుకోవడం.
"చాలా చెప్పి శ్రమ పడ్డావ్ కృషి...ఇక చాలు....నీ మాటల చాతుర్యాన్ని నీ మేధస్సుని ప్రదర్శించక మన ఒప్పందం సంగతి మాట్లాడు."
తను అనాలోచితంగా ఇంతకాలం వెంటపడింది సముద్రాన్ని కాదు ఓ మామూలు నీటి చలమనని బోధపడిందామెకు.
"అంగీకరించకపోతే" భావరహితంగా చూసింది కృషి "నీ దగ్గరున్న టేప్ ని పత్రికల దాకా వినిపిస్తానంటావ్."
"గుడ్...గుర్తుందిగా."
"కాని ఆ చిన్న సాక్ష్యంతో నన్ను నువ్వు బెదిరించలేవని నువ్వు గుర్తుంచుకోవడం బెటర్ విశ్వనాథ్"
"అంటే మాట తప్పటానికి సిద్దపడతానంటావ్"
క్షణం పాటు నిర్లిప్తంగా చూసింది. "మన మధ్య ఒప్పందమేమిటి" ఖచ్చితంగా చెప్పగలవా"
ప్రశ్నలో ఔచిత్యం అర్ధంకాక నివ్వెరపోయాడు విస్సు. "నేను ఓడితే మీ ఇంట్లో వాచ్ మెన్ గా పనిచేయాలి. కాని నువ్వు ఓడితే ఓ రాత్రి నువ్వు నాతో గడపాలి."
"అంతేగా"
"యస్"
"గడుపుతాను ఇప్పుడు కాదు."
"ఎప్పుడు"
"నాకు తోచనప్పుడు" నిర్లక్ష్యంగా అంది కృషి.
"అంతే విస్సు....గడపాల్సింది ఎప్పుడో ఏ రాత్రో ఖచ్చితంగా మనం అనుకోలేదుగా"
తెల్లబోయాడు విస్సు.
ఆమె మీద పెంచుకున్న కసితో ప్రతీకారం తీసుకోవాలని వచ్చిన విస్సు ఇప్పుడు ఈ తర్కానికి వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. "తెలివితేటలు ప్రదర్శించకు కృషి"
"ఇట్స్ మై మైండ్ పవర్ మిస్టర్ విస్సు...ఏం...నేను అన్నదాంట్లో తప్పుందా అసలు నేను కాదంటేగా."
"నీ ఇష్టమొచ్చినప్పుడు గడుపుతాననడం కాదనమేగా."
"అది కాదనడం కాదు విస్సు....అవునంటూనే నిన్ను నీరు కార్పించడం....యస్ నేను నీతో గడుపుతాను. ఎప్పుడో తెలుసా. నాకు ఎనభై ఏళ్ళ వయసొచ్చాక ప్రామిస్"
ఆవేశంగా ముందుకు రాబోయాడు.
"అగు మిస్టర్ విస్సూ - హద్దులు మరిచి ప్రవర్తిస్తే నా స్థాయి ఏమిటీ అన్నది నేను ఖచ్చితంగా నిరూపించాల్సి వస్తుంది"