దాసు పరుగెత్తుకొచ్చాడు.
"ఒరే అభినయ్...... నిన్ను సస్పెండ్ చేశార్రా" వగరుస్తూ చెప్పాడు.
"డిస్మిస్ చేయలేదా?" అడిగాడతను.
"నువ్విలా చేయకుండా వుంటే బాగుండేది."
మెల్లగా అన్నాడు సిద్దార్ద.
అభినయ్ అదోలా నవ్వాడు.
"జీవితంలో అన్ని రకాల పీట్స్ కీ అలవాటుపడాలి సిద్దార్ద.
కానీ నువ్వన్నట్టు గీత విషయంలో నేను తొందరపడ్డానని" నేను యిప్పుడు అనుకుంటున్నాను.
"ఇదంతా నా మూలంగానే కదూ" జాలిగా అన్నాడు సిద్దార్ద.
సిద్దార్ద కళ్ళల్లో నీరు సుడులు తిరుగుతోంది.
అతని భుజంపైన చేత్తో తట్టాడు అభినయ్.
" బాధపడకు నువ్వే చూస్తావుగదా... రేపటినుంచి నేను కాలేజీకి వస్తాను."
ఎలా? మన ప్రిన్సిపాల్ చండశాసనుడు" అన్నాడు దాసు.
"పోలీసులు......" ఎవరో అరిచారు.
అభినయ్ బృందం ఉలిక్కిపడ్డారు.
ఇన్స్ పెక్టర్ అవధాని, నలుగురు కానిస్టేబుల్స్ క్యాంటీన్ లోకి వచ్చారు.
"ఎవరూ కదలొద్దు. పారిపోవటానికి ప్రయత్నించవద్దు. అభినయ్ ఎవరో చెప్పండి" అరిచాడు ఇన్స్ పెక్టర్ అవధాని.
"నేనే సర్! మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను."
అతని సమాధానానికి ఇన్స్ పెక్టర్ క్షణంపాటు నివ్వెరపోయి సంభావించుకున్నాడు.
"నిన్ను అరెస్టు చేస్తున్నాను. పద జీపు ఎక్కు."
మిత్రులకేసి చూసి చిన్నగా నవ్వి, పోలీసులతో పాటు కదిలాడు అభినయ్.
జీపు వెళ్లిపోయిందో లేదో ఆ వార్త గుప్పుమంది కాలేజీలో.
ఇదంతా జరిగినదానికి కారణం నువ్వేనంటూ పూర్ణాని అందరూ తిట్టడం మొదలుపెట్టారు.
"వెధవా! అసలిదంతా నీ మూలంగానే జరిగింది ఇప్పుడు పోలీసులు మన అభినయ్ ని ఏం చేస్తారో ఏమో!" కమల్ తిట్టాడు.
పూర్ణా దిగులుగా కూర్చున్నాడు.
"పోలీసులు కొడతార్రా వాడివి" దిగులుగా అన్నాడు దాసు.
"కొట్టకుండా ముద్దు పెట్టుకోవడానికి గీత కాదుగా" ఎవడో అన్నాడు ఎగతాళిగా.
పూర్ణ చివాల్న లేచి వాడి కాలర్ పట్టుకున్నాడు.
"చంపేస్తున్నాను. ఇంకోసారి అభినయ్ గురించి వాగితే నాలిక తెగిపోతుంది.
అభినయ్ అంటే ఏమిటో అందరికీ తెలుసురా! స్వార్దం అనేది లేకుండా ఎంతసేపు ఇతరుల కోసం బ్రతికే మనిషిరా వాడు."
వరదలొచ్చినా ఇళ్ళు తగలబడినా పరుగులు తీస్తాడే చందాలు వసూలుచేసి వాళ్లని ఆదుకొంటాడే.....
అంతెందుకు ...మీలో ఎంతమందిని ఎన్నిసార్లు వాడు ఆదుకోలేదు.
చిన్న ముచ్చట కోసం చిన్న తప్పు చేస్తే అలా వాగుతావా? చూస్తాను.
"అవసరమైతే నేను పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తాను" ఆవేశంతో లేచాడు పూర్ణ.
అతన్ని అనుసరించారు కొందరు విద్యార్దులు.
9
స్టేషన్ లో అడుగుపెట్టగానే అభినయ్ మెడమీద చేయివేసి ఒకతోపు తోశాడు ఇన్స్ పెక్టర్ అవధాని.
అతను కిందపడిపోయాడు.
అతని జుత్తు పట్టుకుని పైకిలేపి ఫెడీల్మని కొట్టాడు ముఖం మీద. అభినయ్ పెదవి చిట్లిపోయింది. రక్తం స్రవిస్తోంది.
"రాస్కెల్! చదువుకోడానికి వెళుతున్నావా? కానిస్టేబుల్స్ బీడ్ దిస్ బాస్టర్డ్" అరిచాడు ఇన్స్ పెక్టర్.
అభినయ్ ని సెల్ లోకి లాక్కెళ్ళి లాఠీలతో కొట్టడం మొదలెట్టారు కానిస్టేబుల్స్.
ఎక్కడపడితే అక్కడ దెబ్బలు తగులుతున్నాయి. ఒళ్ళు కమిలిపోతోంది వాతలు తేలుతున్నాయి. భరించలేక అరుస్తున్నాడే తప్ప ప్రతిఘటించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడంలేదు.
ఇన్స్ పెక్టర్ ఎదురుగా నించున్నాడు.
"మా కానిస్టేబుల్స్ ని ముద్దుపెట్టుకోరా! కొట్టడం మానేస్తారు."
నల్లగా, తుమ్మమొద్దులా వున్న పోర్ ట్వంటీ ఇకిలిస్తూ "రా.... నన్ను ముద్దుపెట్టుకోబే" అన్నాడు.
అతను మాట్లాడలేదు.
ఒళ్ళు హూనం అయిపోతుంది.
బూటు కాళ్ళతో కుమ్మేస్తున్నాడు కానిస్టేబుల్.
పోలీసులు పెట్టే చిత్రహింసలకి భయపడి కాబోలు నిరపరాధులు కూడా ఒక్కొక్కసారి చెయ్యని నేరాలను ఒప్పుకుంటారు అనిపించింది అభినయ్ కి.
"దాహం ..." అన్నాడు పక్కకి వాలిపోతూ.
"దాహంగా వుందా? అరే! కూల్ డ్రింక్ తెప్పించనా?" ఎగతాళిగా వుంది ఇన్స్ పెక్టర్ కి.
అభినయ్ మాట్లాడలేదు.
"ఓహ్ ... నీకు కూల్ డ్రింక్ కాదు - అధరామృతం కావాలి కాబోలు" ఎగతాళిగా అని ఇన్స్ పెక్టర్ వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు.
బయట ఫ్రెండ్స్ ని నిలబెట్టి లోపలికి వెళ్లాడు పూర్ణ.
అతన్ని ఎగాదిగా చూస్తూ "ఎవరు నువ్వు....? అడిగాడు ఇన్స్ పెక్టర్.
"నేను అభినయ్ ఫ్రెండ్ పూర్ణ చంద్రరావుని."
"అయితే?"
"అతడిని విడిచిపెట్టమని అడగటానికి వచ్చాను."
"నువ్వు చెప్పగానే విడిచిపెట్టడానికి కాదు ఆ రాస్కెల్ ని అరెస్ట్ చేసింది. కేసుపెట్టి కోర్టులో హాజరుపరిచి శిక్ష వేయిస్తాను."
"ఓ. కె. ఇన్స్ పెక్టర్! అంతవరకూ బాగానే వుంది. కానీ అతన్ని కొట్టడానికి, రాస్కెల్ అని, బాస్టర్డ్ అని తిట్టడానికీ మీకు అధికారం ఎవరిచ్చారు?"
" కొట్టామా?" ఆశ్చర్యంగా చూశాడు ఇన్స్ పెక్టర్.
"ఇన్స్ పెక్టర్" గంభీరంగా అన్నాడు పూర్ణ.
"ఇది విద్యార్దులకి సంబంధించిన విషయం. మీరు అతి తెలివితేటలు ఉపయోగించటం మంచిదికాదు. నేరం చేసినట్లు అంగీకరించి మీకు లొంగిపోయిన వ్యక్తిని కొట్టే అధికారం మీకు లేదు. మా విద్యార్దులు కన్నెర్ర చేస్తే పరిస్థితి ఎలా మారుతుందో మీకు తెలుసనే అనుకుంటున్నాను."