చల్లని ఈదురు గాలిలో సయితం వికాస్ ఆలోచనలు, మేధస్సు వేడెక్కిపోయాయి.
ఎన్నో కొత్త విషయాల్ని మొదటిసారి తెలుసుకుంటున్నాడు.
ప్రపంచంలోని అత్యున్నత సాంకేతిక వ్యాపార విద్యా సంస్థ ప్రాంగణంలోకి అడుగుపెట్టినట్లుగా అనుభూతించాడు.
"సిద్దమే సార్... నా అస్థిత్వం కోసం.... ఆత్మాభిమానాన్ని కాపాడుకోవటం కోసం ఎంతటి త్యాగానికయినా, యుద్దానికయినా సిద్దమే" స్థిరంగా అన్నాడు వికాస్.
అర్దరాత్రి దాటిపోయింది.
మాట్లాడుతూ, మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నారాయన. ఎన్నో పరిశోధనలు ద్వారా ఎన్నో కోట్లు ఆర్జించిన ది గ్రేట్ ఇండియన్ ఇన్ వెంటర్....ఇండియన్ థామస్ ఆల్వా ఎడిసన్. ఒకానొక వైరాగ్య స్థితిలో ఉన్నదంతా లాబరేటరీలకు, అబ్జర్వేటరీలకు రాసేది ఉత్త చేతులతో తిరిగి స్వగ్రామం చేరిన మహాశాస్త్రవేత్త... మందుకి డబ్బులేని స్థితి.
అంతకంటే తనేం గొప్పవాడు కాదుగా.....? ఆలోచిస్తూనే వసారా మెట్లమీదే నిద్రలోకి జారుకున్నాడు వికాస్.
* * * * *
మంచుతో కడిగిన మంచి ముత్యాల్లాంటి తెల్ల గులాబీ రెక్కలపై ఎండా మిల మిలమని మెరుస్తుండగా ఆయన నిద్రలేచి తన కాళ్ళ దగ్గరే పడుకుని ఉన్న వికాస్ ని చూసి మరింత విస్మయానికి గురయ్యాడు.
వికాస్ ని లేపి లోపలకెళ్ళి టీ చేసి పట్టుకు రమ్మన్నారు.
ఇద్దరు పొగలు చిమ్మే టీ తాగుతుండగా ఆయన చెప్పటం ఆరంభించాడు.
"రాకెట్ ఇంధనం గురించి నీకు తెలిసే ఉంటుంది.... నీలోని సెన్సిటివ్ నెస్, ఆత్మాభిమానం, పౌరుషం నాకు నచ్చాయి.... గొప్ప విషయం ఏమిటో తెలుసా? తణుకులోని ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అనే పారిశ్రామికవేత్త దాని తయారీకి పూనుకొని విజయం సాధించారు. ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అవునూ... రాత్రి నువ్వు తెచ్చిన బాటిల్ ని ఖాళీ చేశానా? ఏమో తెలీదు. బార్లీ గింజలు పెట్టి బీరు తయారు చేసేవాడికి, పులవబట్టే ద్రాక్షసారాతో నరాల్ని ఉత్తేజపరిచే ఆఫ్ట్రాల్ లిక్కర్ ను తయారుచేసే వర్తకులకు నేను బానిసని. చూశావా నా ఫేట్.... అతి తక్కువ పరిణామంలో అతి ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసి ఉంచటమే రాకెట్ ఇంధనంలో ఇమిడి ఉన్న ప్రయోజనం. అణువు చాలా సూక్ష్మమైనది. కాని దానిలో కొన్ని మెఘావాట్ల శక్తి నిక్షిప్తమయి ఉంటుంది. నరాలు పోటెత్తి పోతున్నాయి. ఇంకో బాటిల్ తెచ్చి పెట్టగలవా?"
వికాస్ గుండెల్లో రాయి పడింది.
ఆయన ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఆ ప్రవాహం అలా సాగితేనే తను నిలదొక్కుకోగలిగేది.
తన దగ్గర ఈడ్చి తన్నినా పైసా లేదు. రాత్రి ఆకలితోటే నిద్రపోయాడు. ఇప్పుడు మరో బాటిల్, కొన్ని సిగరెట్ పెట్టెలు ఎలా? ఆయన చేతులు వణుకుతున్నాయి. షవరింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. మందు లోనకెళ్ళందే మాట్లాడగలిగేలా లేరు.
అప్పుడు గుర్తుకొచ్చాడు భీమిలి రిజిస్టార్ ఆఫీసులో పనిచేసే తన చిన్ననాటి మిత్రుడు.
మరో గంటకి మరో బాటిల్ తో ప్రొఫెసర్ అప్పన్నదొర ముందున్నాడు వికాస్.
"అలాగే కొన్ని మెఘావాట్ల శక్తిని గిగావాట్ల శక్తిని చార్జ్ చేసుకోగల బ్యాటరీకి రూపకల్పన జరగాలి. కారులోనే మినీ జనరేటర్ ని బ్యాటరీలోకి ఎనర్జీని జనరేట్ చేసేందుకు అమర్చాలి. ఒక్కక్షణం...." అంటూ ఉదయమే బాటిల్ ఓపెన్ చేశారు.
ఆయన చెప్పే ప్రతి చిన్న విషయాన్ని తన జ్ఞాపకాల అరల్లో నిక్షిప్తం చేసుకుంటున్నాడు వికాస్.
"నాకు మందు తేవటానికి ఊళ్ళోకెళ్ళి అప్పు తెచ్చావే- స్వంతంగా కార్ల కంపెనీని ఎలా స్టార్ట్ చేయగలవు? కష్టం.... అందుకే ఏదైనా కార్ల పరిశ్రమకే చెందిన సిక్ యూనిట్ ని చేపట్టు... ఎందుకంటే దానికి ఆల్ రడీ బేసిక్ ఇన్ ఫ్రాస్టక్చరర్ ఫెసిలిటీస్ ఏర్పాటయి ఉంటాయిగదా.... దివాళా తీసినా... లేక... తీయించిన ఆ యజమానిని కలసి నీ ప్రయోగం ద్వారా తిరిగి ఆ ప్రాజెక్టుని నిలబెట్టగలనని ఒప్పించు. అది ఒకింత సులభం.... అదే అమెరికాలో లీ అయోకోకా చేసింది. ఫోర్డ్ ఎంపైర్ కి ప్రెసిడెంట్ అయిన హెన్రీ ఫోర్డ్-2 లీ అయోకోకా సామర్ధ్యాన్ని తెలివితేటల్ని సంపాదించుకుంటున్న ఇమేజ్ ని, పాపులారిటీని చూసి ఓర్వలేక, భరించలేక అయోకోకా మూలంగా తన కంపెనీకి మిలియన్స్ లాభాలొస్తున్నా ఉద్యోగం మానేసి వెళ్ళిపోయేలా చేశాడు. ప్రొఫెషనలిజం పోయి ఇగో అతన్ని డామినేట్ చేసింది. అందుకే లీ అయోకోకా లాంటి క్రియేటివ్ జీనియస్ ని పోగొట్టుకున్నాడు. అలా జరగటం ఫోర్డ్ కన్నా లీ అయోకాకే ఎక్కువ మేలు జరిగింది. ఆ అవమానాన్ని దిగమ్రింగుకుంటున్న సమయంలో బిలియన్ డాలర్స్ లాస్ తో నడుస్తున్న క్రిస్ లర్ కార్ల కంపెనీ లీ అయోకోకాకి తమ కంపెనీ చైర్మెన్ పదవి ఇచ్చింది. నౌ.... యూ మైట్ బీ నో ది సక్సెస్ ఆఫ్ క్రిస్ లర్ కంపెనీ.... లీ అయోకోకా ఇప్పుడు హీరో ఆఫ్ ది అమెరికా.
ఇక్కడ హెన్రీఫోర్డ్ భానోజీరావు అయితే యూ మస్ట్ బీ ఏ ఇండియన్ అయోకోకా-
అసలీ దేశాన్ని ఒక దశాబ్దంపాటు ఒక నియంత పరిపాలిస్తే కాని బాగుపడదు. సోమరిపోతులూ, పిరికివాళ్ళు, రాజకీయ నాయకులు, గూండాలు, దేశద్రోహులు, ప్రజాధనాన్ని దోచుకునే వ్యాపారుల్ని కొరడాలతో కొట్టి తాత వలిస్తే కాని దేశం ఒక కొలిక్కి రాదు."
ఆగారు మరలా- ఒక పెగ్ తీసుకొని, సిగరెట్ వెలిగించుకొని-
"నన్ను నా చరమదశలో కలిసిన ఆఖరి వ్యక్తివి నీవే కావాలి. మరొకరికి నా ఉనికి చెప్పి నా ప్రశాంతతకు భంగం కలిగించకు. కృతజ్ఞతకి అర్ధం తెలీని హారిబుల్ బాస్టర్డ్స్ కి నా జీవిత కాలాన్ని వెచ్చించి ఎంతో తప్పు చేశాననిపిస్తోంది. పెళ్ళి కూడా మానేసి ఒంటరితనాన్ని స్నేహం చేసుకుని ఎన్నో సృష్టించాను- గుర్తించారా? యూ నో.... మనదేశంలో ఉన్నంత మంది దేశద్రోహులు మరే దేశంలోనూ లేరు. ఔనూ నా గురించి నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు?"
ఆయన్ని, ఆయన చెప్పే పొంతన లేని విషయాల్ని అర్ధం చేసుకోటానికి చాలా ఎకాగ్రతాన్ ఐ పెట్టవలసి వస్తోంది వికాస్ కి.
"ఒకవేళ నీ ప్రయత్నంలో నీవు విజయం సాధించినా, నా పేరు బయటకు రాకూడదు- అలా అని ప్రమాణం చెయ్- రాజకీయ నాయకుడిలా కాదు- ఇంకా పొల్యూట్ కాని నేటి భారతదేశపు యువతరానికి ప్రతినిధిగా" అంటూ చేయి చాపారు ఆయన.
వికాస్ ఆయన చేతిలో చేయివేసి ప్రమాణం చేశాడు.
మరో పెగ్ తీసుకొని, తిరిగి సిగరెట్ వెలిగించారాయన.
ఇండియన్ సూడో సైంటిస్ట్ లకు, హైప్రోకాట్స్ అయిన సైంటిస్ట్లకున్న పిల్లి గడ్డం ఆయనకు లేదు.
పిల్లిగడ్డం పెంచిన ప్రతివాడు సైంటిస్ట్ కాదు- నిజమైన సైంటిస్ట్ కి గడ్డం ఉంటే వుండవచ్చేమో...!
"సిలికాన్ తో తయారుచేసే బ్యాట్రీ ఎలక్ట్రోడ్స్ కి కొన్ని మెగావాట్ల శక్తిని స్టోర్ చేసుకునే శక్తి వుంటుంది. అసలయిన ఆ బ్యాటరీకి సంబంధించిన డిజైన్ ని నేను నీకు యిచ్చినా, దాన్ని తయారుచేయటం నీవల్ల ఎలా వీలవుతుంది?"
అది నిజమే అనిపించింది వికాస్ కి.
ఏమిటి కర్తవ్యం...?
"ఆ పెట్టుబడి నీ దగ్గర లేదు- పట్టుదల మాత్రమే వుంది. నా డిజైన్ ప్రకారం బ్యాట్రీని, జనరేటర్ ని తయారుచేయగల శక్తి బొంబాయిలో ఉన్న ఒక కంపెనీకే వుంది. అది డాక్టర్ విలియమ్స్ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో నడుస్తోంది. దకతర్ విలియమ్స్ చాలా మంచివాడు. నాకు ఆప్తుడు, మిత్రుడు, కుట్రలు, కుతంత్రాలు తెలీని మానవతావాది. ఆయనకు మాత్రం నా పేరు చెప్పి- డిజైన్ ఇచ్చింది నేనేనని చెప్పు- లేదంటే నీకు పిచ్చిపట్టి అలాంటి డిజైన్ తెచ్చావనుకుంటాడు. కాని నేనెక్కడున్నదీ చెప్పకు...." అన్నాడు.
మరో పెగ్ తీసుకున్నారు.
"సంకల్ప బలంతో ముందుకు నడువు - ఎన్ని అవాంతరాలెదురైనా, ఇబ్బందులొచ్చినా జంకకు. దృఢసంకల్పంతో కారుని మార్కెట్ లోకి తీసుకురా. ఫ్యూచర్ వరల్డ్ క్లాస్ కారుకి నీ చేతిలో రూపకల్పన జరగాలి. తమ దగ్గర ఆయిల్ వుందన్న అహంభావంతో వెర్రిమొర్రిగా ప్రవర్తిస్తున్న మిడిల్ ఈస్ట్ దేశాల్ని ఖంగు తినిపించు.