Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 19

"బాబోయ్! మీకు వంట కూడా వచ్చేమిటి?" అన్నాడు శ్రీహర్ష ఆశ్చర్యం నటిస్తూ.
"వంట వచ్చని చెప్పలేదు. వండుతానని చెప్పలేదు, వడ్డిస్తానని చెప్పానంతే."
"పొద్దున రానా? సాయంత్రం రానా?"
"పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా ఉండిపోండి"
"మహా భాగ్యం"
                                                    * * *

మర్నాడు పొద్దున పదింటికల్లా కుటుంబరావుగారింటికి వెళ్ళాడు శ్రీహర్ష.
లావణ్య ఆకుపచ్చ డిజైన్ ఉన్న తెల్లటి ప్రింటెడ్ అర్గండి చీర కట్టుకుని ఉంది. దాని మీద తెల్లటి జాకేట్టూ, తలంటి పోసుకుంది. జడ వేసుకోలేదు. జుట్టు విపునంతా ఆక్రమించుకుని మొహం మీద కూడా మెత్తగా పడుతోంది. ఫాన్ గాలికి షాంపూ సువాసన ఆమె తల మీద నుండి గదంతా వ్యాపిస్తోంది.
సోఫాలో కూర్చుని , టీపాయ్ మీద రెండుకాళ్ళు పెట్టి కుడిచేతిలో ఇర్వింగ్ వాలస్ నవల పట్టుకుని చదువుతూ, ఎడమచేత్తో తన ఒళ్ళో తల దాచుకున్న అల్సేషియన్ కుక్క తల నిమురుతోంది.
శ్రీహర్ష రావటం రెండు నిమిషాల సేపు గమనించలేదు. పలకరించకుండా గుమ్మానికానుకుని నవ్వు మొహంతో చూస్తున్నాడు శ్రీహర్ష.
ఎంత అందంగా ఉంది. పచ్చ సంపంగి పువ్వంత లేతగా, నాజుగ్గా- పాదాల వైపు చూశాడు.
అసలు లావణ్య భూమిమీద నడుస్తుందా అని అనుమాన మొచ్చింది. గులాబీరంగులో కాస్త అయినా మట్టి అంటకుండా మృదువుగా ఉన్నాయి. ఇంటిపనులు చెయ్యాల్సి వచ్చే మధ్య తరగతి అమ్మాయిలకు పాదాలు సాధారణంగా పగిలి ఉంటాయి.
లావణ్య పాదాలకి ఒక్క పగులు లేదు.
గులాబీల కుప్పల్లాగా ఉన్నాయి.
లావణ్య కంటే ముందు కుక్క చూసింది శ్రీహర్షని.
ఒక్క ఉదుటున కిందికి దూకింది "భౌ భౌ!" అంటూ.
"సీజర్" అంటూ గద్దిస్తూ గుమ్మం వైపు చూసి, శ్రీహర్షని చూసి సంతోషంగా లేచి నిలబడింది లావణ్య.
సీజర్ అనుమానంగా అతన్ని చూసి, మళ్ళీ సోఫా ఎక్కి పడుకుంది.
"దీని పేరు సిజరా? క్రితంసారి వచ్చినప్పుడు కనబడలేదు" అన్నాడు శ్రీహర్ష.
"అప్పుడు దీనికి వంట్లో బాగాలేదు. రెండ్రోజులు వెటర్నరి హాస్పిటల్లో ఉండోచ్చింది." అంది ఆప్యాయంగా దాన్ని దువ్వూతూ.
తను సోఫాలో కూర్చుని "కూర్చోండి" అంటూ శ్రీహర్షకి ఇంకో సోఫా చూపించింది.
"మీ అమ్మగారూ నాన్నగారూ ఊరికెళ్ళి పోయారా?"
"ఆ! మా అంకుల్ ఇంటికెళ్ళారు. అట్నుంచి అటే ఊరికెళ్ళిపోతారు."
ఏదయినా ఇంకా ఎండ ఎక్కలేదు. చల్లగా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం.
"ఏమిటి విశేషాలు?" అన్నాడు శ్రీహర్ష.
"మీరు చెప్పండి వింటారు."
"మీరు చాలా బావుంటారు."
"అది విశేషమా?" అంది నవ్వుతూ.
"ఇంత అందంగా ఉండడం విశేషం కాదూ మరి."
"ఔను సుమా!" అన్నట్టు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, పదిసార్లు తల ఊపింది లావణ్య.
"లావణ్యా! మీరు చాలా అందంగా ఉంటారని మీకు తెలుసు. ఆ మాటని మీ తల్లిదండ్రులు లక్షల సార్లు చెప్పి ఉంటారు. మీ ఫ్రెండ్స్ కోట్ల సార్లు చెప్పి ఉంటారు. అందుకే ఆ మాట చాలా పాతబడిపోయి, మాములుగా వినిపిస్తుందేమో మీకు."
"లేదు లేదు. మీరు చెబుతుంటే కొత్తగా ఉంది- ఇంతకు ముందు లక్షల సార్లు విన్నా కూడా."
మళ్ళీ ఆమె పాదాల వైపు చూసాడు. తర్వాత చేతుల వైపు చూశాడు. దంతాన్ని గులాబీ రేకులతో నునుపు చేసినంత మృదువుగా , సుకుమారంగా ఉన్నాయి.
వంటవాడు కాఫీ ట్రే టీపాయ్ మీద పెట్టి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు.
కప్పులో కాఫీ పోసి అతని కందిస్తూ "మీ సలహా కావాలి నాకు" అంది.
"నా సలహానా ? మీకా? అంతటి వాణ్న నేను?" అన్నాడు శ్రీహర్ష.
"మీ గొప్ప మీకు తెలియదు" అంటూ లేచి పక్కగదిలోకి వెళ్ళి, రెండునిమిషాల్లో తిరిగి వచ్చి, రెండు ఫోటోలు అతని చేతిలో పెట్టింది.
"చెప్పండి. వీళ్ళలో ఎవరు బాగున్నారు."
"నిశ్చలంగా చూశాడు శ్రీహర్ష. అతనికి ఉపిరి ఆగిపోయినట్లయింది. రెండు ఫోటోల్లో ఇద్దరబ్బాయిలు. అందంగా ఉన్నారు.
"ఎవరు వీళ్ళు?" అన్నాడు.
"పెళ్ళి సంబంధాలు - నాకు" అంది సూటిగా.
"మికేవరు నచ్చారు?" అన్నాడు. అతనికి హఠాత్తుగా కాఫీ చేదుగా అనిపించింది.
"రెండే రెండు ఫోటోలు చూపించి 'ఎవరు నచ్చారు? ' అంటే ఎలా? ఛాయిస్ మరీ తక్కువనిపించింది. తేల్చుకోలేక పోయాను."
"అయినా ఇదేమిటి? అబ్బాయిల ఫోటోలు మీ దగ్గరి కొచ్చాయి? పేపర్లో మెట్రిమోనియల్ కాలమ్స్ లో అడ్వర్ టెయిజ్ మెంటు వేయించారా 'వరుడు కావాలి' అని!"

 Previous Page Next Page