Previous Page Next Page 
మొగలిబాకు పేజి 19

   

    తను అనవసరంగా ఈ ప్రేమ గొడవలో ఇరుక్కుపోయాడు. స్టూడెంట్స్ చేసిన తీర్మానాన్ని ఆమోదిస్తూ ఆ సంధ్య వెంటనే తనని ప్రేమించినట్లు నటిస్తే ఈ గొడవలేవీ వుండవుకదా.....ఈ గొడవ లేవీ కూడా ఈ న్యూస్ తనమేనమామ వరకూ వెళ్ళకుండా, మరీ ముఖ్యంగా తన బామ్మవరకూ వెళ్ళకుండా చూసుకోవాలి.
   
    అంటే తనేం చేయాలి?
   
    సంధ్యను ప్రేమిస్తున్నట్లుగా నటించేసి, నమ్మించేస్తే.....నటించడం నమ్మించడం ఎందుకు! అవును సీరియస్ గా ప్రేమించేస్తే__అవును సంధ్యను తను నిజంగా ప్రేమించేస్తాడు. యిద్దరూ కల్సి హాయి హాయిగా బీచులంట షికార్లు తిరుగుతారు....ఆదర్స ప్రేమికులుగా లోకం గుర్తిస్తుంది.
   
    ఈస్ట్ మన్ కలర్లో, ఊహించుకుంటూ రోడ్డుమీద వెళ్ళిపోతున్న నారాయణరావుకి అకస్మాత్తుగా తన బామ్మ, కాంతమ్మ ఎదురైనట్టుగా భ్రాంతిపడి ఆనక భయపడ్డాడు.
   
    "అయ్యబాబోయ్.....బామ్మకు గనక ఈ న్యూస్ తెలిస్తే.....ఆవిడ ఆస్తి, ఏ కలక్టర్ కో, గవర్నర్ కో రాసేస్తుంది తప్ప తనకివ్వదు__అలాగే మేనమామ దొంగ ఐడియావేసి బోల్టు, బోల్టు ఆస్తి సంపాదించాడు....అ ఆస్తికోసమైనా తను సురభిని పెళ్ళి చేసుకోవాలి.
   
    ఈ మధ్యలో ఈ సంధ్యా ప్రణయం......
   
    ఎలా__ఎలా....
   
    అలా ఆలోచిస్తూ రెండుమైళ్ళు నడిచి, డాబా గార్డెన్స్ లోని తన రూమ్ కొచ్చి, రూమ్ లోకి వెళ్ళడానికి బద్ధకంవేసి వరండాలోనే కూలబడి పోయాడు. అలసటవల్ల అతనికి వెంటనే నిద్రవచ్చేసింది. జారుడు బండమీద జారిపోయినట్టుగా అతను నిద్రలోకి జారిపోయాడు ఉదయం పది గంటలపూట.
   
                                                                    *    *    *    *
   
    సీరియస్ గా ఆటోదిగి, ఆర్ట్స్ కాలేజీవేపు అటూ యిటూ చూస్తూ వెళుతోంది సంధ్య. వాస్తవంగా గోడలమీద రాతలు రాసిన వాళ్ళని, తనని ఎలాగయినా మానేజ్ చేయాలని ఆ రాతలు రాయించిన నారాయణరావుని పట్టుకుని, ఎక్కడ బడితే అక్కడ చడామడా తిట్టేసి, చంపలు వాయించేయాలన్నంత కోపంగా వుంది సంధ్యకు.
   
    అలాంటి సమయంలో మహమ్మదాలీ కనిపించాడు సంధ్యకు.
   
    ప్రస్తుతానికి మహమ్మదాలీ సరదాపటేల్ ఇద్దరికి స్టూడెంట్స్ యూనియన్ గూఢచారి ఉద్యోగాన్ని కేటాయించింది. అలాగే అమ్మాయిల్లో జానకికీ, లీలకూకూడా గూఢచారి ఉద్యోగాలే కేటాయించారు.
   
    వీళ్ళ నలుగురి పనీ......
   
    నారాయణరావు రాకపోకల్నీ, దినచర్యనూ, ప్రతిక్షణం గమనిస్తూ, ఎప్పటికప్పుడూ హైకమాండ్ లోని స్టూడెంట్ నాయకుడూ వాసుదేవ్ కు తెలియ చేయడం.
   
    అలాగే సంధ్య వేసే ఎత్తుగడల్ని, తప్పించుకునే మార్గాల్నీ పట్టుకుని ఎప్పటికప్పుడు మోతీలక్ష్మికి ఇన్ ఫామ్ చేయడం.
   
    అలాగే సంధ్య, నారాయణరావుల ప్రతి చర్యనూ గమనించి, తెలియచేయటంతోపాటు వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకునేటట్టు చేయడం అందుకు అవసరమైన సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించడం వీరి ప్రధానమైన పని.
   
    రాత్రి హాస్టల్ నుంచి బయటకు వచ్చిన లీల, జానకి నిజంగా ఇంగ్లీష్ సినిమాకు వెళ్ళలేదు. మహమ్మదాలీ, జుత్తులజిన్నా, లీల, జానకి మరికొందరు ఉత్సాహవంతులయిన కార్యకర్తలందరూ రాత్రి రెండు గంటలవరకూ లవ్ స్లోగన్లను గోడలమీద రాసారు.
   
    అలాగే జానకి, లీల హైకమాండ్ ఉత్తర్వుల మేరకు ఐదు గంటలకే నిద్రలేచిపోయి, పడుకున్నట్లుగా నటించి, సంధ్య మానసిక స్థితి గతిని అబ్జర్వ్ చేయడం ప్రారంభించారు. సంధ్య బయటకువెళ్ళి గోడలమీద రాతల్ని చూసి, తిట్టుకుంటూ రూమ్ లోకి రావడం శాపనార్ధాలు పెడుతూ, స్నానాదికాలు ముగించడం, గబగబా టిఫినూ గట్రా ముగించేసి, హాస్టల్లోంచి బయటపడడం వాళ్ళిద్దరూ గమనిస్తూ ఇంపార్టెంట్ పాయింట్లను నోట్ బుక్ లో నోట్ చేసుకున్నారు కూడా.
   
    రాత్రి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఇలా వుండగా......
   
    ప్రస్తుతం ప్రెజెంట్ లో కొస్తే......
   
    సంధ్య నేరుగా లైబ్రరీ హాల్లోకెళ్ళి కూర్చుంది. అంత పొద్దున్నే లైబ్రరీకి ఎవరూ రారు కాబట్టి చికాగ్గా, కోడిగుడ్డులా మొహం పెట్టుకుని కూర్చున్న లైబ్రేరియన్ ని విష్ చేసి-
   
    ఒక మూలకెళ్ళి, వారపత్రికలన్నిట్నీ తిరగేస్తూ కూర్చుంది సంధ్య.
   
    నారాయణరావుకి ప్రతిరోజూ రెండుగంటలసేపు లైబ్రరీలో కూర్చోవడం అలవాటు. ఆతనక్కడకు వస్తే చడామడా వాయించెయ్యాలని నిర్ణయించుకుంది సంధ్య.
   
                                             *    *    *    *
   
    ఉదయాన్నే చక్కర్లు కొట్టి పరగడుపునే పడుకుండిపోయిన నారాయణరావుకి మిట్టమధ్యాహ్నం మెలుకువ వచ్చింది. మెలుకువ రాగానే లవ్ షాక్ కొట్టినవాడిలా ఫీలయి గబగబా ఫేసూగట్రా వాష్ చేసుకుని చిలకస్నానం చేసేసి, టింగురంగారావులా తయారయి గబ గబా కాలేజీవేపు బయల్దేరాడు.
   
    ఎప్పుడూ స్టూడెంట్స్  కలకలమని నవ్వుల్తో, కిలకిలలాడే క్యాంటిన్ లో ఒక్క స్టూడెంట్ కూడా ముచ్చటకయినా కనిపించలేదు.
   
    "ఈ వెధవలందరూ ఎటెళ్ళిపోయారు" అని దీర్ఘాలోచనుడై లైబ్రరీవేపు అడుగులు వేశాడు.
   
    స్టూడెంట్స్ అందరూ క్యాంటీన్ కు రాకపోవడానికి కారణం వాళ్ళందరూ కెమిస్ట్రీలాబ్ లో సమావేశమయ్యారు.
   
    సంధ్య, నారాయణరావుల్ని అర్జంటుగా కలపడానికి ఆరుసూత్రాల పథకాన్ని తయారుచేయడంలో నిమగ్నమై పోయి ఉన్నారు అందరూ.
   
    లైబ్రరీ మెట్టెక్కి లోనికి తొంగిచూసిన నారాయణరావు లైబ్రేరియన్ కమలాక్షిని చూసి గబుక్కున వెనక్కి తిరిగి పోబోయాడు. సాధారణంగా లైబ్రేరియన్ కమలాక్షి ఎప్పుడోగానీ లైబ్రరీకి రాదు. అసిస్టెంట్ లైబ్రేరియన్ మాత్రమే ఉంటాడు.
   
    కమలాక్షి నారాయణరావుని చూడనే చూసింది-
   
    "రావయ్యా.....రావ్.....నువ్వు ఏదోరోజు ఈ లైబ్రరీలో తారసపడతావని తెల్సు. నువ్వీమధ్య రెగ్యులర్ గా లైబ్రరీకి వస్తున్నావని తెలిసి నేను టంచన్ గా డ్యూటీకి రావడం మొదలెట్టాను. చూడు రావ్.....నేను ణీ నిర్ణయం కోసం ఆరునెలలుగా ఎదురుచూస్తున్నాను రావ్......నువ్వు ఈ వేళ నీ నిర్ణయాన్ని నాకు చెప్పక తప్పదు రావ్.....రా.....నా రూమ్ లో నిలబడే మాట్లాడుకుందాం."
   
    సుమారు డెబ్బై కేజీల కమలాక్షి, ఆయాసపడుతూ చెప్పి చనువుగా చెయ్యి పట్టుకుని గబగబా తన రూమ్ లోకి లాక్కుపోయింది నారాయణరావుని.
   
    బుక్స్ షెల్ఫ్ పక్కన కూర్చున్న సంధ్య ఏవో మాటలు వినిపిస్తే, తలెత్తి చూసినా అంతలోనే నారాయణరావుని, కమలాక్షి తన రూమ్ లోకి లాగేయడంవల్ల, అతను సంధ్యకు కన్పించలేదు.
   
    ఇక అతను వస్తాడు__గోడమీద రాతలకు సంబంధించి చెడా మడా దులిపేయాలని సాహసంతో భీష్మించుకు కూర్చుంది సంధ్య.
   
    రూమ్ లో కెళ్ళాక, డోర్ ను దగ్గరగా వేసి తనకేసి, ఓరకంట చూసి సిగ్గుపడుతున్న కమలాక్షిని చూడగానే గుండెలు ఠారుమన్నాయి నారాయణరావుకి.
   
    "చెప్పు.....రావ్.....నీ నిర్ణయం నాకీవేళ స్పష్టంగా చెప్పేస్తే నేను ప్రొసీడ్ అయిపోతాను....." పేపర్ వెయిట్ ని పట్టుకుని, టేబిల్ మీద అటూ, ఇటూ తిప్పుతూ అంది కమలాక్షి.
   
    చాలాసార్లు కమలాక్షి ద్రుష్టిలోంచి చాలా చాకచక్యంగా బయట పడిన నారాయణరావు ఇలా ఎప్పుడూ ఇరుక్కుపోతాడని అతననుకో లేదు.

 Previous Page Next Page